కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ కోసం రోడ్‌షోలు
న్యూఢిల్లీ: కోల్ ఇండియాలో దాదాపు రూ. 9,129 కోట్ల మేర వాటాల విక్రయానికి సంబంధించి డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జర్మనీ, బ్రిటన్, అమెరికా, కెనడా, నెదర్లాండ్స్ వంటి అయిదు రాష్ట్రాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నది. అమెరికాలోని న్యూయార్క్, బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కోలో రోడ్‌షోలు నిర్వహిస్తున్నట్లు, అటుపైన కెనడాలోని టొరంటో, బ్రిటన్‌లోని లండన్‌లోనూ వీటిని నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం (డీవోడీ) అధికారులతోపాటు కోల్ ఇండియా సీఎండీ తదితరులు ఇందులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కోల్ ఇండియాలో ప్రభుత్వానికి 90 శాతం వాటాలు ఉన్నాయి.
ముందుగా 10 శాతం వాటాలు విక్రయించాలని భావించినప్పటికీ, కార్మికులు ఆందోళనకు దిగడంతో వెనక్కి తగ్గి అయిదు శాతాన్ని విక్రయించేందుకు కసరత్తు చేస్తోంది. గత నెల తలపెట్టిన మూడు రోజుల సమ్మెను కార్మికులు డిసెంబర్ 17కి వాయిదా వేసుకున్నారు. 2010లో కోల్ ఇండియాలో 10 శాతం వాటాల విక్రయం ద్వారా కేంద్రం రూ. 15,199 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్ మార్గంలో రూ. 40,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకున్న ప్రభుత్వం ఇప్పటిదాకా రూ. 1,300 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలో కోల్ ఇండియాలో డిజిన్వెస్ట్‌మెంట్ అత్యంత భారీది కానుంది.