సాక్షి, అమరావతి: అవసరమైన మేరకు ఆక్సిజన్‌ను కేటాయించి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఆక్సిజన్ అవసరమైన రోగులకు సమర్థవంతంగా చికిత్స అందించేందుకు సరిపడేలా 910 టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించాలని కోరారు. ఇదే సమయంలో దేశీయ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం దేశీయ అవసరాలకు సరిపోవడం లేదని.. విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కోవాగ్జిన్ టెక్నాలజీని వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న సంస్థలకు బదిలీ చేయడానికి చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇది భారత ప్రభుత్వ ప్రాపర్టీ కనుక పేటెంట్ సమస్య ఉత్పన్నం కాదని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రధానికి వేర్వేరుగా 2 లేఖలు రాశారు. వాటి వివరాలు ఇలా..
ఆక్సిజన్ కేటాయింపులు సరిపోవడం లేదు
► ఆంధ్రప్రదేశ్‌కు ఈ నెల 8న కేటాయించిన 590 టన్నుల ఆక్సిజన్ సరిపోవడం లేదు. ఇందులో ఒడిశా నుంచి కేటాయించిన 210 టన్నుల ఆక్సిజన్‌ను రాయలసీమ ప్రాంతానికి తరలించాలంటే 1,400 కిలోమీటర్లు ప్రయాణించాలి. అంతదూరం నుంచి ఎల్‌ఎంవో (లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్) ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్‌ను తరలించడంలో జాప్యం చోటు చేసుకుంటోంది.
► దాంతో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆస్పత్రులకు తమిళనాడు, కర్ణాటకల నుంచి ఆక్సిజన్‌ను సరఫరా చేసేలా కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాం. చెన్నైలోని సెయింట్ గోబెయిన్ (తమిళనాడు) నుంచి 35 టన్నులు, శ్రీపెరంబదూరులోని ఐనాక్స్ నుంచి 25 టన్నులను రాష్ట్ర ప్రభుత్వం సేకరించకపోతే ఆస్పత్రుల్లో పరిస్థితి విషమంగా ఉండేది.
► అయితే ఈ నెల 10న చెన్నై, కర్ణాటకల నుంచి ఆక్సిజన్ సరఫరాలో జాప్యం కావడం వల్ల తిరుపతిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 11 మంది రోగులు దురదృష్టవశాత్తు మరణించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయింపులను 910 టన్నులకు పెంచడంతోపాటు 20 ఎల్‌ఎంవో ట్యాంకర్లను కేటాయించాలి.
కేసులు పెరిగినందున అదనపు ఆక్సిజన్ అవసరం
► కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాం. రాష్ట్రంలో ఏప్రిల్ 24 నాటికి 81,471 కరోనా యాక్టివ్ కేసులు ఉండేవి. ఆ రోజున రాష్ట్రానికి కేంద్రం 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించింది.
► ఈ నెల 8 నాటికి ఆక్సిజన్ కేటాయింపులను 590 టన్నులకు పెంచింది. అయితే మంగళవారం నాటికి రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 1,87,392కు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేటాయించిన ఆక్సిజన్‌ను కొనసాగిస్తూనే.. కేటాయింపులను పెంచాలి.
► కర్ణాటకలోని బళ్లారిలో జేఎస్‌డబ్ల్యూ నుంచి ప్రస్తుతం 20 టన్నుల ఆక్సిజన్‌ను రాష్ట్రానికి కేటాయించారు. ఇటీవల జేఎస్‌డబ్ల్యూ పరిశ్రమ సామర్థ్యం పెంచిన నేపథ్యంలో అక్కడి నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయింపులను 150 టన్నులకు పెంచాలి.
► ఒడిశా నుంచి ప్రస్తుతం సరఫరా చేస్తున్న 210 టన్నుల ఆక్సిజన్‌ను 400 టన్నులకు పెంచాలి. ఈ ఆక్సిజన్‌ను ఇండియన్ రైల్వేస్ నేతృత్వంలో నడిపే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా తరలించడానికి 20 ఎల్‌ఎంవో ట్యాంకర్లను కేటాయించాలి.
కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోండి
► కోవిడ్–19 మహమ్మారిపై సర్వశక్తులు ఒడ్డి రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తున్న విషయం మీకు తెలుసు. రాష్ట్రంలో గత ఏడు రోజులుగా రోజుకు సగటున 20,300 కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటూనే కోవిడ్–19 బారిన పడిన రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.
► కర్ఫ్యూ విధించడం, ఇతర ఆంక్షల ద్వారా కరోనాను తాత్కాలికంగానే కట్టడి చేయగలం. కరోనాను పూర్తిగా కట్టడి చేయాలంటే జాతీయ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ వేయడం ఒక్కటే మార్గం.
► రాష్ట్రంలో పరిపాలన యంత్రాంగం ద్వారా ఒకే రోజు ఆరు లక్షల మందికి వ్యాక్సిన్ వేసిన సామర్థ్య ఏపీ ప్రభుత్వానికి ఉంది. కానీ వ్యాక్సిన్ కొరత వల్ల అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ వేయలేకపోతున్నాం.
► మీ నాయకత్వంలో ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్), ఎన్‌ఐవీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ), భారత బయోటెక్ సంయుక్తంగా దేశీయంగా కోవిడ్–19 నివారణకు కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. కనుక ఇది భారత ప్రభుత్వ ప్రాపర్టీ.
► ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను బీఎస్‌ఎల్ (బయో సేఫ్టీ లెవల్)–3 అత్యున్నత ప్రమాణాలతో భారత్ బయోటెక్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. కోవాగ్జిన్‌కు 2021 జనవరిలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీసీఎస్‌వో) నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చింది.
► ప్రస్తుతం కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం దేశీయ అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఉత్పత్తి సామర్థ్యం ఇదే రీతిలో ఉంటే.. అర్హులందరికీ వ్యాక్సిన్ వేయడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. కోవాగ్జిన్ ఉత్పత్తిని పెంచాలని గతంలో మీరు కూడా చెప్పారు.
► కోవిడ్–19ను కట్టడి చేయాలంటే అర్హులందరికీ వ్యాక్సిన్ వేయడం ఒక్కటే మార్గం. అందరికీ వేగంగా వ్యాక్సిన్ వేయాలంటే వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలి. దేశ విశాల ప్రజాప్రయోజనాల దృష్ట్యా భారత్ బయోటెక్ సంస్థ, ఐసీఎంఆర్–ఎన్‌ఐవీల కోవాగ్జిన్ టెక్నాలజీని.. వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న సంస్థలకు బదిలీ చేయించాలి. ఈ విపత్కాలంలో కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి.
► ఈ అంశంలో మీరు జోక్యం చేసుకుని కోవాగ్జిన్ టెక్నాలజీని బదిలీ చేయించడం ద్వారా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి.. అందరికీ వేగంగా వ్యాక్సిన్ వేసి.. కరోనాను కట్టడి చేయవచ్చు.
910 టన్నుల ఆక్సిజన్ కేటాయించండి
Published Wed, May 12 2021 3:08 AM | Last Updated on Wed, May 12 2021 12:17 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment