స్థల దాతలు చర్చి ఫాదర్, సిస్టర్‌తో మాట్లాడుతున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్
తాడిపత్రి రూరల్: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్జాస్ స్టీల్ ప్లాంట్ సమీపంలో అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. ఆస్పత్రి ఏర్పాటుకు సంబంధించి అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో కలిసి శనివారం ఆయన తాడిపత్రి–కడప ప్రధాన రహదారి పక్కనే తాడిపత్రి క్రీస్తురాజు చర్చికి సంబంధించిన ఆరు ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్టీల్‌ప్లాంట్‌లో ఉన్న ఐనోక్స్ ఆక్సిజన్ ప్లాంట్‌ను పరిశీలించారు.
ఆస్పత్రి ఏర్పాటు చేయనున్న ప్రాంతానికి నేరుగా ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సరఫరా సాధ్యాసాధ్యాలపై చర్చించారు. సానుకూలత వ్యక్తం కావడంతో స్థలానికి సంబంధించి చర్చి ఫాదర్ డేవిడ్ అర్లప్ప, చర్చి స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ సెలిన్‌తో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, కలెక్టర్ గంధం చంద్రుడు చర్చించారు. మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ.. కోవిడ్ రోగులకు నాణ్యమైన చికిత్సలు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతటి ఖర్చుకైనా వెనుకాడడం లేదన్నారు. ఇందులో భాగంగానే అనంతపురంతో పాటు పొరుగున ఉన్న కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరేలా ఆరు ఎకరాల విస్తీర్ణంలో 500 పడకలతో తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో షెడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment