expenditures.
-
పట్టణ తలసరి వ్యయంలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: సగటు భారతీయుడి నెలవారీ ఖర్చు పట్టణాల్లో రూ.6,459 ఉంటే, అదే గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి రూ.3,773గా ఉన్నట్లు ఓ నివేదిక తేల్చింది. పట్టణ ప్రాంతాల్లో ఆహారేతర నెలవారీ ఖర్చు రూ.3,929 కాగా ఆహారానికి సంబంధించి రూ.2,530 వ్యయం చేస్తున్నట్లు తెలిపింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర ఖర్చు నెలకు రూ.2,023 కాగా ఆహారానికి రూ. 1,750 వ్యయం చేస్తున్నారు. పెద్ద రాష్ట్రాల్లో సగటు పట్టణ నెలవారీ తలసరి వ్యయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సగటు భారతీయుడి నెలవారీ ఖర్చులు ఎలా ఉంటాయి? వేటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు? పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాల తీరు ఎలా ఉంటుంది? ఇవన్నీ అందరికీ ఆసక్తిని కలిగించే అంశాలే. ఈ నేపథ్యంలోనే..‘హౌస్‌హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ (గృహావసరాల వినియోగ ఖర్చు) (మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్–ఎంపీసీఈ (నెలవారీ తలసరి ఖర్చు) సర్వే 2022–23’పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. గతంలో కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే పేరిట ప్రతి ఐదేళ్లకు సర్వే నిర్వహిస్తుండగా, చివరగా 2011–12లో దీనిని నిర్వహించారు. ఇప్పుడు పదేళ్ల తర్వాత తాజా సర్వే నిర్వహించారు. అయితే సర్వేకు అనుసరించిన విధానం (మెథడాలజీ)లో మార్పుల కారణంగా గతంలో నిర్వహించిన అధ్యయనాలతో దీనిని పోల్చలేదని నేషనల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్వో) తెలిపింది. కాగా ఇటీవల విడుదల చేసిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ తర్వాత ఢిల్లీ, హిమాచల్ పెద్ద రాష్ట్రాల్లో సగటు పట్టణ నెలవారీ తలసరి వ్యయంలో రూ.8,251తో తెలంగాణ టాప్‌లో ఉండగా, ఢిల్లీ (రూ.8,250), హిమాచల్‌ప్రదేశ్ (రూ.8,083) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే మొత్తంగా చూస్తే చండీగఢ్ (రూ.12,577) మొదటి స్థానంలో ఉండగా, సిక్కిం (రూ.12,125), అండమా¯న్ అండ్ నికోబార్ (రూ.10,268), గోవా (రూ.8,761), అరుణాచల్ ప్రదేశ్ (రూ.8,649) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక పట్టణాల్లో శ్రీమంతులుగా ఉన్న టాప్ 5 శాతం మంది రూ.20,824 వ్యయం చేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,501 ఖర్చు చేస్తున్నారు. మరోవైపు దిగువ స్థాయిలో ఉన్న 5 శాతం మంది పట్టణాల్లో రూ.2,001, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,373 ఖర్చు చేస్తున్నట్లు నివేదిక వివరించింది. -
లక్ష్యంలో 63.6 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి ముగిసే నాటికి బడ్జెట్ లక్ష్యంలో 63.6 శాతానికి చేరింది. విలువలో ఇది రూ.11 లక్షల కోట్లని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. 2023–24లో ద్రవ్యలోటు రూ.17.35 లక్షల కోట్లు గా ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. జీడీపీ అంచనాల్లో ఇది 5.8 శాతం. కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (కాగ్) విడుదల చేసిన గణాంకాలు చూస్తే.. ► ప్రభుత్వ మొత్తం ఆదాయం రూ.22.52 లక్షల కోట్లు (2023–24 బడ్జెట్ అంచనాల్లో ఇది 81.7 శాతం). ఇందులో రూ.18.8 లక్షల కోట్లు నికర పన్ను ఆదాయం. రూ.3.38 లక్షల కోట్లు పన్ను యేతర ఆదాయం. రూ.34,219 కోట్లు నాన్–డెట్ క్యాపిటల్ రిసిట్స్ (రుణాల రికవరీ, ఇతర క్యాపిటల్ రిసిట్స్). ► కేంద్ర వ్యయాలు రూ.33.54 లక్షల కోట్లు (బడ్జెట్లో 74.7 శాతం). వీటిలో రూ.26.33 లక్షల కోట్లు రెవెన్యూ అకౌంట్‌కు సంబంధించినది కాగా, రూ.7.2 లక్షల కోట్లు క్యాపిటల్ అకౌంట్‌కు సంబంధించినది. ► వెరసి ద్రవ్యలోటు రూ.11.02 లక్షల కోట్లు. -
ద్రవ్యలోటు కట్టడిలో తగ్గేదేలే..!
ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు కట్టడిలో తన చిత్తశుద్దిని కేంద్రం తాజా బడ్జెట్ ద్వారా ఉద్ఘాటించింది. ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.1 శాతానికి తగ్గుతుందని మధ్యంతర బడ్జెట్ అంచనావేసింది. 2025–26 నాటికి ఈ లోటును 4.5 శాతానికి తగ్గాలన్నది ప్రభుత్వ రోడ్‌మ్యాప్ అన్న సంగతి తెలిసిందే. గడచిన ఆర్థిక సంవత్సరం (2022–23) ద్రవ్యలోటు 6.4 శాతం. మార్చితో ముగిసే ప్రస్తుత (2023–24) ఆర్థిక సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని 5.9 శాతంగా గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన సమరి్పంచిన బడ్జెట్ నిర్దేశించుకుంది. అయితే ఇది 5.8 శాతానికే పరిమితమవుతుందని 2024–25 మధ్యంతర బడ్జెట్ పేర్కొంది. భారీ పన్ను ఆదాయాలు ద్రవ్యలోటు అంచనా సానుకూలంగా 5.9 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గడానికి కారణంగా వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు విలువలో రూ.17,34,773 కోట్లు ఉంటే, 2024–25 రూ.16,85,494 కోట్లకు తగ్గుతుందని మధ్యంతర బడ్జెట్ పేర్కొంది. ఇక స్థూల, నికర మార్కెట్ రుణాలు 2024–25లో వరుసగా రూ.14.13 లక్షల కోట్లు, రూ.11.75 లక్షల కోట్లుగా ఉంటాయని బడ్జెట్ తెలిపింది. ఈ రెండు సంఖ్యలూ 2023–24తో పోల్చితే తక్కువే కావడం గమనార్హం. ప్రభుత్వం తక్కువ రుణాలను తీసుకోవడం వల్ల ప్రైవేట్ రంగానికి పెద్ద ఎత్తున రుణాల లభ్యత సులభతరం అవుతుందని ఆర్థికమంత్రి వ్యాఖ్యానించారు. ద్రవ్యలోటును తగ్గించడానికి భారతదేశం నిర్దేశించిన లక్ష్యాలను మెరుగుపరిచిందనే సందేశాన్ని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు విస్తృత స్థాయిలో పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ అనంతర సమావేశంలో అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ, ‘‘మేము ఇంతకుముందు ఇచి్చన ద్రవ్యలోటు రోడ్‌మ్యాప్‌ను అనుసరించడంలో, మెరుగుపరచడంలో ఎంతో పురోగతి సాధిస్తున్నాం. ఇది ప్రతి రేటింగ్ సంస్థకు సూటిగా పంపుతున్న ఒక స్పష్టమైన సందేశం. ఏజెన్సీలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని అన్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి భారీ డివిడెండ్లు, పన్ను సమీకరణలో మెరుగుదల ద్రవ్యలోటు కట్టడిలో లక్ష్య సాధనకు దోహదపడుతున్న అంశాలు. గ్లోబల్ రేటింగ్ దిగ్గజ సంస్థలు– ఫిచ్, ఎస్అండ్పీ, మూడీస్లు దేశానికి అతి దిగువస్థాయి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్‌ను ఇస్తున్నాయి. చెత్త స్థాయికి ఈ రేటింగ్ కేవలం ఒకమెట్టు ఎక్కువ. అధిక రేటింగ్ కోసం కేంద్రం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అంతగా ఫలితం ఇవ్వడంలేదు. ఒకదేశంలో పెట్టుబడులను పెట్టడానికి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, ఆయా సంస్థలు ఈ రేటింగ్‌లనే ప్రాతిపదికగా తీసుకుంటాయి. -
ఎకానమీకి ‘కరెంట్ అకౌంట్’ అనిశ్చితి
న్యూఢిల్లీ: నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారక ద్రవ్యం నికర వ్యత్యాలను ప్రతిబింబించే భారత్ కరెంట్ అకౌంట్.. తాజా అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితికి అద్దం పడుతోంది. త్రైమాసికాల పరంగా చూస్తే, 2023 జనవరి– మార్చి మధ్య 0.2 శాతం ఉన్న కరెంట్ అకౌంట్ లోటు– క్యాడ్ (జీడీపీ విలువలో) తదుపరి త్రైమాసిక కాలంలో (2023 ఏప్రిల్–జూన్) మధ్య 1.1 శాతానికి పెరిగింది. విలువల్లో చూస్తే ఈ పరిమాణం 1.3 బిలియన్ డాలర్ల నుంచి 9.2 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఎగుమతులకన్నా దిగుమతులు భారీగా పెరగడం (వాణిజ్యలోటు) దీనికి కారణం. ఇక వార్షికంగా చూస్తే మాత్రం 2022 ఏప్రిల్–జూన్ మధ్య 2.1 శాతంగా ఉన్న క్యాడ్ తాజా సమీక్షా క్వార్టర్లో (2023 ఏప్రిల్–జూన్) 1.1 శాతానికి తగ్గడం గమనార్హం. విలువల్లో సైతం 17.9 బిలియన్ డాలర్ల నుంచి 9.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. వార్షికంగా (పోలి్చ) చూస్తే, అంతర్జాతీయంగా ఎకానమీ మందగమన పరిస్థితులను ఇది సూచిస్తోంది. త్రైమాసికంగా బలహీనతలు... ఇటీవలి నెలల్లో భారత్ వస్తు ఎగుమతులు క్షీణతలో కొనసాగుతున్నాయి. సేవల రంగానిదీ ఇదే ధోరణి. కంప్యూటర్ ఎగుమతుల్లో క్షీణత కనబడుతోంది. పర్యాటకం, వ్యాపార సేవల్లో కూడా ఇదే బలహీన ధోరణి నెలకొంది. విదేశాల్లో ఉద్యోగాలు చూసే భారతీయులు దేశానికి డాలర్ల పంపకంసహా వివిధ అంశాలకు సంబంధించిన ప్రైవేటు ట్రాన్స్ఫర్ రిసిట్స్ (ఆదాయాలు) త్రైమాసికంగా తగ్గుతున్నాయి. 2023 జనవరి–మార్చి మధ్య ఇలా దేశానికి వచి్చన మొత్తాల విలువ 28.6 బిలియన్ డాలర్లయితే, ఏప్రిల్–జూన్ మధ్య 27.1 బిలియన్ డాలర్లకు తగ్గింది. దేశ దిగుమతుల భారం మరోవైపు పెరుగుతుండడం గమనార్హం. క్రూడ్ ధరలు ఇటీవల పెరగడం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. భారత్ వస్తు ఎగుమతులు 2023 ఆగస్టులో వరుసగా ఏడవనెల వృద్ధిలేకపోగా క్షీణబాటనే నడిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఐదు నెలల్లో ఎగుమతులు 11.9 శాతం క్షీణించి 172.95 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మరోవైపు భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం ఎగుమతులు ఆగస్టులో 26.5 బిలియన్ డాలర్ల (2022 ఆగస్టు) నుంచి స్వల్పంగా 26.39 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2023–24లో 2.1 శాతానికి అప్! ఈ నేపథ్యంలో 2023–24 జూలై–ఆగస్టు త్రైమాసికంలో (క్యూ2) క్యాడ్ జీడీపీలో 2.3 శాతం (విలువల్లో 19 నుంచి 21 బిలియన్ డాలర్లు) విలువకు చేరవచ్చని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితీ నయ్యర్ అంచనావేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ శాతం 2.1 శాతంగా (73 బిలియన్ డాలర్ల నుంచి 75 బిలియన్ డాలర్లు) ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు. 2022–23లో క్యాడ్ జీడీపీలో 2 శాతం. విలువలోల 67 బిలియన్ డాలర్లు. విదేశీ రుణ భారం 629 బిలియన్ డాలర్లు భారత్ విదేశీ రుణ భారం జూన్ ముగిసే నాటికి 629.1 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. మార్చితో ముగిసిన నెలతో (624.3 బిలియన్ డాలర్లు) పోలి్చచూస్తే ఈ విలువ 4.7 బిలియన్ డాలర్లు పెరిగింది. అయితే రుణ భారం జీడీపీతో పోలి్చతే ఇదే కాలంలో 18.8 శాతం నుంచి 18.6 శాతానికి తగ్గింది. గణాంకాల ప్రకారం దీర్ఘకాలిక రుణం (ఏడాదిపైన మెచ్యూరిటీ) మార్చితో పోలి్చతే 9.6 బిలియన్ డాలర్లు పెరిగి 505.5 బిలియన్ డాలర్లకు చేరింది. -
Budget 2024-2025: వ్యయ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: వ్యయ వివరాలు అందించాలని వివిధ మంత్రిత్వ శాఖలను ఆర్థికశాఖ కోరింది. 2024–25 మధ్యంతర బడ్జెట్‌పై కసరత్తు, బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ప్రక్రియను ప్రారంభించినట్లు ఒక సర్క్యులర్ పేర్కొంది. వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నందున మధ్యంతర బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. జూలై 2019లో తన మొదటి పూర్తి బడ్జెట్‌ను సమరి్పంచిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రానున్నది ఆరవ బడ్జెట్. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి, 2024–24కు సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను సమర్పిస్తుంది. ‘‘వ్యయ విభాగం కార్యదర్శి అధ్యక్షతన ప్రీ–బడ్జెట్ సమావేశాలు అక్టోబర్ 2023 రెండవ వారంలో ప్రారంభమవుతాయి. దాదాపు 2023 నవంబర్ మధ్య వరకు కొనసాగుతాయి’’ అని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ నేతృత్వంలో పనిచేసే బడ్జెట్ డివిజన్ సర్క్యులర్ (2024–25) ఒకటి వివరించింది. ప్రీ–బడ్జెట్ సమావేశాల్లో అంచనాల ఖరారు సెప్టెంబర్ 1 నాటి ఈ సర్క్యులర్ ప్రకారం, అవసరమైన అన్ని వివరాలను అక్టోబర్ 5 లోపు సమరి్పంచేలా ఆర్థిక సలహాదారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అటు తర్వాత ప్రీ–బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల అనంతరం 2024–25 మధ్యంతర బడ్జెట్‌కు సంబంధించి అంచనాలు తాత్కాలిక ప్రాతిపదికన ఖరారవుతాయి. ప్రీ–బడ్జెట్ సమావేశాల సందర్భంగా, మంత్రిత్వ శాఖలు లేదా శాఖల ఆదాయాలతో పాటు వ్యయాలకు నిధుల ఆవశ్యకతపై చర్చించడం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. 2024–25 మధ్యంతర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమరి్పంచే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఫిబ్రవరి–చివరిలో బడ్జెట్‌ను సమర్పించే వలస పాలన సంప్రదాయాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 సంవత్సరంలో ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను సమరి్పంచే విధానాన్ని ప్రారంభించారు. తాజా ప్రక్రియతో ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండే మంత్రిత్వ శాఖలకు బడ్జెట్ కేటాయింపు నిధులు అందుబాటులో ఉంటాయి. గతంలో ఫిబ్రవరి చివరిలో బడ్జెట్‌ను సమరి్పంచినప్పుడు మూడు–దశల పార్లమెంట్ ఆమోద ప్రక్రియ... వర్షాల ప్రారంభానికి వారాల ముందు మే మధ్యలో పూర్తయ్యేది. దీనితో ప్రభుత్వ శాఖలు వర్షాకాలం ముగిసిన తర్వాత ఆగస్టు–ఆఖరు లేదా సెపె్టంబర్ నుండి మాత్రమే ప్రాజెక్టులపై వ్యయాలను ప్రారంభించేవి. -
రాష్ట్రంలో తలసరి ఆరోగ్య ఖర్చు రూ.5,110
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కలిపి ఆరోగ్యంపై చేస్తున్న తలసరి ఖర్చు రూ. 5,110గా ఉందని, ఈ అంశంలో తెలంగాణ దేశంలో ఎనిమిదో స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆరోగ్య ఖర్చు రూ. 5,114గా ఉందని తెలిపింది. ఆరోగ్యంపై దేశంలో అత్యధికంగా కేరళ తలసరి రూ.10,607 ఖర్చుతో తొలిస్థానంలో నిలిచిందని వివరించింది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య ఖాతాల అంచనాల నివేదిక–2019–20లో వివరాలను తాజాగా వెల్లడించింది. తెలంగాణలో ప్రభుత్వం, ప్రైవేట్ రంగం కలిపి ఆరోగ్యంపై రూ.18,908 కోట్లు వ్యయం అవుతోందని.. ఇది రాష్ట్ర జీఎస్డీపీలో 2 శాతమని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యయం రూ. 27,105 కోట్లు అని, ఇది ఆ రాష్ట్ర జీఎస్డీపీలో 2.8 శాతమని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యంపై రూ.8,374 కోట్లు ఖర్చు చేస్తోందని.. రాష్ట్ర మొత్తం ఆరోగ్య ఖర్చులో ఇది 44.3 శాతమని పేర్కొంది. ప్రభుత్వం తలసరి చేస్తున్న ఖర్చు రూ.2,125గా ఉందని తెలిపింది. రాష్ట్ర బడ్జెట్లో 6.7 శాతాన్ని ఆరోగ్య రంగం కోసం వ్యయం చేస్తున్నారని.. దీనిలో దేశంలో తెలంగాణ ఏడో స్థానంలో ఉందని వెల్లడించింది. అత్యధికంగా కేరళ బడ్జెట్లో 8 శాతం ఖర్చు చేస్తోందని వివరించింది. ఏపీలో ప్రభుత్వం 9,005 కోట్లు ఆరోగ్యంపై ఖర్చు చేస్తోందని వెల్లడించింది. ప్రజారోగ్య బీమాలో తెలంగాణ పదో స్థానం తెలంగాణలో మొత్తం వైద్య ఖర్చులో 41.6 శాతం ప్రజలు సొంత జేబు నుంచి ఖర్చు చేస్తున్నారు. ఈ అంశంలో దేశంలో అతి తక్కువ ఖర్చు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. అత్యంత తక్కువగా 31.8 శాతం ప్రజల ఖర్చుతో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఇక దేశంలో ప్రైవేట్ ఆరోగ్య బీమా కోసం ప్రజలు ఏటా చేస్తున్న వ్యయం రూ.45,838 కోట్లు.ఇందులో ఉద్యోగుల ఖర్చు రూ.25,881 కోట్లు, మిగతాది ఇతరులు ఖర్చు చేస్తున్నారు. ప్రజలు సొంత జేబు నుంచి చేస్తున్న ఖర్చులో భారత దేశం ప్రపంచంలో 67వ స్థానంలో ఉంది. దేశంలో ఒక్కొక్కరు సగటున ఏడాదికి 100 డాలర్లు (సుమారు రూ.8,200) ఖర్చు చేస్తున్నారు. అత్యంత తక్కువగా కిరిబితి దేశంలో ఏటా కేవలం 0.2 డాలర్లు (రూ.16) ఖర్చు చేస్తున్నారు. ప్రజలు తమ జేబు నుంచి పెట్టుకునే తలసరి ఖర్చుతెలంగాణలో రూ.2,263 కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో అంతకంటే తక్కువగా రూ.1,699 ఉంది. ప్రజారోగ్య బీమాకు సంబంధించి.. తెలంగాణలో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రూ.300 కోట్ల ఖర్చుతో పదో స్థానంలోనిలిచింది. అత్యధికంగా తమిళనాడు ‘ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం’కింద రూ.1,467 కోట్ల వ్యయంతో మొదటి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.1,305 కోట్లు ఖర్చు చేస్తూ రెండో స్థానంలో నిలిచింది. దేశంలో మొత్తంగా ఆరోగ్యంపైజరుగుతున్న వ్యయంలో..కుటుంబాలు పెట్టే ఖర్చు 59.2 శాతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు 20 శాతం, కేంద్రం 12 శాతం, స్వచ్ఛంద సంస్థలు 8 శాతం, స్థానిక సంస్థలు 0.99% ఖర్చు చేస్తున్నాయి. మిగతా ఖర్చు ఇతర పద్ధతుల్లో జరుగుతోంది. దేశంలో ప్రభుత్వం ద్వారా అందే వైద్యసేవలతో 25.5 శాతం, ప్రైవేట్ ద్వారా 33 శాతం, ఫార్మసీల ద్వారా 22 శాతం, లే»ొరేటరీల ద్వారా 4 శాతం, ఇతర పద్దతుల ద్వారా మిగతా ఖర్చు జరుగుతోంది. ప్రజలు అత్యధికంగా ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నది స్విట్జర్లాండ్‌లో.. అక్కడ ఏటా 2,201 డాలర్లు (సుమారు రూ.1.8 లక్షలు) ఖర్చు చేస్తున్నారు. అమెరికాలో ఏటా 1,163 డాలర్లు (సుమారు రూ.95 వేలు) ఖర్చు చేస్తున్నారు. -
చౌక ఇళ్ల రుణ విభాగంపై ప్రభావం
ముంబై: అందుబాటు ధరల్లోని (అఫర్డబుల్) ఇళ్లకు గృహ రుణాలను అందించే కంపెనీలపై పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా నిర్మాణ రంగ వ్యయాలు పెరిగిపోతాయని పేర్కొంది. ఇది అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానించేందుకు దారితీస్తుందని విశ్లేషణ వ్యక్తం చేసింది. రూ.25 లక్షలు, అంతకంటే దిగువ బడ్జెట్ ఇళ్లను అఫర్డబుల్‌గా చెబుతారు. ఆర్థిక అనిశ్చితుల ప్రభావం ఈ విభాగంపై ఎక్కువగా ఉండదని లోగడ నిరూపితమైందంటూ.. గడిచిన దశాబ్ద కాలంలో ఈ విభాగం వేగంగా పురోగతి సాధించిందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. గత ఐదేళ్ల కాలంలో చూస్తే హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్లో వృద్ధిని.. అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి అధిగమించడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఈ విభాగంలో తొలుత కొంత జోరు కనిపించినప్పుటికీ అది ఇప్పుడు సాధారణ స్థాయికి దిగొచ్చిందని పేర్కొంది. ‘‘అధిక ద్రవ్యోల్బణం కారణంగా రుణ గ్రహీతల వద్ద నగదు ప్రవాహం తగ్గిపోతుంది. నిర్మాణ వ్యయాలు పెరగడం వల్ల ప్రాపర్టీ ధరలు పెరగడమే కాకుండా, కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులు తగ్గుతాయి. ప్రభుత్వం అత్యవసర రుణ హామీ పథకాన్ని నిలిపివేయడం అనే సవాలును ఈ విభాగం ఎదుర్కొంటోంది’’ అని ఇండియా రేటింగ్స్ నివేదిక వివరించింది. ఇటీవలి కాలంలో ఆర్బీఐ 0.90 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. ఈ చర్యతో బ్యాంకులు సైతం వెంటనే పలు రుణాల రేట్లను సవరించేశాయి. ప్రస్తుత రెపో రేటు కరోనా ముందున్న రేటు కంటే పావు శాతం తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో హౌసింగ్ ఫైనాన్స్ (గృహ రుణాలు) మార్కెట్ 13 శాతం వృద్ధిని చూపిస్తుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. పెరగనున్న భారం ‘‘ఒక శాతం మేర వడ్డీ రేట్లు పెరిగితే రుణాల ఈఎంఐ 6.1–6.4 శాతం మేర పెరుగుతుంది. అందుబాటు ధరల ఇళ్ల రుణ గ్రహీతలపై ఈ పెరుగుదల 5.3 శాతంగా ఉంటుంది’’అని ఈ నివేదిక వివరించింది. వడ్డీ రేట్ల సైకిల్ ఇలానే ముందుకు సాగితే 2 శాతం మేర రేటు పెరగడం వల్ల ఈఎంఐపై పడే భారం 10.8–13 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది. ‘‘ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కాల వ్యవధి పెంచడం ద్వారా (ఈఎంఐ పెంచకుండా) రుణ దాతలు ఆ ప్రభావాన్ని అధిగమించగలరు. కొత్త కస్టమర్లకు మాత్రం పెరిగిన రేట్ల మేర ఈఎంఐ అధికమవుతుంది. ఇది ఇల్లు కొనుగోలు సెంటిమెంట్‌ను మధ్య కాలానికి ప్రతికూలంగా మార్చేయవచ్చు’’అని ఈ నివేదిక వివరించింది. నిర్మాణంలో వాడే సిమెంట్, స్టీల్, కాంక్రీట్ సహా ఎన్నో ముడి సరుకుల ధరల గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది. కార్మికులకు చెల్లింపులు కూడా పెరిగిన విషయాన్ని పేర్కొంది. నిర్మాణ వ్యయం 20–25 శాతం మేర పెరిగేందుకు ఈ అంశాలు దారితీశాయని తెలిపింది. పెరిగిన ధరల ప్రభావాన్ని నిర్మాణదారులు పూర్తిగా కొనుగోలుదారులకు బదిలీ చేయలేవని పేర్కొంటూ.. మధ్య కాలానికి ప్రాపర్టీ ధరలపై ఇవి ప్రతిఫలిస్తాయని అంచనా వేసింది. -
వామ్మో ‘జూన్’.. తలుచుకుంటే వణుకు పుడుతోంది!
‘జూన్ అంటేనే మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ నెలలోనే విద్యాసంస్థలు, వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల్లో ఫీజులు చుక్కలనంటుతున్నాయి. బుక్స్, యూనిఫాం, పెన్నులు, పెన్సిల్ ఇతరాత్ర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు వానాకాలం సీజన్ మొదలవ్వడంతో రైతులు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారు. విత్తనాలు, ఇతర ఖర్చులకు డబ్బుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూనే బ్యాంకర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఈనెల ఎలా గట్టేక్కుతుందా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.’ సాక్షి,కరీంనగర్: పేద, మధ్య తరగతి కుటంబీకుల జేబులకు చిల్లుపడే మాసం వచ్చేసింది. ఈ నెల 12 నుంచి కొత్తవిద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో పిల్లల చదువుకు పెట్టే ఖర్చులపై తల్లిదండ్రులు బేరీజు వేసుకుంటున్నారు. కొత్తగా అడ్మిషన్ తీసుకునేవారు ప్రైవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్న అడ్మిషన్, డొనేషన్ ఫీజులు చూసి జంకుతున్నారు. ఇదివరకే చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం తదితర వస్తువుల కొనుగోలుతో తల్లిదండ్రులకు జేబులకు చిల్లుపడనుంది. దీంతో ‘వామ్మో జూన్’ అంటూ తలపట్టుకుంటున్నారు. ఒక వైపు తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలి, ఏయే స్కూల్లో ఏ స్థాయి ఫలితాలు వచ్చాయి, తదితర అంశాలపై తల్లిదండ్రులు విశ్లేషించుకుంటున్నారు. అప్పు చేసైనా పైసలున్న బడికి.. జిల్లావ్యాప్తంగా సుమారు 600 పైగా ప్రైవేట్ పాఠశాలల్లో వాటి విద్యాప్రమాణాలు, ఇతర అంశాలతో కూడిన స్థాయిని బట్టి ఏడాదికి రూ.10 వేల నుంచి మొదలుకొని రూ.లక్షకు పైగా ఫీజులున్నాయి. అందులోనూ ఐఐటీ, ట్యూషన్, సాంస్కృతిక, కరాటే తదితర అంశాలు నేర్పించేందుకు అదనంగా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రైవేట్ స్కూళ్లు వసూలు చేస్తున్నాయి. వీటిలో కొన్ని తోకల పేరుతో 1వ తరగతికే రూ.లక్షల్లో వసూలు చేయడం విశేషం. కొన్ని పాఠశాలలైతే నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అప్పు చేసైనా ప్రైవేట్ స్కూల్ అనేది వేళ్లూనుకోవడంతో దిగువ, మధ్య తరగతి జనం కూడబెట్టుకున్న దానికి మరికొంత అప్పు చేసి పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. రైతులకు ఖరీఫ్ భారం ఏటా రైతులకు వానాకాలం సీజన్ భారంగా మారుతోంది. ఈ యాసంగి పంటలు పండినా ధా న్యం డబ్బు చేతికి రాని దైన్య స్థితిలో రైతులు ఉ న్నారు. వ్యవసాయ పనులూ అంతంతే. ఇతరత్రా కూలీ పనులు దొరక్క గ్రామీణులుæ ఉపాధి పనుల కు వెళ్లినా కొద్ది రోజులుగా డబ్బులు అందక వారి పరిస్థితి గందరగోళంగా ఉంది. మండుతున్న ఎండల్లో ఉపాధి పనులకు వెళ్తే రూ.200 నుంచి రూ. 250 వరకు దక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో ఖరీ ఫ్‌నకు సంబంధించి ఎరువులు, విత్తనాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో సరిపడా రుణాలు లభించక అప్పు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. పిల్లల చదువు, వ్యవసాయ ఖర్చులు అంచనా వేయలేని స్థితి ఏర్పడడంతో పేద, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన నెలకొంది. చదవండి: కుక్క కరిచిందా.. అయితే రూ.10వేలు తీసుకోవడం మరచిపోకండి! -
ద్రవ్యలోటు రూ.3.21 లక్షల కోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై ముగిసే సరికి రూ.3.21 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2021–22 వార్షిక బడ్జెట్ అంచనాలతో పోల్చితే ఇది 21.3 శాతం. 2021–22లో మొత్తం రూ.15,06,812 కోట్ల ద్రవ్యలోటు (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి–జీడీపీ అంచనాల్లో ఇది 6.8 శాతం) ఉంటుందన్నది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనా.ఈ లెక్కన ఆర్థిక సంవత్సరం జూలై ముగిసే నాటికి లక్ష్యంలో 21.3 శాతానికి ద్రవ్యలోటు చేరిందన్నమాట. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. తాజా గణాంకాలు ఇలా... - జూలై ముగిసే నాటికి ప్రభుత్వానికి వచ్చిన ఆదా యం రూ.6.83 లక్షల కోట్లు (బడ్జెట్ మొత్తం అంచనాల్లో 34.6%). ఇందులో రూ.5,29,189 కోట్లు పన్ను ఆదాయాలు. రూ.1,39,960 కోట్లు పన్నుయేతర ఆదాయాలు. రూ.14,148 కోట్లు నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్. నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్‌లో రూ.5,777 కోట్ల రుణ రికవరీలు, రూ.8,371 కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభించినవి ఉన్నాయి. - ఇక ఇదే సమయంలో వ్యయాలు రూ.10.04 లక్షల కోట్లు (2021–22 బడ్జెట్లో 28.8 శాతం) వీటిలో రెవెన్యూ అకౌంట్ నుంచి రూ.8,76,012 లక్షల కోట్లు వ్యయమవగా, రూ.1,28,428 కోట్లు క్యాపిటల్ అకౌంట్ నుంచి వ్యయం అయ్యాయి. రెవెన్యూ వ్యయాల్లో రూ.2,25,817 కోట్లు వడ్డీ చెల్లింపులుకాగా, రూ. 1,20,069 కోట్లు సబ్సిడీలకు వ్యయమయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 3.21 లక్షల కోట్లుగా ఉంది. 6.8 శాతం లక్ష్య సాధన కష్టమే! 2019–20లో ద్రవ్యలోటు 4.6 శాతం (స్థూల దేశీయోత్పత్తి–జీడీపీతో పోల్చి). అప్పటికే ఇది ఏడేళ్ల గరిష్టం. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతానికి (రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్నది లక్ష్యమయితే, కరోనా ఈ లక్ష్యానికి గండి కొట్టింది. భారీ వ్యయాలు, ఉద్దీపనల నేపథ్యంలో ద్రవ్యలోటు ఏకంగా 9.3 శాతానికి (రూ.18,21,461 కోట్లు) ఎగసింది. 2021–22లో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంటుందని ద్రవ్యలోటు 8 శాతం దాటిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం కొంత ధైర్యం చేసి ద్రవ్యలోటు లక్ష్యాలను పెంచవచ్చని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ వంటి పలువురు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రతిపాదనల అమలును రేటింగ్, బహుళజాతి ఆర్థిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయా పరిస్థితుల నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. చదవండి : ఎకానమీకి లోబేస్ భరోసా.. జీడీపీ జూమ్ -
కోవిడ్ చికిత్స... ఖర్చు చూస్తే గుడ్లు తేలేయాల్సిందే!
యాంటీ జెన్, ఆర్టీ పీసీఆర్, ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు.. ఇంకా మరెన్నో నిన్నా మొన్నటి దాకా చెవుల్లో మార్మోగిపోయిన పేర్లు. ఇప్పుడు కోవిడ్ కొంత శాంతించినా.. దాని బారిన పడ్డవారు తమ ప్రాణాలు నిలుపుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఆర్థికంగా కుదేలైపోయారు. సాక్షి, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి దెబ్బకు దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి తారుమారు అయ్యింది. కోవిడ్ చికిత్స కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో అనేక కుటుంబాలు ఏడాదిలో సంపాదించే సొమ్ములో సగానికి పైగా ఆస్పత్రి ఖర్చులకే సరిపోయాయి. కోవిడ్ చికిత్స కోసం దేశ ప్రజలు పెట్టిన ఖర్చు వివరాలపై ఇటీవల చేపట్టిన సర్వేలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. రూ. 64,000 కోట్లు కరోనా టెస్టింగ్, ట్రీట్మెంట్కు ప్రజలు చేసిన ఖర్చుపై పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియాతో పాటు అమెరికాకు చెందిన డ్యూక్ గ్లోబల్ హెల్త్ ఇన్సిస్టిట్యూట్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఈ సర్వే వివరాల ప్రకారం... కోవిడ్ పరీక్షలు, చికిత్సల కోసం దేశ ప్రజలు ఏకంగా రూ. 64,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తేలింది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం వేసిన అంచనా వ్యయం రూ.35,000 కోట్ల కంటే దాదాపు రెట్టింపు ఖర్చు చికిత్సకు అయ్యింది. ఇంకా ఎక్కువే కరోనా చికిత్సకు వివిధ రాష్ట్రాలు విధించిన పరిమితులను పరిగణలోకి తీసుకుని తాము ఈ నివేదిక సిద్ధం చేసినట్టు ఈ సర్వేలో కీలకంగా వ్యవహరించిన శక్తివేల్ సెల్వరాజ్ పేర్కొన్నారు. అంతేకాదు తాము కేవలం ఆస్పత్రి ఖర్చులనే పరిగణలోకి తీసుకున్నామని, ఆస్పత్రికి రానుపోను రవాణా, మరణాలు సంభవిస్తే అంత్యక్రియులు తదితర ఖర్చులు లెక్కించ లేదని తెలిపారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం వ్యయం మరింతగా పెరుగుతుందన్నారు. ఐసీయూలో చికిత్సకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కరోనా చికిత్స పొందిన వారి కుటుంబాల బడ్జెట్ అయితే చిన్నాభిన్నమైంది. ఒక ఏడాది మొత్తం సంపాదనలో వివిధ కేటగిరిల వారీగా కరోనా చికిత్సకు అయిన ఖర్చు వివరాలు ఇలా ఉన్నాయి. - క్యాజువల్స్ వర్కర్స్‌లో తమ వార్షిక ఆదాయంలో 86 శాతాన్ని కరోనా చికిత్సకే వెచ్చించారు. - శాలరీడ్ ఎంప్లాయిస్‌లో తమ ఆదాయంలో 50 శాతాన్ని ఐసీయూ చికిత్స కోసం ఖర్చు చేశారు. - సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తుల సంవత్సర ఆదాయంలో 66 శాతం కోవిడ్ చికిత్స ఖర్చులకే సరిపోయింది హోం ఐసోలేషన్‌లో ఉన్నా.. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆస్పత్రికి పోకుండా హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందినా ఆర్థిక సమస్యలు తప్పలేదు. హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ క్యాజువల్ వర్కర్స్ తమ ఆదాయంలో 43 శాతం నష్టపోగా స్వయం ఉపాధి పొందే వారు తమ ఆదాయంలో నాలుగో వంతు కోల్పోయారని సర్వేలో తేలింది. శాలరీ ఎంప్లాయిస్ విషయంలో ఇది 15 శాతంగా నమోదు అయ్యింది. పరీక్షలు కూడా భారమే దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో RT-PCR పరీక్షలకు సగటున రూ. 2200 వసూలు చేశారు. సాధారణంగా ఓ క్యాజువల్ లేబర్ వారం సంపాదన కూడా ఇంతే ఉంటుంది. ఒక్కరికిలో ఈ కరోనా లక్షణాలు కనిపించినా.. ఆ ఫ్యామిలీ మొత్తానికి పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పరీక్షలకు కూడా ప్రజలు భారీగానే ఖర్చు పెట్టారని సర్వే పేర్కొంది. -
భూపాలపల్లి: అభ్యర్థుల ఖర్చులు..మోపెడు
సాక్షి, భూపాలపల్లి: ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది అభ్యర్థుల ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. ఇటు కార్యకర్తలకు, అటు ఎన్నికల కార్యక్రమాలు, ప్రచారంలో పాల్గొన్న వారికి భోజన సదుపాయాలు, రోజూవారీ చెల్లింపులకు విపరీతంగా డబ్బులు కుమ్మరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పార్టీ నచ్చితే స్వచ్ఛందంగా చేరిన వ్యక్తులు సైతం ప్రస్తుతం నోట్లకు ఆశపడి ఎవరు డబ్బులిస్తే వారివైపు మారిపోతున్నారు. చివరికి రోడ్ షో అయినా బహిరంగ సభ అయినా పైసలు ఇవ్వనిదే జనాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీనికితోడు యువతను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు మద్యం, క్రికెట్ కిట్లు, ఇతరత్రా తాయిలాలను గతం నుంచే అలవాటు చేయడంతో ఇప్పుడు తప్పడం లేదని పలువురు అభ్యర్థులు పేర్కొంటున్నారు. దీంతో ప్రస్తుతం ఎన్నికల కమిషన్ అభ్యర్థులకు నిర్ణయించిన ప్రచార లెక్కల కంటే ఖర్చు అనేక రెట్లు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. రోజుకు మూడు పూటలు.. ఈసారి ఎన్నికల్లో కొత్త ప్రధాన పార్టీల అభ్యర్థులు నూతన సంప్రదాయాలకు తెరలేపారు. గతంలో ఎదైనా బహిరంగ సభ జరిగితేనో, కార్యకర్తల మీటింగ్‌లు ఉంటేనో భోజన సదుపాయాలు కల్పించేవారు. ప్రస్తుతం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోని అభ్యర్థులు నిత్యం మూడు పూటలా పొయ్యి వెలగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు తయారు చేయాల్సిందే. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల వెంట తిరిగే కార్యాకర్తల నుంచి మొదలు ఎన్నికల ప్రచారానికి తరలించే జనం వరకు రోజుకు దాదాపు 500 మంది వరకు ఉంటున్నారు. వీరందరికీ భోజన వసతితోపాటు ప్రచారానికి వచ్చిన వారికి అదనంగా రోజు కూలీలా చెల్లింపులు చేస్తున్నారు. సభలు, సమావేశాలకు.. గతంలో ఏదైనా మండలంలో ప్రచారం నిర్వహించాలంటే స్థానికంగా ఉండే ద్వితీయ శ్రేణి నాయకులు ఖర్చులు భరించేవారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కార్యక్రమం ఏదైనా అభ్యర్థి స్వయంగా భరించాల్సిందే. సభలకు అవసరమయ్యే టెంట్ల నుంచి మొదలు కుర్చీలు, స్టేజీ డెకరేషన్లకు, సభలో జనాలకు పంచే వాటర్ ప్యాకేట్ల వరకు విపరీతంగా డబ్బు వెదజల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక జనసమీకరణ అంటేనే అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గ్రామాల నుంచి సభాస్థలికి చేరాలంటే వాహనాలకు, అందులో వచ్చే ప్రజలకు రోజూవారీ భత్యంతోపాటు, భోజనాలు తప్పడంలేదు. గ్రామాల నుంచి ప్రజలను తరలించాలంటే రూ.200 నుంచి రూ.300 చెల్లించాల్సిదే. ఆ మొత్తం సైతం ముందుగా అడ్వాన్స్ ఇస్తేనే వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. కోలాటాలు, డీజేలు.. కోలాటాలు, డీజేలు, డప్పు చప్పుళ్లు లేనిదే ఏ నాయకుడు ప్రచారానికి రావడం లేదు. ఒక రోజుకు నాలుగైదు గ్రామాల్లో పర్యటన ఉందనుకుంటే ముందు రోజే ఆయా గ్రామాల్లో కోలాటం ఆడే వారిని, డీజేలు, డప్పు కొట్టేవారిని సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కోలాటం ఆడేవారు టీంలుగా ఏర్పడి రోజుకు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు తీసుకుంటున్నారు. ఈ ఎన్నికల పుణ్యమా అని వారికి కొంత ఉపాధి లభిస్తోంది. ఎన్నికలకు కళాకారుల డిమాండ్ పెరగడంతో గ్రామాల్లో కోలాటం రాణి మహిళలకు శిక్షణ ఇస్తూ ఏ రోజుకు ఆ రోజు డబ్బులు ముట్టజెపుతున్నారు. పార్టీ మారినా చెల్లింపులే.. ప్రస్తుతం పార్టీలు మారిన నాయకులకు ఎంతో కొంత ముట్టచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామ స్థాయిలో మండల స్థాయి అధ్యక్షులు, మాజీ సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, మునిసిపాలిటీల్లో కౌన్సిలర్లు పార్టీ మారితే తాయిలాలు అందించాల్సిందే. గతంలో స్వచ్ఛందంగా తమకు నచ్చిన పార్టీ తీర్థం పుచ్చుకునే వారు. ప్రస్తుతం ఆ ట్రెండ్ మారింది. గ్రామ, మండల స్థాయిలో ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉండే నాయకులను ప్రధాన పార్టీలు తమవైపు తిప్పుకోవడానికి డబ్బులు, పదవులను ఎర వేస్తున్నారు. నాయకుడి స్థాయి, జనంలో అతడికి ఉన్న పలుకుబడిని బట్టి ఒక్కొక్కరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. -
లక్షల్లో ఖర్చులు.. వేలల్లో బిల్లులు
కోరుట్ల, న్యూస్‌లైన్ :పంచాయతీ ఎన్నికల్లో ఖర్చుపెట్టిన వివరాలను సమర్పించాలని అధికారులు ఒత్తిడి తెస్తుండడంతో అభ్యర్థులు కిందమీద పడుతున్నారు. లక్షల్లో ఖర్చుపెట్టి వేలల్లో చూపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికలు పూర్తయిన 45 రోజుల్లోగా పోటీచేసిన అభ్యర్థులు ఖర్చుల వివరాలను మండల పరిషత్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం అందించిన ప్రొఫార్మ ప్రకారం లెక్కలు చూపాలి. ఎన్నికలు ముగిసి ఇరవై రోజులు గడుస్తున్నా పది శాతం అభ్యర్థులు కూడా లెక్కలు సమర్పించనట్టు తెలుస్తోంది. గడువులోగా అందజేయాలని నోటీస్‌లు ఇచ్చేందుకు అధికారులు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అభ్యర్థులు తక్కువ లెక్కలు చూపేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇందుకు బంధుగణాన్ని సైతం ఉపయోగించుకుంటున్నారు. నిబంధనలు.. గత నెల 23, 27, 31 తేదీల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.80 వేలు, వార్డు సభ్యులు రూ.10 వేలు, 10 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.40 వేలు, వార్డు సభ్యులు రూ.6 వేలు ఖర్చు చే యాలి. ఏకగ్రీవాలు మినహాయిస్తే జిల్లాలో 1149 పంచాయతీల్లో సర్పంచులకు 9 వేలు, వార్డు సభ్యులకు 31 వేల మంది పోటీ చేశారు. వీరంతా 45 రోజుల్లోగా ఎన్నికల సమయంలో చేసిన ఖర్చుల వివరాలను అప్పగించాలి. తక్కువ చూపేందుకే మక్కువ.. పంచాయతీ ఎన్నికల్లో కరపత్రాలు, పోస్టర్లు, ప్రచార సామగ్రి ముద్రణ, హోర్డింగ్‌లు, కటౌట్లు, ఫ్లెక్సీలు, వాహనాలు, ఆడియో, వీడియో క్యాసెట్లు, సభలు, సమావేశాలకు సంబంధించిన ఖర్చును అభ్యర్థులు తక్కువ చేసి చూపేందుకు సిద్ధమవుతున్నారు. వేలల్లో కరపత్రాలు ముద్రించి వందల్లో లెక్క చూపుతున్నారు. ప్రచారంలో తిరిగిన వారికి అయిన ఖర్చు లెక్కలే రాయడం లేదు. వాహనాలు అసలు ఉపయోగించలేదని, ఎన్నికల రోజు తమ మద్దతుదార్లకు టిఫిన్లు, భోజనాలు ఏర్పాటు చేసిన అభ్యర్థులు అసలు వాటి లెక్కలే చూపడం లేదు. లెక్క చూపకుంటే చిక్కులే ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులు నిబంధనల ప్రకారం వ్యయపరిమితి లెక్కలు చూపాల్సిందే. లేకుంటే పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్(బి) ప్రకారం లెక్కలు చూపని అభ్యర్థి మూడేళ్ల పాటు పోటీ చేసేందుకు అనర్హులు. 45 రోజుల్లో లెక్కలు చూపకుంటే తన పదవిని కోల్పోతాడు. త్వరలో జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం ఉండడంతో లెక్క చూపకుంటే మళ్లీ పోటీ చేసే అవకాశం కోల్పోతామని భయపడుతున్నారు. ఎన్నికలు గడిచి ఇరవై రోజులు గడస్తున్నా వ్యయపరిమితి లెక్కలు సమర్పించని అభ్యర్థులకు ఎదురయ్యే చిక్కులపై వారం రోజుల క్రితం మండల పరిషత్ అధికారులు అవగాహన కల్పించారు.అయినప్పటికీ ఆశించిన రీతిలో అభ్యర్థులు లెక్కలు సమర్పించకపోవడంతో నోటీసులకు రంగం సిద్ధం చేస్తున్నారు.