మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి | Self-sufficiency in medical oxygen production with Cm Jagan Initiate | Sakshi
Sakshi News home page

మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి

Published Fri, Jan 28 2022 4:28 AM | Last Updated on Fri, Jan 28 2022 4:28 AM

Self-sufficiency in medical oxygen production with Cm Jagan Initiate - Sakshi

ప్లాంట్‌ను వర్చువల్‌ విధానంలో ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి /వరదయ్యపాళెం: మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా ఏపీ పయనిస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనలతో రాష్ట్రంలో రోజుకు 220 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంటు అందుబాటులోకి వచ్చింది. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు లోటులేకుండా చూసే చర్యల్లో భాగంగా ఈ ప్లాంట్‌ ఏర్పాటైంది. శ్రీ సిటీలో నోవా ఎయిర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రూ.130 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ ప్లాంట్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.

కోవిడ్‌ కారణంగా గతంలో ఆక్సిజన్‌ కొరత ఎదుర్కొన్న నేపథ్యంలో ఇకపై అలా ఇబ్బంది పడకూడదని గతంలో సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. భారీ స్థాయిలో ఒక ఆక్సిజన్‌ ప్లాంటును తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు లోటు రాకుండా స్వయం సమృద్ధి సాధించాలని అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. ఇందులో భాగంగా నోవా ఎయిర్‌తో రాష్ట్ర ప్రభుత్వం 2020 జనవరి 24న ఏంఓయూ చేసుకుంది. 2020 డిసెంబర్‌ 18న పనులు ప్రారంభించగా, 2021 నవంబర్‌లో పనులు తుది దశకు చేరాయి. రోజుకు 220 టన్నుల ఆక్సిజన్‌ తయారీ సామర్థ్యం గల ప్లాంటు సాకారం అయింది. ఈ ప్లాంట్‌లో మెడికల్‌ ఆక్సిజన్, లిక్విడ్‌ ఆక్సిజన్, లిక్విడ్‌ నైట్రోజన్, లిక్విడ్‌ ఆర్గా్గన్‌ వాయువులు తయారవుతాయి. ఆరోగ్య సంరక్షణ, ఫార్మా, మెటల్స్, ఆటో, టెలికాం, టైర్లు, జనరల్‌ ఫ్యాబ్రికేషన్, ఏరోస్పేస్, ఇన్‌ఫ్రా వంటి రంగాలకు ఈ పరిశ్రమ వాయువులను సరఫరా చేయనుంది. 

సరిపడా ఆక్సిజన్‌
ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం  మాట్లాడుతూ.. 14 నెలల్లో ప్లాంట్‌ ప్రారంభం కావడం అన్నది ఒక మైలు రాయి అని, ఇంత తక్కువ వ్యవధిలో ప్లాంట్‌ ప్రారంభం కావడం విశేషం అన్నారు. ఈ ప్లాంట్‌ ద్వారా పెద్ద ఎత్తున ఆక్సిజన్‌ లభించడంతో పాటు ఎంతో మందికి ఉపాధి కలుగుతుండటం మంచి పరిణామం అని చెప్పారు. ‘రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 144 పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. మరో 32 ప్లాంట్లు పెడుతున్నాం. దీనివల్ల ఆక్సిజన్‌ విషయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. 24,000 ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులోకి తెచ్చాం. కోవిడ్‌ లాంటి విపత్తులు వచ్చినప్పుడు సరిపడా ఆక్సిజన్‌ అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 300 టన్నుల ఆక్సిజన్‌ తయారీలో ఉంది. ఈ ప్లాంట్‌ ద్వారా జరిగే ఉత్పత్తి దీనికి అదనంగా వచ్చి చేరుతుంది’ అని తెలిపారు. కార్యక్రమంలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, నోవా ఎయిర్‌ సీఈవో అండ్‌ ఎండీ గజనన్‌ నబర్, కమర్షియల్‌ హెడ్‌ శరద్‌ మధోక్, శ్రీసిటీ జీఎం (కార్పొరేట్‌ ఎఫైర్స్‌) సీహెచ్‌.రవికృష్ణ పాల్గొన్నారు. శ్రీసిటీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే ఆదిమూలం, చిత్తూరు కలెక్టర్‌ హరినారాయణన్, శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి  పాల్గొన్నారు.

ప్రభుత్వ సహకారం బావుంది
కోవిడ్‌కే కాదు, పరిశ్రమలకూ ఆక్సిజన్‌ చాలా ముఖ్యం. దేశంలో తొలిసారిగా ప్లాంట్‌ పెట్టాం. ఏపీ సరైనదని ఎంచుకుని ఈ ప్లాంట్‌ పెట్టాం. ఇక్కడ మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. 14 నెలల్లో ప్లాంట్‌ను నిర్మించాం. ప్రభుత్వ యంత్రాంగం బాగా సహకరించింది. కోవిడ్‌ వేవ్‌ల సమయంలో రవాణాకు, మానవ వనరులకు కొరత లేకుండా అధికారులు చూశారు. అందరికీ కృతజ్ఞతలు. 
– గజనన్‌ నబర్, సీఈవో అండ్‌ ఎండీ, నోవా ఎయిర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement