
కుడివైపున మహాద్వారం వద్ద చేపట్టిన హెర్బల్ క్లీనింగ్ పనులు
సాక్షి, తిరుమల: కోట్లాది మంది భక్తుల కొంగుబంగారమైన తిరుమలేశుని ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దడానికి అధికారులు సిద్ధమయ్యారు. సంప్రదాయ హెర్బల్ మిశ్రమాలతో ఆలయ ప్రాకారాలకు, మండపాలకు మెరుగులు దిద్దుతున్నారు. ఆలయ రాతి ప్రాకారాలు, రాతి మండపాల్లో పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మసి, పాచిని పోగొట్టి నిర్మాణాలకు సహజత్వం, వన్నె తీసుకొచ్చేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీకారం చుట్టింది.
మసిబారిన రాతి నిర్మాణాలు
తిరుమల శ్రీవారి ఆలయం మండపాలు, ప్రాకారాలతో శోభిల్లుతోంది. అయితే ధూపదీప హారతి, అఖండ దీపారాధనలతో రాతి ప్రాకారాలు, రాతి మండపాలు పొగ, మసి అంటుకుని నల్లబారాయి. వీటితోపాటు వాతావరణ పరిస్థితులతో పాచి, దుమ్ము చేరింది. ఫలితంగా రాతి నిర్మాణాల అసలు రూపం మారిపోయి శిల్పకళా సౌందర్యం కళ తప్పింది.
తమిళనాడు ఆలయాల్లో హెర్బల్ క్లీనింగ్
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడి ఆలయాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఆలయ రాతి ప్రాకారాలు, మండపాలకు సహజత్వాన్ని తీసుకొచ్చేందుకు సంప్రదాయ వనమూలికలు, విత్తనాల ఔషధ మిశ్రమాలను వినియోగిస్తోంది. ఇటీవల టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ శ్రీరంగం క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ చేపట్టిన హెర్బల్ క్లీనింగ్‌ను పరిశీలించి టీటీడీ ఆలయాల్లోనూ ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ హెర్బల్ క్లీనింగ్ విధానాన్ని ముందు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో చేపట్టగా మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో శ్రీవారి ఆలయంలోనూ అమలుకు శ్రీకారం చుట్టారు. తొలుత మహాద్వారం ఎడమవైపున పనులు చేపట్టి హెర్బల్ మిశ్రమ లేపనంతో శుద్ధి చేశారు. నీటితో కడిగి, మళ్లీ లేపనం చేశారు. దీంతో రాతి ప్రాకారం సహజత్వంతో శోభాయమానంగా కనిపిస్తోంది. శుద్ధి చేయకముందు, చేసిన తర్వాత పనులను అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
సహజత్వం కోల్పోకుండా..
తిరుమల ఆలయం రాతి ప్రాకారాలు, మండపాలు సహజత్వం కోల్పో కుండా హెర్బల్ క్లీనింగ్‌తో పనులు చేపట్టాం. ముందు గోవిందరాజస్వామి ఆలయంలో పనులు పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతే తిరుమలలోనూ ప్రారంభించాం. హెర్బల్ క్లీనింగ్‌తో ఆలయం మరింత సుందరంగా, శోభాయమానంగా దర్శనమిస్తుంది.
– టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్
Comments
Please login to add a commentAdd a comment