Jaiprakash Associates
-
జైప్రకాశ్ అసోసియేట్స్‌పై దివాలా చర్యలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జైప్రకాశ్ అసోసియేట్స్ (జేఏఎల్)పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్ ఆదేశించింది. ఇందుకోసం తాత్కాలిక పరిష్కార నిపుణుడిని నియమించింది. ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన దివాలా పిటిషన్ల విషయంలో ఎన్సీఎల్టీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. జేపీ గ్రూప్‌లో కీలకమైన జేఏఎల్ ప్రధానంగా నిర్మాణం, హాస్పిటాలిటీ తదితర వ్యాపారాలు సాగిస్తోంది. కంపెనీ 2037 కల్లా మొత్తం రూ. 29,805 కోట్ల రుణాలను (వడ్డీతో కలిపి) కట్టాల్సి ఉండగా ఇందులో రూ. 4,616 కోట్లు 2024 ఏప్రిల్ 30 నాటికి చెల్లించాల్సి ఉంది. దీన్ని చెల్లించడంలో సంస్థ విఫలమైంది. ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం వల్ల లిక్విడిటీ కొరత ఏర్పడటమే డిఫాల్ట్ కావడానికి కారణమంటూ జేఏఎల్ వినిపించిన వాదనలను తోసిపుచ్చిన ఎన్సీఎల్టీ తాజా ఆదేశాలిచ్చింది. -
మళ్లీ డిఫాల్ట్.. రూ.4,161 కోట్ల చెల్లింపుల్లో విఫలమైన జేపీ అసోసియేట్స్
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జేపీ గ్రూప్ కంపెనీ జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్(జేఏఎల్) తాజాగా రూ. 4,161 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలమైంది. దీనిలో అసలు, వడ్డీ కలసి ఉన్నాయి. మార్చి31న రూ. 1,653 కోట్ల అసలు, రూ. 2,508 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు కంపెనీ నియంత్రణ సంస్థలకు వెల్లడించింది. ఈ రుణాలు వివిధ బ్యాంకులకు చెందినవని తెలియజేసింది. వడ్డీసహా కంపెనీకున్న మొత్తం రుణ భారం రూ. 29,396 కోట్లుకాగా.. 2037కల్లా తిరిగి చెల్లించవలసి ఉన్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది. వీటిలో రూ. 4,161 కోట్లు 2023 మార్చి31కల్లా చెల్లించవలసి ఉన్నట్లు వెల్లడించింది. అయితే ప్రతిపాదిత ఎస్పీవీ పథకాన్ని వాటాదారులంతా ఆమోదించారని, ఎన్సీఎల్టీ అనుమతించవలసి ఉన్నదని తెలియజేసింది. ఇదీ చదవండి: బ్యాంకింగ్‌లోకి బడా కార్పొరేట్లను అనుమతించొద్దు దీంతో ఎస్పీవీకి బదిలీ తదుపరి రూ. 18,051 కోట్లమేర రుణాలు తగ్గనున్నట్లు వివరించింది. కాగా.. జేఏఎల్‌కు వ్యతిరేకంగా 2018 సెప్టెంబర్‌లో ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. 2022 సెప్టెంబర్‌లో రూ. 6,893 కోట్ల చెల్లింపుల్లో వైఫల్యంపై పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ సైతం జేఏఎల్‌పై ఎన్సీఎల్టీ వద్ద ఫిర్యాదు చేసింది. కాగా.. ఇటీవల జేఏఎల్, గ్రూప్ సంస్థలు దాల్మియా భారత్‌కు మిగిలిన సిమెంట్ ఆస్తుల విక్రయానికి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. డీల్ విలువ రూ. 5,666 కోట్లుకాగా.. రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా అంతక్రితం కంపెనీ 20 మిలియన్ టన్నుల వార్షిక సిమెంట్ సామర్థ్యాలను ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్నకు 2014–2017 మధ్య విక్రయించింది. ఇదీ చదవండి: లాభాలు అదుర్స్! అదానీ కంపెనీల ఆదాయాలు వృద్ధి -
జేఏఎల్‌పై ఎస్బీఐ దివాలా పిటీషన్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాశ్ అసోసియేట్స్ (జేఏఎల్)పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దివాలా పిటీషన్ దాఖలు చేసింది. 2022 సెప్టెంబర్ 15 నాటికి కంపెనీ మొత్తం రూ. 6,893 కోట్ల మేర బాకీ పడిందని పేర్కొంది. జేఏఎల్ రుణాల చెల్లింపులో పదే పదే డిఫాల్ట్ అవుతున్నందున దివాలా చట్టం కింద చర్యల ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం నెలకొందని ఎస్బీఐ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి భువన్ మదన్‌ను తాత్కాలిక పరిష్కార నిపుణుడిగా నియమించాలంటూ ప్రతిపాదించింది. మరోవైపు, రుణాల చెల్లింపు కోసం తమ సిమెంటు ప్లాంట్లను విక్రయించినట్లు జేఏఎల్ తెలిపింది. రుణదాతలకు చెల్లింపులు జరిపేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. -
జేపీ అసోసియేట్స్‌కు బ్యాంకుల ఊరట
♦ రుణ పునరుద్ధరణకు ఓకే! ♦ 30 వేలకోట్ల రుణం 3 భాగాలు ♦ వ్యాపారాల విక్రయంతో చెల్లింపులు న్యూఢిల్లీ: జై ప్రకాష్ అసోసియేట్స్‌కు భారీ ఊరట లభించింది. కంపెనీ రుణాలను పునరుద్ధరించేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ఆధ్వర్యంలోని రుణదాతల కన్సార్షియం అంగీకరించింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు విషయాన్ని వెల్లడించాయి. రూ.30,000 కోట్ల రుణాన్ని 3 భాగాలుగా వర్గీకరించడం ఈ పునరుద్ధరణ ప్రణాళికలో భాగం. తన సిమెంట్ వ్యాపారంలో ముఖ్యమైన భాగాన్ని అల్ట్రాటెక్ సిమెంట్‌కు విక్రయించడం ద్వారా జేపీ అసోసియేట్స్ బ్యాలెన్స్ షీట్ నుంచి రూ.10,000 కోట్ల మేర రుణ భాగం మొదట తొలగిపోనుంది. ఇక కంపెనీ ఆధ్వర్యంలోని రూ.13,000 కోట్ల విలువైన భూములను స్పెషల్ పర్పస్ వెహికల్ కింద రుణదాతలు తమ నియంత్రణలోకి తీసుకుంటారు. ఈ భూములను విక్రయించడం ద్వారా దీర్ఘకాలంలో రెండో రుణ భాగాన్ని తీర్చాల్సి ఉంటుంది. మిగిలిన మరో రుణ భాగం కంపెనీ బ్యాలన్స్ షీట్లలోనే ఉంటుంది. కంపెనీ నిర్వహణలో ఇంకా కొంత మేర సిమెంట్ వ్యాపారం, ఈపీసీ విభాగం, 5 లగ్జరీ హోటళ్లు, విద్యుత్ ప్లాంట్లు, ఒక హాస్పిటల్, స్పోర్ట్స్ వ్యాపారం ఉంటాయి. వీటిపై ఆధారపడి కంపెనీ మూడో రుణ భాగాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ ప్రణాళికపై జేపీ అసోసియేట్స్, ఐసీఐసీఐ బ్యాంకు ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. -
అల్ట్రాటెక్తోడీల్ విలువను పెంచిన జేపీ
న్యూఢిల్లీ: తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయి, బ్యాంకర్ల చేతికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న జైప్రకాశ్ అసోసియేట్స్(జేపీ) గ్రూప్.. అల్ట్రాటెక్‌తో ఒప్పందం విలువను పెంచింది. ఐదు రాష్ట్రాల్లో ఉన్న సిమెంట్ ప్లాంట్లను(వార్షిక సామర్థ్యం 21.2 మిలియన్ టన్నులు) విక్రయించడం కోసం గతంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్‌తో జేపీ రూ.15,900 కోట్లకు ఒప్పం దాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువను ఇప్పుడు రూ.16,189 కోట్లకు పెంచుతూ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు జేపీ అసోసియేట్స్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, ఉత్తర్ ప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న 4 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం గల గ్రైండింగ్ ప్లాంట్ పూర్తయ్యాక మరో రూ. 470 కోట్లు అదనంగా చెల్లించేందుకు కూడా అల్ట్రాటెక్ అంగీకరించినట్లు జేపీ గ్రూప్ వెల్లడిం చింది. కాగా, జేపీ రుణ ఖాతాను మొండిబకాయిగా మార్చిన బ్యాంకర్ల కన్సార్షియం వ్యూహా త్మక రుణ పునర్వ్యవస్థీకరణ(ఎస్డీఆర్) ప్రక్రియను మొదలుపెట్టిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఎస్డీఆర్ అమల్లోకివస్తే.. బ్యాంకర్లు తమ రుణ బకాయిలకుగాను కంపెనీలో వాటాలను తీసుకుం టాయి. దీంతో జేపీ గ్రూప్ నియంత్రణ పూర్తిగా బ్యాంకర్ల చేతిలోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. -
రిలయన్స్ పవర్ చేతికి జేపీ గ్రూప్ జల విద్యుత్ ప్లాంట్లు
న్యూఢిల్లీ: జైప్రకాష్ అసోసియేట్స్‌కు చెందిన మూడు జల విద్యుత్ ప్రాజెక్ట్‌లను అనిల్ అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ పవర్ సొంతం చేసుకోనుంది. ఈమేరకు జేపీ గ్రూప్‌తో ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రిలయన్స్ పవర్ తెలిపింది. దీనిలో భాగంగా అనుబంధ సంస్థ రిలయన్స్ క్లీన్జెన్(ఆర్సీఎల్) ద్వారా జేపీ గ్రూప్ అనుబంధ కంపెనీ జైప్రకాష్ పవర్ వెంచర్స్(జేపీవీఎల్)తో ప్రత్యేక అవగాహన ఒప్పం దంపై సంతకాలు చేసినట్లు పేర్కొంది. తద్వారా జేపీవీఎల్‌కు చెందిన జలవిద్యుత్ పోర్ట్‌ఫోలియోలో 100% వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. సుమారు 1,800 మెగావాట్ల నిర్వహణ సామర్థ్యం (ప్రైవేటు రంగంలో దేశంలోనే అత్యధికం) కలిగిన 3 జల విద్యుత్ ప్లాంట్లను జేపీవీఎల్ కలిగి ఉంది. వీటి ఆస్తుల విలువ రూ.10,000 కోట్లుగా అంచనా. -
దాల్మియా సిమెంట్ చేతికి బొకారో జేపీ
న్యూఢిల్లీ: రుణభారం తగ్గించుకునే దిశగా ఇన్ఫ్రా దిగ్గజం జైప్రకాశ్ అసోసియేట్స్.. బొకారో జేపీ సిమెంట్‌లో తనకున్న మొత్తం 74 శాతం వాటాలను దాల్మియా సిమెంట్‌కు విక్రయించాలని నిర్ణయించింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 690 కోట్లుగా ఉండనుంది. దీని ద్వారా వచ్చే నిధులను జేపీ గ్రూప్ రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించుకోనుంది. ఉక్కు దిగ్గజం సెయిల్‌తో కలిసి జేపీ అసోసియేట్స్ ఏర్పాటు చేసిన రెండు జాయింట్ వెంచర్లలో బొకారో జేపీ సిమెంట్ (బీవోజేసీఎల్) కూడా ఒకటి. ఇందులో జేపీ గ్రూప్‌కి 74 శాతం, సెయిల్‌కి 26 శాతం వాటాలు ఉన్నాయి. బీవోజేసీఎల్‌కి జార్ఖండ్‌లోని బొకారోలో 2.1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం (వార్షిక) గల సిమెంటు ప్లాంటు ఉంది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ సారథ్యంలోని ఏసీసీ కూడా బీవోజేసీఎల్ కోసం పోటీపడినప్పటికీ.. దాల్మియా మెరుగైన ఆఫర్ ఇవ్వడంతో దాని వైపు మొగ్గు చూపినట్లు జేపీ అసోసియేట్స్ తెలిపింది. ఇందుకు సంబంధించి దాల్మియా సిమెంట్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సోమవారం కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. సెయిల్‌తో మరో జాయింట్ వెంచర్ అయిన భిలాయ్ ప్లాంటు (2.2 మిలియన్ టన్నుల సామర్థ్యం) విషయంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. సిమెంటు తయారీ రంగంలో జేపీ సంస్థ దేశంలోనే మూడో అతి పెద్ద కంపెనీ. రియల్ ఎస్టేట్, విద్యుత్ తదితర రంగాల్లో కూడా గ్రూప్ కార్యకలాపాలు ఉన్నాయి. ప్రస్తుతం బీవోజేసీఎల్‌లో 74 శాతం వాటాల కింద 9.89 కోట్ల షేర్లను జేపీ అసోసియేట్స్ (జేఏఎల్) విక్రయిస్తోంది. రూ. 18.57 విలువ చేసే ఒక్కో షేరును దాదాపు రూ. 69.74 ధరకి విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. భాగస్వామ్య సంస్థ సెయిల్‌తో పాటు ఇతర నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి విక్రయం జరుగుతుందని వివరించింది. భిలాయ్ జాయింట్ వెంచర్ విషయంలో తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. సెయిల్‌తో ఉన్న రెండు జాయింట్ వెంచర్ సిమెంట్ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా వచ్చిన నిధులను జేపీ గ్రూప్.. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వినియోగించుకోనుంది. జేపీ గ్రూప్ గతేడాది 4.8 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) సామర్థ్యమున్న సిమెంట్ ప్లాంటును ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్‌కి విక్రయించింది. అలాగే, హిమాచల్ ప్రదేశ్‌లోని రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులను విక్రయించే దిశగా అబుధాబి నేషనల్ ఎనర్జీ కంపెనీతో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బోర్డ్ మీటింగ్ నేపథ్యంలో జైప్రకాశ్ అసోసియేట్స్ షేర్ ధర ఎన్ఎస్ఈలో సోమవారం 1.34% లాభపడి రూ.49.05 వద్ద ముగిసింది.