Coal India
-
సింగరేణిని కాపాడుకోవాలి!
కేంద్ర ప్రభుత్వం కోల్ సెక్టార్ నుంచి ఒక లక్ష 75 వేల కోట్లు సంపాదించుకోవాలని నిర్ణయం తీసుకున్న నాటి నుంచి 500 బొగ్గు బ్లాక్‌లను దశల వారీగా వేలం వేస్తూ వస్తున్నది. కార్పొరేట్ల చేతుల్లోకి ఇప్పటికే 140కి పైగా బొగ్గు బ్లాకులు వెళ్లిపోయాయి. గత పార్లమెంట్లో 303 సీట్లు ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నీ అడ్డుకునే పరిస్థితి విపక్షాలకు లేదు. చర్చకు అవకాశమే లేకుండా ఏకపక్ష నిర్ణయాలను కేంద్రం తీసుకొంది.అది ప్రవేశపెట్టిన బిల్లుకు అప్పుడు తెలంగాణ ఎంపీలు అందరూ మద్దతు పలికారు. ఇందులో బొగ్గు బ్లాక్‌ల వేలంతో పాటు కోల్ ఇండియా, దాని అనుబంధ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, షేర్ల అమ్మకం కీలకంగా పేర్కొనవచ్చు. సింగరేణి సంస్థ కోల్ ఇండియాకు అనుబంధం కాని కారణంగా బతికి పోయింది!ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణ, అమ్మకం, పెద్ద ఎత్తున సాగుతున్నది. కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన బీసీసీఎల్ (భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ )లో 25 శాతం పెట్టుబడి ఉపసహరణకు కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కోల్ ఇండియా తన 33 శాతం షేర్లను అమ్మేసింది. కేంద్రం నిర్ణయం కారణంగా మరిన్ని షేర్లు ప్రైవేటుపరం కానున్నాయి. ఇదంతా బీసీసీఎల్‌ను అమ్మేసే కుట్రలో భాగమే అనక తప్పదు!మోదీ మూడో సారి ప్రధాని అయ్యాక తాజాగా దేశంలోని 60 బొగ్గు బ్లాక్‌లకు వేలం వేసే ప్రక్రియ మన తెలంగాణలోనే మొదలు పెట్టారు. గత పార్లమెంట్లో ఉన్న మెజారిటీ ఇప్పుడు బీజేపీకి లేకున్నా, మోదీ తన విధానం మాత్రం మార్చుకోలేదనేది కొత్తగా నిర్వహించిన వేలం వల్ల స్పష్టమవుతోంది. గతంలో రామగుండానికి పీఎం నరేంద్ర మోదీ వచ్చినపుడు సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తి లేదని చెప్పి వెళ్ళారు.ఇప్పుడు అదే మాట మన బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చెబుతున్నారు. అప్పుడు బొగ్గు బ్లాక్‌ల కేటాయించమని డిమాండ్ చేసినా ఏమీ సమాధానం చెప్పలేదు! ‘రైల్వేతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను ఛాయ్ అమ్మాను! నేను రైల్వేను ప్రైవేట్ పరం చేస్తానని కొందరు ప్రచారం చేస్తున్నారు, నేను అలా చేస్తానా?’ అని చెప్పిన పీఎం తర్వాత చేసిన పని ఏమిటో జగమెరిగిన సత్యం! అంతే కాదు అదే పీఎం మోడీ, ‘ప్రభుత్వ రంగం పుట్టిందే చావడానికి’ అని చెప్పిన వీడియోలు ఉన్నాయి. మరి ఏ మాట నమ్మాలి?కేంద్ర, రాష్ట్రాల వాటాలు ఉన్న ఏకైక సంస్థ సింగరేణి. ఇందులో కేంద్రం వాటా 49 శాతం ఉంది. రాష్ట్ర వాటా 51 శాతం ఉంది. గత 20 ఏండ్లకు పైగా లాభాల్లో నడుస్తూ, 2001– 2002 ఆర్థిక సంవత్సరం నుంచి కార్మికులకు, లాభాల్లో వాటా ఇస్తున్నది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండు సంవత్సరాలు మిగులు సర్వీస్ ఉన్న నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ (ఎన్సీడబ్ల్యూఏ) పరిధిలోకి వచ్చే ఉద్యోగులు అనారోగ్యం పాలై దరఖాస్తు చేసుకుంటే ఇన్వాలిడేషన్ చేసి, డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ కూడా సింగరేణే కావడం విశేషం!ఈ నేపథ్యంలో కేంద్రం ప్రైవేటీకరణ పాలసీ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఇలాంటి విధానాల వల్ల కోల్ ఇండియాలో ఒకప్పుడు 8 లక్షల పైచిలుకు ఉన్న కార్మికుల సంఖ్య 3 లక్షలకూ, సింగరేణిలో 1991లో లక్షకు పైగా ఉన్న కార్మికుల సంఖ్య ఇప్పుడు 43 వేలకూ పడిపోయాయి. కోల్ ఇండియా కూడా మంచి లాభాల్లో ఉంది. అయినా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ బారి నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఉంది! కోల్ బ్లాక్‌లను కేటాయించకుండా ఉంటే సింగరేణి నష్టాల్లో పడుతుంది. అప్పుడు దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయవచ్చనేది కేంద్రం యోచన కావచ్చు. అందుకే అది బొగ్గు బ్లాక్‌లను కేటాయించడంలేదని చెప్పవచ్చు.ఈ విషయం మీద మన తెలంగాణకు చెందిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రధాని మోదీతో మాట్లాడుతామన్నారు. మరో వైపు ‘మా బ్లాకులు మాకు ఇవ్వండి’ అని మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లిఖిత పూర్వకంగా కోరారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మేరకు పీఎం మోదీకి లేఖ రాశారు. ఒక వైపు కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. 2015 లోని బొగ్గు బ్లాక్‌ల వేలం చట్టం లోనే, 17 (ఏ) సెక్షన్ ప్రకారం సింగరేణికి బొగ్గు బ్లాక్‌లను వేలంలో పాల్గొనకుండానే కేటాయించవచ్చు! ఆ దిశలో కేంద్రం ముందుకు పోతుందని ఆశిద్దాం! అందరం కలిసి సింగరేణిని కాపాడుకుందాం! ఛలో ఆజ్ నహీ తో కల్ నహీ! తెలంగాణ గోదావరి తీరంలోని బొగ్గు నిక్షేపాల మీద సింగరేణికి హక్కు ఉన్నది! – ఎమ్.డి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్, 9951865223. -
ఖజానాకు అంచనాలను మించి డివిడెండ్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల (సీపీఎస్ఈ) నుంచి ఖజానాకు బడ్జెట్ అంచనాలను మించిన స్థాయిలో డివిడెండ్లు అందాయి. 2023–24లో కోల్ ఇండియా, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్, గెయిల్ వంటి దిగ్గజాలు ఏకంగా రూ. 63,000 కోట్లు చెల్లించాయి. సవరించిన బడ్జెట్ అంచనాలకన్నా ఇది 26 శాతం అధికం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం 2023–24లో సీపీఎస్ఈల నుంచి రూ. 50,000 కోట్ల డివిడెండ్లు రావొచ్చని అంచనాలను సవరించారు. అయితే, పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం దీపమ్ వెబ్సైటు ప్రకారం కేంద్రానికి మొత్తం రూ. 62,929.27 కోట్లు వచ్చాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో డివిడెండ్ వసూళ్లు రూ. 59,952.84 కోట్లకు పరిమితమయ్యాయి. మార్చి నెలలో ఓఎన్జీసీ రూ. 2,964 కోట్లు, కోల్ ఇండియా రూ. 2,043 కోట్లు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ. 2,149 కోట్లు, ఎన్ఎండీసీ రూ. 1,024 కోట్లు, హెచ్ఏఎల్ రూ. 1,054 కోట్లు, గెయిల్ రూ. 1,863 కోట్లు చెల్లించాయి. సీపీఎస్ఈలు అధిక మొత్తంలో డివిడెండ్ల చెల్లించడమనేది వాటి పటిష్టమైన పనితీరును ప్రతిబింబిస్తుంది. ఇది రిటైల్, సంస్థాగత వాటాదారులకు లబ్ధి చేకూర్చడంతో పాటు ఆయా సంస్థల షేర్లపై ఆసక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడగలదు. -
కోల్ ఇండియాలో 16న సమ్మె సైరన్
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థగా నిలిచిన కోల్ ఇండియాలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 16న ఒకరోజుపాటు మెరుపు సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం వాటా కలిగిన కోల్ ఇండియా సిబ్బంది సమ్మె బాటపడుతుండటంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, సమ్మె చేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఈ సమ్మెలో హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ, ఐఎన్‌ఎంఎఫ్, సీఐటీయూ యూనియన్లు పాల్గొంటున్నాయి. ఇదీ చదవండి: భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. -
ఇంధన దిగ్గజం కోల్ ఇండియాకు లాభాల పంట
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం కోల్ ఇండియా పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 13 శాతం పుంజుకుని రూ. 6,800 కోట్లను తాకింది. అధిక అమ్మకాలు ఇందుకు సహకరించాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 6,044 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 15.25 చొప్పున తొలి మధ్యంతర డివిడెండును బోర్డు ప్రకటించింది. కాగా.. మొత్తం అమ్మకాలు సైతం రూ. 27,539 కోట్ల నుంచి రూ. 29,978 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు 9 శాతం పెరిగి రూ. 26,000 కోట్లను దాటాయి. ఈ కాలంలో ఇంధన కొనుగోలు ఒప్పందం(ఎఫ్ఎస్ఏ)లో భాగంగా ఒక్కో టన్ను బొగ్గుకు సగటున దాదాపు రూ. 1,542 చొప్పున లభించినట్లు కంపెనీ వెల్లడించింది. దేశీ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం వాటాను ఆక్రమిస్తున్న కంపెనీ తాజా సమీక్షా కాలంలో 157.42 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసింది. గతేడాది క్యూ2లో 139.23 ఎంటీ బొగ్గు మాత్రమే ఉత్పత్తయ్యింది. ఇక అమ్మకాలు సైతం 154.53 ఎంటీ నుంచి 173.73 ఎంటీకి జంప్ చేశాయి. ఈ ఏడాది 780 ఎంటీ విక్రయాలను కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. -
దీపావళి బోనస్ రూ.85 వేలు
సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు గని కార్మికులకు ప్రొడక్షన్ లింక్ రివార్డ్ (పీఎల్ఆర్) దీపావళి బోనస్‌ను కోల్ ఇండియా యాజమాన్యం ప్రకటించింది. కోల్ ఇండియా పరిధిలోని సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు ఈ బోనస్ అందనుంది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఒక్కో కార్మికుడికి రూ.85 వేల చొప్పున చెల్లించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గతేడాది దీపావళి బోనస్ రూ.76,500 చెల్లించగా, ఈ సంవత్సరం రూ.1.20 లక్షలు ఇవ్వాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. చివరకు గతేడాది కంటే రూ.8,500 పెంచి రూ.85 వేల చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఈ పీఎల్ఆర్ బోనస్‌ను సింగరేణి కార్మికులకు మాత్రం దీపావళికి వారం, పది రోజుల ముందు చెల్లిస్తుండగా, ఇతర ప్రాంతాలవారికి దసరా ముందు చెల్లిస్తున్నారు. -
హరిత ప్రాజెక్టులపై రూ. 25 వేల కోట్లు - కోల్ ఇండియా ప్రణాళికలు
న్యూఢిల్లీ: పర్యావరణానికి అనుకూలమైన విధంగా బొగ్గు రవాణాకు తోడ్పడే దాదాపు 61 ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (ఎఫ్ఎంసీ) ప్రాజెక్టులపై కోల్ ఇండియా దృష్టి పెట్టింది. వచ్చే కొన్నేళ్లలో వాటిపై రూ. 24,750 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ప్రాజెక్టులను మూడు దశల్లో ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఉత్పత్తి కేంద్రాల నుంచి బొగ్గు హ్యాండ్లింగ్ పాయింట్ల వరకు యాంత్రిక కన్వేయర్ల ద్వారా బొగ్గును రవాణా చేసేందుకు ఎఫ్ఎంసీ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి. వీటివల్ల ధూళి, కర్బన ఉద్గారాలపరమైన కాలుష్యం, అలాగే రహాదార్లపైనా రవాణా భారం తగ్గుతుందని అధికారి వివరించారు. వీలైనంత తక్కువ మానవ ప్రమేయంతో వినియోగదారులకు అవసరమైన నాణ్యమైన బొగ్గును, కచ్చితమైన పరిమాణంలో అందించవచ్చని పేర్కొన్నారు. తొలి దశలో 414.5 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉండే 35 ఎఫ్ఎంసీ ప్రాజెక్టులను రూ. 10,750 కోట్లతో చేపట్టినట్లు చెప్పారు. వీటిలో 112 మిలియన్ టన్నుల సామర్ధ్యం గల ఎనిమిది ప్రాజెక్టులు ఇప్పటికే పనిచేస్తున్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 178 మిలియన్ టన్నుల సామర్థ్యం గల మరో 17 ప్రాజెక్టులను అందుబాటులోకి తేనున్నట్లు అధికారి చెప్పారు. ఇక రెండు, మూడో విడత ప్రాజెక్టుల్లో వరుసగా రూ. 2,500 కోట్లు, రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన వివరించారు. -
సింగరేణి వార్షిక లాభాలు రూ.2,222 కోట్లు
గోదావరిఖని: సింగరేణి ఆల్‌టైం రికార్డ్ సిరులు కురిపించింది. సంస్థ చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించింది. కోల్ ఇండియాసహా మహారత్న కంపెనీలన్నింటి కన్నా లాభాల వృద్ధిలో అగ్ర స్థానంలో నిలిచింది. సింగరేణి సంస్థ చరిత్రలోనే అత్యధికంగా ఈ ఆర్థిక సంవత్సరం రూ.33,065 కోట్ల టర్నోవర్‌తో రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవారం వెల్లడించారు. బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.3,074 కోట్ల స్థూల లాభాలను ఆర్జించగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పన్నుల చెల్లింపుల అనంతరం రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు ప్రకటించారు. సింగరేణి చరిత్రలోనే ఇది ఆల్‌టైం రికార్డు అని పేర్కొన్నారు. గతేడాది రూ.1,227 కోట్ల లాభాలు రాగా, ఈసారి 81 శాతం అధికంగా వచ్చాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం టర్నోవర్ రూ.26,585 కోట్లుకాగా, ఈ ఏడాది రూ.33,065 కోట్లు సాధించామని, గతం కన్నా 24 శాతం అధికమని పేర్కొన్నారు. బొగ్గు అమ్మకాల ద్వారా రూ.28,650 కోట్లు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.4,415 కోట్లు గడించినట్లు చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అత్యద్భుత వృద్ధి సింగరేణి సంస్థ తన 134 ఏళ్ల చరిత్రలో తెలంగాణ ఆవిర్భా వం తర్వాత అత్యద్భుత ప్రగతి సాధించిందని శ్రీధర్ తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో 33 శాతం, రవాణాలో 39, అమ్మకాల్లో 177 శాతం లాభాలతో 430 శాతం వృద్ధి సాధించిందన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పాదన ద్వారా గణనీయమైన టర్నోవర్, లాభాలు సాధించిందన్నారు. కార్మికులు ఉద్యోగులు అంకితభావంతో పని చేసి కంపెనీని దేశంలోనే అగ్రస్థానంలో నిలి పారని కొని యాడారు. లాభాల ద్వారా సింగరేణి మరిన్ని కొత్త ప్రాజెక్టులు, కార్మికులకు లాభాల్లో వాటా, మరిన్ని సంక్షేమ కార్య క్రమాలు చేపడతామని తెలిపారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తే రూ.4 వేల కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందన్నారు. -
కోల్ ఇండియా ఆఫర్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)కు తొలి రోజు భారీ డిమాండ్ నెలకొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి గురువారం ఏకంగా రూ. 6,500 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీలో 3 శాతం వాటా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓఎఫ్ఎస్ చేపట్టింది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. గురువారం(1)న సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రారంభమైంది, నేడు(శుక్రవారం) రిటైలర్లకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విండో ఓపెన్ కానుంది. తొలి రోజు ప్రభుత్వం 8.31 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 28.76 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అంటే 3.46 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ లభించింది. ఓఎఫ్ఎస్లో భాగంగా కంపెనీ ఈక్విటీలో 3 శాతం వాటాకు సమానమైన మొత్తం 18.48 కోట్లకుపైగా షేర్లను విక్రయించనుంది. ఆఫర్ ధర ప్రకారం ప్రభుత్వానికి రూ. 4,158 కోట్లు అందనున్నాయి. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2023–24)లో తొలి పీఎస్యూలో డిజిన్వెస్ట్మెంట్కు తెరలేచింది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 66.13% వాటా ఉంది. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం రూ. 51,000 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే. ఓఎఫ్ఎస్ నేపథ్యంలో గురువారం కోల్ ఇండియా షేరు బీఎస్ఈలో 4.4 శాతం పతనమై రూ. 231 వద్ద ముగిసింది. బుధవారం ధరతో పోలిస్తే 6.7 శాతం డిస్కౌంట్లో ప్రభుత్వం ఓఎఫ్ఎస్ను ప్రకటించింది. -
కోల్ ఇండియా @ రూ. 225
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. నేడు(జూన్ 1)న సంస్థాగత ఇన్వెస్టర్లకు, శుక్రవారం(2న) రిటైలర్లకు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)ను చేపడుతోంది. ప్రతిపాదన ప్రకారం ప్రభుత్వం తొలుత 1.5 శాతం వాటాకు సమానమైన 9.24 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఆఫర్‌కు అత్యధిక స్పందన లభిస్తే మరో 1.5 శాతం వాటాను సైతం విక్రయించేందుకు గ్రీన్ షూ ఆప్షన్ ఎంచుకుంది. వెరసి కంపెనీ ఈక్విటీలో 3 శాతం వాటాకు సమానమైన మొత్తం 18.48 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. ఆఫర్ ధర ప్రకారం ప్రభుత్వం విక్రయిస్తున్న వాటాకు రూ. 4,158 కోట్లు లభించనున్నాయి. వెరసి ఈ ఏడాది(2023–24) తొలిసారి పీఎస్యూలో ప్రభుత్వం వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 66.13 శాతం వాటా ఉంది. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం రూ. 51,000 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే. బీఎస్ఈలో బుధవారం కోల్ ఇండియా షేరు 1.3 శాతం నష్టంతో రూ. 241 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే 6.7 శాతం డిస్కౌంట్లో ఓఎఫ్ఎస్ ప్రారంభంకానుంది. -
ఫలితాలు, గ్లోబల్ ట్రెండ్ కీలకం
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ల నడకను ఈ వారం పలు అంశాలు ప్రభావితం చేయనున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ ఫలితాల సీజన్ ఊపందుకుంది. జనవరి–మార్చి(క్యూ4) ఫలితాలతోపాటు పూర్తి ఏడాది(2022–23)కి లిస్టెడ్ కంపెనీలు పనితీరును వెల్లడిస్తున్నాయి. వీటికితోడు విదేశీ స్టాక్ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు సైతం దేశీయంగా ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ వారం పలు దిగ్గజాలు ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయి. జాబితాలో ఏషియన్ పెయింట్స్, అపోలో టైర్స్ సిప్లా, ఐషర్ మోటార్స్, ఎల్అండ్టీ, యూపీఎల్, టాటా మోటార్స్ తదితరాలున్నాయి. కోల్ ఇండియా వీక్ వారాంతాన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా క్యూ4 ఫలితాలు ప్రకటించాయి. యూనియన్ బ్యాంక్ లాభం 81 శాతం జంప్‌చేయగా.. కోల్ ఇండియా లాభం 18 శాతం క్షీణించింది. దీంతో నేడు(సోమవారం) ఈ కౌంటర్లపై ఫలితాల ప్రభావం కనిపించనున్నట్లు స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ బాటలో కెనరా బ్యాంక్, యూపీఎల్(8న), లుపిన్(9న), బాష్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎల్అండ్టీ(10న), ఏషియన్ పెయింట్స్, సీమెన్స్(11న), సిప్లా, హెచ్‌పీసీఎల్, టాటా మోటార్స్(12న) పనితీరు వెల్లడించనున్నాయి. ఆర్థిక గణాంకాలు మార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), తయారీ రంగ గణాంకాలతోపాటు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు 12న విడుదలకానున్నాయి. ఏప్రిల్ నెలకు 10న యూఎస్, 11న చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు తెలియరానున్నాయి. కాగా.. 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు 13న వెలువడనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీసహా పలు ప్రధాన పార్టీలు పోటీపడుతుండటంతో ఫలితాలకు ప్రాధాన్యమున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 58 పాయింట్లు నీరసించి 61,112 వద్ద నిలవగా.. నిఫ్టీ 4 పాయింట్ల నామమాత్ర లాభంతో 18,069 వద్ద ముగిసింది. అయితే చిన్న షేర్లకు డిమాండ్ పుట్టడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.3 శాత చొప్పున బలపడ్డాయి. ఇతర అంశాలు ఇటీవల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌పట్ల ఆసక్తిని చూపుతున్నారు. ఏప్రిల్ 26– మే 5 మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు రూ. 11,700 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వీకే విజయకుమార్ తెలియజేశారు. దీంతో ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఇకపై కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. వీటికితోడు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం సెంటిమెంటును ప్రభావితంచేయనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ విశ్లేషకులు ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. -
కోల్ ఇండియా చీఫ్‌గా పీఎం ప్రసాద్!
రాంచీ: కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) బాధ్యతలకు తెలుగు వ్యక్తి పోలవరపు మల్లికార్జున ప్రసాద్ ఎంపికయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక వ్యవహారాల బోర్డ్ (పీఈఎస్బీ) ఏడుగురు అధికారులను ఇంటర్వ్యూ చేసి పీఎం ప్రసాద్ పేరును సిఫారసు చేసింది. ఎఫ్ఎస్ఐబీ సిఫారసుకు ప్రధాని అధ్యక్షతన గల కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రసాద్ ప్రస్తుతం రాంచీ కేంద్రంగా పనిచేస్తున్న కోల్ ఇండియా అనుబంధ సంస్థ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) సీఎండీగా పనిచేస్తున్నారు. 2019లో ఆయన భారత్ కోకింగ్ కోల్ (బీసీసీఎల్) సీఎండీగా కూడా ఎంపికయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బీఈ మైనింగ్‌లో గ్రాడ్యుయేటింగ్ తదుపరి 1984లో ఆయన సీఐఎల్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. అటు తర్వాత అంచెలంచెలుగా విభిన్న హోదాల్లో పనిచేస్తూ, కోల్ ఫీల్డ్స్‌లోని వివిధ రంగాల్లో అపార అనుభవాన్ని గడించారు. -
బొగ్గు గనుల్లో డ్రోన్ వినియోగం
న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తిలో ఉన్న కోల్ ఇండియా అనుబంధ కంపెనీ మహానది కోల్‌ఫీల్డ్స్ డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తోంది. పర్యావరణ పర్యవేక్షణ, నిల్వల స్థాయి తెలుసుకోవడానికి, గనుల చిత్రీకరణకు డ్రోన్‌ను ఉపయోగిస్తున్నట్టు కోల్ ఇండియా తెలిపింది. ఇందుకోసం విహంగం పేరుతో బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అధీకృత వ్యక్తులు ఈ పోర్టల్ ద్వారా ఎక్కడి నుంచైనా డ్రోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఒడిషాలోని తాల్చేర్ బొగ్గు గనుల్లో భువనేశ్వరి, లింగరాజ్ ఓపెన్‌కాస్ట్ మైన్స్‌లో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో మహానది కోల్‌ఫీల్డ్స్ వాటా 20 శాతంపైమాటే. చదవండి: Google Layoffs: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్ ఉద్యోగులు.. -
విదేశీ బ్లాక్స్‌పై కోల్ ఇండియా కన్ను
న్యూఢిల్లీ: ప్రస్తుతం విదేశాలలో ఎలాంటి కోల్ బ్లాకులూలేని పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియాకు త్వరలో ఈ అవకాశాలు లభించనున్నాయి. తాజాగా ఇందుకు పార్లమెంటరీ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఇకపై విదేశాలలో బొగ్గు గనుల కొనుగోలు అవకాశాలను పరిశీలించవచ్చు. అయితే ఇందుకు ఆయా క్షేత్రాలపట్ల పూర్తిస్థాయి అధ్యయనాన్ని చేపట్టవలసి ఉంటుంది. ప్రధానంగా తక్కువ యాష్గల కోకింగ్ కోల్ బ్లాకుల కొనుగోలుకి అనుమతించనున్నారు. దీంతో శిలాజ ఇంధనలాకు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమేకాకుండా విదేశాలలో మైనింగ్‌పై కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుంటుందని కమిటీ భావిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న బొగ్గు వనరులను పరిగణిస్తూ విదేశాలలో కోల్ బ్లాకులను కొనుగోలు చేసేందుకు కమిటీ సిఫారసు చేస్తోంది. బొగ్గు శాఖ లేదా కోల్ ఇండియా ఇందుకు సిద్ధపడవచ్చని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో బొగ్గు, గనులు, స్టీల్‌పై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ పేర్కొంది. 2009లో.. పూర్తి అనుబంధ సంస్థ కోల్ ఇండియా ఆఫ్రికానా లిమిటాడా ద్వారా నిజానికి 2009లోనే కోల్ ఇండి యా మొజాంబిక్‌లోని కోల్ బ్లాకుల కొనుగోలుకి ప్రాస్పెక్టింగ్ లైసెన్సులను సొంతం చేసుకుంది. లోతైన అన్వేషణ, జియోలాజికల్, మైనింగ్ అవకాశాల నివేదికను అధ్యయనం చేశాక బొగ్గు నాణ్యత విషయంలో వెనకడుగు వేసింది. ఇక్కడ బొగ్గు వెలికితీత వాణిజ్యపంగా ఆచరణ సాధ్యంకాదని గుర్తించింది. ఫలితంగా బొగ్గు గనుల కొను గోలు లాభదాయకంకాదని 2016లో ప్రాస్పెక్టింగ్ లైసెన్సులను తిరిగి మొజాంబిక్ ప్రభుత్వానికి దాఖలు చేసింది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండి యా 80 శాతాన్ని ఆక్రమిస్తున్న విషయం విదితమే. -
అంచనాలకు మించి.. భారీ లాభాల్లో ప్రభుత్వ రంగ సంస్థ!
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం కోల్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం రెండు రెట్లుపైగా ఎగసి రూ. 8,834 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 3,174 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 39 శాతం ఎగసి రూ. 32,498 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 23,293 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఇక మొత్తం వ్యయాలు రూ. 21,626 కోట్ల నుంచి రూ. 23,985 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో బొగ్గు ఉత్పత్తి 124 మిలియన్ టన్నుల నుంచి దాదాపు 160 ఎంటీకి పెరిగింది. దేశీ బొగ్గు ఉత్పత్తిలో కంపెనీ 80 శాతం వాటాను ఆక్రమిస్తున్న విషయం విదితమే. థర్మల్ విద్యుత్ రంగం నుంచి భారీ డిమాండ్ నెలకొనడంతో 15.4 కోట్ల టన్నుల బొగ్గును విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. మొత్తం 17.75 ఎంటీ బొగ్గును విక్రయించినట్లు తెలియజేసింది. ఇంధన సరఫరా కాంట్రాక్టుల(ఎఫ్ఎస్ఏ) మార్గంలో టన్నుకి రూ. 1,442 చొప్పున ధర లభించినట్లు పేర్కొంది. వచ్చే ఏడాది(2023–24)కల్లా బిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది 70 కోట్ల టన్నుల ఉత్పత్తిని సాధించనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో కోల్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో 2% వృద్ధితో రూ. 220 వద్ద ముగిసింది. -
దేశంలో విద్యుత్ సంక్షోభం..కోల్ ఇండియాకు కేంద్రం కీలక ఆదేశాలు!
న్యూఢిల్లీ: రానున్న కాలంలో విద్యుత్ రంగ యుటిలిటీలకు అవసరమయ్యే బొగ్గును దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉండవలసిందిగా ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రానున్న 13 నెలల్లో 12 మిలియన్ టన్నుల(ఎంటీ) కోకింగ్ కోల్‌ను దిగుమతి చేసుకోవలసి ఉంటుందంటూ సూచించింది. ఎంతమొత్తం బొగ్గు కాలవసిందీ వెల్లడించేందుకు రాష్ట్ర జెన్కోలు, స్వతంత్ర విద్యుదుత్పత్తి సంస్థలు శనివారం మధ్యాహ్నంవరకూ గడువును కోరినట్లు తెలుస్తోంది.తద్వారా కోల్ ఇండియా దిగుమతులకు ఆర్డర్లను పెట్టే వీలుంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి 2015 తదుపరి మహారత్న కంపెనీ కోల్ ఇండియా తిరిగి బొగ్గును దిగుమతి చేసుకోనుంది. కాగా..ఈ జులై నుంచి 2023 జులై మధ్య కాలంలో 12 ఎంటీ బొగ్గు దిగుమతులకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. బొగ్గు కొరత కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో విద్యుత్ కోతలకు తెరలేచిన విషయం విదితమే. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టే బాటలో ప్రభుత్వం బొగ్గు నిల్వలు సిద్ధం చేసేందుకు తగిన సన్నాహాలు చేపట్టినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. -
కోల్ ఇండియా లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం కోల్ ఇండియా గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 46 శాతం జంప్‌చేసి రూ. 6,693 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 4,587 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 26,700 కోట్ల నుంచి రూ. 32,707 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 21,516 కోట్ల నుంచి రూ. 25,161 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున తుది డివిడెండు ప్రకటించింది. ఈ కాలంలో బొగ్గు ఉత్పత్తి 203.4 మిలియన్ టన్నుల నుంచి 209 ఎంటీకి పుంజుకుంది. విక్రయాలు 165 ఎంటీ నుంచి 180 ఎంటీకి ఎగశాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఉత్పత్తి 596.22 ఎంటీ నుంచి 622.63 ఎంటీకి పురోగమించింది. ఫలితాల నేపథ్యంలో కోల్ ఇండియా షేరు 1% క్షీణించి రూ. 181 వద్ద ముగిసింది. -
బొగ్గు కొరత వెనుక కేంద్రం కుట్ర: ప్రొఫెసర్ నాగేశ్వర్
సీతంపేట (విశాఖ ఉత్తర): బొగ్గు కృత్రిమ కొరత వెనుక కోల్ ఇండియాను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. స్థానిక ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ‘బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభం’ అంశంపై శనివారం నిర్వహించిన సదస్సులో నాగేశ్వర్ జూమ్ ద్వారా ప్రసంగించారు. కోల్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదన్నారు. బొగ్గు సంక్షోభం విద్యుత్ చార్జీలు పెరగడానికి దారి తీస్తుందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకపోవడం, కోల్ ఇండియాకు బొగ్గు బ్లాకులు కేటాయించకపోవడం వెనుక వాటిని అమ్మాలన్న ఆలోచన దాగుందన్నారు. బొగ్గు నిల్వల్లో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న మన దేశంలో బొగ్గు సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కోల్ ఇండియా విస్తరణ కంటే దాని నిర్వీర్యానికే చర్యలు చేపడుతున్నట్టు ఉందన్నారు. విశ్రాంత ఐఏఎస్ ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి దూరదృష్టి ప్రణాళిక లేకపోవడమే బొగ్గు సమస్యకు కారణమన్నారు. ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించి ఏపీ జెన్కో సామర్థ్యాన్ని తగ్గిస్తూ వస్తోందన్నారు. రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీలు ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి విద్యుత్ కేటాయించకుండా.. ఇతర రాష్ట్రాల్లో అధిక ధరలకు అమ్ముకుంటున్నా వాటిపై రాష్ట్ర ప్రభుత్వం జరిమానా వేయకపోవడం విచారకరమన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు పెంచడం ద్వారా ప్రైవేటు కంపెనీలు లాభపడేందుకు బొగ్గు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని విమర్శించారు. సీపీఎం నగర కార్యదర్శి బి.గంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజ శర్మ పాల్గొన్నారు. -
ఇక మన ఫోకస్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ పైనే, సీఐఎల్‌కు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: కాలుష్య రహిత విధానాలను ప్రోత్సహిస్తున్న క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలు, చార్జింగ్ పాడ్లు వంటి వ్యాపారాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా (సీఐఎల్)కు కేంద్రం సూచించింది. ‘కోల్ ఇండియా తన వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరించాలి, కొత్త పరిశ్రమలైన ఎలక్ట్రిక్ చార్జింగ్ పాడ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మొదలైన వాటిల్లో అవకాశాలు అన్వేషించాలి‘ అని 2021–22కి సంబంధించిన అజెండాలో బొగ్గు శాఖ పేర్కొంది. భవిష్యత్తులో కర్బన ఉద్గారాలపై మరిన్ని ఆంక్షలు అనివార్యం కానున్న నేపథ్యంలో సోలార్ వేఫర్ తయారీ, సౌర విద్యుదుత్పత్తి, కోల్ బెడ్ మీథేన్ మొదలైన వాటిని పరిశీలించవచ్చని తెలిపింది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలో 80% పైగా వాటా కోల్ ఇండియాదే. 2023–24 నాటికి 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని కంపెనీ నిర్దేశించుకుంది. చదవండి: కొత్త చట్టం, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్లు ఉండేలా ఇళ్లను నిర్మించాలి.. -
శెబ్బాష్ ఆకాంక్ష.. అండర్మైన్ తొలి మహిళా ఇంజనీర్‌గా!
బొగ్గు గనుల్లో ఒక వజ్రం మెరిసింది. చీకటి గుయ్యారం వంటి లోలోపలి గనుల్లో ఇక మీద ఒక మహిళ శిరస్సున ఉన్న లైట్ దిశను చూపించనుంది. ఇది మొదటిసారి జరగడం. ఇది చరిత్ర లిఖించడం. కోల్ ఇండియా మొట్టమొదటిసారిగా అండర్మైన్ ఇంజనీర్‌గా ఒక యువతిని నియమించింది. ఆడవాళ్లు కొన్ని పనులకు పనికి రారు అనేది గతం. ‘మేము ఏమైనా చేయగలం’ అని ఆకాంక్ష కుమారి దేశానికి సందేశం పంపింది. అత్యంత శ్రమ, ప్రమాదం ఉన్న ఈ పనిలో సాహసంతో అడుగుపెట్టిన ఆ ఆకాంక్ష ఎవరు? గనులు మగవారి కార్యక్షేత్రాలు. గనులు తవ్వడం, ఆక్సిజన్ అందనంత లోతుకు వెళ్లి ఖనిజాన్ని బయటకు తేవడం, దానిని రవాణా చేయడం... ఇవన్నీ శ్రమ, బలంతో కూడుకున్న పనులు కనుక అవి మగవాడి కార్యక్షేత్రాలు అయ్యాయి. అందుకే కాదు... గనుల్లో 24 గంటలు పని జరుగుతుంది. రాత్రింబవళ్లు చేయాలి. భద్రత గురించి జాగ్రత్తలు ఎలా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకని కూడా స్త్రీలకు ఆ ప్రాంతాలు నిరోధించబడ్డాయి. గని కార్మికుడు అంటే మగవాడే. ఆ కార్మికుడు గనికి బయలుదేరితే స్త్రీ క్యారేజీ కట్టి ఇచ్చి ఇల్లు కనిపెట్టుకుని ఉండటం ఇప్పటి వరకూ సాగిన ధోరణి. అయితే గత దశాబ్ద కాలంలో మైనింగ్ ఇంజనీరింగ్ చదివేందుకు యువతులు ముందుకు వచ్చారు. మైనింగ్ చదివితే ఉపాధి గనులలోనే దొరుకుతుంది కనుక తల్లిదండ్రులు ఆ చదువును నిరుత్సాహపరుస్తూ వచ్చినా ఈ కాలపు యువతులు మేము ఆ చదువు చదవగలం... భూమి గర్భం నుంచి ఖనిజాన్ని బయటకు తీయగలం అని ముందుకొచ్చారు. దేశంలో ఆ విధంగా ఫస్ట్‌క్లాస్ మైనింగ్ ఇంజనీర్లుగా గుర్తింపు పొందిన మొదటి మహిళలు సంధ్య రసకట్ల... మన తెలంగాణ అమ్మాయి, మరొకరు యోగేశ్వరి రాణె (గోవా). వీళ్లిద్దరూ హిందూస్తాన్ జింక్‌లో ఉపరితల మేనేజర్ స్థాయిలో పని చేసి ఇప్పుడు వేదాంత రిసోర్స్ తరఫున కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం. అయితే వీరి తర్వాత నేరుగా అండర్‌గ్రౌండ్ మైనింగ్ విధులను స్వీకరించిన తొలి మహిళ మాత్రం ఆకాంక్ష కుమారి. 50 ఏళ్లలో తొలిసారి కేంద్ర బొగ్గుగని శాఖ ఆధ్వర్యంలో 50 ఏళ్లుగా నడుస్తున్న ‘కోల్ ఇండియా లిమిటెడ్’కు అనుబంధ సంస్థ అయిన ‘సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్’ సెప్టెంబర్ 1న తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆకాంక్ష కుమారి నియామకాన్ని వెల్లడి చేసింది. ‘చురి మైన్స్’ లో ఆమెను అండర్‌గ్రౌండ్ కార్యకలాపాలకు నియమించి మైనింగ్ చరిత్రలో కొత్త పుటకు చోటు కల్పించామని చెప్పింది. రాంచీకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే చురీలో అండర్‌గ్రౌండ్ గనుల్లో ఆకాంక్ష పని చేయాల్సి ఉంటుంది. ఆమె తన ట్రయినింగ్‌ను ముగించుకుని విధులు మొదలెట్టింది కూడా. అంత సులభం కాలేదు భారత గనుల చట్టం 1952లోని సెక్షన్ 46 ప్రకారం బొగ్గు గనుల్లో స్త్రీలకు అండర్‌గ్రౌండ్ కార్యకలాపాలు నిరోధించబడ్డాయి. 2017 వరకూ ఈ చట్టం ఇలా సాగినా అదే సంవత్సరం జరిగిన చట్ట సవరణ వల్ల స్త్రీలకు భూగర్భ కార్యకలాపాలలో ఉద్యోగం పొందే హక్కు ఏర్పడింది. కాని ఆ తర్వాత కూడా కోల్ ఇండియాలో స్త్రీలు ఉపరితల కార్యకలాపాలలో ఉద్యోగాలు పొందుతూ ఇప్పటికి తమ శాతాన్ని కేవలం 7.5కు మాత్రమే పెంచగలిగారు. కాని వారికే కాదు, దేశంలోని ఇతర యువతులకు, విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా మొదటిసారి ఆకాంక్ష భూగర్భ విధులను స్వీకరించింది. భిన్న విద్యార్థి జార్ఘండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన ఆకాంక్ష చిన్నప్పటి నుంచి చురుకైన భిన్న విద్యార్థి. ఇద్దరు తోబుట్టువులు, ఒక సోదరుడు ఉన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలలో హైస్కూల్ వరకూ చదివి సింద్రి (జార్ఖండ్) బిట్స్‌లో మైనింగ్ ఇంజనీరింగ్ చదివింది. ఆ వెంటనే ఆమెకు హిందూస్థాన్ జింక్ రాజస్థాన్ శాఖలో ఉద్యోగం దొరికింది. మూడేళ్లు అక్కడ ఉద్యోగం చేసి కోల్ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్మెంట్ ట్రైనీగా ఉద్యోగం పొంది తాజాగా అండర్‌గ్రౌండ్ మైనింగ్ ఇంజనీరుగా డిజిగ్నేషన్ పొందింది. అయినా జాగ్రత్తలే ఆకాంక్ష కుమారి అండర్‌గ్రౌండ్ మైనింగ్ డ్యూటీని స్వీకరించినా గనుల చట్టం ప్రకారం మహిళా ఉద్యోగులకు సంబంధించిన షరతులు ఆమెకు వర్తిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి ఆకాంక్ష ఉదయం 6 నుంచి రాత్రి 7 లోపు ఉండే షిఫ్టుల్లో మాత్రమే పని చేయాలి. ఏ ఫిష్ట్ చేసినా ఆమెకు 11 గంటల రెగ్యులర్ విశ్రాంతి ఇవ్వాలి. రాత్రి ఆమె పని చేయడానికి వీల్లేదు. రాత్రి 10 నుంచి ఉదయం 5 మధ్య ఒక్కోసారి ఎమర్జన్సీ డ్యూటీ పడవచ్చు. అయినా సరే ఆమెకు డ్యూటీ వేయకూడదు. ఇవన్నీ మహిళా ఉద్యోగుల రక్షణ కోసం తీసుకున్న జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు ఆమె వొత్తిడిని తగ్గిస్తాయి. కాని సాహసం యథాతథమే. హెడ్‌లైట్ ధరించి ఆమె గనుల్లోకి దిగే సన్నివేశం, అజమాయిషీ చేసే సన్నివేశం ఇప్పటికిప్పుడు ఒక పెద్ద ధైర్యం, తేజం... నల్ల బొగ్గు మధ్యలో ఏర్పడిన వెలుగు దారి. ఆమెకు శుభాకాంక్షలు. -
కోల్ ఇండియా లాభం రూ. 3,170 కోట్లు
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 52 శాతం జంప్‌చేసి రూ. 3,170 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,080 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 18,487 కోట్ల నుంచి రూ. 25,282 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 16,471 కోట్ల నుంచి రూ. 21,626 కోట్లకు పెరిగాయి. క్యూ1లో బొగ్గు ఉత్పత్తి 121.04 మిలియన్ టన్నుల నుంచి దాదాపు 124 ఎంటీకి బలపడింది. ముడిబొగ్గు అమ్మకాలు 120.80 ఎంటీ నుంచి 160.44 ఎంటీకి పెరిగాయి. రానున్న మూడేళ్లలో రూ. 1.22 లక్షల కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. బొగ్గు వెలికితీత, తరలింపు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్, శుద్ధ ఇంధన సాంకేతికతలు తదితరాలకు ఈ నిధులను వెచ్చించనుంది. తద్వారా 2023–24కల్లా 100 కోట్ల టన్నుల కోల్ ఉత్పత్తిని సాధించాలని ప్రణాళికలు వేసింది. ఫలితాల నేపథ్యంలో కోల్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 142 వద్ద ముగిసింది. -
50 శాతం శాలరీ హైక్.. సెలవుల పెంపు; డిమాండ్లు ఇవే
గోదావరిఖని: దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికుల ఉమ్మడి చార్టర్ ఆఫ్ డిమాండ్లను జాతీయ కార్మిక సంఘాలు సిద్దం చేశాయి. ఈ నెలాఖరుతో 10వ వేతన సంఘం గడువు పూర్తి కానుంది. వచ్చే నెల నుంచి కొత్త వేతన ఒప్పందం అమలు కావాల్సి ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు జాతీయ సంఘాలు ఒకేతాటిపైకి వచ్చి ఉమ్మడి చార్టర్ ఆఫ్ డిమాండ్లు పొందు పర్చాయి. దేశంలోని 4 లక్షల మంది కార్మికులకు వర్తించనున్న డిమాండ్లపై బొగ్గు గని కార్మికుల్లో ఆసక్తి రేకిస్తోంది. తమకు సంబంధించి జాతీయ కార్మిక సంఘాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి.. 11వ వేతన కమిటీలో జీతభత్యాలు ఏ విధంగా పెరుగుతాయి.. అలవెన్సులు ఏ విధంగా ఉంటాయనే ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. దేశంలో ఉన్న జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ యూనియన్లు తమ డిమాండ్లను ఉమ్మడిగా సిద్దం చేశాయి. ఈనెల 3న నిర్వహించిన వర్చువల్ సమావేశంలో దీనికి అంగీకరించారు. ప్రధానంగా మూల వేతనం, అలవెన్సులు, సెలవులు తదితర అంశాలపై ఇప్పటికే స్పష్టతకు వచ్చాయి. దీనిపై ఆదివారం మరోసారి వర్చువల్ సమావేశం నిర్వహించి పూర్తిస్థాయిలో అంగీకారం తెలుపనున్నాయి. ఈ ఒప్పందం పూర్తయితే 01.07.2021 నుంచి 30.06.2026 వరకు అమలులో ఉండనుంది. ప్రధాన డిమాండ్లు ప్రస్తుత మూల వేతనంపై 50 శాతం జీతం పెంచాలి. ఎల్ఎల్టీసీ రూ.75 వేలు, ఎల్టీసీ రూ .50 వేలు చెల్లించాలి రెస్క్యూ అలవెన్స్ వేతనంలో 15 శాతం చెల్లించాలి. క్వారీ, వాషరీ, క్రషర్, సీహెచ్‌పీల్లో పనిచేసే కార్మికులకు వేతనంలో 10 శాతం డస్ట్ అలవెన్స్ ఇవ్వాలి సాధారణ సెలవులు 11 నుంచి 15 రోజులకు పెంచాలి సిక్ లీవ్ 15 నుంచి 20 రోజులకు పెంచాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే కార్మికులు కోలుకునేంత వరకు పూర్తి స్థాయి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి మూడేళ్ల వరకు శిక్షణ, స్టడీ లీవ్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం నిర్వహించే సమావేశాలకు టీఏ, డీఏతో పాటు నలుగురు ట్రేడ్ యూనియన్ ప్రతినిధులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలి. గ్రాడ్యువిటీ చెల్లింపునకు సీలింగ్ పరిమితి ఉండొద్దు విధుల్లో మరణించిన కాంట్రాక్టు కార్మికులతో సహా పర్మినెంట్ కార్మికులకు రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. ఆధార పడిన వారికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి. సీపీఆర్ఎంఎస్ స్కీంపై రూ.25 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించాలి. ప్రతి గనిపై లైఫ్ సపోర్టు అంబులెన్సులు ఏర్పాటు చేయాలి పెన్షన్ ఫండ్ కోసం టన్ను బొగ్గుపై రూ.20 వసూలు చేయాలి. కనీస పెన్షన్ రూ.10 వేలకు తగ్గకూడదు వారంలో 40 పని గంటలు లేదా ఐదు రోజులు పనిదినాలు ఉండాలి కాంట్రాక్టు కార్మికులకు క్రమబద్ధీకరించాలి గనుల్లో కొత్త నియామకాలు ప్రారంభించాలి. కార్మికుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలి కాంట్రాక్టు కార్మికులకు జేబీసీసీఐ పరిధిలోకి రావాలి. పారామెడికల్ స్టాఫ్‌కు ప్రత్యేక క్యాడర్ స్కీం తయారు చేయాలి. యువత చదువుకు తగిన ఉద్యోగం ఇవ్వాలి. వీటితో పాటు మరికొన్ని డిమాండ్లపై జాతీయ కార్మిక సంఘాలు పూర్తి స్థాయి కసరత్తు చేసి బొగ్గు పరిశ్రమ ద్వైపాక్షిక కమిటీకి అందించనున్నాయి. ఈ డిమాండ్లపై కోలిండియా యాజమాన్యం జాతీయ కార్మిక సంఘాలతో చర్చించనుంది. ఇరువర్గాల సంప్రదింపుల అనంతరం పూర్తి స్థాయి నిర్ణయాలు వెలువడనున్నాయి. చదవండి: సింగరేణిలో ఇదేం వివక్ష ? -
పీఎం కేర్స్‌కు బజాజ్ ఫిన్సర్వ్ 10 కోట్లు
ముంబై: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎంకేర్స్ అనే ప్రత్యేక నిధికి బజాజ్ ఫిన్సర్వ్, ఆ సంస్థ ఉద్యోగులు సంయుక్తంగా రూ.10.15 కోట్ల విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. కరోనా వైరస్ నివారణకు రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు గతంలోనే బజాజ్ గ్రూపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎంఆర్ఎఫ్ రూ.25 కోట్లు: ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ సైతం కరోనా వైరస్ నివారణ చర్యలకు మద్దతుగా రూ.25 కోట్లను ప్రకటించింది. కోల్ ఇండియా రూ.221 కోట్లు: ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా కరోనా వైరస్ నివారణ కోసం భూరీ విరాళాన్ని ప్రకటించింది. పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.221 కోట్లను అందించినట్టు తెలిపింది. -
బ్లూచిప్ పీఎస్‌యూల్లో ఆఫర్ ఫర్ సేల్!
న్యూఢిల్లీ: నాల్కో, కోల్ ఇండియా, ఎన్టీపీసీ వంటి బ్లూచిప్ పీఎస్‌యూల్లో ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో షేర్లను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ లక్ష్య సాధన కష్టతరం కానుండటంతో నాల్కో, కోల్ ఇండియా వంటి మంచి పనితీరు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఓఎఫ్ఎస్ను చేపట్టాలని డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం భావిస్తోంది. నేషనల్ అల్యూమినియమ్ కంపెనీ(నాల్కో), కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎన్ఎమ్డీసీ, ఎన్బీసీసీ(ఇండియా), భారత్ ఎలక్ట్రానిక్స్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, హిందుస్తాన్ కాపర్.. ఈ కంపెనీలు ఓఎఫ్ఎస్ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీల్లో ప్రభుత్వానికి 52–82 శాతం రేంజ్లో వాటాలున్నాయి. అయితే ఈ కంపెనీల ఓఎఫ్‌ఎస్‌కు ప్రధాన మంత్రి కార్యాలయం ఆమోదం పొందాల్సి ఉంది. మరోవైపు మార్కెట్ స్థితిగతులు బాగా ఉంటేనే ఈ షేర్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి దండిగా రాబడి రాగలదు. బీపీసీఎల్, ఎయిర్ ఇండియాల వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తికాకవపోచ్చు. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యసాధనలో రూ.87,000 కోట్ల మేర కోత పడనున్నది. -
‘నల్లబంగారం’ ఇక జిగేల్!
న్యూఢిల్లీ: దేశంలో అపారంగా బొగ్గు నిక్షేపాలు ఉండి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. కోల్ ఇండియా ఒక్కటీ దేశ అవసరాల్లో అధిక శాతం తీరుస్తోంది. అయినా, అవసరానికంటే ఉత్పత్తి తక్కువగానే ఉంటోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు, దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచడం ద్వారా దిగుమతుల భారానికి కళ్లెం వేసేందుకు ప్రైవేటు రంగాన్ని ఇందులోకి అనుమతించాలని కేంద్ర సర్కారు లోగడే నిర్ణయించింది. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్ల కాలంలో 200 బొగ్గు గనులను (బ్లాకులు) వాణిజ్య ప్రాతిపదికన తవ్వితీసేందుకు వేలం వేయనుంది. గరిష్టంగా 400 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా 2024 నాటికి విద్యుత్ సంస్థలు బొగ్గు దిగుమతి చేసుకునే అవసరం ఉండదన్నది అంచనా. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. త్వరలోనే వేలం..: పరిశ్రమల అవసరాలను తీర్చేందుకు గాను మొదటి విడతగా 40 బొగ్గు బ్లాకులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కేంద్రం వేలానికి తీసుకురానుంది. వీటి గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం ఏటా 1–50 మిలియన్ టన్నుల మధ్య ఉండనుంది. వాణిజ్య బొగ్గు గనుల వేలానికి సంబంధించి బిడ్డింగ్ నిబంధనలను ఈ నెలాఖరుకు విడుదల చేసి, వచ్చే నెలలో భాగస్వాముల అభిప్రాయాలను స్వీకరించనున్నట్టు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. వేలానికి వచ్చే బ్లాకుల్లో కొన్నింటి గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం 30–50 మిలియన్ టన్నుల మధ్య ఉంటుందని తెలిపారు. కొన్ని బ్లాకుల్లో నిల్వల సమాచారం కచ్చితంగా గుర్తించగా, మరికొన్నింటిలో పాక్షికంగానే అది జరిగిందన్నారు. వీటి వల్ల దేశీయంగా బొగ్గు ఉత్పత్తి లోటు కొంత వరకు తీరుతుందన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2018–19)లో 235 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతులు జరిగాయి. వీటిల్లో 125 మిలియన్ టన్నుల మేర థర్మల్ బొగ్గు (54 శాతం) దిగుమతులే కావడం గమనార్హం. ఐరన్, స్టీల్ తయారీకి కోకింగ్ కోల్ అవసరం అవుతుంది. మన దేశంలో కోకింగ్ కోల్ లభ్యత లేనందున ఐరన్, స్టీల్ కంపెనీలకు దిగుమతే మార్గం. కానీ, విద్యుత్ తయారీకి వినియోగించే థర్మల్ బొగ్గును దిగుమతి చేసుకోకుండా దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆదాయంలో వాటా..: వేలానికి పరిగణిస్తున్న వాటిల్లో చెండిపడ–1, 2, మదన్‌పూర్ నార్త్, ఫతేపూర్, ఫతేపూర్ ఈస్ట్, మహానంది, మచ్చకట బ్లాకులు ఉన్నట్టు ఆ అధికారి వెల్లడించారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి నిర్దేశిత వాటాను లీజుదారులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఈ బొగ్గు బ్లాకుల ఉత్పత్తిని త్వరగా ఆరంభించేందుకు ప్రోత్సాహకాలను కూడా ఇవ్వనుంది. నాలుగు, ఐదో దశ వేలంలో పరిశ్రమల నుంచి స్పందన ఆశించిన మేర లేదు. దీంతో మాజీ సీవీసీ ప్రత్యూష్ సిన్హా సిఫారసుల మేరకు ఆదాయంలో వాటా ప్రాతిపదికన బొగ్గు బ్లాకులను వేలం వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వేలంలో బొగ్గు గనులు దక్కించుకున్న సంస్థలు, నిర్దేశిత కాల వ్యవధి కంటే ఏడాదిముందే ఉత్పత్తి ప్రారంభిస్తే దానికి ప్రోత్సాహకంగా ఆదాయంలో వాటాను 10% ప్రభుత్వం తగ్గించుకోనుంది. 125 టన్నులకు కోల్ ఇండియా ఉత్పత్తి ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా గత ఏడాది కాలంలో 16 బొగ్గు బ్లాకులను సొంతం చేసుకోగా, వీటి సాయంతో సంస్థ ఉత్పత్తి 125 మిలియన్ టన్నులకు చేరనుందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ బ్లాకుల్లో ఉత్పత్తి మూడు నుంచి ఆరేళ్లలో ప్రారంభమవుతుందని చెప్పారు. ‘‘2023–24 నాటికి ఒక బిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్య లక్ష్యాన్ని చేరుకునేందుకు కంపెనీకి సాయపడుతుంది. ఇటీవలి కేటాయించిన వాటిల్లో కొన్నింటిలో 2–3 ఏళ్లు, ఇతర బ్లాకుల్లో ఉత్పత్తికి మరింత సమయం తీసుకుంటుంది’’ అని కోల్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. ఈ బ్లాకుల్లో వెలికితీత కార్యకలాపాలను కోల్ ఇండియా త్వరగా ప్రారంభించాలని కేంద్రం కోరుకుంటోంది. -
అయ్యో మేక : కోల్ ఇండియాకు భారీ నష్టం
భువనేశ్వర్: ఓ మూగ జీవి మరణం కోల్ ఇండియాకు భారీ నష్టాన్ని మిగిల్చింది. భారతదేశంలో అతిపెద్ద సంస్థ కోల్ ఇండియాకు చెందిన మహానంది బొగ్గు క్షేత్రం (ఎంసీఎల్)లోని నిషేధిత మైనింగ్ జోన్లో జరిగిన ప్రమాదంలో మేక చనిపోయింది. దీంతో సమీప గ్రామానికి చెందిన స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనతో సంస్థకు 26.8 మిలియన్ల డాలర్ల (రూ.2.7 కోట్ల) నష్టం వాటిల్లింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. మేక మరణంతో తమకు రూ. 3 కోట్ల నష్టం వాటిల్లిందని ఎంసీఎల్ ప్రతినిధి డికెన్ మెహ్రా ఒక ప్రకటనలో తెలిపారు. స్థానికుల ఆందోళన కారణంగా ఎంసీఎల్ వద్ద దాదాపు మూడున్నర గంటలు బొగ్గు రవాణా నిలిచిపోయింది. ఉన్నట్టుండి ఆపరేషన్లు నిలిచిపోవడంతో కోట్లాది రూపాయలు నష్టం వచ్చింది. పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాతే పరిస్థితి చక్కబడి, పనులు తిరిగి ప్రారంభమైనట్లు మెహ్రా తెలిపారు. నిరసనకారులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. స్థానిక ప్రజలు బొగ్గు, కట్టెలకోసం, అలాగే వారి పశువులను మేపడానికి బొగ్గు గని నిషేధిత ప్రాంతాల్లోకి అక్రమంగా చొరబడతారనీ మెహ్రా చెప్పారు.