25 లక్షల డోసుల వ్యాక్సిన్లు సరఫరా చేయండి | CM Jagan Letter To PM Narendra Modi About Covid-19 vaccination | Sakshi
Sakshi News home page

25 లక్షల డోసుల వ్యాక్సిన్లు సరఫరా చేయండి

Published Sat, Apr 10 2021 2:55 AM | Last Updated on Sat, Apr 10 2021 3:10 AM

CM Jagan Letter To PM Narendra Modi About Covid-19 vaccination - Sakshi

సాక్షి, అమరావతి: ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకు ‘టీకా ఉత్సవ్‌’ను దిగ్విజయంగా నిర్వహించేందుకు రాష్ట్రానికి వెంటనే 25 లక్షల డోసుల కోవిడ్‌ వ్యాక్సిన్లను సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోందని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. రోజుకు 6 లక్షల మందికి చొప్పున నాలుగు రోజుల్లో 24 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసేందుకు ప్రణాళిక రూపొందించామని లేఖలో వివరించారు. ఈ లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

టీకా ఉత్సవ్‌కు సన్నద్ధం అవుతున్నాం
► కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్‌ మీద మీరు నిన్న (గురువారం) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించిన విషయాలకు కొనసాగింపుగా కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. 
► మీ పిలుపుమేరకు కరోనా వ్యాప్తి నివారణకు టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్‌ విధానాన్ని మా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాం. మీ సమర్థ నాయకత్వంలో భారతదేశం కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొన్న తీరు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు మా రాష్ట్రానికి మీరు అందించిన సహకారానికి ధన్యవాదాలు.  
► ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకు ‘టీకా ఉత్సవ్‌’ నిర్వహణలో పెద్ద ఎత్తున భాగస్వామ్యమయ్యేందుకు మా రాష్ట్రం సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఒక గ్రామం, ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఒక వార్డులో టీకా ఉత్సవ్‌ నిర్వహించాలని నిర్ణయించాం.
► ఆ గ్రామాలు, వార్డుల్లో అర్హులైన వారందరికీ టీకాలు వేసేందుకు మా వైద్యులు, ఏఎన్‌ఎంలను మొహరిస్తున్నాం. మా రాష్ట్రంలో ప్రతి 50 ఇళ్లను పర్యవేక్షించేందుకు నిబద్దులైన వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తాం. 
► ప్రతి రోజు 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 259 పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో 1,145 గ్రామాలు, 259 వార్డులలో టీకా ఉత్సవ్‌ నిర్వహిస్తాం. నాలుగు రోజుల్లో 4,580 గ్రామాలు, 1,036 వార్డులలో 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు వేయిస్తాం. ఈ కార్యక్రమానికి ఉత్సవ శోభ తీసుకువస్తాం. 

రోజూ 6 లక్షల మందికి వ్యాక్సిన్లు వేస్తాం
► టీకా ఉత్సవ్‌లో భాగంగా రోజూ గ్రామీణ ప్రాంతాల్లో 4 లక్షల మందికి, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల మందికి.. వెరసి రోజుకు 6 లక్షల మందికి టీకాలు వేసేందుకు ప్రణాళిక రూపొందించాం. తద్వారా నాలుగు రోజుల్లో  24 లక్షల మందికి టీకాలు వేసేందుకు కార్యాచరణకు సిద్ధమయ్యాం. 
► ఇందుకు తగినన్ని వ్యాక్సిన్ల సరఫరా అత్యావశ్యకం. ప్రస్తుతం మా రాష్ట్రంలో 2 లక్షల డోసులే ఉన్నాయి. మరో 2 లక్షల డోసులు ఒక రోజులో వస్తాయని భావిస్తున్నాం. కాబట్టి మా రాష్ట్రానికి మరో 25 లక్షల డోసుల వ్యాక్సిన్లను ఏప్రిల్‌ 11 లోగా సరఫరా చేయాలని కోరుతున్నాం. కోవిడ్‌ నివారణ కోసం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement