
సాక్షి, అమరావతి: కరోనా బారినపడిన 18 సంవత్సరాలలోపు పిల్లలకు చికిత్సలో యాంటీవైరల్స్, మోనోక్లోనల్ యాంటీబాడిస్ వాడకూడదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం సూచనలకు అనుగుణంగా పిల్లల చికిత్స, కోవిడ్, నాన్–కోవిడ్ ప్రాంతాల్లో పనిచేసే వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సవరించిన మార్గదర్శకాలను వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ సోమవారం విడుదల చేశారు.
మార్గదర్శకాలు ఇవే..
5 ఏళ్ల లోపు పిల్లలు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు లేకుండా ఉండేలా తల్లిదండ్రుల పర్యవేక్షణలో 6–11 ఏళ్ల పిల్లలు మాస్క్ వినియోగించవచ్చు. 12 ఏళ్లు, ఆ పైబడిన పిల్లలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. 15–18 ఏళ్ల పిల్లలు తప్పనిసరిగా టీకా వేసుకోవాలి. ఆస్పత్రుల్లో, వైద్యుల పర్యవేక్షణలోనే పాజిటివ్ అయిన పిల్లల చికిత్సలో స్టిరాయిడ్‌లు వినియోగించాలి. 2, 3 రోజులు జ్వరంతో బాధపడుతుండటంతోపాటు ర్యాష్, కళ్లకలక, హైపర్ టెన్షన్, శరీరంపై దద్దుర్లు, దురదలు, డయేరియా లక్షణాలున్నా.. ఈఎస్సార్ 40, సీఆర్‌పీ 5 కన్నా ఎక్కువగా ఉన్నా మిస్–సీగా పరిగణించి చికిత్స అందించాలి.
లక్షణాలు లేనివాళ్లు, స్వల్ప లక్షణాలున్న వారికి యాంటీబాడీలు వాడకూడదు. ఊపిరితిత్తుల్లో ఎక్కువగా ఇన్‌ఫెక్షన్ ఉన్నవారికి, న్యూమోనియాతో బాధపడేవారికి, సెప్టిక్ షాక్‌కు గురైనవారికి మాత్రమే చికిత్సలో యాంటీబయోటిక్స్ వాడాలి. 3–5 రోజుల్లో సిరాయిడ్స్ వాడకూడదు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి 5వ రోజు నుంచి స్టిరాయిడ్స్ వినియోగించాలి. పరిస్థితిని బట్టి 10–14 రోజుల వరకు డోసు తగ్గించుకుంటూ వెళ్లాలి.
Comments
Please login to add a commentAdd a comment