oxygen supply
-
మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి
సాక్షి, అమరావతి /వరదయ్యపాళెం: మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా ఏపీ పయనిస్తోంది. సీఎం వైఎస్ జగన్ ఆలోచనలతో రాష్ట్రంలో రోజుకు 220 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంటు అందుబాటులోకి వచ్చింది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్‌కు లోటులేకుండా చూసే చర్యల్లో భాగంగా ఈ ప్లాంట్ ఏర్పాటైంది. శ్రీ సిటీలో నోవా ఎయిర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.130 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ ప్లాంట్‌ను సీఎం వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కోవిడ్ కారణంగా గతంలో ఆక్సిజన్ కొరత ఎదుర్కొన్న నేపథ్యంలో ఇకపై అలా ఇబ్బంది పడకూడదని గతంలో సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. భారీ స్థాయిలో ఒక ఆక్సిజన్ ప్లాంటును తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్‌కు లోటు రాకుండా స్వయం సమృద్ధి సాధించాలని అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. ఇందులో భాగంగా నోవా ఎయిర్‌తో రాష్ట్ర ప్రభుత్వం 2020 జనవరి 24న ఏంఓయూ చేసుకుంది. 2020 డిసెంబర్ 18న పనులు ప్రారంభించగా, 2021 నవంబర్‌లో పనులు తుది దశకు చేరాయి. రోజుకు 220 టన్నుల ఆక్సిజన్ తయారీ సామర్థ్యం గల ప్లాంటు సాకారం అయింది. ఈ ప్లాంట్‌లో మెడికల్ ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆర్గా్గన్ వాయువులు తయారవుతాయి. ఆరోగ్య సంరక్షణ, ఫార్మా, మెటల్స్, ఆటో, టెలికాం, టైర్లు, జనరల్ ఫ్యాబ్రికేషన్, ఏరోస్పేస్, ఇన్ఫ్రా వంటి రంగాలకు ఈ పరిశ్రమ వాయువులను సరఫరా చేయనుంది. సరిపడా ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. 14 నెలల్లో ప్లాంట్ ప్రారంభం కావడం అన్నది ఒక మైలు రాయి అని, ఇంత తక్కువ వ్యవధిలో ప్లాంట్ ప్రారంభం కావడం విశేషం అన్నారు. ఈ ప్లాంట్ ద్వారా పెద్ద ఎత్తున ఆక్సిజన్ లభించడంతో పాటు ఎంతో మందికి ఉపాధి కలుగుతుండటం మంచి పరిణామం అని చెప్పారు. ‘రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 144 పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. మరో 32 ప్లాంట్లు పెడుతున్నాం. దీనివల్ల ఆక్సిజన్ విషయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. 24,000 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి తెచ్చాం. కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినప్పుడు సరిపడా ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 300 టన్నుల ఆక్సిజన్ తయారీలో ఉంది. ఈ ప్లాంట్ ద్వారా జరిగే ఉత్పత్తి దీనికి అదనంగా వచ్చి చేరుతుంది’ అని తెలిపారు. కార్యక్రమంలో సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, నోవా ఎయిర్ సీఈవో అండ్ ఎండీ గజనన్ నబర్, కమర్షియల్ హెడ్ శరద్ మధోక్, శ్రీసిటీ జీఎం (కార్పొరేట్ ఎఫైర్స్) సీహెచ్.రవికృష్ణ పాల్గొన్నారు. శ్రీసిటీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే ఆదిమూలం, చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్, శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సహకారం బావుంది కోవిడ్కే కాదు, పరిశ్రమలకూ ఆక్సిజన్ చాలా ముఖ్యం. దేశంలో తొలిసారిగా ప్లాంట్ పెట్టాం. ఏపీ సరైనదని ఎంచుకుని ఈ ప్లాంట్ పెట్టాం. ఇక్కడ మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. 14 నెలల్లో ప్లాంట్‌ను నిర్మించాం. ప్రభుత్వ యంత్రాంగం బాగా సహకరించింది. కోవిడ్ వేవ్‌ల సమయంలో రవాణాకు, మానవ వనరులకు కొరత లేకుండా అధికారులు చూశారు. అందరికీ కృతజ్ఞతలు. – గజనన్ నబర్, సీఈవో అండ్ ఎండీ, నోవా ఎయిర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ -
రోజుకు 250 టన్నుల ఆక్సిజన్
సాక్షి, అమరావతి: కరోనా థర్డ్‌వేవ్ వేగంగా విస్తరిస్తున్న వేళ తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీసిటీలో నోవా ఎయిర్ మెడికల్ ఆక్సిజన్ యూనిట్ ఉత్పత్తికి సిద్ధమయ్యింది. త్వరలో దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రికార్డు స్థాయిలో నిర్మాణం ప్రారంభించిన 12 నెలల్లోనే ఈ యూనిట్ ఉత్పత్తి ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాయువుల తయారీ కంపెనీ నోవా ఎయిర్ టెక్నాలజీ.. ఒకపక్క కోవిడ్ ఇబ్బందులు వెంటాడుతున్నప్పటికీ 2020 డిసెంబర్లో నిర్మాణ పనులు ప్రారంభించి 2021 నవంబర్‌కి పూర్తిచేసింది. ప్రయోగ పరీక్షలు విజయవంతం కావడంతో వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమయ్యింది. రోజుకు 250 టన్నుల మెడికల్ ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆర్గాన్‌ను ఉత్పత్తి చేసేవిధంగా ఈ యూనిట్‌ను రూ.106 కోట్లతో ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ ద్వారా 150 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. హాంకాంగ్‌కు చెందిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ పీఏజీ నోవా ఎయిర్ టెక్నాలజీ పేరుతో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వాయువులను ఉత్పత్తి చేస్తోంది. పీఏజీ నిర్వహిస్తున్న ఆస్తుల విలువ రూ.3,37,500 కోట్లకుపైగా ఉండగా, ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రూ.22,500 కోట్ల విలువైన పారిశ్రామిక వాయువుల వ్యాపారం చేస్తోంది. ఈ సంస్థ రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటు చేయడానికి 2020 జనవరి 24న ఒప్పందం కుదుర్చుకుంది. -
AP: పుష్కలంగా ప్రాణవాయువు
సాక్షి, అమరావతి: కరోనా రెండో దశలో ఆక్సిజన్ కొరత కారణంగా రాష్ట్రంలో ఎదురైన ఇబ్బందులు తిరిగి కోవిడ్ మూడో దశలో తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాణవాయువుకు కొరతలేకుండా ఉండేలా ‘జగనన్న ప్రాణవాయువు’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 50, అంతకన్నా ఎక్కువ పడకలున్న ప్రతి ప్రభుత్వాసుపత్రిలో గాలి నుంచి మెడికల్ ఆక్సిజన్ తయారుచేసే ప్రెజర్ స్వింగ్ అడ్సార్పషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు ఏర్పాటుచేసింది. ఈ ప్లాంట్లను సీఎం వైఎస్ జగన్ సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. 124 ఆసుపత్రుల్లో 144 ప్లాంట్లు రాష్ట్రవ్యాప్తంగా 124 సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల్లో 144 పీఎస్ఏ ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకోసం రూ.189.5 కోట్లు వెచ్చించింది. ఇవి నిమిషానికి 500, వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 124 ఆస్పత్రుల్లో నిమిషానికి 93,600 లీటర్ల (లీటర్స్ పర్ మినిట్–ఎల్పీఎం) ఆక్సిజన్ ఉత్పత్తి అవ్వనుంది. మరోవైపు.. పీఎస్ఏ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు కరోనా మూడో దశ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఆ వివరాలు.. ► రూ.90.07 కోట్లతో 24,419 పడకలకు ఆక్సిజన్ పైప్లైన్ల ఏర్పాటు. ► 35 ఆసుపత్రుల్లో రూ.15 కోట్లతో 399 కిలోలీటర్ల సామర్థ్యంతో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ) ట్యాంకర్ల ఏర్పాటు. ► మరో 39 ఆస్పత్రుల్లో రూ.16.3 కోట్లతో 390 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఎల్ఎంఓ ట్యాంకర్లను కొనుగోలు చేయనున్న ప్రభుత్వం. ► ఆక్సిజన్ సరఫరా, నిల్వ చేయడానికి 20 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన 25 కంటైనర్లు రూ.15.25కోట్లతో కొనుగోలు. ► 23,971 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 26,746 డీ టైప్ సిలిండర్ల కొనుగోలు. ► రూ.6.22 కోట్లతో 13 జిల్లాల్లో 20 వీఆర్డీఎల్ ల్యాబ్‌ల ఏర్పాటు. ► రూ.21.93 కోట్లతో సివిల్, ఎలక్ట్రికల్ పనులు నిర్వహణ. ► రూ.297.36 కోట్లతో మెడికల్, ల్యాబ్ ఎక్విప్మెంట్, కోవిడ్ కిట్స్ కొనుగోలు. అన్ని వసతులూ సమకూర్చాం కరోనా మూడో దశ వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని వసతులు సమకూర్చాం. కరోనా చికిత్సకు అవసరమైన ఎనిమిది రకాల మందుల స్టాక్ సరిపడా ఉంది. నేడు పీఎస్ఏ ప్లాంట్లను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. – మురళీధర్‌రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీ వీసీ, ఎండీ -
ఖననం చేసేముందు కన్ను తెరిచిన పురిటికందు
సాక్షి, కోల్‌సిటీ(కరీంనగర్): చనిపోయాడనుకుని ఖననం చేయడానికి తీసుకెళ్తున్న మగశిశువు శ్వాస తీసుకోవడంతో వెంటనే పిల్లల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖనిలో చోటుచేసుకుంది. మంథని మండలానికి చెందిన ఓ మహిళ 26 వారాల గర్భిణి. నెలలు నిండకున్నా పురిటి నొప్పులు రావడంతో ఆమెను గోదావరిఖని లక్ష్మీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఏప్రిల్ 9న డెలీవరీ డేట్ ఇచ్చినా, పురిటినొప్పులు తీవ్రం కావడంతో వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. తక్కువ బరువుతో మగశిశువు జన్మించాడు. అయితే ఆ శిశువు బతకడం కష్టమని, ఏదైనా పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో శిశువును రాత్రంతా తల్లి వద్దే ఉంచారు బంధువులు. ఆదివారం ఉదయం శిశువును గమనించగా శ్వాస తీసుకోలేదు. దీంతో చనిపోయాడని భావించిన బంధువులు ఖననం చేయడానికి గోదావరి నది ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడికెళ్లాక శిశువుపై ఉంచిన గుడ్డను తీసి చూశారు. శిశువులో కదలిక కనిపించడంతో హుటాహుటిన లక్ష్మీనగర్‌లో గల మరో పిల్లల ఆస్పత్రికి తరలించారు. తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, మెరుగైన వసతులు కలిగిన పిల్లల ఆస్పత్రికి తరలించాల్సి ఉందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. సరిగా పరీక్షించకుండానే శిశువులో శ్వాస ఆడటం లేదని మొదట పురుడుపోసిన ఆస్పత్రి సిబ్బంది చెప్పడం వల్లే తాము ఖననం చేయడానికి తీసుకెళ్లామని శిశువు బంధువులు ఆరోపిస్తున్నారు. జరిగిన ఘటనలో తమ నిర్లక్ష్యమేమీ లేదని, మెరుగైన ఆస్పత్రికి తరలించాలని తాము ముందే చెప్పగా, చనిపోయాడని భావించి బంధువులే శిశువును శ్మశానానికి తీసుకెళ్లారని లక్ష్మీనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు వివరించారు. -
ఎయిర్ ప్యూరిఫైయర్.. ప్రతీ ఇంట్లో ఉండాల్సిందే
మన పరిసరాల్లో గాలి స్వచ్ఛంగా ఉంటేనే మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతాం. వీధుల్లోకి వెళితే వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ము ధూళితో నిండే గాలి ఉక్కిరిబిక్కిరి కావడం ఎటూ తప్పదు. కనీసం ఇంట్లోనైనా స్వచ్ఛమైన గాలిలో ఊపిరి పీల్చుకుందామనుకుంటే ఇలాంటి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంట్లో ఉండాల్సిందే! ఇది ఫ్యాను మాదిరిగా చక్కని గాలి అందిస్తూనే, గాలిలోని ప్రమాదకరమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. ఇది వెయ్యి చదరపు గజాల పరిధిలోని గాలిని క్షణాల్లో స్వచ్ఛంగా మార్చేస్తుంది. యూరోపియన్ ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థ ‘ఏస్పెన్’ డిజైనర్లు ‘హెచ్13 హెపా యూవీసీ జెర్మిసైడల్ ఎయిర్ ప్యూరిఫైయర్’ పేరిట దీనిని రూపొందించారు. దీనిని ఆన్ చేయగానే, గాలి వీచడంతో పాటు, ఇందులోని అల్ట్రావయొలెట్ లైట్ కూడా వెలుగుతుంది. దీని నుంచి వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాలు గాలిలోని సూక్ష్మక్రిములను క్షణాల్లో నాశనం చేస్తుంది. చదవండి: చనిపోయి మళ్లీ అదే తల్లి కడుపున పుట్టారు..సైన్స్‌కే అందని అద్భుతం -
రోగుల ఇంటికే ఆక్సిజన్
సాక్షి, హైదరాబాద్: అత్యవసర రోగుల ఇళ్లకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సరఫరా చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 4,500 కాన్సన్ట్రేటర్లను అన్ని రకాల ఆస్పత్రుల్లో సిద్ధంగా ఉంచినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఒక్కో ప్రాథమిక ఆసుపత్రిలో సరాసరి రెండు మూడు చొప్పున సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. ఏరియా, సామాజిక, జిల్లా, బోధన ఆసుపత్రుల్లోనూ చాలాచోట్ల సిద్ధంగా ఉంచారు. కొన్ని పెద్దస్థాయి ఆసుపత్రుల్లో పది వరకు కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉంచారు. త్వరలో మరికొన్నింటిని కూడా అందుబాటులోకి తెస్తామని అధికారులు వెల్లడించారు. కరోనా కాలంలో డిమాండ్ కరోనా నేపథ్యంలో ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడింది. దేశంలో సెకండ్‌వేవ్ సమయంలో చాలామంది రోగులు ఆక్సిజన్ అందక చనిపోయిన పరిస్థితులను కూడా చూశాం. పరిస్థితి విషమంగా ఉన్న అనేకమంది రోగులకు ఆక్సిజన్ ఎక్కించడం పరిపాటి. ఐసీయూ, వెంటిలేటర్లపై ఉండే రోగులకు కూడా ఆక్సిజన్ అవసరం పడుతుంది. చాలా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచారు. అయితే కొందరు రోగులు కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కొన్నాళ్లపాటు ఇళ్లల్లోనూ ఆక్సిజన్‌పై ఉండాల్సి వస్తుంది. అటువంటి వారు ఇళ్లల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను వాడుతున్నారు. కొందరు కొనుగోలు చేసుకోవడం, మరికొందరు అద్దెకు తెచ్చుకొని వాడేవారు. దీంతో అనేకమంది దాతలు ముందుకురావడం, ప్రభుత్వం కూడా కొన్నింటిని కొనుగోలు చేసి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఆస్పత్రుల్లో ఉంచుతోంది. వీటిని ఆస్పత్రుల్లో ఉంచడమే కాకుండా గ్రా>మాల్లో అత్యవసరమైన రోగులకు ఇళ్లకు కూడా ఇస్తున్నారు. కొన్నిచోట్ల కొద్దిపాటి అద్దెకు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎక్కడా ఆక్సిజన్‌కు కొరత లేకుండా చేయాలన్నది ఉద్దేశం. ఒకవేళ థర్డ్‌వేవ్ వచ్చినా కొరత లేకుండా అన్ని రకాలుగా ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఆస్పత్రులకు ఆక్సిజన్ ఇంజనీర్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ వ్యవస్థను పటిష్టపర్చడానికి వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు చేసింది. ఇందుకోసం భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ పట్టభద్రుల సేవలను వినియోగించుకోనుంది. ఆక్సిజన్ సరఫరా నిర్వహణ కోసం ఎంటీటీ (మల్టీ టాస్క్ టెక్నీషియన్స్) విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు అధికారులు యోచిస్తున్నారు. కోవిడ్ సమయంలో తలెత్తిన సాంకేతిక లోపాలను అధిగమించి, రోగులకు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఆక్సిజన్ అందించేలా కొత్త విధానం ఉండేలా చర్యలు చేపడుతున్నారు. పీహెచ్సీ, సీహెచ్‌సీ స్థాయిలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు.. ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటివరకూ వీటి నిర్వహణ అనస్థీషియా డాక్టర్లు ఐసీయూ చూస్తుండగా, నైపుణ్యం లేనివారు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ చూసేవారు. ప్లాంట్లలో తలెత్తే సాంకేతిక లోపాలు వీరికి తెలియవు. కాబట్టి ప్రత్యేక నిపుణులను తయారు చేయబోతున్నారు. మార్గదర్శకాలు రెడీ అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా నిర్వహణకు ఇంజనీరింగ్ పట్టభద్రులను నియమించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. ఇందులో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్రొడక్షన్, కెమికల్ ప్రాసెస్, ఆటోమొబైల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చదివిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలోనే క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి వీరిని నియమిస్తారు. తొలుత 28 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. దీన్ని ఇంటర్న్షిప్గా భావిస్తారు. వీరిని మల్టీ టాస్క్ టెక్నీషియన్స్‌గా పేర్కొంటారు. ఇంటర్న్‌షిప్ కాలంలో పనితీరు మదింపు చేసి, ఆ తర్వాత బ్రిడ్జ్ కోర్సుల రూపంలో ఉన్నతస్థాయి నైపుణ్య శిక్షణ ఇస్తారు. వీరికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శిక్షణ ఇస్తుంది. శిక్షణకు జాతీయ ఆరోగ్యమిషన్ (కుటుంబ సంక్షేమ శాఖ), ఏపీ హెల్త్ స్ట్రెంగ్త్‌నింగ్ ప్రాజెక్ట్, సాంకేతిక విద్యా శాఖ, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల నోడల్ ఏజెన్సీలుగా పనిచేస్తాయి. వేతనాలు ఆయా విభాగాలు నిర్ణయించాల్సి ఉంటుంది. విధుల నిర్వహణ ఇలా.. ఆక్సిజన్ సరఫరా విషయంలో ఎంటీటీలు ప్రత్యేక విధులు ఎలా ఉండాలన్న దానిపైనా మార్గదర్శకాలు రూపొందించారు. ఆక్సిజన్ ఎకో సిస్టంపై అవగాహన, ఆక్సిజన్ వినియోగంపై పర్యవేక్షణ, ఆస్పత్రుల్లో రోగులకు ఆక్సిజన్ డెలివరీ ఏవిధంగా వెళుతోంది, ఆక్సిజన్ పరికరాల పరిశుభ్రత, నిర్వహణ వీరి విధుల్లో ఉంటాయి. మల్టీ పారామానిటర్, వెంటిలేటర్లు, సిపాప్, బైపాప్ల పర్యవేక్షణతో పాటు, పీఎస్ఏ (ప్రెజర్ స్వింగ్ అబ్జార్బేషన్) ప్లాంట్ కార్యకలాపాలు, జియోలైట్స్, కంప్రెషర్లు, పీఎస్ఏ ప్లాంట్ ఏర్పాటు దశలో చర్యలు, బైపాస్ సిస్టం, తనిఖీలు, విద్యుత్ కనెక్షన్లు, ప్లాంట్ షట్‌డౌన్, తిరిగి పునరుద్ధరణ వంటి అన్ని విధులనూ ఎంటీటీలే చూసుకోవాల్సి ఉంటుంది. జిల్లాల్లో కలెక్టర్ల స్థాయిలో సెలక్షన్ కమిటీ ద్వారా వీరిని నియమించుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. -
రూ.250 కోట్లతో ప్లాంట్: రోజుకు 600 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న పారిశ్రామిక ఆక్సిజన్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కర్నూలులో మరో ఆక్సిజన్ తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్నట్టు ఎలెన్ బర్రీ గ్యాసెస్ లిమిటెడ్ ప్రకటించింది. రూ.250 కోట్లతో రోజుకు 600 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఎలెన్ బర్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరుణ్ అగర్వాల్ తెలిపారు. ఈ యూనిట్ ద్వారా పరిశ్రమలకు అవసరమైన ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్ వంటి గ్యాస్‌లను ఉత్పత్తి చేయనున్నారు. ఫార్మా కంపెనీల నుంచి నైట్రోజన్ డిమాండ్ పెరుగుతుండటం, వెల్డింగ్, కాస్టింగ్‌లో ఆర్గాన్ గ్యాస్ వినియోగం కూడా పెరుగుతుండటంతో వీటి ఉత్పత్తిపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. కర్నూలు జిల్లాకు జిందాల్ ఇస్పాత్ స్టీల్ యూనిట్‌తో పాటు రాంకో సిమెంట్ ప్లాంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్లు వస్తుండటంతో వీటి అవసరాలకు ఉపయోగపడేలా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడేలా ఈ యూనిట్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తున్నారు. 2022 మధ్య నాటికి దీనిని అందుబాటులోకి తెస్తామని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ఈ సంస్థకు విశాఖలో యూనిట్ ఉంది. -
కోవిడ్ చికిత్స... ఖర్చు చూస్తే గుడ్లు తేలేయాల్సిందే!
యాంటీ జెన్, ఆర్టీ పీసీఆర్, ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు.. ఇంకా మరెన్నో నిన్నా మొన్నటి దాకా చెవుల్లో మార్మోగిపోయిన పేర్లు. ఇప్పుడు కోవిడ్ కొంత శాంతించినా.. దాని బారిన పడ్డవారు తమ ప్రాణాలు నిలుపుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఆర్థికంగా కుదేలైపోయారు. సాక్షి, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి దెబ్బకు దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి తారుమారు అయ్యింది. కోవిడ్ చికిత్స కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో అనేక కుటుంబాలు ఏడాదిలో సంపాదించే సొమ్ములో సగానికి పైగా ఆస్పత్రి ఖర్చులకే సరిపోయాయి. కోవిడ్ చికిత్స కోసం దేశ ప్రజలు పెట్టిన ఖర్చు వివరాలపై ఇటీవల చేపట్టిన సర్వేలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. రూ. 64,000 కోట్లు కరోనా టెస్టింగ్, ట్రీట్మెంట్కు ప్రజలు చేసిన ఖర్చుపై పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియాతో పాటు అమెరికాకు చెందిన డ్యూక్ గ్లోబల్ హెల్త్ ఇన్సిస్టిట్యూట్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఈ సర్వే వివరాల ప్రకారం... కోవిడ్ పరీక్షలు, చికిత్సల కోసం దేశ ప్రజలు ఏకంగా రూ. 64,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తేలింది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం వేసిన అంచనా వ్యయం రూ.35,000 కోట్ల కంటే దాదాపు రెట్టింపు ఖర్చు చికిత్సకు అయ్యింది. ఇంకా ఎక్కువే కరోనా చికిత్సకు వివిధ రాష్ట్రాలు విధించిన పరిమితులను పరిగణలోకి తీసుకుని తాము ఈ నివేదిక సిద్ధం చేసినట్టు ఈ సర్వేలో కీలకంగా వ్యవహరించిన శక్తివేల్ సెల్వరాజ్ పేర్కొన్నారు. అంతేకాదు తాము కేవలం ఆస్పత్రి ఖర్చులనే పరిగణలోకి తీసుకున్నామని, ఆస్పత్రికి రానుపోను రవాణా, మరణాలు సంభవిస్తే అంత్యక్రియులు తదితర ఖర్చులు లెక్కించ లేదని తెలిపారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం వ్యయం మరింతగా పెరుగుతుందన్నారు. ఐసీయూలో చికిత్సకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కరోనా చికిత్స పొందిన వారి కుటుంబాల బడ్జెట్ అయితే చిన్నాభిన్నమైంది. ఒక ఏడాది మొత్తం సంపాదనలో వివిధ కేటగిరిల వారీగా కరోనా చికిత్సకు అయిన ఖర్చు వివరాలు ఇలా ఉన్నాయి. - క్యాజువల్స్ వర్కర్స్‌లో తమ వార్షిక ఆదాయంలో 86 శాతాన్ని కరోనా చికిత్సకే వెచ్చించారు. - శాలరీడ్ ఎంప్లాయిస్‌లో తమ ఆదాయంలో 50 శాతాన్ని ఐసీయూ చికిత్స కోసం ఖర్చు చేశారు. - సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తుల సంవత్సర ఆదాయంలో 66 శాతం కోవిడ్ చికిత్స ఖర్చులకే సరిపోయింది హోం ఐసోలేషన్‌లో ఉన్నా.. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆస్పత్రికి పోకుండా హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందినా ఆర్థిక సమస్యలు తప్పలేదు. హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ క్యాజువల్ వర్కర్స్ తమ ఆదాయంలో 43 శాతం నష్టపోగా స్వయం ఉపాధి పొందే వారు తమ ఆదాయంలో నాలుగో వంతు కోల్పోయారని సర్వేలో తేలింది. శాలరీ ఎంప్లాయిస్ విషయంలో ఇది 15 శాతంగా నమోదు అయ్యింది. పరీక్షలు కూడా భారమే దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో RT-PCR పరీక్షలకు సగటున రూ. 2200 వసూలు చేశారు. సాధారణంగా ఓ క్యాజువల్ లేబర్ వారం సంపాదన కూడా ఇంతే ఉంటుంది. ఒక్కరికిలో ఈ కరోనా లక్షణాలు కనిపించినా.. ఆ ఫ్యామిలీ మొత్తానికి పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పరీక్షలకు కూడా ప్రజలు భారీగానే ఖర్చు పెట్టారని సర్వే పేర్కొంది. -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రుయా ఘటన
సాక్షి, అమరావతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితులు మరణించిన ఘటనపై చిత్తూరు కలెక్టర్ మంగళవారం హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఆక్సిజన్ సరఫరా చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే బాధితులు మరణించారని తన నివేదికలో పేర్కొన్నారు. కాంట్రాక్టర్ తొలగింపునకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది బాలస్వామి వివరించారు. అలాగే ఆక్సిజన్ పీడనం తగ్గినప్పుడు అప్రమత్తం చేసే అలారం పనిచేయలేదని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితులు మరణించిన ఘటనలో బాధ్యులైన అధికారులు, ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ టీడీపీ నేత, శాప్ మాజీ చైర్మన్ మోహనరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ఆక్సిజన్ సరఫరా : మోదీ ఉన్నత స్థాయి సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి థర్డ్‌వేవ్ అంచనాల మధ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి, లభ్యతను సమీక్షించనున్నారని వెల్లడించాయి. 23,000 కోట్ల రూపాయల కరోనా ఉపశమన ప్యాకేజీని ఆమోదించిన తర్వాత ప్రధాని మోదీ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా కోవిడ్-19పై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా మౌలిక వైద్య సదుపాయాల పెంపు కోసం కేంద్ర క్యాబినెట్ రూ.23,123 కోట్ల ప్యాకేజీకి ఆమోదించిన సంగతి తెలిసిందే. కేబినెట్‌ను విస్తరణ అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన తొలి భేటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పునర్వ్యవస్థీకరణ తరువాత అనంతరం తొలిసారి మీడియానుద్దేశించి మాట్లాడిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా వైద్య మెరుగుదల కోసం దేశంలోని మొత్తం 736 జిల్లాల్లో సంయుక్త ప్రణాళికను అమలుచేస్తామని చెప్పారు. కరోనా థర్డ్ వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం చూపిస్తుందన్న అంచనాలపై కేంద్రం దృష్టి సారించింది. అలాగే మహమ్మారి సెకండ్ వేవ్‌లో ఏప్రిల్-మేలో ఆసుపత్రులలో తీవ్రమైన ఆక్సిజన్ కొరతతో అనేకమంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమవుతోంది. దీనికి తోడు రానున్న థర్డ్‌వేవ్ హెచ్చరికలతో భవిష్యత్తులో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు, సరఫరాను పెంచేందుకు వివిధ రాష్ట్రాల సమన్వయంతో చర్యలు తీసుకుంటోంది. -
ఏపీకి 400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించిన అమెరికా
సాక్షి, అమరావతి: అగ్రరాజ్యం అమెరికా ఆంధ్రప్రదేశ్‌కి 400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించింది. అమెరికా -భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం కింద వీటిని అందజేశారు. ఏపీకి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసినందుకు గాను ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్ డా. శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఢిల్లీలోని ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ వీటికి కస్టమ్స్ క్లియరెన్స్ ఇచ్చారు. వీటిలో తూర్పుగోదావరి జిల్లాకు 200, పశ్చిమ గోదావరికి 100, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలకు 50 చొప్పున తరలించారు. -
రెండు రోజులకు ఒక సిలెండర్.. ఊపిరితిత్తులకు రంధ్రాలు..
సాక్షి, అర్వపల్లి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లికి చెందిన లింగంపల్లి లింగమ్మ(60)కి ఊపిరితిత్తులకు రంద్రాలు పడి ఆయసంతో రోజులు వెళ్లదీస్తుంది. అయితే ఆక్సిజన్ పెడితేనే ఆమె బతుకుతుందని వైద్యులు తేల్చడంతో ఆమె కుటుంబీకులు రెండు రోజులకు ఒక సిలిండర్ తెచ్చి పెడుతున్నారు. ఒక సిలిండర్ ఆక్సిజన్ రెండు రోజులపాటు వస్తుంది. ఒక్క సిలిండర్‌కు రూ. 2500 ఖర్చు చేస్తున్నారు. అంటే రోజుకు రూ.1250 చొప్పున ఖర్చు అవుతుంది. కుటుంబీకులు కూలినాలి చేసి ఆమెను బతికిస్తున్నారు. ఆమెకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఏర్పాటు చేస్తే ఆక్సిజన్ అవసరం ఉండదని.. దాతలు సాయమందించి ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను అందించాలని ఆమె కుమారుడు సీతారాములు కోరుతున్నారు. ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మిషన్‌కు రూ. 50వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. చదవండి: విషాదం: కరోనా వ్యాక్సిన్‌కు భయపడి యువకుడు.. -
కొత్త సీపాప్ మెషీన్: కరోనా బాధితులకు వరం?
సాక్షి, చండీగఢ్: కరోనా సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితుల కష్టాలు వర్ణనాతీతం. ఊపిరాడక తమ కళ్లముందే ఆత్మీయులు విలవిల్లాడుతోంటే కుటుంబ సభ్యుల ఆవేదన ఇంతా కాదు. ఒక మాదిరి నుంచి తీవ్రంగా ప్రభావితమైన కరోనా బాధితుల్లో సీపాప్ థెరపీ చాలా కీలకంగా మారింది. అయితే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, సీపాప్, బీపాప్ మెషీన్లు ఖరీదైనవిగావటం బాధిత కుటుంబాల్లో మరింత ఆందోళన రేపింది. అయితే జీవన్ వాయు పేరుతో రూపొందించిన ఒకకొత్త సీపాప్ డివైస్ వివరాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ ( ఐఐటి రోపర్ )ట్వీట్ చేసింది. చాలా తక్కువ రేటులో సీపాప్‌ను మెషీన్ మోడల్ రూపొందించడం ఒక ప్రత్యేకత అయితే..విద్యుత్ అవసరం లేకుండానే పనిచేయడం మరో విశేషం. ఐఐటీ రోపార్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖుష్బూరాక దీన్ని డిజైన్ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా విద్యుతు అవసరం లేకుండానే అతి తక్కువ ఖర్చుతో దీన్ని తయారు చేసినట్టు రాక వెల్లడించారు. నిమిషానికి 15 లీటర్లు ఆక్సిజన్ అందిస్తుండగా, తమ డివైస్ ద్వారా నిమిషానికి 16 లీటర్లు దాకా అందిచ వచ్చన్నారు. అంతేకాదు దీన్ని 3 వేల రూపాయలలోపే దీన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ‘జీవన్ వాయు’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ మెషీన్ ద్వారా గ్రామాలు, సౌకర్యాలు కొరత వున్న గ్రామాల నుంచి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రులకు చేరేవారి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పీఈసీ భాగస్వామ్యంతో ఈ పరికరాన్ని తయారుచేసినట్టు వెల్లడించారు. అన్ని అనుమతులు లభిస్తే.. త్వరలోనే దీన్ని కమర్షియల్‌గా అందుబాటులోకి తీసుకొస్తామని ఆమె చెప్పారు. @iitrpr develops NATION’S FIRST Power-free CPAP device ‘JIVAN VAYU’ to save lives in villages and low resource areas and during transit of patients from ambulance to hospitals. @Reuters @DrRPNishank @EduMinOfIndia @SanjayDhotreMP @iitcouncil @PIB_India @HuffPost @PTI_News pic.twitter.com/VBKtKxWWqG — IIT Ropar (@iitrpr) June 14, 2021 -
యూపీలో దారుణం: ఆక్సిజన్ నిలిపివేసి మాక్ డ్రిల్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఒకవైపు కరోనాతో తీవ్ర అనారోగ్యం , ఆక్సిజన్ కొరతతో పేషెంట్లు విల విల్లాడిపోతోంటే..ఆగ్రాలోని పరాస్ ఆసుపత్రిలో కావాలనే "మాక్ డ్రిల్" నిర్వహించిందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఏప్రిల్ 27న క్రిటికల్ కేర్‌లో ఉన్న పేషెంట్లకు అయిదు నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరాను నిలిపివేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం సంచలన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో రౌండ్లు కొడుతోంది. దీనిపై యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పారాస్ హాస్పిటల్ యజమాని డాక్టర్ అరింజయ్ జైన్ "మాక్ డ్రిల్" లో భాగంగా ఐదు నిమిషాలు ఆక్సిజన్ సరఫరాను తగ్గించినట్లు చెబుతున్న ఒక ఆడియో చక్కర్లు కొడుతోంది. ఇదే ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు అనుమతి కూడా ఉంది. అయితే తీవ్రమైన ఆక్సిజన్ కొరత కారణంగా డిశ్చార్జ్ కావాలని ఎన్నిసార్లు చెప్పినా బాధితుల బంధువులు నిరాకరించడంతో ఒక ప్రయోగం మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. దీంతో ఏప్రిల్ 27, ఉదయం 7 గంటలకు, తాము ఐదు నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరాను తొలగించామని, దీంతో ఊపిరాడక 22 మంది రోగుల శరీరాలు నీలం రంగులోకి మారిపోయాయనీ, వారు బతికి ఉండే అవకాశం లేదని ఈ ఆడియోలో జైన్ పేర్కొన్నారు. అందుకే ఆక్సిజన్ లేకపోతే మనుగడ కష్టమని గ్రహించి మిగిలిన 74 మంది రోగుల కుటుంబ సభ్యులను వారి వారి సొంత ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసుకోమని తెలిపామన్నారు. ఈ ఆడియో సంచలనంగా మారడంతో ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఈ ఆసుపత్రిలో, ఏప్రిల్ 26, 27 తేదీలలో ఏడు కోవిడ్ మరణాలు సంభవించాయనీ, ఈ వీడియోపై దర్యాప్తు చేయనున్నామని ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ మీడియాకు తెలిపారు. మరోవైపు ఈ వీడియోపై జైన్ మాట్లాడుతూ ఆడియోలోని తన మాటలను వక్రీకరించారని చెబుతున్నారు. అసుపత్రిలో రోగుల ఆక్సిజన్ డిపెండెన్సీని, ఈ కొరతను అధిగమించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించాం తప్ప, 22 మంది చనిపోయారని తాను చెప్పలేదని వాదించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. బీజేపీ పాలనలో, ఆక్సిజన్, మానవత్వం రెండింటికీ తీవ్రమైన కొరత ఏర్పడిందంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ కొరత సమయంలో ప్రధాని, యూపీ సీఎం యోగి, రాష్ట్రమంత్రి వ్యాఖ్యలను ఉటంకించిన ప్రియాంక గాంధీ, దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. PM: “मैंने ऑक्सीजन की कमी नहीं होने दी” CM: "ऑक्सीजन की कोई कमी नहीं। कमी की अफवाह फैलाने वालों की संपत्ति जब्त होगी।" मंत्री: “मरीजों को जरूरत भर ऑक्सीजन दें। ज्यादा ऑक्सीजन न दें।” आगरा अस्पताल: "ऑक्सीजन खत्म थी। 22 मरीजों की ऑक्सीजन बंद करके मॉकड्रिल की।" ज़िम्मेदार कौन? pic.twitter.com/DbiqtILE27 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 8, 2021 -
ఆక్సిజన్ ప్లాంట్.. ‘మేడిన్ తెలంగాణ’!
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్‌లో ఆస్పత్రుల్లో నెలకొన్న ఆక్సిజన్ కొరతను అధిగమించే లక్ష్యంతో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మిత్రులు వినూత్న ప్రయత్నం చేసి విజయం సాధించారు. స్థానికంగా లభించే విడిభాగాలతోనే సమర్థమైన పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్‌ను రూపొందించారు. తిరుపతి ఐఐటీ సహకారంతో చౌటుప్పల్‌లో పూర్తి స్వదేశీ ఆక్సిజన్ ప్లాంట్ సిద్ధం చేసినట్లు ఆ మిత్రులు స్థాపించిన కంపెనీ ఆక్సిఫ్లో శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఒక్కో యంత్రం నిమిషానికి 60 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలదని, ఇది 93 నుంచి 95 శాతం స్వచ్ఛతతో కూడి ఉం టుందని వివరించారు. ఈ పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాం ట్ను ఆక్సి ఫ్లో అని పిలుస్తున్నారు. ఆ ముడిపదార్థంతోనే సమర్థంగా ఆక్సిజన్.. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పూర్వ విద్యార్థులైన డిస్కవరీ ల్యాబ్స్ సీఈవో మన్నే ప్రశాంత్, ద యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపియా సీనియర్ డైరెక్టర్ యడ్లపల్లి శిరీష, ఎకో వెంచర్స్ అండ్ ఎకోటెక్ ఇండస్ట్రీస్ ఎండీ నరేడి ఆశి ష్లు తక్కువ సమయంలో సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్ తయారీ దిశగా అడుగులు చేశారు. ఈ అంశంపైనే పరిశోధనలు చేస్తున్న తిరుపతి ఐఐటీ శాస్త్రవేత్త డాక్టర్ గుమ్మా శశిధర్ సహకారం తీసుకున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ తయారీలో కీలకమైన జియోలైట్ పదార్థం దేశంలోనే అందుబాటులో లేని నేపథ్యంలో తక్కువ సామర్థ్యం ఉందన్న కారణంగా సోడియం ఆధారిత జియోలైట్‌ను దేశంలో వాడట్లేదన్న విషయాన్ని గుర్తించి దాంతోనే సమర్థంగా ఆక్సిజన్ ఉత్పత్తి జరిగేలా కొన్ని మార్పుచేర్పులు చేశారు. ఫలితంగా ఆక్సిజన్ ప్లాంట్ ధర గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం తాము నెలకు 20 ఆక్సీ ఫ్లో యంత్రాలను తయారు చేయగలమని కంపెనీ వివరించింది. చదవండి: ఊపిరి ఉన్నంతవరకూ కేసీఆర్ వెంటే.. -
విశాఖ తూర్పు నౌకాదళ కేంద్రానికి చేరిన ఐఎన్ఎస్ ఐరావత్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని తూర్పు నౌకాదళ కేంద్రానికి ఐఎన్ఎస్ ఐరావత్ నౌక గురువారం ఆక్సిజన్, కోవిడ్ మందులతో చేరుకుంది. కాగా ఐఎన్ఎస్ ఐరావత్ సింగపూర్ , వియత్నాం నుంచి 158 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, 2722 ఆక్సిజన్ సిలిండర్లను తీసుకొచ్చింది. సముద్ర సేతు ప్రాజెక్టులో భాగంగా సింగపూర్, వియత్నాం భారత్‌కు కోవిడ్ సామాగ్రిని అందించింది. ఇప్పటికే సింగపూర్, ఇతర మిత్ర దేశాలు రెండు సార్లు కోవిడ్ సామాగ్రిని అందించాయి. కాగా తూర్పు నౌకాదళ కేంద్రానికి చేరుకున్న సామాగ్రిని సిబ్బంది ఏపీతో పాటు ఇతర ప్రాంతాలకు తరలించనున్నారు. -
Oxygen Train: లోకో పైలట్ శిరీషకు ప్రధాని ప్రశంస
వేగం, భద్రం.. అనే రెండు సమాంతర రైలు పట్టాలపైన నైరుతి రైల్వే అధికారులు ఆ రోజు ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’ను నడపవలసి వచ్చింది! జార్ఘండ్‌లోని టాటానగర్ నుంచి బెంగళూరు సమీపంలోని వైట్‌ఫీల్డ్‌కు ఆరు ట్యాంకర్లలో లిక్విడ్ ఆక్సిజన్ని నింపి ఆ రైలును లోకో పైలట్ శిరీషకు అప్పగించారు. గంటన్నరలో ఆ ప్రాణవాయువు గమ్యం చేరింది. కరోనా రోగులున్న హాస్పిటళ్లకు సమయానికి శ్వాసలా అందింది. అత్యంత కీలక సమయంలో ఆక్సిజన్ రైలును నడిపిన తొలి మహిళా పైలట్‌గా శిరీషను తన తాజా ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భారత ప్రధాని ప్రశంసించారు. శనివారం రాత్రి బెంగళూరులోని ఆలిండియా రేడియో స్టేషన్ రికార్డింగ్ రూమ్‌లో కూర్చొని ఉన్నారు శిరీష (31). ఏ క్షణమైనా భారత ప్రధాని నరేంద్ర మోదీ తనతో మాట్లాడేందుకు లైన్లోకి రావచ్చన్న ఆలోచన ఆమె గొంతును తడారేలా చేస్తోంది. నిముషాలు గడుస్తున్నాయి. ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఆరు.. ఏడు.. ‘‘నమస్తే శిరీషాజీ..’’ ఒక్కసారిగా ప్రధాని స్వరం! వెంటనే శిరీష ప్రతి నమస్కారం. తర్వాత వెంటనే ప్రధాని ప్రశ్నలు, శిరీష సమాధానాలు. ‘‘శిరీషాజీ.. ఈ కష్టకాలంలో నారీశక్తి దేశాన్ని నడిపిస్తోంది. ఇక మీరు... కరోనా పేషెంట్లకు అత్యవసరమైన ప్రాణవాయువును తీసుకుని రైలును వేగంగా నడుపుకుంటూ విజయవంతం గా గమ్యస్థానం చేరుకున్నారు. ఇందుకు మీకు అభినందనలు. అంతటి ఆత్మ స్థయిర్యం, స్ఫూర్తి మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? మిమ్మల్ని అందుకు సంసిద్ధం చేయడానికి అవసరమైన బలాన్ని మీకు ఇచ్చింది ఎవరు? ఈ దేశం తెలుసుకోవాలని అనుకుంటోంది. నాకు కూడా..! చెప్పండి శిరీషాజీ’’ అడిగారు ప్రధాని. ‘‘మా నాన్న, మా అమ్మ ..’’ శిరీష జవాబు. ‘‘ఆక్సిజన్ కోసం వేచి చూస్తున్న రోగుల కోసం ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించుకుని వెళ్లడం అన్నది ఎంతలేదన్నా బాధ్యతతో కూడిన పని కదా. మీకెలా అనిపించింది?’’.. ప్రధాని. ‘‘రైల్వే అధికారులు అన్నీ సవ్యంగా ఉండేలా చూశారు. నాపై నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది’’ అని శిరీష సమాధానం.మొత్తం 2 నిముషాల 8 సెకన్లపాటు దేశ ప్రధానికి, దేశ పౌరురాలికి మధ్య స్ఫూర్తివంతమైన సంభాషణ నడిచింది. గంటన్నర పాటు 123 కి.మీ. దూరం ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను జాగ్రత్త గా, వేగంగా నడపడం వంటిదే దేశ ప్రధానితో ఒక నిముషం పాటైనా మాటను నడిపించడం. మర్నాడు ప్రధాని ‘మన్ కీ బాత్’లో ఈ సంభాషణ ప్రసారం అయింది. ఆ సమయానికి శిరీష తల్లి వైజాగ్‌లోని తమ ఇంట్లో.. చుట్టుపక్కల వాళ్లతో కలిసి కూర్చొని తన కూతురు, ప్రధాని ముచ్చటించుకోవడాన్ని హృదయం ఉప్పొంగుతుండగా విన్నారు. శిరీష తండ్రి రామారావు మాత్రం వినలేకపోయారు. పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ సెక్రెటరీగా ఆయన రిటైర్ అయ్యారు. కొంతకాలం క్రితమే కన్నుమూశారు. శిరీష నైరుతి రైల్వే ఉద్యోగి. బెంగళూరు డివిజన్లో లోకో పైలట్. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన ‘ఆల్ ఫిమేల్ క్రూ’ లో ప్రధాన పైలట్‌గా శిరీష గత వారం వార్తల్లోకి వచ్చారు. ఈ నెల 21 న జార్ఘండ్ నుండి బెంగళూరుకు ఆరు ట్యాంకర్లలో 120 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నింపి ఉన్న ఎక్స్‌ప్రెస్ రైలును గంటకు 80 కి.మీ వేగంతో శిరీష నడిపించుకుని వచ్చారు. ఆమెతోపాటు అసిస్టెంట్ లోకో పైలట్ అపర్ణ ఉన్నారు. రైలు బెంగళూరు చేరిన వెంటనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయెల్ శిరీష, ఆమె సహ పైలట్ దీక్షాదక్షతలను కొనియాడుతూ ‘‘ప్రాణవాయువును నడిపించుకుని వచ్చిన మహిళలు’’ అని ట్విట్టర్లో అభినందించారు. చదవండి: విదేశీ టీకాలకు నో ట్రయల్స్! -
ఓలా ఫౌండేషన్: ఇంటి ముందుకే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ రోగులకు ఓలా ఫౌండేషన్ అభయహస్తం అందించింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్ బాధితుల వద్దకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉచితంగా చేరవేసేందుకు ముందుకు వచ్చింది. ‘ఓ 2 ఫర్ ఇండియా’కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్‌ను ఓలా ప్రతినిధులు కలసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పదివేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఓలా హైదరాబాద్‌లో 500 కాన్సన్ట్రేటర్లను అందుబాటులోకి తెస్తోంది. ఓలా యాప్ ద్వారా సమాచారం తీసుకుని రోగులకు చేరవేయడంతోపాటు, తిరిగి వాటిని శానిటైజ్ చేసి రోగికి అందుబాటులోకి తెస్తారు. ప్రత్యేక్షంగా శిక్షణ పొందినవారితో ఓలా క్యాబ్స్ ద్వారా వీటిని కోవిడ్ రోగులకు అందుబాటులోకి తెస్తారు. స్వల్ప కోవిడ్ లక్షణాలతో బాధ పడుతున్న వారికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. రాజకీయనేతలు, అధికారులు, వివిధ వర్గాలవారు కోవిడ్ రోగులకు పలు రూపాల్లో సాయం అందిస్తున్నారని, అదేరీతిలో ఓలా ముందుకు రావడంపై రాష్ట్ర ఐటీ శాఖ అనుబంధ ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపూరి హర్షం వ్యక్తం చేశారు. మూడు, నాలుగు గంటల వ్యవధిలో బాధితులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఓలా సీఓఓ గౌరవ్ పొర్వాల్, సేల్స్ హెడ్ సుమిత్ ఆనంద్ వెల్లడించారు. చదవండి: మేకప్ తీసేసి ట్రక్ ఎక్కింది -
సింగపూర్ నుంచి ఏపీకి మూడు ఆక్సిజన్ ట్యాంకర్లు
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల అవసరాల నిమిత్తం మూడు క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను ప్రభుత్వానికి ఉచితంగా అందించిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్. ఒక్కో ఆక్సిజన్ ట్యాంక్ నుంచి 1. 40 కోట్ల లీటర్ల ఆక్సిజన్ సామర్ధ్యం ఉన్న మూడు క్రయోజెనిక్ ట్యాంకర్లను సింగపూర్ నుంచి దిగుమతి చేసుకుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు సింగపూర్‌లో బయలుదేరిన భారత వైమానికదళ ప్రత్యేక విమానం రాత్రి ఏడు గంటలకు పశ్చిమబెంగాల్ లోని పానాగఢ్ వైమానిక స్థావరానికి మూడు క్రయోజెనిక్ ట్యాంకులతో చేరుకుంది. క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను విమానం నుంచి దించిన వెంటనే ప్రత్యేక వాహనాల్లో 35 కిలోమీటర్ల దూరంలోని దుర్గాపూర్ ఉక్కు కర్మాగారానికి తరలించారు. ఆ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన విషయం తెలిసిందే. మూడు క్రయోజెనిక్ ట్యాంకర్లలో ఆక్సిజన్ నింపిన తరువాత అవి ఆంధ్ర ప్రదేశ్ కు బయలుదేరతాయి. ఆక్సిజన్ ట్యాంకులు రైలు మార్గం ద్వారా బుధవారం రాత్రికి లేదా గురువారం ఉదయానికి రాష్టానికి చేరుకుంటాయని ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి. రాజేశ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే 11 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను తెలంగాణా ప్రభుత్వానికి మేఘా ఇంజనీరింగ్ ఉచితంగా థాయిలాండ్ నుంచి దిగుమతు చేసుకుని అందించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు సింగపూర్ ప్రభుత్వం సమన్వయంతో త్వరితగతిన ట్యాంకర్లు దిగుమతి కావడానికి కృషి చేశాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అందించే మూడు ట్యాంకర్ల ద్వారా 4. 20 కోట్ల లీటర్ల ఆక్సిజన్ ను సరఫరా చేయవచ్చు. ఈ క్రయోజనిక్ ట్యాంకర్లను రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు తగిన విధంగా వినియోగించుకుంటుంది. మన రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను తీసుకువచ్చి నేరుగా ఆసుపత్రులకు ఇవి అందచేస్తాయి. అదే సమయంలో అవసరాన్ని బట్టి నేరుగా ఆసుపత్రులకు సరఫరా చేసే విధంగా కూడా ఈ ట్యాంకర్లను ఉపయోగిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల కమిటీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు దృష్టి లో ఉంచుకొని ఆక్సిజన్ సరఫరాకు క్రయోజనిక్ ట్యాంకర్స్ ను సింగపూర్ నుండి మేఘా ఇంజనీరింగ్ దిగుమతి చేసుకుంది. దేశంలో సరిపడా ఆక్సిజన్ ఉన్నా దాన్ని సరఫరా చేయడానికి అవసరమైన ట్యాంకులు, రవాణా లాంటి సదుపాయాలు లేకపోవడంతో అవసరమైన వారికి అందడం లేదు. మన దేశంలో ఒక్కొక్క క్రయోజనిక్ ట్యాంకర్ తయారు చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలంతో పోటీ పడి ట్యాంకర్లను సిద్ధం చేయాలి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ గాలించి సింగపూర్ నుండి 3 క్రయోజనిక్ ట్యాంకర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం మేఘా ఇంజనీరింగ్ దిగుమతి చేసుకుంది. కరోనా సమయంలో తమ వంతుగా దేశానికి సేవ చేయడం బాధ్యతగా ఎంఈఐఎల్ భావిస్తోంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేయడం కోసం ప్రత్యేకంగా ఒక బృందం పనిచేస్తోంది. కరోనా సంక్షోభం తీవ్ర రూపం దాల్చి ఆక్సిజన్ కొరత అధికమవుతున్నప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. అందులో భాగంగానే సంస్థ ఉన్నతస్థాయి యాజమాన్యమే కాకుండా మొత్తం యంత్రాంగం ఇదే పనిలో నిమగ్నమైంది. -
సేవలో ‘అగర్వాల్ బంధు’
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ సమస్యలు బాధితులను ఎక్కువగా బాధించాయి. ఇంకా అక్కడక్కడ ఆక్సిజన్ అందక ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా ఆక్సిజన్ లభించక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఎక్కువగా ఉండడంతో వాటిని బాధితులకు అందజేయడానికి కొంత మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సేవలు అందజేస్తున్నారు. మేమున్నామంటూ... గతంలో స్వచ్ఛంద సంస్థలు విరివిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనగా.. ఈసారి కొంత మంది స్నేహితులు ఒక చోట చేరి మేమున్నామంటూ కోవిడ్ బాధితులను ఆదుకుంటున్నారు. కరోనా వైరస్ సోకి ఇళ్లల్లో హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి ఆక్సిజన్ అందజేయడానికి ముందుకు వచ్చారు. ఆసుపత్రులతో పాటు ఇళ్లల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యవసరంగా ఆక్సిజన్ అవసరం ఏర్పడినప్పడు.. వారికి ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్స్తో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించడానికి పాతబస్తీకి చెందిన పంకజ్‌కుమార్ అగర్వాల్ తన స్నేహితులను ఒక ఫ్లాట్ ఫాంగా మార్చుకుని ఆక్సిజన్ సిలిండర్లను అందజేసే కార్యక్రమాలను ప్రారంభించారు. నెల రోజుల క్రితం ప్రారంభమైన ఈ సేవలను ‘ప్రాణ వాయు సేవ’గా నామకరణం చేసి ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తూ.. పలువురి ప్రశంసలు పొందుతున్నారు. పాతబస్తీ ఘాంసీబజార్‌కు చెందిన హైదరాబాద్ కుంభ మేళా అగర్వాల్ బంధు అధ్యక్షుడు, అశోక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పంకజ్ కుమార్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఉచిత ఆక్సిజన్ సేవలను ప్రారంభించారు. ‘ప్రాణ వాయు సేవ’మొదలైందిలా... పంకజ్‌కుమార్ అగర్వాల్‌కు చెందిన ఓ బంధువుల కుటుంబంలో కోవిడ్–19 వ్యాధితో బాధపడుతూ నలుగురు మృతి చెందారు. ఈస్ట్ చార్మినార్ ప్రాంతానికి చెందిన అశోక్‌కుమర్ అగర్వాల్, సునీల్‌కుమార్ అగర్వాల్‌లతో పాటు మరో ఇద్దరూ అన్నదమ్ములు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. కోవిడ్‌తో బాధపడుతూ ఆక్సిజన్ అందక మృతి చెందారు. ఈ సంఘటనలు పంకజ్‌కుమార్‌కు తీవ్ర మనోవేధనకు గురి చేసింది. కేవలం ఆక్సిజన్ అందక మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో.. అవసరమైన బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లను అందజేయడానికి తన భార్య ప్రియాంక్‌తో కలిసి నిర్ణయం తీసుకున్నారు. వెంటనే తమ సమాజానికి చెందిన తరుణ్ అగర్వాల్, అనూప్ అగర్వాల్, బ్రిజ్మోహన్, రవీందర్, గోపాల్ దాస్ తదితరులను సంప్రదించి ఈ నెల మొదటి వారం నుంచి ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లతో పాటు అత్యవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేయడానికి కార్యాచరణ రూపొందించుకున్నారు, అనుకున్నదే తడవుగా ఇప్పటి వరకు 100 మంది వరకు బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. అలాగే ఎమర్జెన్సీ కింద ఎలాంటి రుసుం వసూలు చేయకుండా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేస్తున్నారు. అంతేకాకండా అవసరమైన బాధితులకు ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్ సకాలంలో అందడంతో.. కోవిడ్–19తో బాధపడుతున్న మా అమ్మ శోభారాణి సోదరుడైన అజయ్‌కుమార్ అగర్వాల్‌తో పాటు ఆయన భార్య కవిత అగర్వాల్ ప్రాణాపాయం నుంచి బతికి బయట పడ్డారు. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా.. ఆక్సిజన్ అందుబాటులో లేదని పంపించారు. దీంతో పంకజ్‌కుమార్ అగర్వాల్ ఆక్సిజన్ సిలిండర్ సరఫరా చేస్తున్నట్లు తెలుసుకుని తెచ్చుకున్నాం. సకాలంలో ఆక్సిజన్ లభించడంతో ఇరువురు కోలుకున్నారు. – యోగేష్ కుమర్ అగర్వాల్, వ్యాపారి, చార్మినార్ కోవిడ్ బాధితులకు ఉచితంగా.. కోవిడ్ బాధితుల సౌకర్యార్థం ఆక్సిజన్ సిలిండర్లను అందిజేస్తున్నాం. అత్యవసరంగా ఆక్సిజన్ లభించకపోతే.. 9246550088లో సంప్రదించాలి. రీ–ఫిలింగ్తో పాటు కొత్తగా కూడా సిలిండర్లను రిఫరెన్స్‌తో అందజేస్తున్నాం. అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను అందజేస్తున్నాం. – రవీందర్ నార్నూలీ, అగర్వాల్ బంధు ప్రతినిధి డిపాజిట్లు.. రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు.. ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అవసరమైన వారు మమ్మల్ని సంప్రదిస్తే వెంటనే స్పందిస్తున్నాం. ఎలాంటి డిపాజిట్లు కానీ, డబ్బులు కానీ చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం తెలిసిన వారి సిఫారసు ఉంటే చాలు. మాకు ఫోన్ చేసిన వెంటనే పాతబస్తీలోని ఘాన్సీబజార్‌కు పిలిపించి ఆక్సిజన్ సిలిండర్లను అందజేస్తున్నాం. – పంకజ్ కుమార్ అగర్వాల్, అగర్వాల్ బంధు అధ్యక్షుడు -
Telangana: పడకలు ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఉధృతి నియంత్రణలోకి వస్తోంది. వైరస్ వ్యాప్తి తగ్గుతుండగా బాధితులు వేగంగా కోలుకుంటున్నారు. మూడు వారాలుగా కొనసాగుతున్న లాక్ డౌన్, వైద్యారోగ్య శాఖ చేపట్టిన ఓపీ (ఔట్ పేషెంట్) సర్వే, ఇంటింటి సర్వే, లక్షణాలు ఉన్నవారికి ఇండ్ల వద్దే మందుల కిట్లు అందజేయడం ఫలితాన్ని ఇస్తున్నాయి. ఓ వైపు కొత్త కేసుల నమోదు తగ్గడం, మరోవైపు కోలుకుని డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య పెరగడంతో.. ఆస్పత్రుల్లో కరోనా పడకలు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో కలిపి కోవిడ్ చికిత్స కోసం 55,352 పడకలు కేటాయించగా.. ఇందులో 34,959 పడకలు (63.15 శాతం) ఖాళీగా ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్రమంగా కొత్త కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతున్నాయని.. మరో పక్షం రోజుల్లో పరిస్థితి మరింత అదుపులోకి వస్తుందని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. నెలాఖరులోగా సెకండ్‌వేవ్ తీవ్రత నుంచి బయటపడతామన్నారు. కొద్దిరోజులు భయపెట్టి.. గత నెల చివరి రెండు వారాల్లో, ఈ నెల తొలి వారంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆస్పత్రులు నిండిపోయాయి. బెడ్ల కోసం పేషెంట్లు పడిగాపులు పడ్డారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ బెడ్ దొర కని పరిస్థితి ఏర్పడింది. అంబులెన్స్ సైరన్లు గుండె పగిలేలా ధ్వనించాయి. అంబులెన్సుల్లో, ఆస్పత్రుల ఆవరణలో పేషెంట్లు ప్రాణాలు విడిచిన ఘటనలు జరిగాయి. అలాంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా కనిపించే దశ వచ్చింది. పకడ్బందీ చర్యలతో.. రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీ నుంచి అమలవుతున్న లాక్ డౌన్‌తో జనం బయట తిరగడం తగ్గింది. దానికితోడు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంపై పోలీసు శాఖ దృష్టిపెట్టింది. మరోవైపు సర్కారు కరోనా టెస్టుల సంఖ్యను కూడా బాగా పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టిన ప్రభుత్వం.. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా, జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా అన్నది పరిశీలించి.. లక్షణాలు ఉన్నవారికి అక్కడిక్కడే మందుల కిట్లను అందించే కార్యక్రమాన్ని నిర్వహించింది. సెకండ్ వేవ్ మొదట్లో గ్రామీణ ప్రాంతాలను కమ్మేసిన కరోనా మెల్లగా తగ్గుముఖం పడుతోంది. ఆస్పత్రుల వరకు వెళ్లకుండా.. ఇంట్లో ఉండి ప్రభుత్వం పంపిణీ చేసిన మందులు వాడటం బాగానే ఉపయోగపడిందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రం కరోనా సెకండ్ వేవ్ ముప్పు నుంచి బయటపడినట్లేనని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు శ్రీనివాసరావు కూడా ఇటీవల ప్రకటించడం గమనార్హం. ఒకప్పటి పరిస్థితి ఇదీ గాంధీ ఆస్పత్రిలో పడకలు ఖాళీలేక అంబులెన్స్‌లోనే వేచి ఉన్న బాధితులు(ఫైల్) హైదరాబాద్‌లో పేషెంట్లు ఎక్కువున్నా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ అయినా.. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో మాత్రం బాధితుల సంఖ్య కొంత ఎక్కువగానే ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చికిత్స పొందుతున్నవారు గణనీయంగా ఉన్నారని.. అందుకే హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోందని వైద్యారోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఆక్సిజన్ బెడ్లు సగంపైగా ఖాళీ కరోనా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి, ఆక్సిజన్ అవసరమైన వారు ఆస్పత్రుల్లో చేరుతున్నారని.. స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న వారిలో 85 శాతం మంది హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. కొద్దిరోజుల కిందటి వరకు.. శ్వాస సమస్య ఎక్కువై, ఆక్సిజన్ పెట్టాల్సిన వారి సంఖ్య ఎక్కువగా ఉండేదని.. ప్రస్తుతం తక్కువగా ఉంటోందని అంటున్నాయి. వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 21,704 ఆక్సిజన్ బెడ్లు ఉండగా.. 10,278 బెడ్లలో పేషెంట్లు ఉన్నారు. మిగతా 11,426 బెడ్లు (52.64 శాతం) ఖాళీగా ఉన్నాయి. ఇక ఐసీయూ/వెంటిలేటర్ కేటగిరీలో 11,811 పడకలు ఉండగా.. ప్రస్తుతం 6,372 మంది చికిత్స తీసుకుంటున్నారు. 5,439 పడకలు (46.06 శాతం) ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్యను రోజుకు లక్ష వరకు పెంచారని.. కేసులు తక్కువగానే వస్తున్నాయని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ లెక్కన కరోనా నియంత్రణలోకి వస్తున్నట్టేనని పేర్కొన్నారు. ఒక్కరోజే 205 మంది డిశ్చార్జి గాంధీ ఆస్పత్రి: కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యారు. మహమ్మారిని జయించి పూర్తిస్థాయిలో కోలుకున్న 205 మంది శుక్రవారం తమ ఇళ్లకు వెళ్లారు. సెకండ్ వేవ్‌లో ఒక రోజులో ఇంతమంది డిశ్చార్జి కావడం ఇదే మొదటిసారి అని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు, నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 12 వందల మందికి పైగా చికిత్స పొందుతున్నారని చెప్పారు. ప్రభుత్వ చర్యలు, లాక్డౌన్ నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. ఇక గాంధీలో 149 మంది బ్లాక్ ఫంగస్ బా«ధితులు ఉన్నారని, అందులో శనివారం నాలుగు సర్జరీలు నిర్వహించామని వెల్లడించారు. బాధితులు క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. జూన్ రెండో వారం నాటికి రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రధాన ప్రభుత్వాస్పత్రుల్లో ఇలా.. ►ఆదిలాబాద్ రిమ్స్‌లో కరోనా పేషెంట్లకు 550 పడకలు కేటాయించగా.. 514 పడకలు ఖాళీగా ఉన్నాయి. ►నిమ్స్‌లో 173 పడకలుంటే అన్నింట్లో పేషెంట్లు ఉన్నారు. ►గాంధీ ఆస్పత్రిలో 1,869 పడకలుండగా, 1,263 మంది రోగులున్నారు. 606 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ►ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఉన్న 261 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ►మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో 500 పడకల్లో 251 పేషెంట్లు ఉన్నారు. మిగతావి ఖాళీ. ►నల్లగొండ జనరల్ ఆస్పత్రిలో 380 పడకలకు 148 బెడ్లలో రోగులున్నారు. ►నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో 357 ఖాళీగానే ఉన్నాయి. ►గచ్చిబౌలి టిమ్స్‌లో 1,261 పడకలు కోవిడ్ కోసం కేటాయించగా 524 పడకల్లో మాత్రమే రోగులున్నారు. ►సిద్దిపేట జనరల్ ఆస్పత్రిలో 360 బెడ్లు ఉంటే 157 మందే రోగులున్నారు. వరంగల్ ఎంజీఎంలో 1,170 బెడ్లు ఉండగా.. 704 ఖాళీగానే ఉన్నాయి. ►బీబీనగర్ ఎయిమ్స్‌లో 50 పడకల్లో 10 మందే చికిత్స పొందుతున్నారు. సగంపైన బెడ్లు ఖాళీ.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సీరియస్ కేసులు బాగా తగ్గాయి. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య బాగా తగ్గింది. రాష్ట్రంలో ఉన్న 10 ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో సగం కంటే ఎక్కువ బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రుల్లో సాధారణ బెడ్లు 80 శాతం వరకు ఖాళీగా ఉండటాన్ని బట్టి కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. – రమేశ్‌రెడ్డి, వైద్యవిద్య సంచాలకుడు చదవండి: ఎక్స్ట్రా మసాలా.. లెగ్ పీస్ లేదు.. స్పందించిన కేటీఆర్ -
ఆక్సిజన్ కొరత, చైనాకు ఆర్డర్ పెట్టాం: చిరంజీవి
ఈ కోవిడ్ సంక్షోభంలో ఆక్సిజన్ కొరత వల్ల పలువురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు ప్రముఖ హీరో చిరంజీవి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాట్లు, వాటి కార్యకలాపాలను ఆచరణలో పెట్టారు. చిరంజీవి జిల్లా అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ జరిగింది. ఈ ఆక్సిజన్ బ్యాంకుల సమాచారాన్ని సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ట్విట్టర్లో అకౌంట్‌ను ప్రారంభించారు. చిరంజీవి మాట్లాడుతూ – ‘‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఈ ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా నిరంతరాయంగా ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతుంది. ఇక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కొరత ఉండటం మూలాన చైనాకు ఆర్డర్ పెట్టాం. ప్రస్తుత పరిస్థితుల్లో చాలాచోట్ల ఆక్సిజన్ కొరత ఉంది. ముందుగా అత్యవసరం ఎక్కడ ఉందో అక్కడికి ఆక్సిజన్ సిలిండర్లు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఆక్సిజన్ సిలిండర్లు ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ ఉంటున్నాయన్నది తెలుసుకునేందుకు ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశాం. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు కార్యాలయం నుంచి ఈ ఆక్సిజన్ బ్యాంకుల నిర్వహణపై పర్యవేక్షణ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్నిచోట్ల ఈ ఆక్సిజన్ బ్యాంకుల సేవలు సద్వినియోగం కావాలన్నదే మా సంకల్పం. రామ్‌చరణ్ ఈ ఏర్పాట్లను చూస్తున్నారు’’ అన్నారు. -
ఆక్సిజన్ వచ్చేసింది.. తాడిపత్రికి చేరిన స్పెషల్ రైలు
సాక్షి, తాడిపత్రి: ఆక్సిజన్ స్పెషల్ రైలు డివిజన్ పరిధిలోని తాడిపత్రి రైల్వేస్టేషన్ చేరినట్లు డీఆర్ఎం అలోక్‌తీవారి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన స్థానిక డీఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా విలయతాండవం నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్రం టాటానగర్ నుంచి వెస్ట్ బెంగాల్, ఒడిశా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఆక్సిజన్ అత్యవసరమైందన్నారు. దీంతో 32 స్పెషల్ ఆక్సిజన్ రైళ్లను ఆయా రాష్ట్రాలకు తరలించారన్నారు. టాటానగర్ నుంచి బయలుదేరిన ఆక్సిజన్ స్పెషల్ రైలు మంగళవారం గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని తాడిపత్రి రైల్వేస్టేషన్‌కు చేరిందన్నారు. మొత్తం 10 గూడ్స్ వ్యాగన్లలో(బూస్ట్ వ్యాగన్)లో 100 టన్నుల ఆక్సిజన్ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తాడిపత్రి రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక ఆక్సిజన్ కంటైనర్ల ద్వారా అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు ఆక్సిజన్ తరలించామన్నారు. చదవండి: గుంతకల్లు రైల్వేలో బయటపడ్డ నకిలీ నియామకాలు గుంతకల్లు : వ్యాగిన్ల నుంచి ఆక్సిజన్‌ను ట్యాంకర్లలోకి నింపుతున్న దృశ్యం -
పోర్టుకు మరో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రాక
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/ముత్తుకూరు: విజయవాడ డివిజన్ కృష్ణపట్నం పోర్టుకు మరో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం చేరుకుంది. రైలు మార్గం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లలో ఇది ఏడోది. ఇది నాలుగు ట్యాంకర్లలో 76 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో ఒడిశాలోని రూర్కెలాలో బయలుదేరి 22 గంటల్లో కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంది. ఈ ప్రత్యేక రైలు ద్వారా ఈ నెల 15 నుంచి ఇప్పటివరకు 20 ట్యాంకర్లలో మొత్తం 395 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి దిగుమతి అయ్యింది. డీఆర్ఎం పి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రీన్ చానల్ ద్వారా ఈ ఆక్సిజన్ రైళ్ల కదలికలను పర్యవేక్షిస్తూ సకాలంలో గమ్యస్థానానికి చేరుకునేలా కృషి చేస్తున్నామని తెలిపారు. -
రాష్ట్రానికి అండగా నిలిచిన కార్పొరేట్లకు కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 సంక్షోభ సమయంలో ఆక్సిజన్ సరఫరా చేయడం ద్వారా రాష్ట్రానికి అండగా నిలిచిన రిలయన్స్, టాటాస్టీల్, జిందాల్ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ వంటి కార్పొరేట్ సంస్థలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన వేర్వేరుగా ట్వీట్ చేశారు. కోవిడ్–19కు వ్యతిరేకంగా పోరాడుతున్న రాష్ట్రానికి రిలయన్స్ ఫౌండేషన్ తరఫున ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలును పంపడం ద్వారా మద్దతు తెలిపిన ముఖేష్ అంబానీకి ధన్యవాదాలు తెలిపారు. రానున్న కాలంలో కూడా ఇదే విధమైన మద్దతు కొనసాగుతుందంటూ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికైన పరిమళ్ నత్వాని ట్విటర్ ఖాతాకు ట్యాగ్ చేస్తూ సీఎం ట్వీట్ చేశారు. I thank Mukesh Ambani ji and @ril_foundation for extending their support by sending in Oxygen Express trains to Andhra Pradesh and helping the state in its fight against #COVID19. Looking forward to your continuous support. @mpparimal — YS Jagan Mohan Reddy (@ysjagan) May 24, 2021 ‘ఈ కష్టసమయంలో పార్లమెంటు సభ్యుడు, జిందాల్ గ్రూపు చైర్మన్ నవీన్ జిందాల్ రాష్ట్రానికి అండగా నిలిచారని, ఈ కష్టకాలంలో జేఎస్పీఎల్ నుంచి రాష్ట్రానికి 500 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ పంపిన నవీన్ జిందాల్‌ను అభినందిస్తున్నా’ అంటూ మరో ట్వీట్ చేశారు. My heartfelt thanks to @TataSteelLtd for their commitment to support AP in these tough times. TATA Steel has supplied more than 1000 MT of LMO to AP, which is crucial in our fight against #COVID19. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 24, 2021 అదే విధంగా రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలుస్తూ 1,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపిన టాటాస్టీల్, రాయలసీమ ప్రాంతానికి ఆక్సిజన్ సరఫరా చేసిన జేఎస్‌డబ్ల్యూ గ్రూపు సీఎండీ సజ్జన్ జిందాల్లకు సీఎం కృతజ్ఞతలు తెలియచేస్తూ మరో రెండు ట్వీట్లు చేశారు. I express my gratitude to @sajjanjindal ji for supplying LMO to the Rayalaseema region from JSW Bellary. Thank you for standing with the people of Andhra Pradesh in these tough times. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 24, 2021 -
స్టీల్ కంపెనీలకు సీఎం జగన్ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయించిన స్టీల్ కంపెనీలకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ఏపీకి వెయ్యి మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ అందించిన టాటా స్టీల్ లిమిటెడ్‌కు, అలాగే జిందాల్ కంపెనీకి సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో సీఎం జగన్ ప్రత్యేక చొరవ కారణంగా కొన్ని సంస్థలు స్వచ్చందంగా ముందుకొచ్చి రాష్ట్రానికి ప్రాణ వాయువు సరఫరా చేస్తున్నాయి. -
గిరాకీ లేదని... ఏకంగా ఆక్సిజన్ సరఫరానే నిలిపేశారు..
సాక్షి, నిజామాబాద్: కొన్ని రోజులుగా తమకు పేషెంట్లు దొరకడం లేదనే కారణంతో గిరాకీ కోసం ముగ్గురు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు దుర్మార్గానికి ఒడిగట్టారు. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది గమనించడంతో పెను ప్రమాదమే తప్పింది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులకు సంబంధించి ఆక్సిజన్ సరఫరాను ముగ్గురు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు నిలిపేశారు. ఆక్సిజన్ సరఫరా ఆగి పోవడాన్ని వార్డు బాయ్ గమనించారు, ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్‌ను ప్రభుత్వాసుపత్రి సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు డ్రైవర్ల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: ఇంట్లో మంటలు: మహిళ సజీవదహనం Hyderabad: ‘చేపలు అయిపోయాయి.. తప్పక చికెన్ తీసుకున్నా’ -
ఫోన్లోనే శరీరంలోని ఆక్సిజన్ స్థాయి తెలుసుకోండిలా!
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కరోనా మహమ్మరి మన దేశాన్ని వణీకిస్తుంది. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే మరణాల రేటు అధికంగా ఉంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడమే. అందుకే మన శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు తెలిపే పల్స్ ఆక్సీమీటర్లు, స్మార్ట్ వాచ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో అమాంతంగా వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ఇబ్బందులేవీ లేకుండా ఉచితంగా మన దగ్గర ఉన్న ఫోన్లోని ఒక యాప్ ద్వారా శరీరంలోని ఆక్సిజన్ స్థాయి, పల్స్, శ్వాసక్రియల రేట్లు తెలిసేలా ఉంటే బావుంటుంది కదా!? అనే ఆలోచన నుంచి వచ్చిందే ‘కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్’. ఎలా పనిచేస్తుంది? మన దేశంలోని కోల్‌కతాకు చెందిన ‘కేర్ నౌ హెల్త్‌కేర్’ అనే స్టార్టప్ సంస్థ ఈ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ 'కేర్‌ప్లిక్స్ వైటల్స్'ను అభివృద్ధి చేసింది. ఇక్కడ చేయాల్సిందల్లా ఈ యాప్ ఓపెన్ చేసి స్మార్ట్‌ఫోన్ వెనుక కెమెరా ఉన్న ఫ్లాష్‌లైట్ ఆన్ చేసి దాని మీద వేలు పెట్టిన తర్వాత స్కాన్ అనే బటన్‌ను నొక్కగానే నలభై సెకన్లలో ఆక్సిజన్ స్థాయి(SpO2), పల్స్, శ్వాసక్రియ రేట్లను చూపిస్తుంది. ఫోటో ప్లెథిస్మోగ్రఫీ టెక్నాలజీ, కృత్రిమ మేధ సాయంతో కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్ పనిచేస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు కేర్‌నౌ హెల్త్‌కేర్ సహవ్యవస్థాపకుడు శుభబ్రాతా పాల్ తెలిపారు. ట్రయిల్స్ లో ఈ యాప్ 96 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ యాప్ ప్రస్తుతం ఐవోఎస్ వినియోగదారుల కోసం యాప్‌స్టోర్‌లో, ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. టెస్ట్ నిర్వహించడానికి మంచి ఇంటర్నెట్, హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ ఉండాలి అప్పుడే కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం సింగిల్ యూజర్ వినియోగం కోసం ఉచితంగా అందిస్తున్నారు. అంతకుమించి సేవలు కావాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వివరాలు కేర్‌నౌ వెబ్సైట్లో ఉన్నాయి. చదవండి: ఐసీఎంఆర్ సీరో సర్వేలో కరోనాపై షాకింగ్ విషయాలు వెల్లడి -
కరోనా థర్డ్ వేవ్, సెంట్రల్ యాక్షన్ ప్లాన్
సాక్క్షి, న్యూఢిల్లీ: సెకండ్ వేవ్ నేర్పిన గుణపాఠంతో థర్డ్‌వేవ్‌కి ముందుగానే సన్నద్ధం అవుతోంది కేంద్రం. దేశవ్యాప్తంగా వైద్యరంగాన్ని బలోపేతం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు నియమించిన నిపుణుల కమిటీ సలహా మేరకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. ఆక్సిజన్ కొరత లేకుండా కరోనా సెకండ్‌వేవ్ దేశాన్ని ముంచెత్తగానే ఎదురైన మొదటి సమస్య ఆక్సిజన్ కొరత. దీంతో ఈ సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టింది కేంద్రం. దేశంలో ఉన్న ప్రతీ జిల్లాలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా గాలి నుంచి ఆక్సిజన్ తయారు చేసే ప్రెషర్ అడ్‌ర్సాప్షన్ ఆక్సిజన్ ప్లాంట్లు (PSA) నిర్మించనుంది. అది కూడా జులై 30వ తేదిలోగా నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జులై చివరి నాటికి మొత్తంగా 1,051 PSA ప్లాంట్ల నిర్మాణం పూర్తయిదే 2,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కొత్తగా అందుబాటులోకి వస్తుంది. ఇక 50 నుంచి 100 బెడ్ల సామర్థ్యం ఉండే మధ్య, చిన్న తరహా ఆస్పత్రుల కోసం 450 లీటర్ల ట్యాంకర్లను కొనుగోలు చేయనున్నారు. వీటితో పాటు ఏకంగా కొత్తగా లక్ష ఆక్సిజన్ సిలిండర్లు తయారీకి ఆర్డర్ ఇచ్చింది కేంద్రం. ట్యాంకర్లపై దృష్టి ప్రస్తుతం ఆక్సిజన్ రవాణాకు ఎక్కువ సమయం పడుతోంది. తక్కువ సమయంలో ఆస్పత్రులకు తరించడం కష్టంగా మారడంతో ఆక్సిజన్ తరలించేందుకు ప్రత్యేకంగా రైళ్లు, విమానాలు నడిపించాల్సి వచ్చింది. ఆక్సిజన్ సరఫరాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,270 ఆక్సిజన్ ట్యాంకర్లు ఉన్నాయి. వీటికి తోడు మరో వందట్యాంకర్లు తయారు చేస్తున్నారు. వీటికి అదనంగా 248 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా ఆక్సిజన్ రవాణను గ్రీన్ ఛానల్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. స్టాక్ ఫుల్ కరోనా చికిత్సలో ఉపయోగించే అత్యవసర, సాధారణ ఔషధాలు రెండు మూడు నెలలకు సరిపడ నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు తయారీదారులతో కేంద్రం సంప్రదింపులు చేస్తోంది. ఔషధాల కొరత రాకుండా చూడాలంటూ ఫార్మా కంపెనీలను ఆదేశించింది. కరోనా సెంకడ్ వేవ్ ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తోంది. మరోవైపు దేశంలో అక్కడక్కడ కరోనా థర్డ్ వేవ్ మొదలైందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక అక్టోబరు నుంచి డిసెంబర్ మధ్యన ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ వచ్చేందుకు అవకాశం ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో కేంద్రం ముందుగానే సన్నద్ధం అవుతోంది. -
ఆక్సిజన్ ట్యాంకర్లు వచ్చేశాయి..
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి 11 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను విరాళంగా ఇస్తామని మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా బ్యాంకాక్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ద్వారా శనివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మూడు క్రయోజెనిక్ ట్యాంకర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆ సంస్థ అందజేసింది. వెంటనే ఈ ట్యాంకర్లను ఆక్సిజన్‌ను నింపుకొని రావడానికి సీఎస్ ఒడిశాకు పంపించారు. మేఘా సంస్థ నుంచి మొదటి విడతగా 3 ట్యాంకర్లు హైదరాబాద్‌కు వచ్చాయని, బంగాళాఖాతంలో వాతావరణ అస్థిరత ఉన్న దృష్ట్యా మిగిలిన ట్యాంకర్లు 3 నుండి 4 రోజుల్లో వస్తాయని సీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఆక్సిజన్ ప్లాంట్లు, స్టోరేజ్ యూనిట్ల నిర్మాణం, ట్యాంకర్ల సేకరణకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఒక్కో ట్యాంకర్ తయారీకి మూడు నెలలు.. సాధారణంగా ఒక్కో క్రయోజెనిక్ ట్యాంకర్ తయారీకి దేశంలో మూడునెలల సమయం పడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా బాధితులకు ఆక్సిజన్ అత్యవసరమైన నేపథ్యంలో విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నట్లు మేఘా సంస్థ ఉపాధ్యక్షుడు పి.రాజేశ్‌రెడ్డి వివరించారు. ఈ ట్యాంకర్లను నగరానికి తీసుకుని రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహకారాన్ని అందించాయని తెలిపారు. దేశంలో క్రయోజెనిక్ ట్యాంకర్ల కొరతను గుర్తించి, విదేశాల నుంచి పూర్తి ఖర్చు తమ సంస్థనే భరించి తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే బొల్లారంలోని తమ ప్లాంట్‌నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు, ఎంఈఐఎల్ జీఎం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. -
ఆక్సిజన్ తెచ్చింది
జార్ఖండ్ నుంచి ఒక రైలు బయలుదేరింది. అయితే అది మామూలు రైలు కాదు. ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’. దాదాపు 2000 కిలోమీటర్ల దూరం.... 27 గంటల ప్రయాణం. ముగ్గురు టీమ్. వారిలో లోకో పైలెట్ నీలిమా కుమారి కూడా ఉంది. ప్రాణాలు కాపాడే ప్రాణవాయువును తీసుకొని ఆఘమేఘాల మీద ఆమె బెంగళూరు చేర్చి ప్రశంసలు అందుకుంది. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా దేశంలోకి చాలా కీలకమైన విషయంగా మారాయి. ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల నుంచి ఆఘమేఘాల మీద ఆక్సిజన్‌ను చేరవేయడానికి భారత ప్రభుత్వం ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’లను మొదలెట్టింది. అంటే ఆక్సిజన్ ట్యాంకర్లు ఉన్న గూడ్స్ రైళ్లు ఇవి. వీటిని గమ్యానికి చేర్చడం చాలా బాధ్యతతో కూడుకున్న పని. మామూలు గూడ్సు రైళ్లు అయితే ఆగినా, ఆలస్యమైనా పర్వాలేదు. కాని ఆక్సిజన్ రైలు మాత్రం సమయానికి చేరుకోవాల్సిందే. ఇటీవల అలా సమయానికి చేర్చి ప్రశంసలు అందుకున్న లోకో పైలెట్ (డ్రైవర్) నీలిమా కుమారి. జార్ఖండ్ నుంచి సోమవారం (మే 17) ఉదయం 7 గంటలకు జార్ఖండ్‌లోని జోలార్‌పేట్ డివిజన్ నుంచి 120 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. బెంగళూరు డివిజన్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది ఈ ట్రైనును గమ్యానికి చేర్చాలి. వారిలో సీనియర్ సిబ్బంది అయిన కుమార్ (బిహార్), వలి (కర్ణాటక) ఉంటే అసిస్టెంట్ డ్రైవర్‌గా నీలిమా కుమారికి బెంగళూరు డివిజన్ బాధ్యత అప్పజెప్పింది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు మొదలయ్యాక మహిళా డ్రైవర్‌ను ఈ బాధ్యతకు ఉపయోగించడం ఇదే మొదటిసారి. బిహార్‌కు చెందిన నీలిమా కుమారి ఒక సంవత్సర కాలంగా బెంగళూరు డివిజన్లో లోకో పైలెట్‌గా పని చేస్తోంది. ఆమె వివాహిత. ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. జార్ఖండ్ నుంచి ఆక్సిజన్‌ను తీసుకొచ్చే బాధ్యత ను ఆమె సవాలుగా స్వీకరించింది. 100 కిలోమీటర్ల వేగంతో ముగ్గురు సిబ్బంది తమ భుజాల మీద ఉన్న బాధ్యతను సీరియస్‌గా తీసుకున్నారు. దాదాపు 25 గంటలు నాన్‌స్టాప్‌గా రైలును నడపాలి. అందుకు సిద్ధమయ్యారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు చేరడానికి మధ్యలో సిగ్నళ్ల అంతరాయం లేకుండా లైన్లు క్లియర్ చేయబడ్డాయి. 100 కిలోమీటర్ల వేగంతో రైలు గమ్యానికి చేరాల్సి ఉంటుంది. అనుకున్నట్టుగానే మధ్యలో ఒకటి రెండు చోట్ల తప్ప ముగ్గురూ కలిసి రైలును మరుసటి రోజు (మే 18) ఉదయం 8 గంటల సమయంలో బెంగళూరుకు చేర్చారు. ‘ఇది నాకెంతో సంతోషం కలిగించింది. కష్టాల్లో ఉన్నవారిని సకాలంలో ఆదుకునేందుకు మా రైలు సమయానికి చేరడం ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ఆ పనిని సక్రమంగా చేయగలిగాను’ అని నీలిమా కుమారి అంది. సీనియర్ డ్రైవర్ కుమార్ ‘నా సర్వీసులో ఇంత ఉపయోగకరమైన డ్యూటీ ఎప్పుడూ చేయలేదు’ అనంటే మరో సీనియర్ డ్రైవర్ వలి ‘నేను రైలు మొదలైనప్పటి నుంచి గమ్యం చేరేంత వరకు ఇంజన్లో నిలబడే ఉన్నాను. కంటి మీద కునుకు వేయలేదు’ అన్నాడు. ఎందరో మహానుభావులు. అందుకే కరోనా బాధితులు సమయానికి సహాయం పొందగలుగుతున్నారు. కాకుంటే ఒక మహానుభావురాలు కూడా ఉండటం విశేషం కదా. -
దూసుకొచ్చిన మహిళా ‘ఆక్సిజన్’ రైలు
బెంగళూరు: కరోనా వ్యాప్తి బాధితులకు అందించేందుకు చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో ఇతర ప్రాంతాల నుంచి ప్రాణవాయువు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా, జార్ఖండ్‌ల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది. అయితే తాజాగా చేసిన ఆక్సిజన్ సరఫరా ఎంతో ప్రత్యేకతతో కూడుకున్నది. ఎందుకంటే ఆ ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపిన వారంతా మహిళలే. మహిళా పైలెట్లే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపి ప్రత్యేకత చాటారు. జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ టాటానగర్ నుంచి బయల్దేరిన 7వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం కర్నాటకలోని బెంగళూరుకు చేరింది. ఆ రైల్లో సిబ్బందితో పాటు పైలెట్లంతా మహిళలు ఉండడం విశేషం. ఈ విషయాన్ని తెలుపుతూ రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ బెంగళూరు చేరుకుందని తెలిపారు. -
హైదరాబాద్‌వాసికి నటుడు సోనూసూద్ సాయం
సాక్షి, నల్లకుంట (హైదరాబాద్): కరోనా కష్టకాలం లో ప్రజలకు సాయం అందిస్తోన్న నటుడు సోనూసూద్ తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ కరోనా బాధితుడి ఇంటికి నేరుగా ఆక్సిజన్ యంత్రాన్ని పంపారు. నల్లకుంటకు చెందిన రాఘవ శర్మ(75) ఇటీవల కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. రాఘవ శర్మలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోగా సాయం చేయాలంటూ అతడి కొడు కు లక్ష్మినారాయణ ట్విట్టర్ ద్వారా సోనూ సూద్‌ను కోరారు. దీనికి స్పందించిన సోనూసూద్ తన చారిటీ ఫౌండేషన్ ద్వారా ఏకంగా ఆక్సిజన్ యంత్రాన్ని ఇంటికి పంపించాడు. గురువారం రాత్రి బతుకమ్మకుంట గోకుల్ స్వీట్ షాప్ ఎదురు వీధిలో ఉన్న వీరి నివాసానికి కొరియర్ ప్రతినిధి వెళ్లి వారికి ఆక్సిజన్ మిషన్ అందజేయడంతో రాఘవ కుటుంబ సభ్యులు సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
అనాథ పిల్లల పేరున రూ.10 లక్షల డిపాజిట్: సింఘాల్
సాక్షి, అమరావతి: కరోనా బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు బుధవారం ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరుపై ప్రభుత్వం రూ.10 లక్షల డిపాజిట్ చేయనుందని తెలిపారు. ఆ మొత్తంపై వచ్చే వడ్డీని ప్రతినెలా లబ్దిదారులకు అందించేలా కార్యాచరణ రూపొందించినట్లు సింఘాల్ తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో 21,493 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆక్సిజన్ రోజువారి గరిష్ట వినియోగం 650 మెట్రిక్ టన్నులు కాగా అందుబాటులో 635 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు చెప్పారు. ఆక్సిజన్ రవాణా కోసం 78 ట్యాంకర్లు, 14 చిన్న ట్యాంకర్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. 4+2 ఐఎస్ఓ ట్యాంకర్లు కలిగిన 2 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇందులో ప్రతి ట్యాంకర్‌కు 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సామర్థ్యం ఉంటుందని తెలిపారు. ఏపీలో కొత్తగా 23,160 కరోనా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 1,01,330 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 23,160 మందికి పాజిటివ్‌గా నిర్థారణ కాగా 106 మరణాలు సంభవించాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 24,819 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 12,79,110 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 2,09,736 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,82,41,637మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో కరోనా బారినపడి మరణించినవారి వివరాలు.. చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున.. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున.. అనంతపురం, గుంటూరు, విశాఖ, ప.గో.జిల్లాల్లో 8 మంది చొప్పున.. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున.. నెల్లూరు జిల్లాలో ఐదుగురు.. వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు.. శ్రీకాకుళం- 1466, విజయనగరం- 965, విశాఖ- 2368 కేసులు, తూ.గో- 2923, ప.గో- 1762, కృష్ణా- 1048, గుంటూరు- 1291 కేసులు, ప్రకాశం- 785, నెల్లూరు- 1251, చిత్తూరు- 2630 కేసులు, అనంతపురం- 2804, కర్నూలు- 991, వైఎస్ఆర్ జిల్లా- 1036 కేసులు నమోదయ్యాయి. చదవండి: ఏపీలో కొత్త మెడికల్ ఆక్సిజన్ పాలసీ -
ఏపీలో కొత్త మెడికల్ ఆక్సిజన్ పాలసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం పెంచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఇండస్ట్రియల్ గ్యాసెస్ అండ్ మెడికల్ ఆక్సిజన్ గ్యాస్ పాలసీని తెచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పాలసీని విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సామర్థ్యం ఉండగా దీన్ని 700 మెట్రిక్ టన్నులకు పెంచాలనేది పాలసీ లక్ష్యం. ఈ పాలసీ ద్వారా 50 ప్రెజ్యూర్ స్వింగ్ అడషార్పషన్ (పీఎస్ఏ) ప్లాంట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమల శాఖ సంయుక్తంగా దీనిపై ముందుకు వెళతాయని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఆక్సిజన్ సామర్థ్యం పెంచేందుకు ఆయా కంపెనీలను గుర్తించినట్టు వెల్లడించింది. ప్రధానంగా జోన్ల వారీగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయాలనేది పాలసీ ముఖ్య ఉద్దేశమని వివరించింది. సామర్థ్యాన్ని బట్టి రాయితీలు.. మూతపడిన యూనిట్లకు పీఎస్ఏ టెక్నాలజీ కనీస సామర్థ్యం 1 టన్ను ఉంటే పెట్టుబడి వ్యయంలో రూ.20 లక్షలు లేదా గరిష్టంగా రూ.20 లక్షలు రాయితీ ఇస్తారు. వీటికి విద్యుత్ సబ్సిడీ కింద యూనిట్‌కు రూ.2 చొప్పున గరిష్టంగా మూడేళ్ల వరకు టన్నుకు రూ.7 లక్షల చొప్పున అందిస్తారు. పీఎస్ఏ కొత్త యూనిట్లకు ఒకటన్ను సామర్థ్యం ఉంటే పెట్టుబడి వ్యయంలో 30 శాతం.. గరిష్టంగా రూ.30 లక్షలు ఇస్తారు. వీటికి విద్యుత్ సబ్సిడీ కింద యూనిట్‌కు రూ.2 చొప్పున టన్నుకు ఏడాదికి రూ.7 లక్షల చొప్పున రెండేళ్లు అందిస్తారు. 50 నుంచి 100 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ఇన్పుట్ సబ్సిడీ కింద టన్నుకి 20 శాతం రాయితీ.. గరిష్టంగా రూ.20 లక్షలు ఇస్తారు. వీటికి విద్యుత్ సబ్సిడీ కింద మొదటి ఏడాది యూనిట్ రూ.2, రెండో ఏడాది యూనిట్ రూ.1.50, 3 నుంచి 5 ఏళ్లకు ఒక రూపాయి చొప్పున అందిస్తారు. టన్ను ఉత్పత్తికి గరిష్టంగా రూ.7 లక్షల విద్యుత్ సబ్సిడీని మూడేళ్ల పాటు ఇస్తారు. హెలియాక్స్ టెక్నాలజీ పద్ధతిలో 50 నుంచి 100 టన్నుల సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేసేవారికి పెట్టుబడి రాయితీ 25 శాతం, గరిష్టంగా రూ.25 లక్షలు అందిస్తారు. వీటికి లిక్విడ్ ఆక్సిజన్ పరిశ్రమల తరహాలోనే విద్యుత్ రాయితీలు ఉంటాయి. -
ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఆళ్ల నాని
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు, మరో 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మంగళవారం ఆయన కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ జనరేషన్, స్టోరేజ్‌ల పెంపుపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచింగ్ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పీఎస్ఏ యూనిట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బ్లాక్ ఫంగస్ కేసులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కాటంనేని భాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ విజయరామరాజు, స్టేట్ నోడల్ ఆఫీసర్ కృష్ణ బాబు పాల్గొన్నారు. చదవండి: అవాస్తవాలు నమ్మొద్దు: ఎ.కె.సింఘాల్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మొహం చాటేసిన చంద్రబాబు -
నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్
కర్నూలు (హాస్పిటల్) : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన.. ప్రకృతి నుంచి ఆక్సిజన్ తయారు చేసే ప్రెజర్ స్వింగ్ అడ్జార్పషన్(పీఎస్ఏ) ప్లాంట్ ట్రయల్ రన్‌ను సోమవారం జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ప్రారంభించారు. ఇది ప్రతి నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. ట్రయల్ రన్ వారం పాటు కొనసాగించి.. లోటు పాట్లు గమనించాక పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని చెప్పారు. ఇటువంటి ప్లాంట్ల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఇలాంటి ప్లాంట్‌నే ఈ ఆస్పత్రిలో సినీ నటుడు సోనూసూద్ ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం దాదాపు వెయ్యి మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని, వారికి ఆక్సిజన్ కొరత రాకుండా వార్ రూమ్ ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో 150 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ విరాళం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో హఫీజ్‌ఖాన్ కరోనా బాధితుల కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ 150 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను విరాళంగా ఇచ్చారు. యూఎంఎంసీ ఆస్పత్రి(హోస్టన్–అమెరికా), హఫీజ్‌ఖాన్ ట్రస్ట్ సంయుక్తంగా వీటిని సమకూర్చాయి. పెద్దాస్పత్రి ప్రాంగణంలోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆస్పత్రిలో వంద పడకలతో కోవిడ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి.. అక్కడ 100 కాన్సన్ట్రేటర్లను వినియోగిస్తారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల కోసం మిగిలిన వాటిని వినియోగిస్తారు. -
వేగంగా ఆక్సిజన్ చేరుస్తున్నాం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలో అన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్‌ను వేగంగా, సురక్షితంగా అందించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. వేరే రాష్ట్రాలు, మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ను తరలించేటప్పుడు జాప్యం జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా గ్రీన్ చానల్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆక్సిజన్ సరఫరా చేసే 11 ప్లాంట్లను మ్యాపింగ్ చేసి అక్కడ నుంచి ఎటువంటి అవరోధాలు లేకుండా రవాణా జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. ఇందుకు సంబంధించి ఒడిశా, తమిళనాడు, కర్ణాటక డీజీపీలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు ప్రయాణించే మార్గాల్లో ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా పోలీస్ ఎస్కార్ట్ వాహనాలను పంపుతున్నామన్నారు. ఆక్సిజన్ ట్యాంకర్లకు జీపీఎస్ అమర్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పొరుగు రాష్ట్రాల పోలీసులు తమ రాష్ట్ర సరిహద్దుల వరకు ఎస్కార్ట్‌గా వచ్చి ఆక్సిజన్ ట్యాంకర్లను అప్పగిస్తున్నారని తెలిపారు. ఆక్సిజన్ రవాణాను స్టేట్ ఆక్సిజన్ వార్ రూమ్ నుంచి ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఆయా జిల్లాల పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు అందించిన ఎమ్మెల్యే వంశీ కరోనా సెకండ్ వేవ్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆపద కాలంలో అందుబాటులో ఉండేలా కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి సోమవారం వెళ్లిన వంశీ, పలు సంస్థలకు చెందిన దాతలు డీజీపీ సవాంగ్‌కి 25 ఆక్సిజన్ సిలిండర్లు, 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 25 వేల ఎన్95 మాస్క్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాడ్యులర్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ రమేశ్ జైన్, ఆర్ఆర్హెడ్ సీఈవో పులిపాటి కెన్నడి పాల్గొన్నారు. -
మోదీజీ కనిపించరేం.. ఎక్కడున్నారు?: రాహుల్
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇక దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడా కంటికి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కొందరు మానవతావాదులు కరోనా బాధితులకు ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. పీఎం కేర్స్ ఫండ్ కింద అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న వెంటిలేటర్ల గురించి రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పీఎం కేర్స్ వెంటిలేటర్లు, ప్రధాని మోదీ మధ్య పోలికలు ఉన్నాయన్నారు. ఆ వెంటిలేటర్లు, మోదీ బాధ్యతలను నిర్వర్తించడం లేదని ఎద్దేవా చేశారు. పీఎం కేర్స్ వెంటిలేటర్లు, ప్రధాని మోదీ ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. -
సరిపడా ఇక్కడే ఆక్సిజన్ తయారీ చేసుకుందాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ రోగుల చికిత్స కోసం రాష్ట్రంలోని 48 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 324 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని.. భవిష్యత్‌లో కూడా ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్‌తోపాటు జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో 16 టన్నుల ప్లాంట్లు ఆరు, 8 టన్నుల ప్లాంట్లు పదిహేను, 4 టన్నులవి 27 ప్లాంట్లు ఏర్పాటు చేయాలని.. అదనంగా హైదరాబాద్‌లో మరో 100 టన్నుల ప్లాంటును ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్కోటీ 20 టన్నుల సామర్థ్యం గల 11 ఆక్సిజన్ ట్యాంకర్లను 10 రోజు ల్లోగా అందించాలని ఉత్పత్తిదారులను కోరారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండరాదని అధికారులకు స్పష్టం చేశారు. ఆక్సిజన్ సరఫరాలో పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆస్పత్రులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత అనేదే ఉత్పన్నం కావొద్దన్నారు. కరోనా వ్యాక్సిన్ల సరఫరా కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వ్యాక్సిన్ల కోటా విషయంలో నిరంతరం సంప్రదింపులు జరపాలని, త్వరగా తెప్పించుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి తెలంగాణకు 57,30,220 డోసుల వ్యాక్సిన్ మాత్రమే వచ్చిందని.. ప్రస్తుతం 1,86,780 డోసుల స్టాక్ ఉందని అధికారులు సీఎంకు వివరించారు. అందులో కోవాగ్జిన్ 58,230 డోసులు, కోవిషీల్డ్ 1,28,550 డోసుల స్టాక్ ఉందని తెలిపారు. ప్రైవేటులో చేరి డబ్బులు పోగొట్టుకోవద్దు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వైద్యం సహా భోజనం, మందులు వంటి సకల సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తున్నామని.. పేదలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని సీఎం కేసీఆర్ కోరారు. సోమవారం నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 6,926 బెడ్లు ఖాళీగా ఉన్నాయని.. అందులో ఆక్సిజన్ బెడ్లు 2,253, ఐసీయూ బెడ్లు 533, సాధారణ బెడ్లు 4,140 ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్ సహా అన్నీ అందుబాటులో ఉన్నాయని.. జనం ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఎక్కడైనా వైద్యం ఒక్కటేనని, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని కోరారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో ఉన్న 200 పడకల ఆస్పత్రిని తక్షణమే కోవిడ్ చికిత్సకు ఉపయోగించాలని.. సింగరేణి, ఆర్టీసీ, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, రైల్వే, ఆర్మీ, ఈఎస్ఐ సహా అందుబాటులో ఉన్న అన్ని ఆస్పత్రులను కోవిడ్ సేవల కోసం వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎక్కడైనా ప్రైవేటు ఆస్పత్రుల బిల్లులు కడ్తున్నది రోగులే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ బెడ్ల కేటాయింపు, చికిత్సలకు ధరలను నిర్ణయిస్తూ 11 నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 248 విడుదల చేసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, యూపీ తదితర రాష్ట్రాలు కూడా ఇదే తరహా నిబంధనలు అమలు చేస్తున్నాయని కేసీఆర్‌కు అధికారులు వివరించారు. ఆయా రాష్ట్రాల్లోనూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేషెంట్లే తమ బిల్లులు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. కోలుకుంటున్న వారి శాతం పెరుగుతోంది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్, జ్వర పీడితుల సర్వే, కోవిడ్ కిట్ల పంపిణీ తదితర కారణాల వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ అడ్మిషన్లు తగ్గడం, డిశ్చార్జిలు పెరగడం మంచి పరిణామమని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా రోగుల్లో కోలుకుంటున్న వారి శాతం మెరుగ్గా ఉండటం సంతోషకరమని పేర్కొన్నారు. జ్వర సర్వేలో కరోనా లక్షణాలు కనిపించిన వ్యక్తులను వైద్య బందాలు నిరంతరం సంప్రదిస్తూ, కనిపెట్టుకుని ఉండాలని సూచించారు. కరోనా విషయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, సీఎస్ సోమేశ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం పరికరాలు, మందులు కరోనా రోగులకు తర్వాతి దశలో బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకుతున్న నేపథ్యంలో.. దాని చికిత్స కోసం కోఠిలోని ఈఎన్టీ, గాంధీ ఆస్పత్రి, జిల్లాల్లోని వైద్యకళాశాలల ఆస్పత్రులకు అవసరమైన పరికరాలు, మందులను సమకూర్చుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన 25 మైక్రో డీబ్రైడర్ మిషన్లు, హెచ్డీ ఎండోస్కోపిక్ కెమెరాలను తక్షణమే తెప్పించాలన్నారు. రాష్ట్రంలో ఐదు కొత్త వైద్య కళాశాలలు వైద్యారోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్ లలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. వీటికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పాత వైద్య కళాశాలల్లో నర్సింగ్ కాలేజీలు లేనిచోట్ల వాటిని మంజూరు చేయాలని.. ఇప్పటికే అనుమతులు వచ్చిన నర్సింగ్ కాలేజీల ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు, త్వరితగతిన మందుల సరఫరాకు వీలుగా కొత్తగా 12 రీజినల్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిద్దిపేట, వనపర్తి, మహబూబాబాద్, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, సూర్యాపేట, భువనగిరి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, వికారాబాద్, గద్వాల కేంద్రాల్లో ఈ సబ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. వీటి పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రులకు యుద్ధప్రాతిపదికన మందులు అందించడానికి అద్దె లేదా సొంత వాహనాలను తక్షణమే అందుబాటులోకి తేవాలని సూచించారు. మందులు నిల్వ చేయడానికి సబ్ సెంటర్లలో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలన్నారు. -
రెండు తెలుగు రాష్ట్రాలకు రిలయన్స్ మద్దతు
హైదరాబాద్: కోవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వంతు మద్దతును అందించనుంది. ఇందులో భాగంగా కోవిడ్ సహాయక చర్యలకు ప్రభుత్వం ఉపయోగించే అత్యవసర సేవా వాహనాలు, అంబులెన్స్‌లకు రిలయన్స్ పెట్రోల్ బంకులు ఉచిత ఇంధనాన్ని అందించనున్నాయి. సంబంధిత ప్రభుత్వ అధికారులు జారీ చేసిన అనుమతి లేఖల ఆధారంగా అన్ని అత్యవసర సేవా వాహనాలు, అంబులెన్సులకు రోజుకు ఒక వాహనానికి గరిష్టంగా 50 లీటర్ల ఇంధనాన్ని రిలయన్స్ బంకులు ఉచితంగా అందిస్తాయి. ఈ సదుపాయం జూన్ 30 వరకు వర్తిస్తుంది అని సంస్థ పేర్కొంది. మరోవైపు ఆక్సిజన్ కొరత సమస్యను సమర్ధంగా ఎదుర్కొనేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు రిలయన్స్ తన వంతు సాయాన్ని అందిస్తోంది. ఈ మేరకు తెలంగాణకు 80 టన్నులు, ఆంధ్రప్రదేశ్ కు మరో 80 టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ ను రిలయన్స్ సమకూర్చింది. ఆక్సిజన్ ఎక్సప్రెస్ ఈ కంటైనర్లను రిలయన్స్ జామ్‌నగర్ ప్లాంట్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్, గుంటూరు రైల్వే స్టేషన్లకు ఆదివారం నాటికి చేరవేసింది. కోవిడ్- 19పై దేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా రిలయన్స్ కుటుంబం చేతులు కలిపింది. కోవిడ్ -19తో చేస్తున్న పోరాటంలో దేశం విజయం సాధించేలా చేసేందుకు క్షేత్రస్థాయిలో బహుముఖ విధానాలతో కార్యక్రమాలను రిలయన్స్ చేపట్టింది. కరోనా సమయంలో భారతీయుల కష్టాలను తొలగించేందుకు నిర్విరామంగా ప్రయత్నించింది. వారు వేగంగా కోలుకునేందుకు సహాయపడింది. వైరస్ కలిగించిన ముప్పును అధిగమించేందుకు తన వనరులు, మానవశక్తి, ఉపకరణాలు... అన్నింటినీ రిలయన్స్ ఉపయోగిస్తోంది. రిలయన్స్ 1,000 మెట్రిక్ టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సీజన్ ను దేశవ్యాప్తంగా సమకూరుస్తోంది. ఇది భారతదేశ ఆక్సీజన్ ఉత్పత్తిలో 11 శాతం లేదా ప్రతీ 10 మంది రోగుల్లో ఒకరికి అవసరమైన దాంతో సమానం. మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సీజన్ రవాణాను సులభతరం చేసేందుకు గాను రిలయన్స్ 32 ఐఎస్ఓ కంటెయినర్లను దిగుమతి చేసుకుంది. భారతదేశంలో కోవిడ్ పై జరుగుతున్న పోరాటంలో తాను చేపట్టిన ఎన్నో కార్యక్రమాలతో రిలయన్స్ ఫౌండేషన్ ముందు వరుసలో నిలిచింది. రిలయన్స్ ఫౌండేషన్ భారతదేశ మొట్టమొదటి కోవిడ్ -19 కేర్ హాస్పిటల్ ను కేవలం రెండు వారాల్లోనే ఏర్పాటు చేసింది. మిషన్ అన్న సేవను ప్రారంభించింది. ఇప్పటి వరకూ 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పేదలకు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి 5.5 కోట్లకు పైగా భోజనాలను సమకూర్చింది. చదవండి: ఫ్రీ అంబులెన్స్! మానవత్వం చాటుకున్న సాప్ట్ వేర్ ఉద్యోగి -
గుంటూరు చేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్
లక్ష్మీపురం(గుంటూరు): గుజరాత్ జామ్‌నగర్‌లోని రిలయన్స్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ కంటైనర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం న్యూగుంటూరు రైల్వేస్టేషన్ ఆవరణలోని కాంకర్ కంటైనర్ డిపోకు చేరుకుంది. ఈ ఆక్సిజన్‌ను ఇతర జిల్లాలకు పంపేందుకు చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూం ప్రత్యేకాధికారి ఎంటీ కృష్ణబాబు, కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ ఆర్జా శ్రీకాంత్‌లతో పాటు జేసీ దినేష్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించినా సరిపోకపోవడంతో 910 మెట్రిక్ టన్నులు కేటాయించాలని ఐదు రోజుల కిందట సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానికి లేఖ రాసినట్టు చెప్పారు. దీంతో స్పందించిన కేంద్రం రెండు ఆక్సిజన్ కంటైనర్లను రైలు ద్వారా పంపినట్టు తెలిపారు. గుంటూరుకు వచ్చిన ఆక్సిజన్‌ను పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. జామ్‌నగర్ నుంచి ఇదే విధంగా రోజూ ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ శనివారం మరోసారి ప్రధానికి లేఖ రాసినట్టు చెప్పారు. జేసీ దినేష్‌కుమార్ మాట్లాడుతూ గుంటూరుకు చేరుకున్న ఆక్సిజన్‌ను గుంటూరు జిల్లాకు 30 మెట్రిక్ టన్నులు, కృష్ణా జిల్లాకు 20, ప్రకాశం, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాలకు 10 మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం నరేంద్రవర్మ, డీవోఎం వి.రాంబాబు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏపీ హెడ్ రవిరామరెడ్డి తదితరులున్నారు. -
ఆర్టీసీ బస్సుల్లో మొబైల్ ఆక్సిజన్ బెడ్లు
మచిలీపట్నం: కోవిడ్ మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మొబైల్ ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. కోవిడ్ ఆస్పత్రుల్లో సేవలు మరింత మెరుగుపరిచేందుకు ఏం చేయాలన్న దానిపై మచిలీపట్నంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో సత్వరమే వైద్యం అందించేలా ఆర్టీసీ స్లీపర్ ఏసీ బస్సుల్లో పది ఆక్సిజన్ కాన్సెంట్రేట్ మిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం గ్రీన్కో సంస్థ అధినేత చలమలశెట్టి అనిల్ ముందుకొచ్చినట్టు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో త్వరలోనే మొబైల్ ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకొస్తాయన్నారు. ఇలానే దాతలు మరింత మంది ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కోవిడ్ ఆస్పత్రుల్లో సేవలందించేందుకు వైద్య కోర్సు చేసిన వారు, నర్సింగ్ విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ కోవిడ్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. అనంతరం మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్ కాలేజీ వసతి గృహంలోని కేర్ సెంటర్‌ను సందర్శించి అక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను ఏర్పాటు చేయించారు. సమీక్షలో బందరు ఆర్డీవో ఖాజావలి, డ్వామా పీడీ సూర్యనారాయణ, డీఎస్పీ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Rachakonda Police Commissionerate: కరోనా బాధితుల ఇంటికే ఆక్సిజన్
నేరేడ్మెట్: కరోనాతో పోరాడుతున్న బాధితులకు ఆక్సిజన్ ఎంతో కీలకం. ఆక్సిజన్ కొరత నేపథ్యంలో పలు ఆసుపత్రుల్లో బాధితులు ఇబ్బందులు పడుతుండగా.. కొందరు మృత్యువాత పడిన దాఖలాలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో హోం ఐసోలేషన్‌లో ఉంటూ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న బాధితులకు ప్రాణవాయువును అందించే కార్యక్రమానికి రాచకొండ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డీఆర్డీఓ, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ (ఆర్కేఎస్సీ), లయన్స్ క్లబ్, హెట్ ఫౌండేషన్, సెకండ్ చాన్స్ ఫౌండేషన్లతో కలిసి రాచకొండ పోలీసులు నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ‘ప్రాణవాయు సేవ బ్యాంకు’ను ఏర్పాటు చేశారు. శనివారం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఈ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ఆక్సిజన్ సిలిండర్లు అవసరమైన వారు రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూం నెంబర్ 9490617234కి ఫోన్ చేసి, రోగికి సంబంధించిన వివరాలు, డాక్టర్ ప్రిస్కిప్షన్, ఆధార్ కార్డు తదితర వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలు పరిశీలించి వారి ఇంటికి ఆక్సిజన్ సిలిండర్‌ను పంపించడం జరుగుతుందని సీపీ వివరించారు. డొనేట్‌ప్లాస్మా.ఆర్కేఎస్సీ.ఇన్ వెబ్‌పేజీని సీపీ ప్రారంభించారు. ప్లాస్మా దాతలు, ప్లాస్మా అవసరమైన వారు ఈ వెబ్‌పేజీలో పేరు, వివరాలు నమోదు చేసుకోవాలని సీపీ కోరారు. చదవండి: కరోనా వ్యాక్సిన్: స్పుత్నిక్–వి భేష్.. సామర్థ్యం ఎంతంటే Corona Warriors: డాక్టర్ల కన్నా ముందే..‘ఊపిరి’ పోస్తున్నారు -
నిరంతరాయంగా స్టీల్‌ప్లాంట్ ఆక్సిజన్
ఉక్కునగరం (గాజువాక): కరోనా బాధితులకు చికిత్స నిమిత్తం విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 150 టన్నులు, కర్నాటకకు 30 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసినట్టు స్టీల్‌ప్లాంట్ వర్గాలు తెలిపాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి ప్రక్రియలో తయారయ్యే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. గత ఏడాదిలో వచ్చిన కరోనా మొదటి దశలో కూడా విశాఖ స్టీల్‌ప్లాంట్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేసింది. ప్రస్తుత రెండో దశలో గత నెల 13 నుంచి ఇప్పటివరకు 4,800 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేసింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు మొత్తం 13,650 టన్నుల ఆక్సిజన్‌ను స్టీల్‌ప్లాంట్ సరఫరా చేసింది. -
Andhra Pradesh: 'ఆక్సిజన్' రైలొచ్చింది..
ముత్తుకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టుకు శనివారం సాయంత్రం ఆక్సిజన్ రైలు వచ్చింది. దీని ద్వారా పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్లాంట్ నుంచి ఒక్కోటి 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో ఉన్న రెండు ట్యాంకర్లు పోర్టుకు చేరుకొన్నాయి. ఈ ప్రత్యేక రైలుకు అదాని కృష్ణపట్నం పోర్టు సీఈవో అవినాష్‌చంద్ రాయ్, నెల్లూరు జేసీ హరేందిరప్రసాద్, జేసీ (ఆసరా) బాబిరెడ్డి, చిత్తూరు జేసీ మార్కండేయులు, పోర్టు సెక్యూరిటీ జీఎం రాకేష్ కృష్ణన్, స్థానిక తహసీల్దార్ సోమ్లానాయక్‌లు స్వాగతం పలికారు. ఇప్పటికే రైల్లో వచ్చిన ట్యాంకర్ల నుంచి ఆక్సిజన్‌ను స్థానిక ట్యాంకర్లలోకి నింపుకొనే ప్రక్రియ చేపట్టారు. వీటిని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వివిధ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు తరలించనున్నారు. -
ఆక్సిజన్ కోటా పెంచినందుకు కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఆక్సిజన్ కోటా పెంచడంతోపాటు ఏడు ఐఎస్వో కంటైనర్లను కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయనకు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా రెండో దశ ఉధృతిని ఎదుర్కొనేందుకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఏప్రిల్ 24న 480 మెట్రిక్ టన్నులుగా (ఎంటీ) ఉన్న లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరాను మే 6 నాటికి 590 మెట్రిక్ టన్నులకు పెంచినందుకు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జామ్‌నగర్‌లోని రిలయెన్స్ ప్లాంట్ నుంచి 80 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంవోతో ప్రత్యేక రైలు శుక్రవారం రాష్ట్రానికి చేరిందని ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మరో 30 వేల ఆక్సిజన్, ఐసీయూ పడకలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుత కేసుల లోడు, ఆస్పత్రుల్లో చేరికలను పరిగణనలోకి తీసుకుంటే రోజూ 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కావాల్సి ఉంటుందని వివరించారు. విశాఖ నుంచి వస్తున్నది 100 మెట్రిక్ టన్నులే.. విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)లో స్టోరేజీ సామర్థ్యం తగ్గడంతో తమకు కేటాయించిన 170 మెట్రిక్ టన్నులకు బదులు 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే వస్తోందని సీఎం.. ప్రధాని దృష్టికి తెచ్చారు. ఇదే సమయంలో తమిళనాడు నుంచి ఏపీకి కేటాయించినంత ఆక్సిజన్ రావడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీనివల్ల రాయలసీమలోని పలు పెద్ద ఆస్పత్రుల్లో తీవ్ర అత్యవసర పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించారు. ఈ నెల 10న చెన్నై, కర్ణాటక నుంచి రావాల్సిన ఆక్సిజన్ సకాలంలో రాకపోవడంతో తిరుపతిలో ఆక్సిజన్ కొరత ఏర్పడి 11 మంది మరణించారన్నారు. రాయలసీమలో మా భయానక దుస్థితికి ఈ ఘటన అద్దం పడుతోందని.. తమిళనాడు, కర్ణాటకలపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ఈ రెండు రాష్ట్రాల నుంచి కేటాయింపులు పెంచాలని తాము డీపీఐఐటీకి చేసిన వినతిని పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇటువంటి స్థితిలో జామ్‌నగర్‌లోని రిలయెన్స్ ప్లాంట్ నుంచి 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో వచ్చిన ప్రత్యేక రైలు రాయలసీమ ప్రాణదాతగా నిలిచిందని తెలిపారు. ఇది రాయలసీమ ఆస్పత్రుల్లో రానున్న రెండు రోజుల పాటు ఆక్సిజన్ సరఫరా స్థిరీకరణకు తోడ్పడుతుందన్నారు. రాయలసీమలో ఆక్సిజన్ అవసరాన్ని తీర్చండి.. ఐఎస్వో కంటైనర్లతో ఒడిశా నుంచి ఆక్సిజన్‌ను తరలించేందుకు తాము శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నప్పటికీ రాయలసీమ నుంచి వస్తున్న డిమాండ్‌ను తట్టుకునే అవకాశం కనిపించడం లేదని సీఎం తెలిపారు. అందువల్ల రాయలసీమలో ఆక్సిజన్ అవసరాన్ని తీర్చేందుకు జామ్‌నగర్ నుంచి రోజూ కనీసం 80 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంవోతో ఆక్సిజన్ రైలును నడపాల్సిందిగా విన్నవించారు. రాయలసీమలో పెరుగుతున్న కేసులను, ఆక్సిజన్ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. పై పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కరోనా కేసుల లోడును అదుపు చేయగలిగే స్థితి వచ్చే వరకు జామ్‌నగర్‌లోని రిలయెన్స్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ రైలును కొనసాగించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు. అదేవిధంగా ఏపీలో ప్రస్తుత సంక్షోభ పరిస్థితిని అధిగమించేందుకు 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
CoronaVirus: ఢిల్లీ ప్రజలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రజలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త చెప్పారు. ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. టోల్ ఫ్రీ నంబర్ 1031 కి ఫోన్‌చేస్తే కేవలం 2గంటల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ గుమ్మం ముందు ఉంటుందని అన్నారు. ఈ సేవను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నా రు. ఢిల్లీలోని ప్రతి జిల్లాలో 200 కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఒకరి వద్ద అవసరం తీరిపోయాక, ఆ కాన్సంట్రేటర్‌ను శానిటైజ్ చేసి అవసరంలో ఉన్న మరొకరికి ఇస్తామని చెప్పారు. డాక్టర్ల సిఫారసు మేరకు అవసరమైన పేషెంట్లకు వీటిని అందివ్వనున్నారు. ఓ టెక్నీషియన్ వచ్చి ఎలా వాడాలో వివరిస్తారని తెలిపారు. హోం ఐసోలేషన్ ప్రొటోకాల్‌కు ఎన్రోల్ చేసుకోని వారు కూడా 1031కి ఫోన్ చేసి కాన్సన్ట్రేటర్ తెప్పించుకోవచ్చన్నారు. సరైన సమయంలో ఆక్సిజన్ అందించడం ద్వారా ప్రాణాలను నిలబెట్టుకోవచ్చన్నారు. వీటిని స్పాన్సర్ చేసిన ఓఎల్ఏ ఫౌండేషన్, గివ్ఇండియా సంస్థలను అభినందించారు. -
సీఎం జగన్ చర్యలతో ఆక్సిజన్ సరఫరా వేగవంతం
-
గోవా జీఎంహెచ్‌సీలో మరణ మృదంగం
పనాజీ: గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జీఎంహెచ్‌సీ)లో తెల్లవారుజామున జరుగుతున్న మరణాల పరంపర కొనసాగుతోంది. కేవలం నాలుగు రోజుల్లో తెల్లవారుజాము సమయంలో 75 మంది మరణించారు. తెల్లవారు జామున 2 నుంచి 6 గంటల మధ్యలో ఈ మరణాలు సంభవించాయి. ఈ వ్యవహారంపై బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ విచారణ జరుపుతోంది. గురువారం గోవా ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ దేవీదాస్ పంగం.. ఆక్సిజన్ సరఫరా లోపాల వల్లే మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఆక్సిజన్‌ను తీసుకొచ్చే ట్యాంకర్ల లాజిస్టికల్ సమస్యలతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆక్సిజన్ ప్రెజర్లో లోపాల వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. అయితే, ఆస్పత్రిలో శుక్రవారం మరో 13 మంది చనిపోయారు. ఆక్సిజన్ సంబంధిత సమస్యల కారణంగా మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో కలిపి 75 మంది ప్రాణాలు కోల్పోయారు. -
Hanuma Vihari: దాతృత్వం.. కోవిడ్ బాధితులకు అండగా
న్యూఢిల్లీ: ఆసుపత్రిలో పడకల కోసం ఇంతటి క్లిష్టమైన పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదని, ఇది హృదయవిదారకమని భారత టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి విచారం వ్యక్తం చేశాడు. విపత్కర పరిస్థితిపై కలత చెందిన అతను తనవంతుగా చేయూత అందించాడు. కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో చేయిచేయి కలిపి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశాడు. పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ సేవల్ని అందజేస్తున్నాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్‌లో ఉన్న విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంటకనిపెట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం తన మిత్రుల సహకారం కోరగా వారంతా కలిసివచ్చారు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. ఓ వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో 27 ఏళ్ల విహారి మాట్లాడుతూ ‘నేను చేసింది గొప్ప దాతృత్వమో, సేవో కానే కాదు! అవసరమైన వారికి ఏదో నాకు తోచినంత సాయం మాత్రమే ఇది. మహమ్మారి ఉధృతిలో నా వంతు చేయూత అందించానంతే’ అని అన్నాడు. సామాజిక మాధ్యమాల్లో లక్షా పదివేల ఫాలోవర్లు ఉన్న విహారి చేసిన ప్రయత్నానికి చాలామంది కలిసిరావడంతో ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. ముఖ్యంగా పరిస్థితి విషమించిన వారికి ప్లాస్మా దానం, ఆక్సిజన్ అవసరమైన వారికి ప్రాణవాయువు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగానని ఇక ముందు కూడా ఇలాంటి సాయమందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని విహారి చెప్పాడు. ఇప్పటివరకు 11 టెస్టులాడిన విహారి 624 పరుగులు చేశాడు. వార్విక్షైర్ తరఫున ఆడేందుకు విహారి గత నెలలోనే ఇంగ్లండ్ చేరాడు. అక్కడే జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం జూన్ 3న అక్కడకు చేరుకునే భారత జట్టుతో విహారి కలిసే అవకాశముంది. జట్టుకోసం ఏదైతే అది... ఇంగ్లండ్ పర్యటనపై మాట్లాడుతూ జట్టు కోసం ఏ స్థానంలో పంపించినా బ్యాటింగ్‌కు సిద్ధమేనని చెప్పాడు. ‘నా కెరీర్లో ఎన్నోసార్లు టాపార్డర్‌లో బ్యాటింగ్ చేశాను. జట్టు మేనేజ్మెంట్ కోరితే ఇప్పుడు సిద్ధమే. ఓపెనింగ్ అయినా ఓకే’ అని విహారి అన్నాడు. ముందుగా కివీస్‌తో ఇంగ్లండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్, తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌కు చాలా ముందుగా ఇక్కడికి రావడం తనకు కలిసివస్తుందని చెప్పాడు. పిచ్, స్థానిక వాతావరణం అలవాటైందని చెప్పుకొచ్చాడు. ఇది భారత జట్టు తరఫున మెరుగ్గా ఆడేందుకు దోహదం చేస్తుందన్నాడు. -
రెండు రోజుల్లో అదనంగా 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి రెండు రోజుల్లో అదనంగా 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందని వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇది కేంద్ర ప్రభుత్వం రోజు వారీ కేటాయిస్తున్న 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌కు అదనమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయాలను అన్వేషించి ఆక్సిజన్ నిల్వలను పెంచేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నుంచి 2 ట్యాంకుల్లో 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందన్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి కృష్ణపట్నం పోర్టులకు ఆ ట్యాంకర్లు చేరుకోనున్నాయన్నారు. జామ్ నగర్ నుంచి మరో 110 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రైలు మార్గంలో ఆదివారం నాటికి గుంటూరుకు రానుందని తెలిపారు. జమ్షెడ్పూర్ నుంచి మరో 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందన్నారు. రెండు రోజుల్లో మొత్తం 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి రానుందని ఆయన తెలిపారు. కేంద్రం ఇచ్చే ఆక్సిజన్‌తో పాటు అదనంగా రానున్న ఆక్సిజన్‌ను రాష్ట్రంలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లో నిల్వ చేయడం ద్వారా అత్యవసర సేవలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఇవే కాకుండా మరో రెండు మూడు ట్యాంకర్లు దుర్గాపూర్ నుంచి రానున్నాయన్నారు. దీనివల్ల రాయలసీమ జిల్లాలకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. అదనపు ఆక్సిజన్‌ను ప్రతి జిల్లాలో 10 నుంచి 20 టన్నుల వరకు నిల్వ చేస్తామని, రోజు వారీ వచ్చే ఆక్సిజన్‌లో ఎక్కడైనా జాప్యం జరిగితే ఈ నిల్వలను వినియోగిస్తామని స్పష్టం చేశారు. 24 గంటల్లో 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ► గడిచిన 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందింది. చెన్నై ప్లాంట్‌లో ఇబ్బందులు రావడంతో ఐదారు రోజుల పాటు ఏపీకి రావాల్సిన ఆక్సిజన్ సరఫరా నిలిచిపోనుందని నిన్న (గురువారం) అర్ధరాత్రి సమాచారమిచ్చారు. ► వెంటనే అధికారులు కేంద్రంతో మాట్లాడారు. ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక అధికారులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సమస్యను పరిష్కరించారు. పెరుగుతున్న డిశ్చార్జిలు ► రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జిల సంఖ్య పెరుగుతుండటం శుభపరిణామం. దేశ వ్యాప్తంగా చూస్తే రాష్ట్రంలో మరణాల శాతం తక్కువగా ఉంది. ► రాష్ట్రంలో 6,453 ఐసీయూ బెడ్లలో 6,006 మంది రోగులు ఉన్నారు. 447 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 23,204 ఆక్సిజన్ బెడ్లలో 22,029 మంది బాధితులు ఉన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 16,597 మంది చికిత్స పొందుతున్నారు. ► గడిచిన 24 గంటల్లో ఇదివరకెన్నడూ లేని విధంగా ప్రైవేట్ ఆస్పత్రులకు పెద్ద మొత్తంలో 18,410 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను సరఫరా చేశాం. ప్రభుత్వాసుపత్రుల్లో 19,349 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. గత 24 గంటల్లో 104 కాల్ సెంటర్‌కు 13,868 ఫోన్లు వచ్చాయి. ఇందులో వివిధ సమాచారాల నిమిత్తం 5,444, అడ్మిషన్లకు 3,018, కరోనా టెస్టులకు 2,914, టెస్ట్ రిజల్ట్ కోసం 1,886 ఫోన్ కాల్స్ వచ్చాయి. ► రాష్ట్రంలో వ్యాక్సిన్ సెకండ్ డోస్‌ల పంపిణీ ఎలాంటి రద్దీ లేకుండా సాఫీగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కొవాగి్జన్ వ్యాక్సిన్ల గురించి ఎదురు చూడకుండా, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను సెకండ్ డోస్ గడువు ముగియక ముందే వేస్తున్నామన్నారు. నేటి నుంచి జ్వరాలపై ఇంటింటి సర్వే ► కరోనాను కట్టడి చేయడంలో భాగంగా శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇంటింటికీ వెళ్లి జ్వర పీడితులను గుర్తించే సర్వే ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్ర అధికారులు, జిల్లా వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఇంటింటి సర్వేపై దిశా నిర్ధేశం చేశారు. ► జర్వ పీడితులను గుర్తించి అక్కడికక్కడే మందులు, కరోనా కిట్లు అందజేయనున్నారు. దీనివల్ల కరోనాను కట్టడి చేయడమే కాక, ఆస్పత్రులపై ఒత్తడి కూడా తగ్గనుంది. -
ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి
సాక్షి, అమరావతి: కోవిడ్–19 ఉధృతి నేపథ్యంలో ఒకేసారి పెరిగిన డిమాండ్‌కు తగినంతగా ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం గణనీయ పురోగతి సాధించిందని ఆక్సిజన్ సేకరణ, సరఫరాను పర్యవేక్షణ చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి టి.కృష్ణబాబు తెలిపారు. ఆక్సిజన్‌పై ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖతో సానుకూల పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రం.. రాష్ట్రానికి కొత్తగా మరో మూడు ఐఎస్వో ట్యాంకులను ఇవ్వనుందని తెలిపారు. ఈ ట్యాంకులను శనివారం మధ్యాహ్నం దుర్గాపూర్‌లో అప్పగించనుందన్నారు. ఆదివారం నాటికి కృష్ణపట్నంకు 60 టన్నుల ఆక్సిజన్‌తో ప్రత్యేక రైలు చేరుకోనుందని పేర్కొన్నారు. ఇప్పటికే దుర్గాపూర్ స్టీల్ ఫ్యాక్టరీలో 2 కొత్త ట్యాంకుల్లో ఆక్సిజన్‌ను అధికారులు నింపారని, ఒక్కో ట్యాంకులో 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, మొత్తంగా 40 మెట్రిక్ టన్నులు వస్తుందన్నారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా శనివారం నెల్లూరులోని కృష్ణపట్నంకు ఆక్సిజన్ ట్యాంకులు చేరుకుంటాయని, మొత్తంగా రాష్ట్రానికి 6 ఐఎస్ఓ ట్యాంకుల ద్వారా ఆక్సిజన్ రానుందని ఆయన తెలిపారు. ఒక్కో ప్రత్యేక రైలు ద్వారా మూడు ట్యాంకుల చొప్పున నిరంతర ఆక్సిజన్ సరఫరాకు ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. ఒక్కో ట్రిప్పులో 60 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ప్రత్యేక రైలు తీసుకురానుందని తెలిపారు. ఒడిశాలో వివిధ కర్మాగారాల నుంచి ఈ ఆక్సిజన్‌ను సేకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. తద్వారా నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రులకు రిజర్వ్‌లో ఆక్సిజన్ నిల్వలు ఉంచగలగుతామన్నారు. మరోవైపు గుజరాత్‌లోని జామ్‌నగర్ రిలయన్స్ ఫ్యాక్టరీ నుంచి మరో 110 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ శనివారం రైలు ద్వారా గుంటూరు చేరుకోనుందని తెలిపారు. -
అన్ని జిల్లాల్లో వ్యాక్సిన్ సెకండ్ డోస్ కొనసాగుతోంది: సింఘాల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వ్యాక్సిన్ సెకండ్ డోస్ కొనసాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్లలో 16,597 మందికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. జాంనగర్ నుంచి గుంటూరుకు 110 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందని, జంషెడ్పూర్ ద్వారా 4 ట్యాంకర్లలో 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానున్నట్లు తెలిపారు. 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అదనంగా రాబోతుందన్నారు. జిల్లాల వారీగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో ఫీవర్ కిట్లు అందిస్తామని, బెడ్స్ దొరకని పరిస్థితిలో కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించాలని సూచించినట్లు తెలిపారు. చదవండి: ఏపీలో కొత్తగా 22,018 కరోనా కేసులు, 96 మరణాలు -
ఏపీ: ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో గణనీయ పురోగతి
సాక్షి, అమరావతి: ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో ఆంధ్రప్రదేశ్ గణనీయ పురోగతి కనబరుస్తోంది. రాష్ట్రంలో వివిధ ఆస్పత్రులకు విస్తృతంగా ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. ప్రధానంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాయడంతో రాష్ట్రంలో సానుకూల పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం మరో మూడు ఐఎస్ఓ ట్యాంకులు ఇవ్వనుంది. రేపు మధ్యాహ్నం దుర్గాపూర్‌లో ఐఎస్ఓ ట్యాంకులు అందజేయనుంది. ఎల్లుండి 60 టన్నుల ఆక్సిజన్‌తో ప్రత్యేక రైలు కృష్ణపట్నం చేరుకోనుంది. ఇప్పటికే దుర్గాపూర్ స్టీల్ ఫ్యాక్టరీలో 2 ట్యాంకుల్లో అధికారులు ఆక్సిజన్ నింపారు ప్రత్యేక రైలు ద్వారా మూడు ట్యాంకుల చొప్పున నిరంతర ఆక్సిజన్ సరఫరా చేయనున్నారు. ప్రత్యేక రైలులో ఒక్కో ట్రిప్పులో 60 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుంది. ఒడిశాలో వివిధ ఫ్యాక్టరీల నుంచి ప్రత్యేక రైలు ఆక్సిజన్ సేకరించనుంది. దీంతో నెల్లూరు, రాయలసీమ జిల్లాలో ఆక్సిజన్ రిజర్వ్‌లో ఉంచగలమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రానికి గుజరాత్ నుంచి మరో 110 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ రానుంది. రేపు ప్రత్యేక రైలు ద్వారా గుంటూరుకు ఈ ఆక్సిజన్ చేరుకోనుంది. -
ఆక్సిజన్ అందక మరో 15 మంది మృత్యువాత
పణజి: గోవా మెడికల్ కళాశాల ఆస్పత్రి(జీఎంసీహెచ్)లో ఆక్సిజన్ అందక గురువారం మరో 15 మంది కోవిడ్ బాధితులు మృత్యువాతపడ్డారు. పెద్ద ఆక్సిజన్ సిలింండర్‌కు అనేక చిన్న సిలిండర్లను కలపడంలో తలెత్తిన లోపాల వల్లే వీరిలో కొందరు చనిపోయిన భావిస్తున్నామని రాష్ట్ర అధికారులు బాంబే హైకోర్టు గోవా ధర్మాసనానికి తెలిపారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య వీరు తుదిశ్వాస విడిచారని తెలిపారు. జీఎంసీహెచ్‌లో చికిత్స పొందే కోవిడ్ బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ను సక్రమంగా అందించాలని తాము ఉత్తర్వులిచ్చిన తర్వాత కూడా ఇలాంటి విషాదం సంభవించడంపై ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు రోజుల క్రితం, మే 12న ఇదే ఆస్పత్రిలో 26 మంది కరోనా రోగులు ఆక్సిజన్ అందక మృతి చెందడంపై దాఖలైన పిటిషన్‌ను గురువారం విచారించింది. ఈ సందర్భంగా తాజా ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరాను అందుబాటులో ఉంచాలని జస్టిస్ నితిన్ సాంబ్రే, జస్టిస్ ఎంఎస్ సోనక్‌ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చదవండి: తెలంగాణ: ఈ-పాస్ కోసం ధరఖాస్తు చేసుకోవడం ఎలా? -
భారతి సిమెంట్ వితరణ
సాక్షి, కడప: ప్రస్తుత కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలిచేందుకు భారతి సిమెంట్ యాజమాన్యం ముందుకొచ్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా భారతి సిమెంట్ యాజమాన్యం వైద్య సేవలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది. వైఎస్సార్ జిల్లాలో కరోనాతో ఇబ్బందులు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో ఆక్సిజన్ సమస్యపై కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్‌లు భారతి సిమెంట్ పరిశ్రమ డైరెక్టర్ జేజే రెడ్డి, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సాయి రమేష్‌లతో చర్చించారు. వెంటనే స్పందించిన యాజమాన్యం సుమారు రూ.60 లక్షల పైచిలుకు విలువజేసే ఆక్సిజన్ ట్యాంక్‌తో పాటు వైద్య పరికరాలను యుద్ధ ప్రాతిపదికన గుజరాత్ నుంచి తెప్పించి అప్పగించారు. గురువారం సాయంత్రం ఆక్సిజన్ ట్యాంక్ కడప రిమ్స్‌కు చేరుకుంది. ట్యాంక్‌తో పాటు వైద్య పరికరాలనూ సిద్ధం చేశారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత వెంటాడుతున్న తరుణంలో ఆక్సిజన్ ట్యాంక్‌తో పాటు వైద్య పరికరాలు అందించడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. -
వాయువేగంతో ప్రాణ వాయువు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు అత్యవసరంగా ఆక్సిజన్ అందించటాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిత్యం ఒక యజ్ఞంలా నిర్వహిస్తోంది. సగటున రోజుకు 22 వేల మందికి పైగా కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ బెడ్లపై వైద్యం అందుతుండగా 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా తరలిస్తూ ఎప్పటికప్పుడు ఆస్పత్రులకు సరఫరా చేయడం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కోవిడ్ మహమ్మారి కారణంగా గాలిని కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావడంతో ఆక్సిజన్‌ను ఒడిశాలోని ప్లాంట్ల నుంచి విమానాలు, ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం తెప్పిస్తోంది. విదేశాల నుంచి నౌకల ద్వారా కూడా దిగుమతి చేసుకుంటోంది. దీంతో నెల రోజుల క్రితం రోజుకు 350 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే సరఫరా చేయగలిగిన రాష్ట్రం ఇప్పుడు సామర్థ్యాన్ని 600 మెట్రిక్ టన్నులకు పెంచుకుంది. ఏ ఒక్క కోవిడ్ బాధితుడూ ఇబ్బంది పడకుండా వందల కిలోమీటర్ల నుంచి ఆక్సిజన్‌ను తీసుకొచ్చి ఆస్పత్రులకు చేరవేస్తోంది. రాష్ట్రంలో ఉన్న ఆక్సిజన్ వనరులన్నీ ఒడిసిపట్టి మెడికల్ ఆక్సిజన్‌గా మార్చి రోగులకు అందిస్తుండటాన్ని వైద్య నిపుణులు అభినందిస్తున్నారు. 54 నుంచి 78 ట్యాంకర్లకు.. రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారంలో ఆక్సిజన్ సరఫరా ట్యాంకర్లు 54 మాత్రమే ఉండగా ఇప్పుడు 78కి చేరుకున్నాయి. ఆక్సిజన్ సరఫరా సామర్థ్యం 350 నుంచి 600 మెట్రిక్ టన్నులకు పెరిగింది. వాయు, జల, రోడ్డు మార్గాలను వినియోగించుకంటూ సకాలంలో ఆస్పత్రులకు ఆక్సిజన్ చేరుస్తున్నారు. వాహనాల రాకలో ఎక్కడ జాప్యం జరిగినా ప్రాణాలతో చెలగాటమే కావడంతో వాహనాల తరలింపులో అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మరోవైపు రూ.40 కోట్లతో మరో 25 ట్యాంకర్లు కొనుగోలు చేయనున్నారు. ఈ నెలాఖరుకు అవి వచ్చే అవకాశం ఉంది. వనరుల కోసం జల్లెడ.. ప్రాణ వాయువు కోసం అడుగడుగునా అన్వేషిస్తున్న అధికారులు మూతపడ్డ సుమారు 20 కంపెనీలను తెరిపించి ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలను గాలించి 17 వేల ఆక్సిజన్ సిలిండర్లు వినియోగిస్తున్నట్టు తేల్చారు. పరిశ్రమల కంటే ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 14 వేల సిలిండర్లను ఆక్సిజన్ సిలిండర్లకు (మెడికల్ ఆక్సిజన్) మార్చారు. ఇలా వనరులను వినియోగించుకుంటూ రోజుకు 70 నుంచి 80 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా వేగంగా చర్యలు చేపట్టారు. ముగ్గురు అధికారులు ఇతర రాష్ట్రాల్లోనే ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇతర రాష్ట్రాల్లోని గ్యాస్ ప్లాంట్లలోనే నియమించారు. కర్నాటకకు అనంతరాములు, ఒడిశాకు ఏకే పరిడా, తమిళనాడుకు కరికాల వలవన్లను నియమించారు. రెండు వారాలుగా ఆ ముగ్గురు అధికారులు గ్యాస్ ప్లాంటులోనే ఉంటూ సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. మరో ఐఏఎస్ అధికారి షాన్మోహన్ రాష్ట్రంలో పర్యవేక్షణ చేస్తున్నారు. రూ.300 కోట్లతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పీఎస్ఏలు ఇప్పటికే ప్రభుత్వం 26 వేల పడకలకు ఆక్సిజన్ పైప్లైన్లు అమర్చింది. ఒక దశలో 8 వేలు కూడా లేని ఆక్సిజన్ పడకలను 26 వేలకు పెంచింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించి రాష్ట్రంలో రూ.300 కోట్లతో 52 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పీఎస్ఏలు నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల నిర్మాణం మొదలైంది. మూడు నెలల్లో వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇవి అందుబాటులోకి వస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ఏ పేషెంటుకూ ఆక్సిజన్ సమస్య ఉండదు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు.. రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు ఇబ్బంది లేకుండా ఐదు లీటర్ల సామర్థ్యమున్న 8 వేల కాన్సన్ట్రేటర్లు, పది లీటర్ల సామర్థ్యమున్న 10 వేల కాన్సన్ట్రేటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో అవసరాన్ని బట్టి వాటిని పంపిణీ చేస్తారు. ఇవి తక్షణావసరం కింద ఉపయోగపడతాయి. రంగంలోకి నేవీ సాంకేతిక బృందం రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో, ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు విశాఖ తూర్పు నౌకా>దళ సాంకేతిక బృందం రంగంలోకి దిగింది. నాలుగు బృందాలు ఈ సమస్యలు పరిష్కరిస్తున్నాయి. తక్కువ సమయంలో పెంచుకున్నాం... ‘కోవిడ్ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో అతి తక్కువ సమయంలో ఆక్సిజన్ సరఫరా సామర్థ్యాన్ని పెంచుకోగలిగాం. నాకు తెలిసి ఇంత తక్కువ సమయంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద స్థాయిలో సరఫరా చేసిన సందర్భాలు లేవు. ప్రభుత్వాసుపత్రుల్లో పీఏఎస్‌లు అందుబాటులోకి వస్తే ఆక్సిజన్ సమస్యే ఉండదు’ –అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఈనెల 13న రాష్ట్రానికి చేరిన ఆక్సిజన్ఏ కంపెనీ? రాష్ట్రానికి వచ్చింది (మెట్రిక్ టన్నుల్లో) లిక్వినాక్స్ గ్యాస్ లిమిటెడ్ 49.6 ఎలెన్ బెర్రీ గ్యాల్ లిమిటెడ్ 39.86 విశాఖ స్టీల్‌ప్లాంట్ 188 జేఎస్‌డబ్ల్యూ గ్యాస్ లిమిటెడ్ 25.4 లిండే..బళ్లారి 36.7 జిందాల్ స్టీల్, అంగుల్, ఒడిశా 40 లిండే, కళింగనగర్, ఒడిశా 93 టాటా బీఎస్ఎల్, అంగుల్, ఒడిశా 61 సెయిల్, రూర్కేలా, ఒడిశా 18 ఐనాక్స్, శ్రీపెరంబదూర్ 11.3 లిండే స్టీల్, గోబిన్ 24.2 ఎంఎస్ఎంఈ ఏఎస్ఎ 12 మొత్తం 599.06 -
‘జగనన్న ప్రాణవాయువు’ రథచక్రాలు ప్రారంభం
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ‘‘జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు’’ వాహనాలను ఎంపీ మార్గాని భరత్ గురువారం ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ పద్ధతికి ఆయన శ్రీకారం చుట్టారు. మొదటిసారిగా రాజమహేంద్రవరంలో కోవిడ్ బాధితులకు బస్సులో వైద్యమందించే విధానం విజయవంతమైతే ఎంపీ భరత్‌రామ్ దీన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 36 సీట్లు సామర్థ్యం గల ఈ బస్సులో ఆరు పడకలను ఏర్పాటు చేశారు. రెండు బస్సులను సిద్ధం చేయగా వాటిలో మొత్తం 12 బెడ్లు అందుబాటులో ఉంటాయి. వీటికి ఆక్సిజన్ సదుపాయం ఏర్పాటు చేసి మినీ ఐసీయూలా తయారుచేశారు. ఆసుపత్రిలో బెడ్ లేక ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడేవారికి బెడ్ దొరికేవరకు ఈ బస్సులో ఉంచి ఆక్సిజన్ అందించనున్నారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ గ్యారేజ్‌లోంచి రెండు వెన్నెల బస్‌లను ఈ సేవలకు వినియోగిస్తున్నారు. చాలామంది ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు రూపకల్పన చేసినట్టు ఎంపీ భరత్‌రామ్ తెలిపారు. సేవా కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కొత్తపేట: రావులపాలెంలో కోవిడ్ బాధితుల కోసం భారీ ఎత్తున సేవా కార్యక్రమాలను కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గురువారం ప్రారంభించారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో కోవిడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు, ప్రభుత్వ కళాశాల మైదానంలో కోవిడ్ నిర్థారణ పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. కరోనా బాధితులకు ఉచితంగా మందులు కిట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే తన సొంత ఖర్చుతో అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేశారు. అలాగే నియోజకవర్గం అంతా సోడియం హైప్రోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయడానికి ఆరు మోబైల్ వాహనాలను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఏర్పాటు చేశారు. చదవండి: రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్ ఏపీ: పంటల బీమా కోసం రూ.2,586.60 కోట్లు విడుదల -
ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. నెల క్రితం రోజుకు 350 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా ఉండగా ఇప్పుడు 590 మెట్రిక్ టన్నులకు చేరుకుందని తెలిపారు. గతంలో 54 ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే ఆక్సిజన్‌ను ఇప్పుడు 78కి పెంచగలిగామన్నారు. ఆక్సిజన్ సామర్థ్యం పెంచుకునేందుకు ఇంకా ఎలాంటి వనరులున్నా వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. అవసరం మేరకు వినియోగిద్దాం.. తాజాగా కేంద్రం 3 ఆక్సిజన్ ట్యాంకర్లు ఇచ్చిందని, ఒకటి ఇప్పటికే రాష్ట్రానికి చేరుకోగా మరో రెండు కోల్‌కతా నుంచి వస్తున్నాయని సింఘాల్ తెలిపారు. అక్కడి నుంచే ఒక్కో ట్యాంకర్లో 20 టన్నుల చొప్పున 40 టన్నుల ఆక్సిజన్‌తో రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నెలాఖరుకు 25 కొత్త ట్యాంకర్లు అందుబాటులోకి వస్తాయని, సరఫరాలో జాప్యం కాకుండా ప్లాంట్ల నుంచి నేరుగా ఆస్పత్రులకు కాకుండా ఒక సెంటర్లో ఆక్సిజన్ నింపి అక్కడ నుంచి చిన్న వాహనాల ద్వారా ఆస్పత్రులకు చేరవేస్తామన్నారు. ‘రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సిలిండర్లు 17 వేలు ఉన్నట్లు గుర్తించాం. వీటిలో 14,338 సిలిండర్లను మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లుగా మార్చాలని నిర్ణయించాం, ఇప్పటికే 6,917 సిలిండర్లను మార్చాం. మిగిలినవి కూడా త్వరగా పూర్తయితే ఆక్సిజన్ కొరత ఉండదు. తాజాగా నెల్లూరు జిల్లాలో అధికారులు ఒక్క రోజులో 30 శాతం ఆక్సిజన్ పొదుపు చేయగలిగారు. అవసరం మేరకు వినియోగిస్తే అన్ని ఆస్పత్రుల్లో ఎక్కువ మందికి ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలను కూడా తెరిచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటాం’ అని సింఘాల్ తెలిపారు. 104కి ఒకే రోజు 17 వేల కాల్స్.. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో 140 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంటు అక్టోబర్‌లో అందుబాటులోకి రానుందని సింఘాల్ చెప్పారు. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, కిట్లు, ఇతరత్రా విరాళాలు అందించేందుకు ఏర్పాటైన ప్రత్యేక విభాగానికి అర్జా శ్రీకాంత్ నోడల్ అధికారిగా ఉంటారని తెలిపారు. ఇప్పటికే ఐదు లీటర్ల సామర్థ్యం కలిగిన కాన్సన్ట్రేటర్లు 8 వేలు, పది లీటర్ల కెపాసిటీ కలిగిన 10 వేల కాన్సన్ట్రేటర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. 104 కాల్‌సెంటర్‌కు బుధవారం ఒక్కరోజే 17 వేల కాల్స్ వచ్చాయని, హోం ఐసోలేషన్‌లో ఉన్న 9 వేల మందికి పైగా బాధితులను వైద్యులు ఫోన్లో పరామర్శించి తగిన సూచనలు అందించినట్లు వివరించారు. -
ఒడిశా నుంచి ఏపీకి ఆక్సిజన్ రైళ్లు నడపాలి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఆక్సిజన్ రవాణాకు తగినన్ని ట్యాంకర్లు అందుబాటులో లేనందున ఒడిశా నుంచి ప్రత్యేక ఆక్సిజన్ రైళ్లను నడపాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి రైల్వేబోర్డు చైర్మన్ సునీత్‌శర్మకు మంగళవారం లేఖ రాశారు. ఒడిశా నుంచి ఆక్సిజన్ రవాణాలో ఎదురవుతున్న ఆటంకాలు, ఇబ్బందులను లేఖలో వివరించారు. సకాలంలో ప్రాణవాయువు రవాణా చేయడం ద్వారా వేలాదిమంది కరోనా రోగుల ప్రాణాలను కాపాడటంలో భారతీయ రైల్వేలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఆక్సిజన్ రైళ్లు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. సెకండ్‌వేవ్ రాష్ట్రంలో కూడా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ అవసరం అపరిమితంగా పెరిగిపోయిందని, కరోనా రోగుల ప్రాణాలను కాపాడటంలో ప్రాణవాయువు అవసరం కీలకంగా మారిందని తెలిపారు. ఒడిశా నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ రవాణా కోసం 10 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను కేటాయించాలని ఎంపవర్డ్ గ్రూప్ చైర్పర్సన్ సునితాదావ్రాను కోరగా 2 కేటాయించారని తెలిపారు. ట్యాంకర్లు అందుబాటులో లేనందున ఒడిశా నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ నిల్వలను రవాణా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ రైళ్లను నడిపేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే లేదా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు వెంటనే ఆదేశాలు జారీచేయాలని కోరారు. -
ఆక్సిజన్ సరఫరాపై నిత్యం పర్యవేక్షణ
సాక్షి, అమరావతి: వివిధ రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ను తీసుకురావడం, దాన్ని ఆస్పత్రులకు సరఫరా చేయడంపై ప్రతిక్షణం పర్యవేక్షణ చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో ఉన్న ప్లాంట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ నిర్వహణకు సీనియర్ ఐఏఎస్ అధికారులు కలికాల వలవన్, అనంతరాములు, ఏకే పరిడాను నియమించామని తెలిపారు. నేటి నుంచి రెండు వారాల పాటు ఈ అధికారులు ఆయా ప్లాంట్లలోనే ఉండి పర్యవేక్షిస్తారన్నారు. మంగళవారం ఆయన ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయిస్తే మొత్తం కేటాయింపులను రాష్ట్రానికి తెచ్చామన్నారు. ట్యాంకర్ జాప్యం కారణంగా తిరుపతిలో ఘటన జరిగిందని, దీనిపై పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉందని తెలిపారు. మృతి చెందిన వారికి సీఎం జగన్ రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారన్నారు. ప్రతిరోజూ ఆక్సిజన్ వినియోగం పెరుగుతోందని, దీనికి తగ్గట్టు కేటాయింపులు జరపాలని కేంద్రాన్ని కోరుతున్నామని, సీఎం కూడా ప్రధానికి లేఖ రాశారని వివరించారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రస్తుతం మైలాన్ కంపెనీ నుంచి కొంటున్నామని, అవి కాకుండా మరో 50 వేల ఇంజక్షన్లు వేరే కంపెనీ నుంచి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 22,395 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 104 కాల్ సెంటర్‌కు ఒక్కరోజులో 16వేలకు పైగా కాల్స్ వచ్చాయని చెప్పారు. హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్న 9,796 మందికి ఫోన్ చేసి డాక్టర్లు సలహాలు ఇచ్చారని తెలిపారు. ఈ సంఖ్యను రోజుకు 15 వేలకు పెంచాలనే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ సెంటర్లకు 100 చొప్పున స్లిప్పులు ఇస్తున్నామని, దీనిపై కలెక్టర్లు నిత్యం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. -
910 టన్నుల ఆక్సిజన్ కేటాయించండి
సాక్షి, అమరావతి: అవసరమైన మేరకు ఆక్సిజన్‌ను కేటాయించి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఆక్సిజన్ అవసరమైన రోగులకు సమర్థవంతంగా చికిత్స అందించేందుకు సరిపడేలా 910 టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించాలని కోరారు. ఇదే సమయంలో దేశీయ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం దేశీయ అవసరాలకు సరిపోవడం లేదని.. విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కోవాగ్జిన్ టెక్నాలజీని వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న సంస్థలకు బదిలీ చేయడానికి చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇది భారత ప్రభుత్వ ప్రాపర్టీ కనుక పేటెంట్ సమస్య ఉత్పన్నం కాదని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రధానికి వేర్వేరుగా 2 లేఖలు రాశారు. వాటి వివరాలు ఇలా.. ఆక్సిజన్ కేటాయింపులు సరిపోవడం లేదు ► ఆంధ్రప్రదేశ్‌కు ఈ నెల 8న కేటాయించిన 590 టన్నుల ఆక్సిజన్ సరిపోవడం లేదు. ఇందులో ఒడిశా నుంచి కేటాయించిన 210 టన్నుల ఆక్సిజన్‌ను రాయలసీమ ప్రాంతానికి తరలించాలంటే 1,400 కిలోమీటర్లు ప్రయాణించాలి. అంతదూరం నుంచి ఎల్ఎంవో (లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్) ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్‌ను తరలించడంలో జాప్యం చోటు చేసుకుంటోంది. ► దాంతో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆస్పత్రులకు తమిళనాడు, కర్ణాటకల నుంచి ఆక్సిజన్‌ను సరఫరా చేసేలా కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాం. చెన్నైలోని సెయింట్ గోబెయిన్ (తమిళనాడు) నుంచి 35 టన్నులు, శ్రీపెరంబదూరులోని ఐనాక్స్ నుంచి 25 టన్నులను రాష్ట్ర ప్రభుత్వం సేకరించకపోతే ఆస్పత్రుల్లో పరిస్థితి విషమంగా ఉండేది. ► అయితే ఈ నెల 10న చెన్నై, కర్ణాటకల నుంచి ఆక్సిజన్ సరఫరాలో జాప్యం కావడం వల్ల తిరుపతిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 11 మంది రోగులు దురదృష్టవశాత్తు మరణించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయింపులను 910 టన్నులకు పెంచడంతోపాటు 20 ఎల్ఎంవో ట్యాంకర్లను కేటాయించాలి. కేసులు పెరిగినందున అదనపు ఆక్సిజన్ అవసరం ► కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాం. రాష్ట్రంలో ఏప్రిల్ 24 నాటికి 81,471 కరోనా యాక్టివ్ కేసులు ఉండేవి. ఆ రోజున రాష్ట్రానికి కేంద్రం 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించింది. ► ఈ నెల 8 నాటికి ఆక్సిజన్ కేటాయింపులను 590 టన్నులకు పెంచింది. అయితే మంగళవారం నాటికి రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 1,87,392కు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేటాయించిన ఆక్సిజన్‌ను కొనసాగిస్తూనే.. కేటాయింపులను పెంచాలి. ► కర్ణాటకలోని బళ్లారిలో జేఎస్‌డబ్ల్యూ నుంచి ప్రస్తుతం 20 టన్నుల ఆక్సిజన్‌ను రాష్ట్రానికి కేటాయించారు. ఇటీవల జేఎస్‌డబ్ల్యూ పరిశ్రమ సామర్థ్యం పెంచిన నేపథ్యంలో అక్కడి నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయింపులను 150 టన్నులకు పెంచాలి. ► ఒడిశా నుంచి ప్రస్తుతం సరఫరా చేస్తున్న 210 టన్నుల ఆక్సిజన్‌ను 400 టన్నులకు పెంచాలి. ఈ ఆక్సిజన్‌ను ఇండియన్ రైల్వేస్ నేతృత్వంలో నడిపే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా తరలించడానికి 20 ఎల్ఎంవో ట్యాంకర్లను కేటాయించాలి. కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోండి ► కోవిడ్–19 మహమ్మారిపై సర్వశక్తులు ఒడ్డి రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తున్న విషయం మీకు తెలుసు. రాష్ట్రంలో గత ఏడు రోజులుగా రోజుకు సగటున 20,300 కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటూనే కోవిడ్–19 బారిన పడిన రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ► కర్ఫ్యూ విధించడం, ఇతర ఆంక్షల ద్వారా కరోనాను తాత్కాలికంగానే కట్టడి చేయగలం. కరోనాను పూర్తిగా కట్టడి చేయాలంటే జాతీయ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ వేయడం ఒక్కటే మార్గం. ► రాష్ట్రంలో పరిపాలన యంత్రాంగం ద్వారా ఒకే రోజు ఆరు లక్షల మందికి వ్యాక్సిన్ వేసిన సామర్థ్య ఏపీ ప్రభుత్వానికి ఉంది. కానీ వ్యాక్సిన్ కొరత వల్ల అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ వేయలేకపోతున్నాం. ► మీ నాయకత్వంలో ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్), ఎన్ఐవీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ), భారత బయోటెక్ సంయుక్తంగా దేశీయంగా కోవిడ్–19 నివారణకు కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. కనుక ఇది భారత ప్రభుత్వ ప్రాపర్టీ. ► ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను బీఎస్ఎల్ (బయో సేఫ్టీ లెవల్)–3 అత్యున్నత ప్రమాణాలతో భారత్ బయోటెక్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. కోవాగ్జిన్‌కు 2021 జనవరిలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీసీఎస్‌వో) నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చింది. ► ప్రస్తుతం కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం దేశీయ అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఉత్పత్తి సామర్థ్యం ఇదే రీతిలో ఉంటే.. అర్హులందరికీ వ్యాక్సిన్ వేయడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. కోవాగ్జిన్ ఉత్పత్తిని పెంచాలని గతంలో మీరు కూడా చెప్పారు. ► కోవిడ్–19ను కట్టడి చేయాలంటే అర్హులందరికీ వ్యాక్సిన్ వేయడం ఒక్కటే మార్గం. అందరికీ వేగంగా వ్యాక్సిన్ వేయాలంటే వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలి. దేశ విశాల ప్రజాప్రయోజనాల దృష్ట్యా భారత్ బయోటెక్ సంస్థ, ఐసీఎంఆర్–ఎన్ఐవీల కోవాగ్జిన్ టెక్నాలజీని.. వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న సంస్థలకు బదిలీ చేయించాలి. ఈ విపత్కాలంలో కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. ► ఈ అంశంలో మీరు జోక్యం చేసుకుని కోవాగ్జిన్ టెక్నాలజీని బదిలీ చేయించడం ద్వారా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి.. అందరికీ వేగంగా వ్యాక్సిన్ వేసి.. కరోనాను కట్టడి చేయవచ్చు. -
ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి.. సాయం చేస్తా: రేణు దేశాయ్
కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి రోజురోజుకూ ఉధృతం అవుతోంది. హాస్పిటల్లో బెడ్స్ దొరక్క పోవడం, ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారికి నా వంతు సాయం చేస్తానంటున్నారు నటి, దర్శకురాలు రేణూ దేశాయ్. ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులతో మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియాను సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకునే వాళ్లు కూడా గత పదిహేను రోజులుగా కోవిడ్ సమాచారాన్ని చేరవేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతుండటం సంతోషం. నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఇన్ బాక్స్ ఇప్పటి నుంచి ఓపెన్‌లో పెడతా. ప్లాస్మా లేదా ఆక్సిజన్ సిలిండర్లు లేదా హాస్పిటల్స్‌లో బెడ్స్ లేదా మందులు.. వంటివి అవసరం ఉంటే నాకు మెసేజ్ చేస్తే, వారికి సహాయం చేయడానికి నా వంతు కృషి చేస్తాను. నిజంగా అవసరం ఉన్నవారే మెసేజ్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలి. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక సహాయం మాత్రం చేయలేను’’ అన్నారు. చదవండి: (అబ్బురపరిచే అమ్మాయి... అవ్నీత్ కౌర్!) View this post on Instagram A post shared by renu (@renuudesai) -
గోవా ఆసుపత్రిలో లీకైన ఆక్సిజన్ ట్యాంక్
పనాజీ: నాసిక్‌లో ఆక్సిజన్ లీకేజీ దుర్ఘటనను మరిచిపోకముందే నేడు తాజాగా మార్గో సిటీలోని సౌత్ గోవా జిల్లా ఆసుపత్రిలో(ఎస్జీడిహెచ్) మంగళవారం మధ్యాహ్నం ప్రధాన నిల్వ ట్యాంకులోకి ట్యాంకర్ నుంచి గ్యాస్ నింపేటప్పుడు ఆక్సిజన్ లీకేజీ అయింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసు అధికారులు తెలిపారు. కోవిడ్-19 రోగులకు చికిత్స అందిస్తున్న అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రులలో ఇది ఒకటి. సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా అధికారులు లీకేజీని అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అగ్నిప్రమాదం జరిగితే మంటలను ఆర్పడం కోసం అక్కడ ఫైరింజన్లను కూడా సిద్ధంగా ఉంచారు. సాధ్యమైనంత త్వరగా లీకేజీని కంట్రోల్ చేయకపోతే ఆస్పత్రిలో వెంటి లేటర్‌పై ఉన్న రోగులకు ప్రాణాపాయం తప్పదని వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. #WATCH Oxygen tank leakage at South Goa District Hospital; fire tenders rushed to the spot. Details awaited#Goa pic.twitter.com/QmDN6JlZ0J — ANI (@ANI) May 11, 2021 చదవండి: ఘోరం: 4 గంటల్లో 26 మంది కరోనా రోగులు మృతి -
కోవిడ్-19 రోగులకు ఆక్సీమీటర్లు ఎందుకు అవసరం?
దేశంలో రోజు రోజుకి కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాపిస్తుంది. ఈ కరోనా వైరస్ నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుండటంతో చాలా మంది కోవిడ్ రోగులు ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. మరి కొంత మంది ఏకంగా మరణిస్తున్నారు. ఇలాంటి సమయంలో కరోనా సోకిన వారి శరీరంలో ఆక్సిజన్ ఎంత స్థాయిలో ఉంది అనేది తెలుసుకోవాలి. అప్పుడే వైద్యులు వారికి సకాలంలో ఆక్సిజన్ అందించడం ద్వారా వారిని కాపాడవచ్చు. ఆసుపత్రులలో అయితే ఆక్సిజన్ స్థాయి తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా పరికరాలు ఉంటాయి. అయితే, హోమ్ ఐసోలెషన్‌లో ఉన్న కరోనా భాదితులు తప్పనిసరిగా పల్స్ ఆక్సీమీటర్ పరికరాన్ని తీసుకోవాలి. దీని ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవచ్చు. అయితే వీటి వాడకంపై నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఒక్కోసారి రీడింగ్ ను తప్పు చూపిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే వీటి పనితీరు గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం అందరికి ఉంది. పల్స్ ఆక్సీమీటర్ అనేది చేతిలో ఒదిగిపోయే ఒక చిన్న పరికరం. చూడటానికి క్లిప్‌లా కనిపించే ఈ పరికరాన్ని ఎక్కువ శాతం కుడి చేతి మధ్య వేలికి లేదా చూపుడు వేలికి అమరుస్తారు. దీన్ని కొన్ని సార్లు మిగతా వెళ్లకు, కాలి వేళ్లు, చెవికి తక్కువ సందర్బాలలో అమరుస్తుంటారు. దీని వల్ల గుండె నుంచి శరీరంలోని మిగతా భాగాలకు ఆక్సిజన్ ఎలా సరఫరా చేస్తుంది అనేది ఆక్సీమీటర్‌తో తెలుసుకోవచ్చు. కేవలం కరోనా కోసం మాత్రమే కాకుండా ఆస్థమా, న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్, రక్త హీనత, గుండె జబ్బుల చికిత్సలో దీని అవసరం ఎక్కువ ఉంటుంది. దీనిని వేలికి పెట్టుకున్న కొన్ని సెకన్ల తర్వాత వారి శరీరంలో ఆక్సిజన్ స్థాయిని ఇది నమోదు చేస్తుంది. ఇది Spo2 యూనిట్లలో ఆక్సిజన్ స్థాయిని కొలుస్తుంది. ఆరోగ్యవంతుల ఆక్సిజన్ స్థాయి 95 శాతం, అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఆక్సీమీటర్ చేతికి పెట్టుకున్నాక 3 నిమిషాల పాటు 95 శాతం కంటే ఎక్కువ ఒకే రీడింగ్ చూపిస్తే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలి. ఆ పరికరంలో బ్యాటరీ తక్కువ ఉన్న సమయాలలో రీడింగ్ తప్పుగా చూపించే అవకాశం ఉంది. అలాగే, ఈ పరికరం గుండె కొట్టుకునే రీడింగ్‌ని కూడా మనకు చూపిస్తుంది. ఆరోగ్యవంతులకు నిమిషానికి 60 నుంచి 100 సార్లు హార్డ్ బీటింగ్ ఉంటుంది. పల్స్ ఆక్సీమీటర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండటం మంచిది. గతేడాది కరోనా సోకి, హోమ్ ఐసోలెషన్‌లో ఉన్న రోగులకు ఢిల్లీ ప్రభుత్వం ఆక్సీమీటర్‌ను ఉచితంగా అందించింది. చదవండి: కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చా? -
‘రుయా’లో విషాదం.. సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తిరుపతి/తిరుపతి తుడా/గుంటూరు రూరల్/అమరావతి: తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఆక్సిజన్ సరఫరాలో ప్రెజర్ తగ్గి 5 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడటంతో 11 మంది కరోనా బాధితులు ఊపిరాడక మృతి చెందారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. రంగంలోకి దిగిన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పాటు ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించి వందలాది మంది ప్రాణాలను నిలబెట్టగలిగారు. ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. కోవిడ్ బాధితుల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా రావడంతో.. చెన్నై నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ 20 నిమిషాలు ఆలస్యం కావడంతో సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు. వచ్చిన ట్యాంకర్‌ను అమర్చే సమయంలో ఐదు నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వెంటిలేటర్‌పై ఉన్న కరోనా బాధితులు ఆ ఐదు నిమిషాలు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న రుయా ఆస్పత్రి అధికారులు, ఎంపీ గురుమూర్తి, కలెక్టర్ హరినారాయణన్, కమిషనర్ గిరీష, ఎస్పీ వెంకట అప్పలనాయుడు, మేయర్ శిరీష, జేసీ వీరబ్రహ్మం, ఆర్డీవో కనక నరసారెడ్డి, ఇతర అధికారులు హుటాహుటిన చేరుకుని పరిస్థితిని సమీక్షించి అదుపులోకి తెచ్చారు. రుయా ఆస్పత్రిలో ప్రభుత్వం 135 ఐసీయూ బెడ్లు, 573 ఆక్సిజన్, 319 సాధారణ బెడ్లను ఏర్పాడు చేసి కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తోంది. ప్రైవేటు దోపిడీ సమయంలో ప్రభుత్వ వైద్యులు ప్రాణాలకు తెగించి వేలాది మందికి ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం రుయాలో 1,027 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. బాధాకరమైన ఘటన.. ఆందోళన చెందొద్దు రుయా ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటన చాలా బాధాకరం. వెంటనే అధికారులు స్పందించటంతో పెను ప్రమాదం తప్పింది. వందలాది మంది ప్రాణాలను నిలబెట్టేందుకు 30 మంది వైద్యులు చర్యలు చేపట్టారు. ఐదు నిమిషాలు మాత్రమే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఐసీయూలో ఉన్న 11 మంది కరోనా బాధితులు మృతి చెందారు. చెన్నై నుంచి ఆక్సిజన్ రావడంలో ఆలస్యమే ఈ పరిస్థితికి కారణం. ఆక్సిజన్ ప్లాంట్లలో ప్రెజర్ తగ్గడం వల్ల ఐసీయూలోకి సరఫరా ఆందలేదు. ఘటనపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడి పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి సీఎంకు నివేదిక ఇస్తాం. ఈ ఘటనకు కారకులు ఎవరైనా ఉన్నట్టు తేలితే చర్యలు తప్పవు. – హరినారాయణన్, కలెక్టర్ ఎలాంటి సాంకేతిక సమస్య లేదు ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి సాంకేతిక సమస్య లేదు. కేవలం ట్యాంకర్ రావడం ఆలస్యమైంది. ఆ సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ గురుమూర్తి, ఎంపీ, తిరుపతి చదవండి: సెకండ్ వేవ్ గుణపాఠం: ముందే మేల్కొన్న ముఖ్యమంత్రి.. చదవండి: రేపు కేబినెట్ భేటీ: లాక్‌డౌన్‌పై తేల్చనున్న సీఎం కేసీఆర్ -
కరోనా పేషెంట్స్ కోసం గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మరి కారణంగా భాదపడుతున్న భాదితుల కోసం టెక్ దిగ్గజం గూగుల్ తన మ్యాప్స్ అప్లికేషన్లో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. దేశంలో భారీగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాలలో పడకలు, మెడికల్ ఆక్సిజన్ లభ్యతకు సంబందించిన స్థానిక సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ ఫీచర్ పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ను అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలకు మద్దతు ఇవ్వడానికి టెక్ దిగ్గజం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. "ప్రజలు కీలకమైన సమాచారమైన ఆసుపత్రిలలో పడకలు, వైద్య ఆక్సిజన్‌కు లభ్యత వెతుకుతున్న విషయం మాకు తెలుసు. ఆ విషయంలో సమాధానాలను తేలికగా కనుగొనడంలో వారికి సహాయపడటానికి, మ్యాప్‌లలోని Q & A అనే ఫంక్షన్‌ను ఉపయోగించి కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నాము. స్థానిక ప్రదేశాలలోని పడకలు, మెడికల్ ఆక్సిజన్ లభ్యతపై సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది" అని గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది. చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15 వేలకే ఆపిల్ ఐఫోన్ -
ఎంతో కీలకమైన ఆక్సిజన్ గురించి ఇవి తెలుసుకోండి
కోవిడ్–19 పేషెంట్స్‌లో ఆక్సిజన్ ఎవరికి అవసరం అవుతుంది? ఎంత పరిమాణంలో ఇవ్వాలి? ఏ రకమైన పరికరాల్లో ఉపయోగించుకోవాలి? అనే అంశాలు ముఖ్యం. వీటి గురించి సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ ఏం చెప్పారంటే... కరోనా బాధితుల్లో ఆక్సిజన్ ఎవరికి అవసరం అవుతుందో తెలుసుకోవాలంటే ముందుగా రక్తంలో ఉన్న ఆక్సిజన్ శాతాన్ని తెలుసుకోవాలి. దీన్ని పల్స్ఆక్సీమీటర్ సహాయంతో తెలుసుకుంటాం. నార్మల్ గా 95 నుంచి 100 శాతం వరకు ఆక్సిజన్ శాచ్యురేషన్ ఉంటుంది. అయితే కోవిడ్ బాధితుల్లో ఆక్సిజన్ క్రమంగా తగ్గుతుంది. చాలా మందిలో ఇది అస్సలు తగ్గకుండానే జబ్బు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే కొంతమందిలో మాత్రం ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. 94 శాతం కన్నా ఆక్సిజన్ శాచ్యురేషన్ తక్కువుంటే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉందని అర్థం. అదే విధంగా ఆక్సిజన్ 90 కన్నా తగ్గుతున్నప్పుడు ఐసీయూలో చికిత్స అవసరమని అర్థం. అయితే ఇంట్లో ఆక్సిజన్ ఎవరికి అవసరం అవుతుంది. ఈ ఆక్సిజన్ ని ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఇంట్లో ఆక్సిజన్ ఎవరికి అవసరం? ఆక్సిజన్ శాచ్యురేషన్ 94 కన్నా తక్కువున్నప్పుడు హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆస్పత్రుల్లో బెడ్ దొరకటం కష్టంగా మా రింది. ఈ సమయంలో ఆస్పత్రిలో అడ్మిషన్ దొరికేలోగా మనం కొంతమేరకు ఆక్సిజన్ ఇవ్వగలిగితే పేషెంట్‌కు ఆక్సిజన్ శాచ్యురేషన్ మరింత తగ్గిపో కుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. మరికొంతమంది ఆస్పత్రిలో అడ్మిట్ అయి కోలుకున్న తర్వాత మరి కొంతకాలం వరకు ఇంట్లో ఆక్సిజన్ అవసరం పడే వాళ్లు కూడా ఉంటారు. వాళ్లకి కూడా ఇంట్లో ఆక్సిజన్ అమర్చుకోవడం తప్పనిసరి. ఇంట్లో ఏ విధంగా అమర్చుకోవాలి? ఇంట్లో ఆక్సిజన్ అమర్చుకోవడానికి ప్రధానంగా రెండు పద్ధతులు. ఒకటి ఆక్సిజన్ సిలిండర్ అమర్చుకోవడం.. మరొకటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని పెట్టుకోవడం. సిలిండర్‌తో లాభనష్టాలేంటి? ఆక్సిజన్ సిలిండర్లు మరీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావు. వీటి నుంచి నాణ్యమైన ఆక్సిజన్ వస్తుంది. కరెంటు లేనప్పుడు కూడా ఈ సిలిండర్ పనిచేస్తుంది. అయితే సిలిండర్‌లో ఆక్సిజన్ అయిపోయినప్పుడు మళ్లీ నింపుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆక్సిజన్ దొరకకపోతే ఇబ్బంది. కాన్సన్‌ట్రేటర్‌తో లాభనష్టాలేంటి? ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు 24 గంటలు పని చేస్తాయి. దీని ద్వారా ఆక్సిజన్ అయిపోవడం అనే సమస్య ఉండదు. ఒకసారి కొనుక్కున్న లేదా అద్దెకు తీసుకున్న తర్వాత ఆక్సిజన్ సరఫరా నిరంతరాయంగా ఉండే అవకాశం ఉంటుంది. ► వీటితో కొన్ని సమస్యలు ఉంటాయి. వీటి ఖరీదు చాలా ఎక్కువ. కరెంటు పోయినప్పుడు ఈ కాన్సన్ట్రేటర్లు పని చేయవు. అప్పుడు బ్యాకప్ జనరేటర్ వీటికి అవసరమవుతుంది. ► ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌లో నుంచి వచ్చే ఆక్సిజన్ క్వాలిటీ వివిధ రకాలుగా ఉంటుంది. మెడికల్‌గా కావాల్సిన ఆక్సిజన్ నాణ్యత 90 శాతం ఉంటుంది. 90 శాతం కన్నా తక్కువైతే పేషెంట్ ఆక్సిజన్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. కాన్సన్ట్రేటర్ ఎలా పనిచేస్తుంది? ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఒత్తిడితో కూడిన గాలిని ఫిల్టర్‌లో ప్రవేశపెడుతుంది. ఈ ఫిల్టర్‌కు గాలిలో ఉన్న నైట్రోజన్ని పీల్చేసే సామర్థ్యం ఉంటుంది. నైట్రోజన్‌ను పీల్చేసిన తర్వాత ఆక్సిజన్ శాతం ఎక్కువ అవుతుంది. ఈ విధంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పని చేస్తుంది. కాన్సన్ట్రేటర్లు ఎన్ని రకాలు? ఇవ్వగలిగిన ఆక్సిజన్ని బట్టి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని ఐదు లీటర్లు ఆక్సిజన్ ఇవ్వగలిగితే, కొన్ని 10 లీటర్లు ఇవ్వగలుగుతాయి. అయితే కొన్నిరకాల కాన్సన్ట్రేటర్లలో తక్కువ పరిమాణం ఆక్సిజన్ వచ్చేటప్పుడు మాత్రం 90 శాతానికి పైగా ఆక్సిజన్ వస్తుంది కానీ ఎక్కువ పరిమాణం అవసరమైనప్పుడు మాత్రం ఆక్సిజన్ శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కొన్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో 30 నుంచి 90 వరకు ఆక్సిజన్ శాతం వస్తుంది అని ఉంటుంది. అంటే.. సుమారుగా ఒకటి లేదా రెండు లీటర్లు అవసరమైనప్పుడు ఈ కాన్సన్ట్రేటర్లు 90 శాతం ఆక్సిజన్ ఇస్తాయి. అయితే సుమారుగా 5 లీటర్ల పైన ఆక్సిజన్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇవి కేవలం 30 శాతం ఆక్సిజన్ మాత్రమే ఇస్తాయి. ఎక్కువ పరిమాణం అవసరమైనప్పుడు కూడా 90 శాతం పైన ఆక్సిజన్ ఇవ్వగలిగిన కాన్సన్ట్రేటర్లను ఎంచుకోవడం ముఖ్యం. ఈ రకం కాన్సన్ట్రేటర్లు ఎక్కువ బరువు ఉంటాయి. ఇంట్లో అమర్చుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆక్సిజన్ కూడా ఒక మందు లాంటిదే. మందు ఎక్కువైనప్పుడు లేదా తక్కువైనప్పుడు ఎలాంటి దుష్ఫలితాలువస్తాయో,ఆక్సిజన్ ఎక్కువైనా లేదా తక్కువైనా కూడా దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిస్థాయి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇంట్లో ఆక్సిజన్ అమర్చుకోవాలి. ► ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ గోడకి ఒకటి లేదా రెండు అడుగుల దూరంలో ఉంచాలి. ► దీన్ని ఉపయోగించేటప్పుడు గది తలుపులు తెరిచి ఉంచితే మంచిది. ఎందుకంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ని అది శుద్ధి చేసినప్పుడు గాలిలో నైట్రోజన్ శాతం పెరుగుతూ ఉంటుంది. అందుకని తలుపులు తీసి ఉంచినట్లయితే నైట్రోజన్ శాతం పెరగకుండా ఉంటుంది. ► ఆక్సిజన్ శాచ్యురేషన్ని క్రమం తప్పకుండా చూసుకోవాలి. ఇది తగ్గుతూ ఉంటే కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలి. ► ఆక్సిజన్ సిలిండర్స్‌ని వాడుతున్నప్పుడు అవి పేలి పోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మంటలు అంటుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నిప్పుకి వాటిని దూరంగా ఉంచాలి. ► బాగా తీవ్రంగా జబ్బు ఉన్న వాళ్ళకి ఇంటిదగ్గర ఆక్సిజన్ ఇవ్వటం మంచిది కాదు. అలాంటి వాళ్లు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యేలోపు మాత్రమే వాడితే మంచిది. ► రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతున్నపుడు కేవలం ఆక్సిజన్ ఇవ్వడం మాత్రమే కాకుండా డాక్టర్లు ఇంకా కొన్ని రకాలైన వైద్య చికిత్సలు చేస్తారు. కొన్ని రకాల ఇంజక్షన్స్ ఇవ్వడం, కొన్ని రక్తపరీక్షలు చేయడం, కొన్నిసార్లు ఎన్ఐవీ ఉపయోగించటం లాంటివి చేస్తారు. కాబట్టి ఆక్సిజన్ అవసరం పడుతున్నప్పుడు వైద్యులను సంప్రదించటం తప్పనిసరి. ► దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ తక్కువ మోతాదులో అవసరం పడొచ్చు. వాళ్లకి మరీ ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చినా కూడా ప్రమాదం. అందువల్ల పల్మనాలజిస్ట్ సలహాతో ఎంత ఆక్సిజన్ పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. -
రూ.310 కోట్లతో ఆక్సిజన్ వ్యవస్థ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ సరఫరా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఆక్సిజన్ వ్యవస్థ మౌలిక వసతుల కోసం రూ.309.87 కోట్లు కేటాయిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.180.19 కోట్లతో 49 చోట్ల ఆక్సిజన్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ 49 చోట్ల సివిల్, ఎలక్ట్రికల్ పనుల కోసం రూ.25.80 కోట్లు కేటాయించారు. ఆక్సిజన్ సరఫరా కోసం రూ.46.08 కోట్లతో 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేయనున్నారు. అదనంగా 10,000 ఆక్సిజన్ పైప్లైన్ల నిర్మాణం కోసం రూ.50 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను ప్రత్యేకంగా ఒక కాంట్రాక్టరుకు అప్పగిస్తారు. ఈ సంస్థ ఆరు నెలల పాటు ఈ యూనిట్ నిర్వహణ, మరమ్మతులను చూడాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి జిల్లాకు నెలకు రూ.10 లక్షల చొప్పున ఆరు నెలలకు రూ.60 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ఈ విధంగా మొత్తం ఆరు నెలలకుగాను ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు రూ.7.80 కోట్లు వ్యయం అవుతుంది. ఆక్సిజన్ యూనిట్లు ఏర్పాటు చేసే బాధ్యతను ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అప్పగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. పర్యవేక్షణ ఇన్చార్జ్గా స్పెషల్ సీఎస్ కరికాల ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ ఇన్చార్జ్గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ దిగుమతిని ఆయన పర్యవేక్షిస్తారు. లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాపై దృష్టి సారించనున్నారు. -
ఆక్సిజన్ కొరత.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గుడ్‌న్యూస్
సాక్షి, హైదరబాద్: కరోనా సెకండ్ వేవ్ దేశంలో అల్లకల్లోలం సృస్టిస్తోంది. లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరత కారణంగానే ఎక్కువమంది మృత్యువాతపడుతున్నారు. అయితే కరోనా సోకిన వీరిలో చాలా వరకు ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతోనే ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఆక్సిజన్ నిరంతర సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాయి. కోవిడ్ కష్ట కాలంలో ఆక్సిజన్ కొరత నెలకొన్న తరుణంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓ శుభవార్త అందించారు. ఈ మేరకు ట్విటర్లో ఓ వీడియో విడుదల చేశారు. చైనీస్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ సరిగా చేయడం లేదన్నారు. అదే తను చెప్పబోయే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ గాలి నుంచి వాయువులను పీల్చుకొని ఫిల్టర్ ద్వారా నైట్రోజన్, 98శాతం కచ్చితమైన ఆక్సిజన్‌ను వేరు చేసి నైట్రోజన్‌ను బయటకు పంపి ఆక్సిజన్‌ను పైపు ద్వారా అందించనున్నట్లు తెలిపారు. ఇటీవల సిలీండర్లు దొరకడం లేదని, ఒకవేళ దొరికినా తొందరగా అయిపోతుందన్నారు. జపాన్‌లో రూపొందించిన ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కరెంట్‌తో నడుస్తుందని పేర్కొన్నారు. దీనిని కరెంట్ పెడితే 30 రోజులు ఏకధాటిగా వాడుకోవచ్చని తెలిపారు. ఇప్పుడే రీఫిల్లింగ్ అవసరం లేదని, ఏడాది.. రెండేళ్ల తరువాత మార్చుకోవచ్చన్నారు. వీటిలో ఒకటి యజ్ఞ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తన కజిన్ అనిత మరో రెండు విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక వికారాబాద్, చేవెళ్లలో 15, 20 బెడ్స్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: టీఆర్ఎస్ వ్యతిరేకులతో త్వరలో కొత్త పార్టీ Chinese oxygen concentrators don't work well. The specs say the oxygen flow is 5 liters/min at 97% purity, but they barely deliver barely 3 liters of oxygen at 80% purity. So my cousin Anitha and I are donating 3 German made Oxygen Concentrators to Yagyna Foundation in Vikarabad. pic.twitter.com/egPLZXGkiO — Konda Vishweshwar Reddy (@KVishReddy) May 8, 2021 -
ఏపీ: 9 మందితో ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీ
సాక్షి, అమరావతి: కరోనా బాధితులకు ఆక్సిజన్ సరఫరా చాలా కీలకమైనందున.. దీన్ని సమర్థంగా నిర్వహించడం కోసం 9 మంది సభ్యులతో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఆక్సిజన్ ఎంత కావాలి? భవిష్యత్ అవసరాలకు ఎంత అవసరం.. అనే అంశాలను పరిశీలించడంతో పాటు.. ఎలాంటి అంతరాయం లేకుండా ఆక్సిజన్ సరఫరా అయ్యేలా ఈ కమిటీ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారులు ఢిల్లీ రావు, రాజాబాబుతో పాటు పరిశ్రమలశాఖకు చెందిన డీడీ ఎం.సుధాకర్‌బాబు, ముగ్గురు కన్సల్టెంట్లు, డ్రగ్ ఇన్స్పెక్టర్ అవినాష్‌రెడ్డి, రవాణా శాఖ నుంచి ఆర్టీఏ పుమేంద్ర, ఎంవీఐ ప్రవీణ్‌లతో ఈ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారి షాన్ మోహన్‌కు వీరంతా రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: World Bank: మిగతా రాష్ట్రాల కంటే ఏపీ బెస్ట్ పోలవరం ప్రాజెక్టుకు రూ.745.94 కోట్లు -
ఆరెకరాల్లో 500 పడకల కోవిడ్ ఆస్పత్రి
తాడిపత్రి రూరల్: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్జాస్ స్టీల్ ప్లాంట్ సమీపంలో అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. ఆస్పత్రి ఏర్పాటుకు సంబంధించి అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో కలిసి శనివారం ఆయన తాడిపత్రి–కడప ప్రధాన రహదారి పక్కనే తాడిపత్రి క్రీస్తురాజు చర్చికి సంబంధించిన ఆరు ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్టీల్‌ప్లాంట్‌లో ఉన్న ఐనోక్స్ ఆక్సిజన్ ప్లాంట్‌ను పరిశీలించారు. ఆస్పత్రి ఏర్పాటు చేయనున్న ప్రాంతానికి నేరుగా ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సరఫరా సాధ్యాసాధ్యాలపై చర్చించారు. సానుకూలత వ్యక్తం కావడంతో స్థలానికి సంబంధించి చర్చి ఫాదర్ డేవిడ్ అర్లప్ప, చర్చి స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ సెలిన్తో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, కలెక్టర్ గంధం చంద్రుడు చర్చించారు. మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ.. కోవిడ్ రోగులకు నాణ్యమైన చికిత్సలు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతటి ఖర్చుకైనా వెనుకాడడం లేదన్నారు. ఇందులో భాగంగానే అనంతపురంతో పాటు పొరుగున ఉన్న కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరేలా ఆరు ఎకరాల విస్తీర్ణంలో 500 పడకలతో తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో షెడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. -
ఆక్సిజన్ సరఫరాకు ముందుకొచ్చిన ఎంఈఐఎల్
సాక్షి, హైదరాబాద్ : కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. దాంతో సహజంగానే ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఉత్పత్తి సరైన స్థాయిలో లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా అవసరమైన మేరకు జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నిమ్స్, అపోలో, సరోజినిదేవి వంటి ఆస్పత్రుల నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థకు ఆక్సిజన్ అందించమని అభ్యర్థనలు వచ్చాయి.. వచ్చిందే తడవుగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆక్సిజన్ సిలిండర్లను భారీ స్థాయిలో ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ సేకరణ కోసం భద్రాచలంలోని ఐటీసీ, హైదరాబాద్‌లోని డిఆర్‌డివోతో ఆఘమేఘాల మీద ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా కోవిడ్ రోగులు ఆక్సిజన్ సమస్యతో సతమతమవుతున్నారు. ఆక్సిజన్ అందక రోజుకు కొన్ని వందల మంది కోవిడ్ మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థల సహకారంతో ఆక్సిజన్ అవసరమయ్యే అన్ని హాస్పిటల్స్‌కు ఆక్సిజన్ సరఫరా చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా మేఘా ఇంజనీరింగ్ ప్రభుత్వం సహకారంతో వివిధ హాస్పిటల్స్ కు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయనుంది. కోవిడ్ రోగుల అవసరాలకు అనుగుణంగా నిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఆక్సిజన్ బెడ్లను పెంచుతూ పోతోంది. ప్రస్తుతం 180 నుంచి 500 బెడ్లకు పెంచారు. పెంచిన బెడ్లకు అనుగుణంగా నిమ్స్ లో రోజుకు 50 బి.టైప్ మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు (ఒక్కొక్క సిలిండర్ 7000 లీటర్లు) ఏర్పాటు అవసరం అవుతుందని నిమ్స్ డైరెక్టర్ డా. మనోహర్ ఎంఈఐఎల్ సంస్థకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే సరోజిని దేవి కంటి ఆసుప్రతికి రోజుకు దాదాపు 200 సిలిండర్లను అందించబోతుంది మేఘా సంస్థ. ఇక అపోలో హాస్పిటల్స్‌కు ప్రతి రోజు 100 సిలిండర్లు, కేర్ హైటెక్ కు 50 సిలిండర్లను సరఫరా చేయనుంది. ఇక భవిష్యత్తులో ఆసుపత్రుల నుంచి వచ్చే ఆక్సిజన్ విజ్ఞప్తి మేరకు సరఫరా చేసేందుకు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు మేఘా ఇంజనీరింగ్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. చదవండి: షిప్పింగ్ కార్పొరేషన్ వేటలో మేఘా డీఆర్డీవో టెక్నాలజీ సహకారంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ 30 నుంచి 40 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఒక్కొక్క ప్లాంటు నుంచి నిమిషానికి 150 నుంచి 1000 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ మొత్తాన్ని డి.ఆర్.డి.వో కల్నల్ బి.ఎస్. రావత్, డా. రాఘవేంద్ర రావు పర్యవేక్షించనున్నారు. మొత్తానికి డి.ఆర్.డి.వో సహకారంతో మేఘా ఇంజనీరింగ్ 35 లక్షల లీటర్ల ఆక్సిజన్ మేఘా సంస్థ ఆస్పత్రులకు సరఫరా చేస్తుంది. ఈ మేరకు ఆయా హాస్పిటల్ నుంచి అభ్యర్థనలు వచ్చాయి. వీటికి అనుగుణంగా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసి సరఫరా చేయనుంది మేఘా సంస్థ. ఇక భద్రాచలం ఐటీసీ నుంచి రోజుకు 30 మెట్రిక్ టన్నుల క్రయోజనిక్ ఆక్సిజన్ ను తీసుకొని ఎంఈఐఎల్ సంస్థ లిక్విడ్ ఆక్సిజన్ గా మార్చనుంది. ఇందుకు అనుగుణంగా భద్రాచలం ఐటీసీ దగ్గర ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ క్రయోజనిక్ ఆక్సిజన్ లభ్యమవుతోంది. స్పెయిన్‌లో ఉన్న ఎంఈఐఎల్కు సంబంధించి కర్మాగారం నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను దిగుమతి చేసేందుకు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. అక్కడి ఫ్యాక్టరీ నుంచి 10 నుంచి 15 ట్యాంకులను ఇక్కడి ఆక్సిజన్ నిల్వ, సరఫరా అవసరాల నిమిత్తం ఉపయోగించుకునేందుకు యుద్ధ ప్రాతిపాదికన తీసుకువచ్చేందుకు ఆసక్తి చూపింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. అదే సమయంలో ఎంఈఐఎల్ కు సంబంధించిన నగర శివారులోని పరిశ్రమల్లో క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను యుద్ధ ప్రతిపాదికన తయారు చేసి అందించేందుకు కూడా సంసిద్ధత తెలిపింది. ఇందుకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్ లతో పాటు డాక్యుమెంట్లను ప్రభుత్వానికి అందించనుంది. ప్రభుత్వ పరిశీలన, అనుమతి అనంతరం వాటి తయారీకి వెంటనే రంగంలోకి దిగుతుంది. -
ఆక్సిజన్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
-
ఆక్సిజన్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
సాక్షి, విజయవాడ: ఆక్సిజన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో స్టీల్ ప్లాంట్, నేవీతో అధికారులు చర్చలు జరిపారు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు భేటీ అయ్యారు. అన్ని ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణను తుర్పు నావికాదళం చేపట్టనుంది. ఆక్సిజన్ ప్లాంట్ లీకేజీలు, స్థితిగతులు, జాగ్రత్తలతో నిర్వహణకు తూర్పు నావికాదళం ముందుకొచ్చింది. అత్యవసరంగా నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఎక్కడ అవసరమైతే అక్కడికి విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేయనుంది. ఆక్సిజన్ ప్లాంట్లలోని సాంకేతిక లోపాలను సవరించేందుకు నేవీ సాయపడనుంది. సింగపూర్, థాయ్ లాండ్, మలేషియా నుండి ఏపీకి ఆక్సిజన్ తో కూడిన 25 క్రయోజనిక్ కంటైనర్స్ తరలించేందుకు నేవీ అంగీకారం తెలిపింది. ఐఎన్ఎస్ కళింగ్ ఆస్పత్రిలో 60 బెడ్లు కోవిడ్‌కి కేటాయించేందుకు అంగీకరించింది. కంచరపాలెంలో 150 పడకల ఆస్పత్రికి మౌలిక సదుపాయాల కల్పనకు నేవీ అంగీకారం తెలిపింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని ప్రభుత్వం సమకూర్చనుంది. గురజాడ కళాక్షేత్రంలో కోవిడ్ చికిత్స కోసం ఆక్సిజన్‌తో కూడిన 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు విశాఖ స్టీల్ ప్లాంట్ అంగీకారం తెలిపింది. వీటికి అదనంగా మరో 150 పడకలు ఏర్పాటు చేయనున్నారు. మే 15 నాటికి అందుబాటులోకి వస్తాయని స్టీల్ ప్లాంట్ సీఎండీ వెల్లడించారు. మే 30 నాటికి 250 పడకలు, జూన్ నాటికి 600 పడకలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్టీల్ ప్లాంట్ అధికారులు తెలిపారు. అందుకు తగిన విధంగా వైద్యులను, మెడికల్ సిబ్బందిని అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని స్టీల్ ప్లాంట్ అధికారులు కోరారు. నేవీ, స్టీల్ ప్లాంట్ అధికారుల విజ్ఞప్తి మేరకు వారి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల కోసం 4000 వాక్సిన్స్‌ను కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్, తూర్పు నావికాదళ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. 850 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లుకు గాను కేవలం 100 మెట్రిక్ టన్నుల ఎంఎల్ఓ ఉత్పత్తి అవుతుందని స్టీల్ ప్లాంట్ అధికారులు వెల్లడించారు. ఆరు నెలల్లో ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. చదవండి: కోవిడ్ కట్టడిపై ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష ముగ్గురాయి గనుల్లో పేలుడు, సీఎం జగన్ దిగ్భ్రాంతి -
ఆక్సిజన్ సరఫరా : కేంద్రానికి చుక్కెదురు
సాక్షి న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్తాయిలో విరుచుకుపడుతోంది. మరోవైపు ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. తమ తగినంత ఆక్సిజన్‌ను సరఫరా చేయాల్సిందిగా పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరు తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటకకు ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రానికి ఎదురు దెబ్బ తగిలింది. కర్నాటకకు రోజువారీ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కేటాయింపును పెంచాలన్న హైకోర్టు ఉత్తర్వుల నిలుపుదలకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. హైకోర్టు అత్యంత జాగ్రత్తగా ఇచ్చిన ఆదేశాలను ఇచ్చిందని, వీటిని తీరస్కరించి కర్ణాటక ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టలేమని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి తగిన కారణం ఏదీ తమకు కనిపించడం లేదని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. రాష్ట్రానికి రోజువారీ ఆక్సిజన్ సరఫరాను 1,200 మెట్రిక్ టన్నులకు పెంచాలని కర్ణాటక హైకోర్టు మే 5న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే 965 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కర్ణాటకకు సరఫరా చేస్తున్నామని, దీన్ని పెంచలేమని ఈ ఆదేశాలను నిలిపేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంను ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వుల్లో ఎలాంటి హేతుబద్ధత లేదని, ప్రతీ హైకోర్టు ఇలా ఆదేశాల్విడం మొదలుపెడితే కష్టమని కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ప్రభుత్వంతో చర్చించి, సమస్యను పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమస్యపై మద్రాస్, తెలంగాణా, ఇతర హైకోర్టులు కూడా విచారణ జరుపుతున్నాయన్నారు అయితే హైకోర్టు బాగా ఆలోచించి, జాగ్రత్తగా చక్కని ఆదేశాలు జారీ చేసిందని సుప్రీంకోర్టు కేంద్రం వాదనలను తోసిపుచ్చింది. మరోవైపు కర్ణాటక కేసును చేపట్టే ముందు, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఢిల్లీకి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కాగా రెండో దశలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. మరీ ముఖ్యంగా బెంగళూరులో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోద వుతున్నాయి. గురువారం కర్నాటకలో 50,112 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 346 మంది ప్రాణాలు కోల్పోయారు. -
400 మంది ప్రాణాలను కాపాడిన ఏపీ పోలీసులు
సాక్షి, విజయవాడ: పోలీసులు సకాలంలో స్పందించి 400 మంది ప్రాణాలను కాపాడారు. జీజీహెచ్‌లో ఆక్సిజన్‌తో 400 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఒడిశా నుంచి బయల్దేరిన ఆక్సిజన్ ట్యాంకర్ ట్రాకింగ్ వ్యవస్థతో సంబంధాలు తెగిపోవడంతో విజయవాడ సిటీ కమిషనర్‌కు అధికారులు సమాచారం అందించారు. వెంటనే ఒరిస్సా నుండి విజయవాడ వరకు మార్గ మధ్యలో ఉన్న జిల్లాల ఎస్పీలను విజయవాడ సీపీ అప్రమత్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ధర్మవరంలోని ఓ డాబా వద్ద ఆక్సిజన్ ట్యాంకర్‌ను గుర్తించారు. అలసిపోయి వాహనాన్ని నిలిపి వేసినట్టుగా పత్తిపాడు సీఐకి డ్రైవర్ వివరించాడు. డ్రైవర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి సీఐ తీసుకెళ్లారు. అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్‌కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్‌ను పోలీసులు విజయవాడ జీజీహెచ్‌కు చేర్చడంతో పెను ప్రమాదం తప్పింది. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరా కొనసాగింది. సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్‌ను తీసుకొచ్చిన పోలీసులకు డీజీపీ అభినందనలు తెలిపారు. చదవండి: ఏపీకి 25 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు ఏపీ: కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు పునరావాసం -
రేపటికల్లా ఆత్మకూరుకు ఆక్సిజన్ సరఫరా: మంత్రి గౌతమ్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు : రేపటికల్లా ఆత్మకూరుకు ఆక్సిజన్ సరఫరా చేస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. మరో 100 ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు తెప్పిస్తున్నామని చెప్పారు. కోవిడ్ సమయంలో రోగులు కోలుకోవడానికి ఇచ్చే ఔషధాల సరఫరా, డిమాండ్, ఐసొలేషన్ కిట్ల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్‌తో మంత్రి మేకపాటి గురువారం చర్చించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందేలా చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులైన జీజీహెచ్, నారాయణ, అపోలో సహా పలు ఆసుపత్రులలో అందుతున్న వైద్య సేవలు, ప్రజల ఇబ్బందులు, కరుణ సోకిన వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో అందుబాటులో ఉన్నప్పుడే ప్రజాసేవకు అసలైన గుర్తింపని, మండలస్థాయిలో ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. నోడల్ అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూడాలని, ఆక్సిజన్ అత్యవసర సమయంలోనే అవసరమనుకుంటేనే వినియోగించాలని అన్నారు. ఆక్సిజన్ వృధా కాకుండా కోవిడ్ వచ్చిన వారికి అవగాహన కల్పించడం కూడా అవసరమన్నారు.