గాంధీనగర్: కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై మోదీ ఫొటో ఎందుకంటూ ప్రతిపక్షాలు నిలదీయడంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్ లబ్ధిదారులకు తక్షణమే సర్టిఫికెట్‌ను అందజేసిన భారత్‌ను చూసి ప్రపంచమంతా చర్చించుకుంటుండగా, కొందరు మాత్రం ఆ సర్టిఫికెట్‌పై తన ఫొటో ఉండటంపై రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గాంధీనగర్‌లో సోమవారం ఆయన డిజిటల్ ఇండియా వీక్–2022ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.
ఆన్‌లైన్ చెల్లింపుల విధానం తీసుకురావద్దంటూ కొందరు పార్లమెంట్‌లో వాదించారని, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో డిజిటల్ సాంకేతిక ప్రవేశంతో ప్రజల జీవితాలు మారిపోయాయని ప్రధాని చెప్పారు. యూపీఐ ఫలితంగా చిరు వ్యాపారులు కూడా తమ రోజువారీ కార్యకలాపాలను సాగిస్తున్నారన్నారు. బిహార్‌లోని ఓ వ్యక్తి డిజిటల్ విధానంలో కూడా తనకు దానం చేయవచ్చంటూ క్యూఆర్ కోడ్ ప్లకార్డును మెడలో కట్టుకుని బిచ్చమెత్తుకుంటున్న విషయం ప్రస్తావించారు.
వివిధ రకాల సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాక ప్రజలు క్యూల్లో నిల్చోవాల్సిన బాధ తప్పిందన్నారు. ఆధునిక సాంకేతికతను భారత్ అందిపుచ్చుకోనట్లయితే ఇప్పటికీ వెనుబడి ఉండేదన్నారు. ‘పదేళ్ల క్రితం ప్రజలు బర్త్ సర్టిఫికెట్లు, బిల్లుల చెల్లింపు, పరీక్షల ఫలితాలు, ప్రవేశాల కోసం క్యూల్లో నిలబడేవారు. ఇప్పుడు అన్ని సేవలను ఆన్‌లైన్ చేసి క్యూలు లేకుండా చేశాం’ అని చెప్పారు.
డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితంగా అన్ని రంగాల్లో దళారీ వ్యవస్థను అరికట్టగలిగినట్లు చెప్పారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో 80 కోట్ల మంది పేదలకు సులువుగా ఉచిత రేషన్ అందించామన్నారు. ఇలా ఉండగా, ప్రధాని మోదీ గురువారం సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సుమారు రూ.1,800 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని పీఎంవో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment