సాక్షి, గుంటూరు: ఏపీలో వైద్య, ఆరోగ్య శాఖ పని తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎంటి. కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. దీనికోసం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. సెప్టెంబరు 15 నుంచి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకోవాలన్న సీఎం.. నూతన మెడికల్ కాలేజీలు, నిర్వహణపైనా సమీక్షించారు.
ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ అత్యంత సమర్థవంతంగా ఉండాలన్న సీఎం.. నిర్వహణకు నిధులు సమస్య రాకుండా చూసుకునేందుకు ఒక విధానం తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాలలోని ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు జరగనున్నాయని, వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సిద్ధం అవుతున్నామని అధికారులు వివరించారు. పులివెందుల, పాడేరు, ఆదోని, మార్కాపూర్, మదనపల్లెల్లో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలకు సిద్ధమవుతున్నాయని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment