వేగం, భద్రం.. అనే రెండు సమాంతర రైలు పట్టాలపైన నైరుతి రైల్వే అధికారులు ఆ రోజు ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’ను నడపవలసి వచ్చింది! జార్ఘండ్‌లోని టాటానగర్ నుంచి బెంగళూరు సమీపంలోని వైట్‌ఫీల్డ్‌కు ఆరు ట్యాంకర్‌లలో లిక్విడ్ ఆక్సిజన్‌ని నింపి ఆ రైలును లోకో పైలట్ శిరీషకు అప్పగించారు. గంటన్నరలో ఆ ప్రాణవాయువు గమ్యం చేరింది. కరోనా రోగులున్న హాస్పిటళ్లకు సమయానికి శ్వాసలా అందింది. అత్యంత కీలక సమయంలో ఆక్సిజన్ రైలును నడిపిన తొలి మహిళా పైలట్‌గా శిరీషను తన తాజా ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భారత ప్రధాని ప్రశంసించారు.
శనివారం రాత్రి బెంగళూరులోని ఆలిండియా రేడియో స్టేషన్ రికార్డింగ్ రూమ్‌లో కూర్చొని ఉన్నారు శిరీష (31). ఏ క్షణమైనా భారత ప్రధాని నరేంద్ర మోదీ తనతో మాట్లాడేందుకు లైన్‌లోకి రావచ్చన్న ఆలోచన ఆమె గొంతును తడారేలా చేస్తోంది. నిముషాలు గడుస్తున్నాయి. ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఆరు.. ఏడు.. ‘‘నమస్తే శిరీషాజీ..’’ ఒక్కసారిగా ప్రధాని స్వరం! వెంటనే శిరీష ప్రతి నమస్కారం. తర్వాత వెంటనే ప్రధాని ప్రశ్నలు, శిరీష సమాధానాలు.
‘‘శిరీషాజీ.. ఈ కష్టకాలంలో నారీశక్తి దేశాన్ని నడిపిస్తోంది. ఇక మీరు... కరోనా పేషెంట్‌లకు అత్యవసరమైన ప్రాణవాయువును తీసుకుని రైలును వేగంగా నడుపుకుంటూ విజయవంతం గా గమ్యస్థానం చేరుకున్నారు. ఇందుకు మీకు అభినందనలు. అంతటి ఆత్మ స్థయిర్యం, స్ఫూర్తి మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? మిమ్మల్ని అందుకు సంసిద్ధం చేయడానికి అవసరమైన బలాన్ని మీకు ఇచ్చింది ఎవరు? ఈ దేశం తెలుసుకోవాలని అనుకుంటోంది. నాకు కూడా..! చెప్పండి శిరీషాజీ’’ అడిగారు ప్రధాని. ‘‘మా నాన్న, మా అమ్మ ..’’ శిరీష జవాబు. ‘‘ఆక్సిజన్ కోసం వేచి చూస్తున్న రోగుల కోసం ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించుకుని వెళ్లడం అన్నది ఎంతలేదన్నా బాధ్యతతో కూడిన పని కదా. మీకెలా అనిపించింది?’’.. ప్రధాని.
‘‘రైల్వే అధికారులు అన్నీ సవ్యంగా ఉండేలా చూశారు. నాపై నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది’’ అని శిరీష సమాధానం.మొత్తం 2 నిముషాల 8 సెకన్లపాటు దేశ ప్రధానికి, దేశ పౌరురాలికి మధ్య స్ఫూర్తివంతమైన సంభాషణ నడిచింది. గంటన్నర పాటు 123 కి.మీ. దూరం ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను జాగ్రత్త గా, వేగంగా నడపడం వంటిదే దేశ ప్రధానితో ఒక నిముషం పాటైనా మాటను నడిపించడం. మర్నాడు ప్రధాని ‘మన్ కీ బాత్’లో ఈ సంభాషణ ప్రసారం అయింది. ఆ సమయానికి శిరీష తల్లి వైజాగ్‌లోని తమ ఇంట్లో.. చుట్టుపక్కల వాళ్లతో కలిసి కూర్చొని తన కూతురు, ప్రధాని ముచ్చటించుకోవడాన్ని హృదయం ఉప్పొంగుతుండగా విన్నారు. శిరీష తండ్రి రామారావు మాత్రం వినలేకపోయారు. పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ సెక్రెటరీగా ఆయన రిటైర్ అయ్యారు. కొంతకాలం క్రితమే కన్నుమూశారు.
శిరీష నైరుతి రైల్వే ఉద్యోగి. బెంగళూరు డివిజన్‌లో లోకో పైలట్. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన ‘ఆల్ ఫిమేల్ క్రూ’ లో ప్రధాన పైలట్‌గా శిరీష గత వారం వార్తల్లోకి వచ్చారు. ఈ నెల 21 న జార్ఘండ్ నుండి బెంగళూరుకు ఆరు ట్యాంకర్‌లలో 120 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నింపి ఉన్న ఎక్స్‌ప్రెస్ రైలును గంటకు 80 కి.మీ వేగంతో శిరీష నడిపించుకుని వచ్చారు. ఆమెతోపాటు అసిస్టెంట్ లోకో పైలట్ అపర్ణ ఉన్నారు. రైలు బెంగళూరు చేరిన వెంటనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయెల్ శిరీష, ఆమె సహ పైలట్ దీక్షాదక్షతలను కొనియాడుతూ ‘‘ప్రాణవాయువును నడిపించుకుని వచ్చిన మహిళలు’’ అని ట్విట్టర్‌లో అభినందించారు.
చదవండి: విదేశీ టీకాలకు నో ట్రయల్స్!
Comments
Please login to add a commentAdd a comment