యాంటీ జెన్, ఆర్టీ పీసీఆర్, ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు.. ఇంకా మరెన్నో నిన్నా మొన్నటి దాకా చెవుల్లో మార్మోగిపోయిన పేర్లు. ఇప్పుడు కోవిడ్ కొంత శాంతించినా.. దాని బారిన పడ్డవారు తమ ప్రాణాలు నిలుపుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఆర్థికంగా కుదేలైపోయారు.
సాక్షి, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి దెబ్బకు దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి తారుమారు అయ్యింది. కోవిడ్ చికిత్స కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో అనేక కుటుంబాలు ఏడాదిలో సంపాదించే సొమ్ములో సగానికి పైగా ఆస్పత్రి ఖర్చులకే సరిపోయాయి. కోవిడ్ చికిత్స కోసం దేశ ప్రజలు పెట్టిన ఖర్చు వివరాలపై ఇటీవల చేపట్టిన సర్వేలో అనేక విషయాలు వెల్లడయ్యాయి.
రూ. 64,000 కోట్లు
కరోనా టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌కు ప్రజలు చేసిన ఖర్చుపై పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియాతో పాటు అమెరికాకు చెందిన డ్యూక్ గ్లోబల్ హెల్త్ ఇన్సిస్టిట్యూట్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఈ సర్వే వివరాల ప్రకారం... కోవిడ్ పరీక్షలు, చికిత్సల కోసం దేశ ప్రజలు ఏకంగా రూ. 64,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తేలింది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం వేసిన అంచనా వ్యయం రూ.35,000 కోట్ల కంటే దాదాపు రెట్టింపు ఖర్చు చికిత్సకు అయ్యింది.
ఇంకా ఎక్కువే
కరోనా చికిత్సకు వివిధ రాష్ట్రాలు విధించిన పరిమితులను పరిగణలోకి తీసుకుని తాము ఈ నివేదిక సిద్ధం చేసినట్టు ఈ సర్వేలో కీలకంగా వ్యవహరించిన శక్తివేల్ సెల్వరాజ్ పేర్కొన్నారు. అంతేకాదు తాము కేవలం ఆస్పత్రి ఖర్చులనే పరిగణలోకి తీసుకున్నామని, ఆస్పత్రికి రానుపోను రవాణా, మరణాలు సంభవిస్తే అంత్యక్రియులు తదితర ఖర్చులు లెక్కించ లేదని తెలిపారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం వ్యయం మరింతగా పెరుగుతుందన్నారు.
ఐసీయూలో చికిత్సకు
ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో కరోనా చికిత్స పొందిన వారి కుటుంబాల బడ్జెట్ అయితే చిన్నాభిన్నమైంది. ఒక ఏడాది మొత్తం సంపాదనలో వివిధ కేటగిరిల వారీగా కరోనా చికిత్సకు అయిన ఖర్చు వివరాలు ఇలా ఉన్నాయి.
- క్యాజువల్స్ వర్కర్స్‌లో తమ వార్షిక ఆదాయంలో 86 శాతాన్ని కరోనా చికిత్సకే వెచ్చించారు.
- శాలరీడ్ ఎంప్లాయిస్‌లో తమ ఆదాయంలో 50 శాతాన్ని ఐసీయూ చికిత్స కోసం ఖర్చు చేశారు.
- సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తుల సంవత్సర ఆదాయంలో 66 శాతం కోవిడ్ చికిత్స ఖర్చులకే సరిపోయింది
హోం ఐసోలేషన్‌లో ఉన్నా..
కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆస్పత్రికి పోకుండా హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందినా ఆర్థిక సమస్యలు తప్పలేదు. హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ క్యాజువల్ వర్కర్స్ తమ ఆదాయంలో 43 శాతం నష్టపోగా స్వయం ఉపాధి పొందే వారు తమ ఆదాయంలో నాలుగో వంతు కోల్పోయారని సర్వేలో తేలింది. శాలరీ ఎంప్లాయిస్ విషయంలో ఇది 15 శాతంగా నమోదు అయ్యింది.
పరీక్షలు కూడా భారమే
దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో RT-PCR పరీక్షలకు సగటున రూ. 2200 వసూలు చేశారు. సాధారణంగా ఓ క్యాజువల్ లేబర్ వారం సంపాదన కూడా ఇంతే ఉంటుంది. ఒక్కరికిలో ఈ కరోనా లక్షణాలు కనిపించినా.. ఆ ఫ్యామిలీ మొత్తానికి పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పరీక్షలకు కూడా ప్రజలు భారీగానే ఖర్చు పెట్టారని సర్వే పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment