సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ వ్యవస్థను పటిష్టపర్చడానికి వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు చేసింది. ఇందుకోసం భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ పట్టభద్రుల సేవలను వినియోగించుకోనుంది. ఆక్సిజన్ సరఫరా నిర్వహణ కోసం ఎంటీటీ (మల్టీ టాస్క్ టెక్నీషియన్స్) విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు అధికారులు యోచిస్తున్నారు. కోవిడ్ సమయంలో తలెత్తిన సాంకేతిక లోపాలను అధిగమించి, రోగులకు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఆక్సిజన్ అందించేలా కొత్త విధానం ఉండేలా చర్యలు చేపడుతున్నారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ స్థాయిలో ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లు.. ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటివరకూ వీటి నిర్వహణ అనస్థీషియా డాక్టర్లు ఐసీయూ చూస్తుండగా, నైపుణ్యం లేనివారు ఆక్సిజన్ ప్లాంట్‌ల నిర్వహణ చూసేవారు. ప్లాంట్‌లలో తలెత్తే సాంకేతిక లోపాలు వీరికి తెలియవు. కాబట్టి ప్రత్యేక నిపుణులను తయారు చేయబోతున్నారు.
మార్గదర్శకాలు రెడీ
అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా నిర్వహణకు ఇంజనీరింగ్ పట్టభద్రులను నియమించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. ఇందులో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్రొడక్షన్, కెమికల్ ప్రాసెస్, ఆటోమొబైల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చదివిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలోనే క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి వీరిని నియమిస్తారు. తొలుత 28 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. దీన్ని ఇంటర్న్‌షిప్‌గా భావిస్తారు. వీరిని మల్టీ టాస్క్ టెక్నీషియన్స్‌గా పేర్కొంటారు. ఇంటర్న్‌షిప్ కాలంలో పనితీరు మదింపు చేసి, ఆ తర్వాత బ్రిడ్జ్ కోర్సుల రూపంలో ఉన్నతస్థాయి నైపుణ్య శిక్షణ ఇస్తారు. వీరికి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ శిక్షణ ఇస్తుంది. శిక్షణకు జాతీయ ఆరోగ్యమిషన్ (కుటుంబ సంక్షేమ శాఖ), ఏపీ హెల్త్ స్ట్రెంగ్త్‌నింగ్ ప్రాజెక్ట్, సాంకేతిక విద్యా శాఖ, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ల నోడల్ ఏజెన్సీలుగా పనిచేస్తాయి. వేతనాలు ఆయా విభాగాలు నిర్ణయించాల్సి ఉంటుంది.
విధుల నిర్వహణ ఇలా..
ఆక్సిజన్ సరఫరా విషయంలో ఎంటీటీలు ప్రత్యేక విధులు ఎలా ఉండాలన్న దానిపైనా మార్గదర్శకాలు రూపొందించారు. ఆక్సిజన్ ఎకో సిస్టంపై అవగాహన, ఆక్సిజన్ వినియోగంపై పర్యవేక్షణ, ఆస్పత్రుల్లో రోగులకు ఆక్సిజన్ డెలివరీ ఏవిధంగా వెళుతోంది, ఆక్సిజన్ పరికరాల పరిశుభ్రత, నిర్వహణ వీరి విధుల్లో ఉంటాయి. మల్టీ పారామానిటర్, వెంటిలేటర్లు, సిపాప్, బైపాప్‌ల పర్యవేక్షణతో పాటు, పీఎస్‌ఏ (ప్రెజర్ స్వింగ్ అబ్జార్బేషన్) ప్లాంట్ కార్యకలాపాలు, జియోలైట్స్, కంప్రెషర్‌లు, పీఎస్‌ఏ ప్లాంట్ ఏర్పాటు దశలో చర్యలు, బైపాస్ సిస్టం, తనిఖీలు, విద్యుత్ కనెక్షన్‌లు, ప్లాంట్ షట్‌డౌన్, తిరిగి పునరుద్ధరణ వంటి అన్ని విధులనూ ఎంటీటీలే చూసుకోవాల్సి ఉంటుంది. జిల్లాల్లో కలెక్టర్ల స్థాయిలో సెలక్షన్ కమిటీ ద్వారా వీరిని నియమించుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment