
సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థుల వసతి గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులకు మెట్రో నగరాలకు వలస వస్తుంటారు. ప్రభుత్వ నూతన విద్యా విధానాలు, వినూత్న సాంకేతికత కారణంగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థుల వలసల వృద్ధికి ప్రధాన కారణమని కొలియర్స్ ఇండియా అడ్వైజరీ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వప్నిల్ అనిల్ తెలిపారు.
క్యాంపస్‌లు, హాస్టళ్లు, పీజీ గృహాలలో అపరిశుభ్రత, భద్రత కరువు, ఎక్కువ అద్దెలు వంటి రకరకాల కారణాల వల్ల స్టూడెంట్ హౌసింగ్ విభాగం ఇప్పటివరకు ఈ రంగం అసంఘటితంగా, నియంత్రణ లేకుండా ఉంది. ఒకే వయసు వ్యక్తులతో కలిసి ఉండటం, ఆధునిక సౌకర్యాలు, మెరుగైన ప్రయాణ వసతులతో సులువైన రాకపోకలు, రోజువారీ కార్యకలాపాలలో సహాయం వంటి రకరకాల కారణాలతో యువతరం వసతి గృహాలలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలలో స్టాంజా, హౌసర్, యువర్ స్పేస్, ఓలైవ్ లివింగ్ వంటి సంస్థలు విద్యార్థి వసతి గృహాల సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 1.10 కోట్ల మంది వలస విద్యార్థులు ఉండగా.. 2036 నాటికి 3.10 కోట్లకు చేరుతుందని కొల్లియర్స్ నివేదిక అంచనా వేసింది. అయితే ఆయా విద్యార్థులకు కోసం వసతి గృహాలలో కేవలం 75 లక్షల పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కరోనా తర్వాత విద్యార్థి గృహాల అద్దెలు ఏటా 10–15 శాతం మేర పెరుగుతున్నాయి.