సాక్షి, హైదరాబాద్: అత్యవసర రోగుల ఇళ్లకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను సరఫరా చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 4,500 కాన్సన్‌ట్రేటర్లను అన్ని రకాల ఆస్పత్రుల్లో సిద్ధంగా ఉంచినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఒక్కో ప్రాథమిక ఆసుపత్రిలో సరాసరి రెండు మూడు చొప్పున సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు.
ఏరియా, సామాజిక, జిల్లా, బోధన ఆసుపత్రుల్లోనూ చాలాచోట్ల సిద్ధంగా ఉంచారు. కొన్ని పెద్దస్థాయి ఆసుపత్రుల్లో పది వరకు కూడా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఉంచారు. త్వరలో మరికొన్నింటిని కూడా అందుబాటులోకి తెస్తామని అధికారులు వెల్లడించారు.
కరోనా కాలంలో డిమాండ్
కరోనా నేపథ్యంలో ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడింది. దేశంలో సెకండ్‌వేవ్ సమయంలో చాలామంది రోగులు ఆక్సిజన్ అందక చనిపోయిన పరిస్థితులను కూడా చూశాం. పరిస్థితి విషమంగా ఉన్న అనేకమంది రోగులకు ఆక్సిజన్ ఎక్కించడం పరిపాటి. ఐసీయూ, వెంటిలేటర్లపై ఉండే రోగులకు కూడా ఆక్సిజన్ అవసరం పడుతుంది. చాలా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచారు. అయితే కొందరు రోగులు కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కొన్నాళ్లపాటు ఇళ్లల్లోనూ ఆక్సిజన్‌పై ఉండాల్సి వస్తుంది.
అటువంటి వారు ఇళ్లల్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను వాడుతున్నారు. కొందరు కొనుగోలు చేసుకోవడం, మరికొందరు అద్దెకు తెచ్చుకొని వాడేవారు. దీంతో అనేకమంది దాతలు ముందుకురావడం, ప్రభుత్వం కూడా కొన్నింటిని కొనుగోలు చేసి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఆస్పత్రుల్లో ఉంచుతోంది. వీటిని ఆస్పత్రుల్లో ఉంచడమే కాకుండా గ్రా>మాల్లో అత్యవసరమైన రోగులకు ఇళ్లకు కూడా ఇస్తున్నారు. కొన్నిచోట్ల కొద్దిపాటి అద్దెకు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎక్కడా ఆక్సిజన్‌కు కొరత లేకుండా చేయాలన్నది ఉద్దేశం. ఒకవేళ థర్డ్‌వేవ్ వచ్చినా కొరత లేకుండా అన్ని రకాలుగా ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment