
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకున్న అనంతరం కోలుకునే సమయంలో ఇచ్చే ‘ఆరోగ్య ఆసరా’ చికిత్సల సంఖ్య భారీగా పెంచారు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో 836 చికిత్సలకు వైద్యం చేయించుకున్న తర్వాత కోలుకునే సమయంలో రోజుకు రూ. 225 చొప్పున, గరిష్టంగా నెలకు రూ. 5 వేలు ఇచ్చారు. ఇప్పుడు మరో 683 చికిత్సలను ఇందులో చేర్చారు. దీంతో మొత్తం చికిత్సల సంఖ్య 1,519కి చేరింది.
ఈ మొత్తం చికిత్సల్లో దేనికైనా సరే వైద్యం పొంది ఇంటివద్ద కోలుకుంటూంటే వెంటనే బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేస్తారు. డాక్టరు నిర్ణయించిన మేరకు విశ్రాంతి రోజులకు లెక్కకట్టి ఆసరా సొమ్ము ఇస్తారు. తాజాగా ఇచ్చిన జాబితాలో గైనకాలజీ, పల్మనరీ, డయాబెటిక్ ఫుట్, డెంగీ జ్వరం వంటివి ఉన్నాయి. రోగులు తమ ఆధార్‌ను బ్యాంకుకు లింకు చేసి ఉంటే వెంటనే నిధులు జమచేస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment