సాక్షి, అమరావతి: వేతన సవరణ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వైద్యుల కల ఎట్టకేలకు నెరవేరింది. బోధనాస్పత్రులు, వైద్య, డెంటల్ కళాశాలల్లో పనిచేసే బోధనా వైద్యులకు వేతన సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 1వ తేదీ నుంచి వేతన సవరణ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనివల్ల సుమారు 4 వేల మంది వైద్యులకు లబ్ధి చేకూరుతుంది. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు వేతన సవరణ ఇచ్చారు.
ఆ తర్వాత 2016లో తిరిగి వేతనాలు సవరించాల్సి ఉండగా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. ప్రభుత్వం చుట్టూ వైద్యులు కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదు. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా.. ప్రభుత్వ వైద్యులు తమ వేతనాల గురించి విన్నవించారు. ఇంతలోనే 2020 ఫిబ్రవరి నుంచి కోవిడ్–19 కారణంగా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా వైద్యులకు న్యాయబద్ధంగా అందాల్సిన వేతన ఫలాలు అందించాలనే ఉద్దేశంతో వారికి 2021 మార్చి 1 నుంచి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు తండ్రి వైఎస్ వేతనాలు పెంచగా, ఇప్పుడు తనయుడు వైఎస్ జగన్ తండ్రి బాటలోనే నిర్ణయం తీసుకున్నారని వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భారీగా పెరిగిన వేతనాలు
రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 2 డెంటల్ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో ట్యూటర్ నుంచి ప్రొఫెసర్ వరకూ 4 వేల మంది పని చేస్తున్నారు. వీరందరికీ వేతన సవరణ వల్ల భారీగా వేతనాలు పెరగనున్నాయి. 7వ సెంట్రల్ పే కమిషన్ ఫార్ములా ప్రకారం వేతనాలను పెంచినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అకడమిక్ లెవెల్, సీనియార్టీని బట్టి వేతనాల పెంపు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఉదాహరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.68,900 బేసిక్‌గా నిర్ణయించారు. అలవెన్సులు అంటే టీఏ, డీఏ, హెచ్‌ఆర్‌ఏ అన్నీ కలిపితే రూ.లక్ష వరకూ లభిస్తుంది.అన్ని పోస్టుల విషయంలోనూ ఇదేవిధంగా ఉంటుంది.
అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయుడు
2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్యులకు పీఆర్‌సీ ఇచ్చారు. 16 సంవత్సరాల తరువాత ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వేతనాలు పెంచారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వ వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత కష్టపడి పనిచేస్తాం.
– డా.జయధీర్, కన్వీనర్, ప్రభుత్వ వైద్యుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment