సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో జూలై 7వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగించారు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. మిగతా 9 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది.
ఈమేరకు కలెక్టర్లు, పోలీస్ అధికారులు కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో కోవిడ్ పాజిటివీటీ రేటు 5 శాతం ఉన్న జిల్లాల్లో సడలింపు సమయాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆ రోజుకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పాజిటివిటీ 5 శాతానికిపైగా ఉంది. దీంతో ఈ 5 జిల్లాల్లో సడలింపు సమయాన్ని తగ్గించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉండటంతో ఆ జిల్లాలో కూడా సడలింపు సమయాన్ని పెంచారు. దీంతో మిగిలిన 4 జిల్లాల్లో మాత్రమే కర్ఫ్యూ సడలింపును ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరిమితం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment