ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు కట్టడిలో తన చిత్తశుద్దిని కేంద్రం తాజా బడ్జెట్ ద్వారా ఉద్ఘాటించింది. ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.1 శాతానికి తగ్గుతుందని మధ్యంతర బడ్జెట్ అంచనావేసింది. 2025–26 నాటికి ఈ లోటును 4.5 శాతానికి తగ్గాలన్నది ప్రభుత్వ రోడ్‌మ్యాప్ అన్న సంగతి తెలిసిందే. గడచిన ఆర్థిక సంవత్సరం (2022–23) ద్రవ్యలోటు 6.4 శాతం.
మార్చితో ముగిసే ప్రస్తుత (2023–24) ఆర్థిక సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని 5.9 శాతంగా గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన సమరి్పంచిన బడ్జెట్ నిర్దేశించుకుంది. అయితే ఇది 5.8 శాతానికే పరిమితమవుతుందని 2024–25 మధ్యంతర బడ్జెట్ పేర్కొంది. భారీ పన్ను ఆదాయాలు ద్రవ్యలోటు అంచనా సానుకూలంగా 5.9 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గడానికి కారణంగా వివరించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు విలువలో రూ.17,34,773 కోట్లు ఉంటే, 2024–25 రూ.16,85,494 కోట్లకు తగ్గుతుందని మధ్యంతర బడ్జెట్ పేర్కొంది. ఇక స్థూల, నికర మార్కెట్ రుణాలు 2024–25లో వరుసగా రూ.14.13 లక్షల కోట్లు, రూ.11.75 లక్షల కోట్లుగా ఉంటాయని బడ్జెట్ తెలిపింది. ఈ రెండు సంఖ్యలూ 2023–24తో పోల్చితే తక్కువే కావడం గమనార్హం. ప్రభుత్వం తక్కువ రుణాలను తీసుకోవడం వల్ల ప్రైవేట్ రంగానికి పెద్ద ఎత్తున రుణాల లభ్యత సులభతరం అవుతుందని ఆర్థికమంత్రి వ్యాఖ్యానించారు.
ద్రవ్యలోటును తగ్గించడానికి భారతదేశం నిర్దేశించిన లక్ష్యాలను మెరుగుపరిచిందనే సందేశాన్ని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు విస్తృత స్థాయిలో పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ అనంతర సమావేశంలో అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ,
‘‘మేము ఇంతకుముందు ఇచి్చన ద్రవ్యలోటు రోడ్‌మ్యాప్‌ను అనుసరించడంలో, మెరుగుపరచడంలో ఎంతో పురోగతి సాధిస్తున్నాం. ఇది ప్రతి రేటింగ్ సంస్థకు సూటిగా పంపుతున్న ఒక స్పష్టమైన సందేశం. ఏజెన్సీలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని అన్నారు.
బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి భారీ డివిడెండ్లు, పన్ను సమీకరణలో మెరుగుదల ద్రవ్యలోటు కట్టడిలో లక్ష్య సాధనకు దోహదపడుతున్న అంశాలు. గ్లోబల్ రేటింగ్ దిగ్గజ సంస్థలు– ఫిచ్, ఎస్‌అండ్‌పీ, మూడీస్‌లు దేశానికి అతి దిగువస్థాయి ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ రేటింగ్‌ను ఇస్తున్నాయి. చెత్త స్థాయికి ఈ రేటింగ్ కేవలం ఒకమెట్టు ఎక్కువ. అధిక రేటింగ్ కోసం కేంద్రం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అంతగా ఫలితం ఇవ్వడంలేదు. ఒకదేశంలో పెట్టుబడులను పెట్టడానికి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, ఆయా సంస్థలు ఈ రేటింగ్‌లనే ప్రాతిపదికగా తీసుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment