సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. నెల క్రితం రోజుకు 350 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా ఉండగా ఇప్పుడు 590 మెట్రిక్ టన్నులకు చేరుకుందని తెలిపారు. గతంలో 54 ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే ఆక్సిజన్‌ను ఇప్పుడు 78కి పెంచగలిగామన్నారు. ఆక్సిజన్ సామర్థ్యం పెంచుకునేందుకు ఇంకా ఎలాంటి వనరులున్నా వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు.
అవసరం మేరకు వినియోగిద్దాం..
తాజాగా కేంద్రం 3 ఆక్సిజన్ ట్యాంకర్లు ఇచ్చిందని, ఒకటి ఇప్పటికే రాష్ట్రానికి చేరుకోగా మరో రెండు కోల్‌కతా నుంచి వస్తున్నాయని సింఘాల్ తెలిపారు. అక్కడి నుంచే ఒక్కో ట్యాంకర్‌లో 20 టన్నుల చొప్పున 40 టన్నుల ఆక్సిజన్‌తో రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నెలాఖరుకు 25 కొత్త ట్యాంకర్లు అందుబాటులోకి వస్తాయని, సరఫరాలో జాప్యం కాకుండా ప్లాంట్ల నుంచి నేరుగా ఆస్పత్రులకు కాకుండా ఒక సెంటర్‌లో ఆక్సిజన్ నింపి అక్కడ నుంచి చిన్న వాహనాల ద్వారా ఆస్పత్రులకు చేరవేస్తామన్నారు. ‘రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సిలిండర్లు 17 వేలు ఉన్నట్లు గుర్తించాం. వీటిలో 14,338 సిలిండర్లను మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లుగా మార్చాలని నిర్ణయించాం, ఇప్పటికే 6,917 సిలిండర్లను మార్చాం. మిగిలినవి కూడా త్వరగా పూర్తయితే ఆక్సిజన్ కొరత ఉండదు. తాజాగా నెల్లూరు జిల్లాలో అధికారులు ఒక్క రోజులో 30 శాతం ఆక్సిజన్ పొదుపు చేయగలిగారు. అవసరం మేరకు వినియోగిస్తే అన్ని ఆస్పత్రుల్లో ఎక్కువ మందికి ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలను కూడా తెరిచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటాం’ అని సింఘాల్ తెలిపారు.
104కి ఒకే రోజు 17 వేల కాల్స్..
చిత్తూరు జిల్లా శ్రీసిటీలో 140 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంటు అక్టోబర్‌లో అందుబాటులోకి రానుందని సింఘాల్ చెప్పారు. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్, కిట్‌లు, ఇతరత్రా విరాళాలు అందించేందుకు ఏర్పాటైన ప్రత్యేక విభాగానికి అర్జా శ్రీకాంత్ నోడల్ అధికారిగా ఉంటారని తెలిపారు. ఇప్పటికే ఐదు లీటర్ల సామర్థ్యం కలిగిన కాన్సన్‌ట్రేటర్లు 8 వేలు, పది లీటర్ల కెపాసిటీ కలిగిన 10 వేల కాన్సన్‌ట్రేటర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. 104 కాల్‌సెంటర్‌కు బుధవారం ఒక్కరోజే 17 వేల కాల్స్ వచ్చాయని, హోం ఐసోలేషన్‌లో ఉన్న 9 వేల మందికి పైగా బాధితులను వైద్యులు ఫోన్‌లో పరామర్శించి తగిన సూచనలు అందించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment