Fact Check: బాబు హయాంలో తుస్‌...జగన్‌ పాలనలో భేష్! | FactCheck: Eenadu Ramoji Rao Fake News On CM Jagan Govt Medical Sector, Facts Inside - Sakshi
Sakshi News home page

Fact Check: బాబు హయాంలో తుస్‌...జగన్‌ పాలనలో భేష్!

Published Thu, Mar 28 2024 5:20 AM | Last Updated on Thu, Mar 28 2024 9:51 AM

Eenadu Ramoji Rao Fake News On CM Jagan Govt Medical Sector - Sakshi

వైద్యరంగాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదే 

53 వేలకుపైగా పోస్టులు భర్తీ చేసి కొరతకు చెక్‌ పెట్టిందీ ఈ ప్రభుత్వంలోనే 

ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు వీలుగా ‘జీరో వేకెన్సీ’ విధానం 

కొత్తగా 17 వైద్యకళాశాలలు ఏర్పాటు.. ఐదు ప్రారంభం 

విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్యసురక్షతో విప్లవాత్మక చర్యలు 

గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువైన ఖరీదైన వైద్యం 

ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య పరిమితి రూ. 25లక్షలకు పెంచి పకడ్బందీగా అమలు 

బోధనాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరతంటూ ‘ఈనాడు’లో రోత రాతలు 

చంద్రబాబు హయాంలో ఈ రంగం నిర్వీర్యమైపోయినా పట్టించుకోని రామోజీ 

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రామోజీ పైత్యం పరాకాష్టకు చేరుతోంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గంటూ ఈనాడులో ‘పచ్చ’ రోతలు పెచ్చుమీరుతున్నాయి. బాబు హయాంలో వ్యవస్థ మొత్తం భ్రష్టుపట్టినా వేలెత్తి చూపేందుకు మనసురాని పచ్చ పత్రికలకు జగన్‌ హయాంలో జరిగే మంచి కూడా పాపంలా కనిపిస్తోంది. ఏపీలో వైద్యరంగాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న ఆయన సంస్కరణలు వారికి ఘోరంలా గోచరిస్తున్నాయి. కొత్తగా 17 వైద్య కళాశాలలు రాష్ట్రంలో ఏర్పాటు చేసి అందులో ఐదింటిని ప్రారంభించినా ప్రశంసించలేక... పగబడుతున్నాయి. ఐదేళ్లలో వైద్య రంగం స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తే... అది తమ వారు చేయలేకపోయారన్న దుగ్ధతో క్షుద్ర రాతలకు తెగబడుతున్నాయి. ‘తెలంగాణ లో భేష్‌.. ఏపీలో తుస్‌’ అంటూ ఇక్కడి బోధన ఆస్పత్రులపై నికృష్ట కథనాన్ని అచ్చేశాయి. 

సాక్షి, అమరావతి:  సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. వీలైనంత పెద్ద సంఖ్యలో అబద్ధాలను అచ్చేయాలి. ఎలాగైనా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలి. తద్వారా తమకు అనుకూలురైన పచ్చనేతలకు పట్టంగట్టాలి. ఇదే లక్ష్యంతో ఎలాంటి దారుణానికైనా వెనుకాడకూడదని రామోజీ సారధ్యంలో నడుస్తున్న ఈనాడు నిర్ణయించుకున్నట్టుంది. ఇందుకోసం రోజురోజుకూ అత్యధిక సంఖ్యలో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయి. 2014–19 మధ్య రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం పడకేసిన సందర్భంలోనూ సీఎంగా తన మనిషి ఉండటంతో ఆహా ఓహో ఏపీ వైద్య రంగం అంటూ రామోజీరావు బాకాలు ఊదారు.

గడచిన ఐదేళ్లలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్యశాఖలో 53 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయడంతో పాటు,  వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారు. 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టి ఐదు కళాశాలలను ఇప్పటికే ప్రారంభించడంతో పాటు, మరో ఐదు త్వరలో ప్రారంభించనున్నారు. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్‌ విధానం, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి ప్రజల గుమ్మం వద్దకే వైద్య సేవలను చేరువ చేశారు. కేవలం ఐదేళ్లలో వైద్య రంగం ఇంతగా పురోగమిస్తే బాబుకు రాజకీయ భవిష్యత్‌ ఉండదనే ఉద్దేశంతో నిస్సిగ్గుగా ఈనాడులో దిగజారుడు రాతలు రాస్తున్నారు.   

ఇప్పుడు తెలంగాణ కంటే మనమే మెరుగు 
ప్రజలకు వైద్యపరంగా అండగా నిలవడంలో పక్కనున్న తెలంగాణాతో పాటు, దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ ఉంటోంది. మధ్యతరగతి వర్గాలకు సైతం ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్రంగా ఏపీని నీతి ఆయోగ్‌ సైతం కీర్తించింది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం గల కుటుంబాలన్నీ నేడు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. రూ.25 లక్షల వరకూ వైద్య సేవలను ఉచితంగా పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం కన్నా మిన్నగా ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎం జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తోంది. రక్తహీనత నివారణ, డిజిటల్‌ వైద్య సేవల కల్పన, జాతీయ ప్రమాణాలు కలిగిన ఆస్పత్రుల సంఖ్య పరంగా, ఇలా వివిధ అంశాల్లో తెలంగాణా ఏపీ కంటే వెనుకే ఉంది.  

వైద్య విద్యకు పట్టం 
అధికారంలోకి వచ్చాక ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ప్రణాళికబద్ధంగా అడుగులు వేశారు. తొలుత ఐదు జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడం ద్వారా రాజమహేంద్రవరం, ఏలూరు, విజయనగరం, నంద్యాల, మచిలీపట్నం వైద్య కళాశాలలకు అనుమతులను రాబట్టారు.

తద్వారా ఈ ఏడాది 750 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె మెడికల్‌ కాలేజీలను ప్రారంభించనున్నారు. మిగిలిన 7 వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చేలా సన్నద్ధమయ్యారు. మూడేళ్లలో 17 కొత్త మెడికల్‌ కాలేజీలు మన రాష్ట్రంలోనూ ఏర్పాటు కానున్నాయి. కరోనా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూనే వైద్య రంగంలో సంస్కరణలన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం చేపట్టింది.

రాష్ట్రంలో చిన్న పిల్లలకు మెరుగైన వైద్య సదుపాయాల అవసరాలను గుర్తించి టీటీడీ ఆధ్వర్యంలో శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలన్ని ప్రారంభించారు. చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తెస్తూ రూ. 450 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దాని నిర్మాణం దాదాపు పూర్తయింది. కానీ చిన్న పిల్లల ఆస్పత్రులకు ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేదని ఈనాడు తప్పుడు రాతలతో జనాన్ని నమ్మించేందుకు యత్నిస్తోంది. 

బాబు పాలనలోనే నీరుగార్చారు 
గత తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో వైద్యరంగం పూర్తిగా కుదేలైంది. ఆరోగ్యశ్రీ మూలకు చేరింది. వైద్యకళాశాలల ఊసే లేదు. అదే సమయంలో పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం నాలుగు కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడంతోపాటు, భవిష్యత్తులో మరిన్ని కళాశాలల ఏర్పాటుకు వీలుగా 25 సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ పడకల సంఖ్యను పెంచింది. 2018లోగా ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసింది. అప్పట్లో తీసుకున్న చర్యలు 17 కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు వచ్చేందుకు దోహదపడ్డాయి.

పక్క రాష్ట్రంలో కళాశాలల ఏర్పాటుకు ముందు చూపుతో అడుగులు వేస్తున్నా.. బాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగి కూడా రాష్ట్ర ప్రయోజనాలను నీరుగార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ వైద్య రంగాన్ని పట్టించుకోకుండా ప్రైవేట్‌ వైద్య కళాశాలలను ప్రోత్సహిస్తూ వైద్య విద్యను వ్యాపారంగా మార్చేశారు. అయినా అవేవీ ఈనాడుకు... దానిని నడిపిస్తున్న రామోజీరావుకు ‘కమ్మ’గానే కనిపించాయి. 

వైఎస్సార్‌సీపీ హయాంలో పురోగతి 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వైద్య శాఖ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఏకంగా 53 వేలకుపైగా పోస్టులను ఐదేళ్లలో భర్తీ చేశారు.

అంతేకాకుండా వైద్య శాఖలో నియామకాల కోసమే ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటుతో పాటు, ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేపట్టేలా అత్యవసర ఉత్తర్వులు ఇచ్చారు. స్పెషలిస్ట్‌ వైద్యులు 4500 మేర, మెడికల్‌ ఆఫీసర్‌లు 2500కు పైగా, 6700కు పైగా నర్సుల పోస్టులను భర్తీ చేశారు. ఇంతలా చర్యలు తీసుకుంటే బోధనాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఉంటోందని రామోజీరావు రోత రాతలు రాసుకొచ్చారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement