నెలాఖర్లో సెయిల్ డిజిన్వెస్ట్‌మెంట్
న్యూఢిల్లీ: ఈ నెల 24-26 మధ్య ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్‌లో డిజిన్వెస్ట్‌మెంట్ జరిగే అవకాశముందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. దీనిలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) మార్గంలో ప్రభుత్వం 5% వాటాకు సమానమైన 20.65 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు తెలిపారు. బీఎస్‌ఈలో మంగళవారంనాటి ముగింపు ధర రూ. 77.15 ప్రకారం చూస్తే డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వానికి రూ. 1,600 కోట్లు లభించే అవకాశముంది. ఇందుకు ఇప్పటికే రోడ్‌షోలు పూర్తయినట్లు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. వెరసి సెయిల్ ద్వారా ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియకు ఊపునివ్వనున్నట్లు పేర్కొన్నారు. నిజానికి సెయిల్‌లో 10.82% వాటాను విక్రయించేందుకు 2012 జూలైలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనిలో భాగంగా 2013 మార్చిలో తొలి దశకింద 5.82% వాటాను అమ్మివేసింది కూడా.
లక్ష్యంవైపు చూపు
ఈ ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్‌యూలు) వాటాల విక్రయం ద్వారా రూ. 43,425 కోట్లను సమీకరించాలని బడ్జెట్‌లో ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. దీనిలో 30% వరకూ అంటే రూ. 18,000 కోట్లను ఒక్క ఓఎన్‌జీసీ ఇష్యూ ద్వారానే సమకరించేందుకు అవకాశముంది. కాగా, డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వం సెయిల్, ఓఎన్‌జీసీలతోపాటు, కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీలలో వాటాలను విక్రయించేందుకు నిర్ణయించింది.
ప్రభుత్వ సంస్థల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌కు ఓఎఫ్‌ఎస్ మార్గాన్ని ఎంచుకుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు అధిక అవకాశాలను కల్పించే బాటలో ప్రభుత్వం రిటైల్ కోటాను పెంచడమేకాకుండా ఆఫర్ ధరలో డిస్కౌంట్‌ను సైతం అందిస్తోంది. సాధారణంగా ఓఎఫ్‌ఎస్‌కు ధరను ఒక రోజు ముందు మాత్రమే ప్రకటిస్తోంది. ఇక ఇష్యూ తేదీని రెండు రోజుల ముందు ప్రకటించనుంది.
సెబీ ఓకే
ఓఎఫ్‌ఎస్ ద్వారా షేర్ల విక్రయాన్ని చేపట్టేందుకు టాప్-100 కంపెనీలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2013 జనవరిలో అనుమతించింది. ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా లిస్టెడ్ కంపెనీలు షేర్ల అమ్మకాన్ని వేలం ద్వారా నిర్వహిస్తాయి. మరోవైపు పబ్లిక్‌కు కనీసం 25% వాటా కల్పించేందుకు వీలుగా ఓఎఫ్‌ఎస్‌ను చేప్టేందుకు పీఎస్‌యూలకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.