దాల్మియా సిమెంట్ చేతికి బొకారో జేపీ
న్యూఢిల్లీ: రుణభారం తగ్గించుకునే దిశగా ఇన్‌ఫ్రా దిగ్గజం జైప్రకాశ్ అసోసియేట్స్.. బొకారో జేపీ సిమెంట్‌లో తనకున్న మొత్తం 74 శాతం వాటాలను దాల్మియా సిమెంట్‌కు విక్రయించాలని నిర్ణయించింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 690 కోట్లుగా ఉండనుంది. దీని ద్వారా వచ్చే నిధులను జేపీ గ్రూప్ రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించుకోనుంది. ఉక్కు దిగ్గజం సెయిల్‌తో కలిసి జేపీ అసోసియేట్స్ ఏర్పాటు చేసిన రెండు జాయింట్ వెంచర్లలో బొకారో జేపీ సిమెంట్ (బీవోజేసీఎల్) కూడా ఒకటి. ఇందులో జేపీ గ్రూప్‌కి 74 శాతం, సెయిల్‌కి 26 శాతం వాటాలు ఉన్నాయి.
బీవోజేసీఎల్‌కి జార్ఖండ్‌లోని బొకారోలో 2.1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం (వార్షిక) గల సిమెంటు ప్లాంటు ఉంది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ సారథ్యంలోని ఏసీసీ కూడా బీవోజేసీఎల్ కోసం పోటీపడినప్పటికీ.. దాల్మియా మెరుగైన ఆఫర్ ఇవ్వడంతో దాని వైపు మొగ్గు చూపినట్లు జేపీ అసోసియేట్స్ తెలిపింది. ఇందుకు సంబంధించి దాల్మియా సిమెంట్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సోమవారం కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. సెయిల్‌తో మరో జాయింట్ వెంచర్ అయిన భిలాయ్ ప్లాంటు (2.2 మిలియన్ టన్నుల సామర్థ్యం) విషయంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. సిమెంటు తయారీ రంగంలో జేపీ సంస్థ దేశంలోనే మూడో అతి పెద్ద కంపెనీ. రియల్ ఎస్టేట్, విద్యుత్ తదితర రంగాల్లో కూడా గ్రూప్ కార్యకలాపాలు ఉన్నాయి.
ప్రస్తుతం బీవోజేసీఎల్‌లో 74 శాతం వాటాల కింద 9.89 కోట్ల షేర్లను జేపీ అసోసియేట్స్ (జేఏఎల్) విక్రయిస్తోంది. రూ. 18.57 విలువ చేసే ఒక్కో షేరును దాదాపు రూ. 69.74 ధరకి విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. భాగస్వామ్య సంస్థ సెయిల్‌తో పాటు ఇతర నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి విక్రయం జరుగుతుందని వివరించింది. భిలాయ్ జాయింట్ వెంచర్ విషయంలో తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. సెయిల్‌తో ఉన్న రెండు జాయింట్ వెంచర్ సిమెంట్ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా వచ్చిన నిధులను జేపీ గ్రూప్.. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వినియోగించుకోనుంది.
జేపీ గ్రూప్ గతేడాది 4.8 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) సామర్థ్యమున్న సిమెంట్ ప్లాంటును ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్‌కి విక్రయించింది. అలాగే, హిమాచల్ ప్రదేశ్‌లోని రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులను విక్రయించే దిశగా అబుధాబి నేషనల్ ఎనర్జీ కంపెనీతో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బోర్డ్ మీటింగ్ నేపథ్యంలో జైప్రకాశ్ అసోసియేట్స్ షేర్ ధర ఎన్‌ఎస్‌ఈలో సోమవారం 1.34% లాభపడి రూ.49.05 వద్ద ముగిసింది.