Divestment
-
బీపీసీఎల్ ప్రెవేటైజేషన్‌కు బ్రేక్: ఎందుకంటే?
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రైవేటైజేషన్ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. దాదాపు 53 శాతం వాటాను విక్రయించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. ఇంధన ధరలపై స్పష్టత లేకపోవడం వంటి సమస్యలపై ఇద్దరు బిడ్డర్లు వాకౌట్ చేయడంతో కేవలం ఒక బిడ్డర్ మాత్రమే పోటీలో ఉన్నారు. దీంతో ప్రైవేటీకరణకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న పరిస్థితులరీత్యా ప్రస్తుతం ప్రయివేటైజేషన్ ప్రక్రియలో పాల్గొనలేమంటూ అత్యధిక శాతం బిడ్డర్లు అశక్తతను వ్యక్తం చేసినట్లు దీపమ్ పేర్కొంది. కంపెనీలో ప్రభుత్వానికిగల మొత్తం 52.98% వాటాను విక్రయించేందుకు తొలుత ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా 2020 మార్చిలోనే ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. అదే ఏడాది నవంబర్‌కల్లా కనీసం మూడు సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. అయితే ఇంధన ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో రెండు సంస్థలు రేసు నుంచి వైదొలగాయి. దీంతో ఒక కంపెనీ మాత్రమే బరిలో నిలిచింది. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్‌పై ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ ప్రైవేటైజేషన్ ప్రక్రియ రద్దుకు నిర్ణయించినట్లు దీపమ్ వెల్లడించింది. పరిస్థితుల ఆధారంగా ఈ అంశంపై భవిష్యత్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేసింది. బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా కొనుగోలుకి వేదాంతా గ్రూప్, యూఎస్ వెంచర్ ఫండ్స్ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఇంక్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఈవోఐలను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో బీపీసీఎల్ షేరు 0.5% నీరసించి రూ. 325 వద్ద ముగిసింది. శుక్రవారం స్వల్ప లాభంతో అక్కడే కదలాడుతోంది. -
ఐడీబీఐ జోరు
ముంబై: ప్రభుత్వరంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయ ప్రకటనతో మార్కెట్లో దూసుకుపోతోంది. 2.34లాభంతో 74.35 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 5శాతానికి పైగా ఎగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ)లో 1.5 శాతం వాటాను వాటా విక్రయించినట్లు వెల్లడించింది. 6.75 లక్షల షేర్లు టీఐఎంఎఫ్ హోల్డింగ్స్‌కు విక్రయించినట్లు బీఎస్ఈకి ఫైలింగ్ లో తెలిపింది. దీంతో ఐడీబీఐ బ్యాంక్ షేరు పట్ల భారీ ఆసక్తి నెలకొంది. గతంలో ప్రభుత్వ రంగ కంపెనీ ఎల్ ఐసీకి దాదాపు 9లక్షల షేర్లను(2శాతం) విక్రయించిన సంస్థ తాజాగా టిఐఎంఎఫ్ హోల్డింగ్స్ కు భారీ వాటాను విక్రయించింది. దీంతో గత ఏడాది కాలంగా స్తబ్దుగా ఉన్న ఐడీబీఐ షేర్లు గురువారం నాటి మార్కెట్లో పుంజుకున్నాయి. కాగా బ్యాడ్ లోన్ల కారణంగా గత ఏడాది 13 శాతం వృద్ధితో పోలిస్తే ఇవాల్టి జోరుతో కలిపి ఈ ఏడాది 3శాతం మాత్రమే వృద్ధి చెందింది. -
నెలాఖర్లో సెయిల్ డిజిన్వెస్ట్‌మెంట్
న్యూఢిల్లీ: ఈ నెల 24-26 మధ్య ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్‌లో డిజిన్వెస్ట్‌మెంట్ జరిగే అవకాశముందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. దీనిలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో ప్రభుత్వం 5% వాటాకు సమానమైన 20.65 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు తెలిపారు. బీఎస్ఈలో మంగళవారంనాటి ముగింపు ధర రూ. 77.15 ప్రకారం చూస్తే డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వానికి రూ. 1,600 కోట్లు లభించే అవకాశముంది. ఇందుకు ఇప్పటికే రోడ్‌షోలు పూర్తయినట్లు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. వెరసి సెయిల్ ద్వారా ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియకు ఊపునివ్వనున్నట్లు పేర్కొన్నారు. నిజానికి సెయిల్‌లో 10.82% వాటాను విక్రయించేందుకు 2012 జూలైలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనిలో భాగంగా 2013 మార్చిలో తొలి దశకింద 5.82% వాటాను అమ్మివేసింది కూడా. లక్ష్యంవైపు చూపు ఈ ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్‌యూలు) వాటాల విక్రయం ద్వారా రూ. 43,425 కోట్లను సమీకరించాలని బడ్జెట్లో ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. దీనిలో 30% వరకూ అంటే రూ. 18,000 కోట్లను ఒక్క ఓఎన్జీసీ ఇష్యూ ద్వారానే సమకరించేందుకు అవకాశముంది. కాగా, డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం సెయిల్, ఓఎన్‌జీసీలతోపాటు, కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, పీఎఫ్సీ, ఆర్‌ఈసీలలో వాటాలను విక్రయించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ సంస్థల్లో డిజిన్వెస్ట్మెంట్కు ఓఎఫ్ఎస్ మార్గాన్ని ఎంచుకుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు అధిక అవకాశాలను కల్పించే బాటలో ప్రభుత్వం రిటైల్ కోటాను పెంచడమేకాకుండా ఆఫర్ ధరలో డిస్కౌంట్‌ను సైతం అందిస్తోంది. సాధారణంగా ఓఎఫ్‌ఎస్‌కు ధరను ఒక రోజు ముందు మాత్రమే ప్రకటిస్తోంది. ఇక ఇష్యూ తేదీని రెండు రోజుల ముందు ప్రకటించనుంది. సెబీ ఓకే ఓఎఫ్ఎస్ ద్వారా షేర్ల విక్రయాన్ని చేపట్టేందుకు టాప్-100 కంపెనీలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2013 జనవరిలో అనుమతించింది. ఓఎఫ్ఎస్లో భాగంగా లిస్టెడ్ కంపెనీలు షేర్ల అమ్మకాన్ని వేలం ద్వారా నిర్వహిస్తాయి. మరోవైపు పబ్లిక్కు కనీసం 25% వాటా కల్పించేందుకు వీలుగా ఓఎఫ్ఎస్ను చేప్టేందుకు పీఎస్‌యూలకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. -
కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ కోసం రోడ్‌షోలు
న్యూఢిల్లీ: కోల్ ఇండియాలో దాదాపు రూ. 9,129 కోట్ల మేర వాటాల విక్రయానికి సంబంధించి డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జర్మనీ, బ్రిటన్, అమెరికా, కెనడా, నెదర్లాండ్స్ వంటి అయిదు రాష్ట్రాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నది. అమెరికాలోని న్యూయార్క్, బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కోలో రోడ్‌షోలు నిర్వహిస్తున్నట్లు, అటుపైన కెనడాలోని టొరంటో, బ్రిటన్‌లోని లండన్‌లోనూ వీటిని నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం (డీవోడీ) అధికారులతోపాటు కోల్ ఇండియా సీఎండీ తదితరులు ఇందులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కోల్ ఇండియాలో ప్రభుత్వానికి 90 శాతం వాటాలు ఉన్నాయి. ముందుగా 10 శాతం వాటాలు విక్రయించాలని భావించినప్పటికీ, కార్మికులు ఆందోళనకు దిగడంతో వెనక్కి తగ్గి అయిదు శాతాన్ని విక్రయించేందుకు కసరత్తు చేస్తోంది. గత నెల తలపెట్టిన మూడు రోజుల సమ్మెను కార్మికులు డిసెంబర్ 17కి వాయిదా వేసుకున్నారు. 2010లో కోల్ ఇండియాలో 10 శాతం వాటాల విక్రయం ద్వారా కేంద్రం రూ. 15,199 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్ మార్గంలో రూ. 40,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకున్న ప్రభుత్వం ఇప్పటిదాకా రూ. 1,300 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలో కోల్ ఇండియాలో డిజిన్వెస్ట్‌మెంట్ అత్యంత భారీది కానుంది.