
లక్ష్మీపురం(గుంటూరు): గుజరాత్ జామ్‌నగర్‌లోని రిలయన్స్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ కంటైనర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం న్యూగుంటూరు రైల్వేస్టేషన్ ఆవరణలోని కాంకర్ కంటైనర్ డిపోకు చేరుకుంది. ఈ ఆక్సిజన్‌ను ఇతర జిల్లాలకు పంపేందుకు చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూం ప్రత్యేకాధికారి ఎంటీ కృష్ణబాబు, కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ ఆర్జా శ్రీకాంత్‌లతో పాటు జేసీ దినేష్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించినా సరిపోకపోవడంతో 910 మెట్రిక్ టన్నులు కేటాయించాలని ఐదు రోజుల కిందట సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానికి లేఖ రాసినట్టు చెప్పారు. దీంతో స్పందించిన కేంద్రం రెండు ఆక్సిజన్ కంటైనర్లను రైలు ద్వారా పంపినట్టు తెలిపారు.
గుంటూరుకు వచ్చిన ఆక్సిజన్‌ను పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. జామ్‌నగర్ నుంచి ఇదే విధంగా రోజూ ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ శనివారం మరోసారి ప్రధానికి లేఖ రాసినట్టు చెప్పారు. జేసీ దినేష్‌కుమార్ మాట్లాడుతూ గుంటూరుకు చేరుకున్న ఆక్సిజన్‌ను గుంటూరు జిల్లాకు 30 మెట్రిక్ టన్నులు, కృష్ణా జిల్లాకు 20, ప్రకాశం, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాలకు 10 మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం నరేంద్రవర్మ, డీవోఎం వి.రాంబాబు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏపీ హెడ్ రవిరామరెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment