
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం పెంచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఇండస్ట్రియల్ గ్యాసెస్ అండ్ మెడికల్ ఆక్సిజన్ గ్యాస్ పాలసీని తెచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పాలసీని విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సామర్థ్యం ఉండగా దీన్ని 700 మెట్రిక్ టన్నులకు పెంచాలనేది పాలసీ లక్ష్యం.
ఈ పాలసీ ద్వారా 50 ప్రెజ్యూర్ స్వింగ్ అడషార్పషన్ (పీఎస్‌ఏ) ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమల శాఖ సంయుక్తంగా దీనిపై ముందుకు వెళతాయని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఆక్సిజన్ సామర్థ్యం పెంచేందుకు ఆయా కంపెనీలను గుర్తించినట్టు వెల్లడించింది. ప్రధానంగా జోన్‌ల వారీగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయాలనేది పాలసీ ముఖ్య ఉద్దేశమని వివరించింది.
సామర్థ్యాన్ని బట్టి రాయితీలు..
మూతపడిన యూనిట్లకు పీఎస్‌ఏ టెక్నాలజీ కనీస సామర్థ్యం 1 టన్ను ఉంటే పెట్టుబడి వ్యయంలో రూ.20 లక్షలు లేదా గరిష్టంగా రూ.20 లక్షలు రాయితీ ఇస్తారు. వీటికి విద్యుత్ సబ్సిడీ కింద యూనిట్‌కు రూ.2 చొప్పున గరిష్టంగా మూడేళ్ల వరకు టన్నుకు రూ.7 లక్షల చొప్పున అందిస్తారు. పీఎస్‌ఏ కొత్త యూనిట్లకు ఒకటన్ను సామర్థ్యం ఉంటే పెట్టుబడి వ్యయంలో 30 శాతం.. గరిష్టంగా రూ.30 లక్షలు ఇస్తారు. వీటికి విద్యుత్ సబ్సిడీ కింద యూనిట్‌కు రూ.2 చొప్పున టన్నుకు ఏడాదికి రూ.7 లక్షల చొప్పున రెండేళ్లు అందిస్తారు.
50 నుంచి 100 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద టన్నుకి 20 శాతం రాయితీ.. గరిష్టంగా రూ.20 లక్షలు ఇస్తారు. వీటికి విద్యుత్ సబ్సిడీ కింద మొదటి ఏడాది యూనిట్ రూ.2, రెండో ఏడాది యూనిట్ రూ.1.50, 3 నుంచి 5 ఏళ్లకు ఒక రూపాయి చొప్పున అందిస్తారు. టన్ను ఉత్పత్తికి గరిష్టంగా రూ.7 లక్షల విద్యుత్ సబ్సిడీని మూడేళ్ల పాటు ఇస్తారు. హెలియాక్స్ టెక్నాలజీ పద్ధతిలో 50 నుంచి 100 టన్నుల సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేసేవారికి పెట్టుబడి రాయితీ 25 శాతం, గరిష్టంగా రూ.25 లక్షలు అందిస్తారు. వీటికి లిక్విడ్ ఆక్సిజన్ పరిశ్రమల తరహాలోనే విద్యుత్ రాయితీలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment