న్యూఢిల్లీ: కోల్ ఇండియా వాటా విక్రయం విజయవంతంగా ముగిసింది. ఈ కంపెనీలో 3 శాతం వాటా విక్రయం ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావించింది. బుధవారం ప్రారంభమైన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) గురువారం ముగిసింది. ఈ ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా 3.18 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించి రూ.5,300 కోట్లు సమీకరించింది. బుధవారం సంస్థాగత ఇన్వెస్టర్లకు, గురువారం రిటైల్ ఇన్వెస్టర్లకు బిడ్ చేయడానికి కేటాయించారు. ఈ ఆఫర్ ఫర్ సేల్‌లో భాగంగా 3 శాతం వాటాకు సమానమైన 18.62 కోట్ల షేర్లను ప్రభుత్వం ఆఫర్ చేసింది. ఒక్కో షేర్ ఫ్లోర్ ధరను రూ.266గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ ధరపై 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
1.56 రెట్లు సబ్‌స్క్రైబయిన రిటైల్ వాటా..
రిటైల్ ఇన్వెస్టర్లకు 3.96 కోట్ల షేర్లను రిజర్వ్ చేశారు. 6.19 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. ఈ వాటా విభాగం 1.56 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా కూడా 1 శాతానికి పైగా ఓవర్ సబ్‌స్క్రైబయింది. వారికి 14.89 కోట్ల షేర్లను కేటాయించగా, 15.84 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. ఈ ఇష్యూ ఓవర్ సబ్‌స్క్రైబయితే అదనంగా మరో 6% వాటాను(37.24 కోట్లు) విక్రయించాలని ప్రభుత్వం భావించింది. 3% వాటా విక్రయానికి గాను 3.18% వాటా షేర్ల కోసం బిడ్‌లు వచ్చాయని, అదనంగా వచ్చిన 0.18% వాటా బిడ్‌లను కూడా ఆమోదిస్తామని ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు. 2015, జవనరిలో ఓఎఫ్‌ఎస్ ద్వారానే 10% వాటా విక్రయించి ప్రభుత్వం రూ.23,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతం కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి 78.32% వాటా ఉంది. ఓఎఫ్‌ఎస్ నేపథ్యంలో బీఎస్‌ఈలో కోల్ ఇండియా షేర్ 1.9% నష్టపోయి రూ.261 వద్ద ముగిసింది.
అతి పెద్ద వాటా విక్రయం..: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టిన అతి పెద్ద వాటా విక్రయం ఇదే. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటివరకూ రూ.10,028 కోట్లు సమీకరించింది. భారత్–22 ఈటీఎఫ్ ఫాలో ఆన్ ఆఫర్‌తో పాటు రీట్స్, ఇర్కన్, మిధాని, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)ల ద్వారా ఈ మొత్తాన్ని ప్రభుత్వం రాబట్టింది.
కోల్ ఇండియా ఓఎఫ్‌ఎస్ ఓకే!
Published Fri, Nov 2 2018 1:13 AM | Last Updated on Fri, Nov 2 2018 1:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment