
న్యూఢిల్లీ: మౌలిక రంగ సంస్థ జేపీ అసోసియేట్స్(జేఏఎల్)పై తాజాగా డైవర్సిఫైడ్ గ్రూప్ వేదాంతా దృష్టి పెట్టింది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జేపీ గ్రూప్ సంస్థ జేఏఎల్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2024 జూన్ 3న జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) అలహాబాద్ బెంచ్ ఆదేశాల ప్రకారం జేఏఎల్ దివాలా చట్ట పరిధిలోకి చేరింది. దీంతో దివాలా పరిష్కార చర్యలకు తెరలేచింది.
ఈ నేపథ్యంలో వేదాంతా గ్రూప్ ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అదానీ గ్రూప్ సైతం ఈవోఐ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. బిజినెస్‌లను విడదీయకుండా ఏకమొత్తంగా కంపెనీ(జేఏఎల్)పై దివాలా పరిష్కార ప్రక్రియను చేపట్టేందుకు ఎన్‌సీఎల్‌టీ ఈ నెల మొదట్లో ఆదేశించింది.
రుణాల బదిలీ
2025 ఫిబవ్రరి 20కల్లా జేఏఎల్ చెల్లించవలసిన రుణాల విలువ రూ. 55,493 కోట్లను దాటింది. చెల్లించవలసిన రుణాలను జాతీయ ఆస్తుల పునర్‌నిర్మాణ కంపెనీ(ఎన్‌ఏఆర్‌సీఎల్)కు రుణదాతల కన్సార్షియం బదిలీ చేసినట్లు ఇటీవల జేఏఎల్ వెల్లడించింది. రుణదాతల కన్సార్షియంలో బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, యాక్సిస్, కెనరా, పీఎన్‌బీ, యుకో, బీవోఎం, కరూర్ వైశ్యా, బీవోఐ, ఇండస్‌ఇండ్, బీవోబీ, ఎగ్జిమ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ తదితరాలున్నాయి.
అయితే ఎన్‌ఏఆర్‌సీఎల్‌కు బదిలీ చేసిన రుణాల విలువ వెల్లడికాలేదు. జేఎల్‌ఎల్ దివాల పరిష్కార ప్రక్రియను నిర్వహించేందుకు భువన్ మదన్ ఎంపికయ్యారు. కాగా.. జేపీ గ్రూప్ సంస్థ జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను దివాల ప్రక్రియ ద్వారా ఇంతక్రితం ముంబైకి చెందిన సురక్షా గ్రూప్ సొంతం చేసుకున్న విషయం విదితమే.