OFS
-
శ్రీరామ్ ప్రాపర్టీస్ ఐపీవో @ రూ. 113–118
న్యూఢిల్లీ: నిర్మాణ రంగ సంస్థ శ్రీరామ్ ప్రాపర్టీస్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించి షేరు ధర శ్రేణిని రూ. 113–118గా నిర్ణయించింది. ఐపీవో డిసెంబర్ 8న ప్రారంభమై 10న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లు డిసెంబర్ 7న బిడ్లు వేయాల్సి ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా శ్రీరామ్ ప్రాపర్టీస్ రూ. 600 కోట్లు సమీకరిస్తోంది. ఇన్వెస్టర్లు కనీసం 125 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద విక్రయించే షేర్ల పరిమాణాన్ని శ్రీరామ్ ప్రాపర్టీస్ రూ. 550 కోట్ల నుంచి రూ. 350 కోట్లకు కంపెనీ తగ్గించింది. దీంతో ఐపీవో పరిమాణం కూడా రూ. 800 కోట్ల నుంచి రూ. 600 కోట్లకు తగ్గింది. ఇష్యూలో భాగంగా కొత్తగా రూ. 250 కోట్ల షేర్లను జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. సంస్థలో ఇన్వెస్ట్ చేసిన ఒమెగా టీసీ సేబర్ హోల్డింగ్స్ రూ. 91 కోట్లు, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సుమారు రూ. 8 కోట్లు, టీపీజీ ఏషియా ఎస్ఎఫ్ రూ. 92 కోట్లు, డబ్ల్యూఎస్ఐ/డబ్ల్యూఎస్‌క్యూఐ 5 మారిషస్ ఇన్వెస్టర్స్ రూ. 133 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నాయి. పబ్లిక్ ఇష్యూలో రూ. 3 కోట్ల విలువ చేసే షేర్లను సంస్థ ఉద్యోగుల కోసం కేటాయించారు. సిబ్బందికి తుది ధరతో పోలిస్తే 11 శాతం డిస్కౌంటుకు షేర్లు లభిస్తాయి. కొత్తగా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం శ్రీరామ్ ప్రాపర్టీస్ వినియోగించుకోనుంది. -
డిసెంబర్ 9న మ్యాప్‌మైఇండియా ఐపీవో
న్యూఢిల్లీ: డిజిటల్ మ్యాపింగ్ సంస్థ మ్యాప్‌మైఇండియా ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,040 కోట్లు సమీకరించనుంది. ఐపీవో డిసెంబర్ 9న ప్రారంభమై 13న ముగియనుంది. దీని కోసం షేరు ధర శ్రేణి రూ. 1,000–1,033గా ఉండనుంది. కనీసం 14 షేర్ల కోసం బిడ్ చేయాల్సి ఉంటుంది. మ్యాప్‌మైఇండియా ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలోనే ఉంటుంది. ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్లు 1,00,63,945 షేర్లను విక్రయించనున్నారు. కంపెనీలో ప్రమోటర్లయిన రాకేశ్ కుమార్ వర్మకు 28.65 శాతం, రాశి వర్మకు 35.88 శాతం వాటాలు ఉన్నాయి. ఓఎఫ్ఎస్ కింద రాశి వర్మ 42.51 లక్షల వరకూ, క్వాల్కామ్ ఏషియా పసిఫిక్ 27.01 లక్షలు, జెన్రిన్ కంపెనీ 13.7 లక్షల షేర్లు, ఇతర వాటాదారులు 17.41 లక్షల షేర్లను విక్రయించనున్నారు. సీఈ ఇన్ఫో సిస్టమ్స్‌గా కూడా పేరొందిన మ్యాప్‌మైఇండియాలో అంతర్జాతీయ వైర్లెస్ టెక్నాలజీ దిగ్గజం క్వాల్కామ్, జపాన్ డిజిటల్ మ్యాపింగ్ కంపెనీ జెన్రిన్కు పెట్టుబడులు ఉన్నాయి. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ.. అధునాతన డిజిటల్ మ్యాప్‌లు, జియోస్పేషియల్ సాఫ్ట్వేర్, లొకేషన్ ఆధారిత ఐవోటీ టెక్నాలజీలను అందిస్తోంది. యాపిల్ మ్యాప్స్‌తో పాటు ఫోన్‌పే, ఫ్లిప్‌కార్ట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎయిర్టెల్, హ్యుందాయ్ తదితర సంస్థలు కంపెనీకి క్లయింట్లుగా ఉన్నాయి. -
కరోనా ఉన్నా... ఆల్‌టైమ్ హైకి.. ఈక్విటీ నిధుల సమీకరణ
ముంబై: కరోనా కల్లోలం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థితిగతులను అల్లకల్లోలం చేసింది. కానీ మన దేశంలో ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల ద్వారా ఈక్విటీ మార్గంలో నిధుల సమీకరణ జోరును ఆపలేకపోయింది. ఈక్విటీ మార్కెట్ ద్వారా వివిధ కంపెనీలు ఐపీఓ, ఓఎఫ్ఎస్, ఇతర మార్గాల్లో రూ.1.78 లక్షల కోట్లు సమీకరించాయి. ఇప్పటివరకూ ఇదే రికార్డ్ స్థాయి. గత ఏడాది సమీకరించిన నిధులు(రూ.82,241 కోట్లు)తో పోల్చితే ఇది 116 శాతం అధికం. 2017లో సమీకరించిన రూ. 1,60,032 కోట్ల నిధుల సమీకరణ రికార్డ్ ఈ ఏడాది బద్దలైంది. ప్రైమ్ డేటాబేస్ వెల్లడించిన వివరాల ప్రకారం... ► కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు)ల్లో రిటైల్ ఇన్వెస్టర్లు జోరుగా పాల్గొనడం, ఐపీఓకు వచ్చిన కంపెనీలు స్టాక్‌మార్కెట్ లిస్టింగ్‌లో భారీ లాభాలు సాధించడం, క్యూఐపీ, ఇన్విట్స్/రీట్స్ మార్గంలో కంపెనీలు రికార్డ్ స్థాయిలో నిధులు సమీకరించడం... ఈ ఏడాది చెప్పుకోదగ్గ విశేషాలు. ► ఈ ఏడాది ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ రూ.26,611 కోట్లుగా ఉంది. గత ఏడాది 16 కంపెనీలు ఐపీఓకు వచ్చి రూ.12,382 కోట్లు సమీకరించాయి. ఈ ఏడాది 15 కంపెనీలు ఐపీఓల ద్వారా 26,611 కోట్లు సమీకరించాయి. గత ఏడాది ఐపీఓ నిధులతో పోల్చితే ఇది 115 శాతం అధికం. ► నిధుల సమీకరణ–ఎఫ్పీఓల(ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.15,024 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా రూ.21,458 కోట్లు, క్యూఐపీల ద్వారా రూ.84,501 కోట్లు, ఇన్విట్స్/రీట్స్ ద్వారా రూ.29,715 కోట్లుగా ఉన్నాయి. ► బాండ్ల జారీ ద్వారా సమీకరించిన మొత్తం, రూ.7,485 కోట్లను కూడా కలుపుకుంటే ఈక్విటీ మార్కెట్ల ద్వారా కంపెనీలు రాబట్టిన మొత్తం నిధులు రూ.1,84,953 కోట్లకు పెరుగుతాయి. ఎస్బీఐ కార్డ్స్ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.10,341 కోట్లు సమీకరించింది. ఈ ఏడాది ఇదే అతి పెద్ద ఐపీఓ. -
పతన బాటలో యూపీఎల్- ఐఆర్సీటీసీ
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లలో ఉన్నట్టుండి అమ్మకాలు తలెత్తాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్ 354 పాయింట్లు పతనమైంది. 45,749కు చేరింది. నిఫ్టీ సైతం 106 పాయింట్ల నష్టంతో 13,423 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రతికూల వార్తల కారణంగా సస్యరక్షణ ప్రొడక్టుల దిగ్గజం యూపీఎల్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ప్రభుత్వ వాటా విక్రయానికి ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ప్రారంభంకావడంతో పీఎస్‌యూ కంపెనీ ఐఆర్సీటీసీ కౌంటర్లోనూ అమ్మకాలు పెరిగాయి. వెరసి ఈ రెండు కౌంటర్లూ మార్కెట్లను మించి భారీ నష్టాలతో కళ తప్పాయి. వివరాలు చూద్దాం.. (ఈ షేర్లు- రేస్ గుర్రాలు) యూపీఎల్ అగ్రి ప్రొడక్టుల దిగ్గజం యూపీఎల్ ప్రమోటర్లు అక్రమమార్గంలో కంపెనీ నిధులను మళ్లించినట్లు ప్రజావేగు ఫిర్యాదు చేశారు. డొల్ల కంపెనీల ద్వారా అద్దె ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. తద్వారా సొంత ఉద్యోగుల పేరుతో ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీకి కోట్లకొద్దీ సొమ్మును చెల్లించినట్లు ఆరోపించారు. ఈ కంపెనీ గతంలో యూపీఎల్ చీఫ్ జైదేవ్ ష్రాఫ్‌కు చెందిన సంస్థగా ఆరోపించారు. అయితే ఈ వార్తలు పూర్తిగా అవాస్తవాలంటూ యూపీఎల్ సీఈవో జై ష్రాఫ్ ఖండించారు. ఆడిటర్లు లావాదేవీలను సమీక్షించినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో యూపీఎల్ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు దాదాపు 16 శాతం కుప్పకూలి రూ. 416కు చేరింది. ప్రస్తుతం కాస్త కోలుకుంది. 12 శాతం నష్టంతో రూ. 434 వద్ద ట్రేడవుతోంది. (తొలి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్- పరీక్షలకు రెడీ) ఐఆర్సీటీసీ ఐఆర్సీటీసీలో ప్రభుత్వం 20 శాతం వరకూ వాటాను విక్రయించేందుకు వీలుగా ఓఎఫ్ఎస్ ప్రారంభమైంది. ఇందుకు కంపెనీ రూ. 1,367 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వం తొలుత 15 శాతం వాటా(2.4 కోట్ల షేర్లు)ను విక్రయించనుంది. ఆఫర్‌కు అధిక స్పందన లభిస్తే మరో 5 శాతం వాటా(8 మిలియన్ షేర్లు) సైతం అమ్మే ఆప్షన్‌ను ఎంచుకుంది. కాగా.. బుధవారం ముగింపు ధర రూ. 1,618తో పోలిస్తే ఆఫర్ ధర 16 శాతం డిస్కౌంట్ కావడం గమనార్హం. దీంతో ఐఆర్సీటీసీ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 13 శాతంపైగా పతనమైంది. రూ. 1,405కు చేరింది. ప్రస్తుతం కాస్త రికవరైంది. 8.2 శాతం నష్టంతో రూ. 1,485 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం ఐఆర్సీటీసీలో ప్రభుత్వానికి 87.4 శాతం వాటా ఉంది. సెబీ నిబంధనల ప్రకారం ప్రమోటర్ వాటాను 75 శాతానికి తగ్గించుకోవలసి ఉండటంతో ఓఎఫ్‌ఎస్‌కు తెరతీసినట్లు నిపుణులు తెలియజేశారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ శుక్రవారం అందుబాటులోకి రానుంది. -
స్ట్రైడ్స్ ఫార్మా- జీఎంఎం ఫాడ్లర్ హైజంప్
కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న హెల్త్‌కేర్ రంగ కంపెనీ స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఇటీవల పతన బాటలో సాగుతున్న ఇంజినీరింగ్ కంపెనీ జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్‌కు ఉన్నట్టుండి డిమాండ్ పుట్టింది. దీంతో మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో హెచ్చుతగ్గులను చవిచూస్తున్నప్పటికీ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ గత వారం రోజుల్లో 14 శాతం ర్యాలీ చేసిన స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ కౌంటర్ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 7 శాతం జంప్‌చేసి రూ. 755ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3.6 శాతం ఎగసి రూ. 733 వద్ద ట్రేడవుతోంది. ఆందోళనవల్ల తలెత్తే తల నొప్పి నివారణలో వినియోగించగల ట్యాబ్లెట్లకు యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి పొందిన తదుపరి ఈ కౌంటర్ జోరందుకున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఎక్టావిస్ ల్యాబొరేటరీకి చెందిన బ్యుటల్బిటల్, ఎసిటామినోఫిన్, కెఫీన్ ట్యాబ్లెట్లకు జనరిక్ వెర్షన్ అయిన ట్యాబ్లెట్లకు అనుబంధ సంస్థ ద్వారా స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి పొందినట్లు పేర్కొన్నారు. దీనికితోడు ఈ ఏడాది క్యూ1లో పటిష్ట పనితీరు చూపడంతో గత మూడు నెలల్లో ఈ షేరు 77 శాతం దూసుకెళ్లింది. జీఎంఎం ఫాడ్లర్ రెండు వారాలుగా పతన బాటలో సాగుతున్న జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్‌కు ఉన్నట్టుండి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎన్ఎస్ఈలో యథాప్రకారం తొలుత 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకిన ఈ షేరు తదుపరి టర్న్అరౌండ్ అయ్యింది. కొనుగోలుదారులు పెరగడంతోపాటు.. అమ్మేవాళ్లు కరువుకావడంతో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. వెరసి తొలుత నమోదైన ఇంట్రాడే కనిష్టం రూ. 3,433 నుంచి రూ. 3,794కు దూసుకెళ్లింది. ఇది 11 శాతం లాభంకాగా.. మార్కెట్ ధరతో పోలిస్తే భారీ డిస్కౌంట్లో ప్రమోటర్లు 17.6 శాతం వాటాను విక్రయానికి పెట్టిన నేపథ్యంలో కొద్ది రోజులుగా పతన బాటలో సాగుతోంది. వెరసి గత రెండు వారాల్లో ఈ షేరు 40 శాతం దిగజారింది. ఇటీవల ఓఎఫ్ఎస్ ద్వారా ప్రమోటర్లు షేరుకి రూ. 3,500 ధరలో 17.6 శాతం వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. -
హెచ్ఎస్ఐఎల్ జూమ్- జీఎంఎం పతనం
తొలుత సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే అమ్మకాలు పెరగడంతో దేశీ స్టాక్ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. కాగా.. సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించడంతో హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్టుల కంపెనీ హెచ్ఎస్ఐఎల్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు దేశీ అనుబంధ సంస్థలో మాతృ సంస్థ 17.59 శాతం వాటాను విక్రయానికి ఉంచడంతో ప్రాసెస్ ఎక్విప్మెంట్ దిగ్గజం జీఎంఎం ఫాడ్లర్ లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి హెచ్ఎస్ఐఎల్ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. జీఎంఎం ఫాడ్లర్ భారీ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. హెచ్ఎస్ఐఎల్ లిమిటెడ్ షేరుకి రూ. 105 ధర మించకుండా ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు హెచ్ఎస్ఐఎల్ తాజాగా వెల్లడించింది. బైబ్యాక్‌లో భాగంగా 6.67 మిలియన్ షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ. 70 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో హెచ్ఎస్ఐఎల్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 77 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.5 శాతం లాభంతో రూ. 75 వద్ద ట్రేడవుతోంది. గత 8 రోజుల్లో ఈ షేరు 29 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! జీఎంఎం ఫాడ్లర్ లిమిటెడ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్ గ్రూప్ సంస్థలు 17.59 శాతం వాటాను విక్రయించనున్నట్లు జీఎంఎం ఫాడ్లర్ తాజాగా పేర్కొంది. ఇందుకు ఫ్లోర్ ధర రూ. 3,500గా నిర్ణయించినట్లు తెలియజేసింది. సోమవారం ముగింపు ధర రూ. 5,241తో పోలిస్తే ఇది 33 శాతం డిస్కౌంట్‌కాగా.. నేటి నుంచి ఓఎఫ్ఎస్ ప్రారంభంకానుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ బుధవారం వర్తించనుంది. కంపెనీ ప్రమోటర్లు ఫాడ్లర్ ఇంక్, మిల్లర్స్ మెషీనరీ, ఊర్మి పటేల్ సంయుక్తంగా 2.57 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. ఓఎఫ్‌ఎస్‌కు లభించే స్పందన ఆధారంగా మరో 1.52 మిలియన్ షేర్లను సైతం విక్రయించనున్నారు. తద్వారా మొత్తం 28 శాతంవరకూ వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 75 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో జీఎంఎం ఫాడ్లర్ షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం పతనమైంది. కొనుగోలుదారులు కరువుకావడంతో రూ. 4,683 దిగువన ఫ్రీజయ్యింది. -
ఎస్సెల్ ప్రొప్యాక్ జూమ్- హెచ్ఏఎల్ స్కిడ్
కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఎఫ్ఎంసీజీ ప్రొడక్టుల ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఇటీవల ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొంతమేర వాటాను విక్రయించిన నేపథ్యంలో నేలచూపులతో కదులుతున్న ఇంజినీరింగ్ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఎస్సెల్ ప్రొప్యాక్ లాభాలతో సందడి చేస్తుంటే.. హెచ్ఏఎల్ షేరు నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. ఎస్సెల్ ప్రొప్యాక్ ఈ ఏడాది క్యూ1లో పటిష్ట ఫలితాలు సాధించాక మరింత జోరందుకున్న ఎస్పెల్ ప్రొప్యాక్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. దీంతో ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 13 శాతం దూసుకెళ్లి రూ. 306ను తాకింది. ప్రస్తుతం 5.3 శాతం లాభంతో రూ. 285 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో కలిపి తొలి రెండు గంటల ట్రేడింగ్‌లోనే 4 లక్షల షేర్లు ఈ కౌంటర్లో చేతులు మారాయి. గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 75 శాతం ర్యాలీ చేయడం విశేషం! క్యూ1లో ఎస్సెల్ ప్రొ నికర లాభం 14 శాతం పెరిగి రూ. 46 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 18 శాతం పుంజుకుని రూ. 741 కోట్లను తాకింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ వరుసగా నాలుగో రోజు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ కౌంటర్లో అమ్మకాలు నమోదవుతున్నాయి. ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 3 శాతం క్షీణించి రూ. 898 వద్ద ట్రేడవుతోంది. తొలుత 6 శాతం పతనమై రూ. 871 వరకూ నీరసించింది. గత నాలుగు రోజుల్లోనే ఈ షేరు 26 శాతం నష్టపోయింది. గత గురువారం(27న) కేంద్ర ప్రభుత్వం ఓఎఫ్ఎస్ ద్వారా 14.82 శాతం వాటాకు సమానమైన 49.56 మిలియన్ ఈక్విటీ షేర్లను విక్రయించిన విషయం విదితమే. ఇందుకు ఫ్లోర్ ప్రైస్‌ను రూ. 1001గా అమలు చేసింది. తద్వారా కంపెనీలో వాటాను 89.97 శాతం నుంచి 75.15 శాతానికి తగ్గించుకుంది. అయితే ఫ్లోర్ ప్రైస్ కంటే దిగువకు తాజాగా షేరు క్షీణించినప్పటికీ గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 60 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
గాడ్ఫ్రే ఫిలిప్స్ భళా- హెచ్ఏఎల్ బోర్లా
సానుకూల ప్రపంచ సంకేతాలతో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ విభాగాలలో కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలు ప్రకటించిన టొబాకొ ప్రొడక్టుల దిగ్గజం గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోపక్క కేంద్ర ప్రభుత్వ వాటా విక్రయానికి తాజాగా ఫ్లోర్ ధరను ప్రకటించడంతో పీఎస్‌యూ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్) కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లాభాలతో సందడి చేస్తుంటే.. హెచ్ఏఎల్ నష్టాలతో కళ తప్పింది. ఇతర వివరాలు చూద్దాం.. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా దేశీయంగా మాల్బోరో బ్రాండ్ సిగరెట్ల తయారీ, విక్రయాలకు ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యాన్ని పటిష్ట పరచుకోనున్నట్లు గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా తాజాగా పేర్కొంది. అంతేకాకుండా ప్రస్తుతం ఎగుమతి చేస్తున్న మార్కెట్లలో సొంత బ్రాండ్లను పెంచుకునేందుకు చూస్తున్నట్లు తెలియజేసింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మరిన్ని ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో గాడ్ఫ్రే ఫిలిప్స్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 8 శాతం జంప్‌చేసి రూ. 1033 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 14 శాతం దూసుకెళ్లి రూ. 1092ను అధిగమించింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా కంపెనీలో 10 శాతం వాటాను ప్రమోటర్ కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది. అధిక స్పందన లభిస్తే అదనంగా 5 శాతం వాటాను సైతం అమ్మివేయనుంది. ఇందుకు ఫ్లోర్ ధర రూ. 1,001కాగా.. ఇది బుధవారం ముగింపు ధర రూ. 1178తో పోలిస్తే 15 శాతం తక్కువ. కంపెనీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 89.97 శాతం వాటా ఉంది. వాటా విక్రయం ద్వారా రూ. 5020 కోట్లవరకూ సమీకరించనుంది. ఫ్లోర్ ధరలో రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 5 డిస్కౌంట్ లభించనుంది. ఈ నేపథ్యంలో హెచ్ఏఎల్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 14 శాతం పడిపోయి రూ. 1014 వద్ద ట్రేడవుతోంది. -
మార్కెట్లో ‘వాటా’ ముసలం!
స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీల్లో ప్రజలకు కేటాయించే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ తాజా ప్రతిపాదన స్టాక్ మార్కెట్లో తీవ్రమైన ప్రకంపనలు సృష్టించింది. బడ్జెట్ రోజు, ఆ తర్వాతి రోజు కొనసాగిన నష్టాలకు ప్రధాన కారణాల్లో ఈ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్రతిపాదన కూడా ఒకటి. ఈ ప్రతిపాదన కారణంగా టీసీఎస్, విప్రో వంటి ఐటీ కంపెనీలు, డిమార్ట్ రిటైల్ స్టోర్స్ చెయిన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ వంటి దిగ్గజ కంపెనీలు కనీసం 10–20 శాతం మేర వాటాను విక్రయించాల్సి వస్తుంది. బీఎస్ఈలో దాదాపు 4,000కు పైగా కంపెనీలు లిస్ట్‌కాగా, వీటిల్లో 1,100 మేర కంపెనీలు వాటా విక్రయం జరపాల్సి వస్తుంది. ఇదంతా ఒకెత్తు. బహుళజాతి కంపెనీలు(ఎమ్ఎన్సీ) బాధ ఇంకొక ఎత్తు. చాలా ఎమ్ఎన్సీల్లో ప్రమోటర్ల వాటా 75 శాతం రేంజ్లో ఉంది. ఇవి 10 శాతం మేర వాటా విక్రయించాల్సి రావచ్చు. అయితే వాటా విక్రయానికి బదులుగా అసలు స్టాక్ మార్కెట్ నుంచే డీలిస్ట్ అయ్యే దిశగా ఈ ఎమ్ఎన్సీలు యోచిస్తున్నాయని సమాచారం. ఈ విషయమై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ.... లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ హోల్డింగ్‌ను ప్రస్తుతమున్న 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ విషయమై మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి ఒక లేఖ రాశామని ఆమె పేర్కొన్నారు. పబ్లిక్ హోల్డింగ్ పెంపు ప్రతిపాదనకు సెబీ త్వరలోనే విధి విధానాలను రూపొందిస్తుందని, రెండేళ్ల గడువుని ఇవ్వవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన స్టాక్ మార్కెట్ నుంచి లిక్విడిటీని లాగేయడమే కాకుండా, ప్రమోటర్ వాటా అధికంగా ఉన్న బహుళ జాతి కంపెనీలు మన స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి దోహదపడుతుందని నిపుణులంటున్నారు. కొన్ని ఎమ్ఎన్సీల్లో ప్రమోటర్ల వాటా 65 శాతానికి అటూ, ఇటూగా ఉంది. ఇలాంటి కంపెనీలకు పెద్దగా ఇబ్బంది లేదు. కొన్ని ఎమ్ఎన్సీల్లో ప్రమోటర్ల వాటా 75 శాతానికి అటూ, ఇటూగా ఉంది. ఈ కంపెనీలు డీలిస్టింగ్కే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక బిజినెస్ టు బిజినెస్(బీ2బీ)రంగంలో ఉన్న కంపెనీలు పూర్తిగా డీలిస్టింగ్కే మొగ్గుచూపుతున్నాయి. ఇలాంటి కంపెనీల వ్యాపారాలకు బ్రాండ్లతో పని లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే తాజా ప్రతిపాదనలపై ఎమ్ఎన్సీలు ఇప్పటివరకైతే, ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అప్పడూ ఇదే పరిస్థితి... మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ 2010–13లో 25 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనను తెచ్చింది. అప్పుడు కూడా ఇలాంటి దృశ్యమే కనిపించింది. పలు ఎమ్ఎన్సీలు స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి ప్రయత్నాలు చేశాయి. ఈ తాజా ప్రతిపాదన ప్రకారం ప్రజలకు 35 శాతం వాటాను కేటాయించాల్సి వస్తే, ఎమ్ఎన్సీలు రూ.50,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించాల్సి రావచ్చు. ఎమ్ఎన్సీలు, ఇతర భారత కంపెనీలు కలసి మొత్తం మీద రూ. 4 లక్షల కోట్ల మేర షేర్లను విక్రయించే అవకాశాలున్నాయి. ఎమ్ఎన్సీలు...మంచి పనితీరు... మార్కెట్, ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు ఎలా ఉన్నా, చాలా ఎమ్ఎన్సీలు మంచి పనితీరునే కనబరుస్తూ వచ్చాయి. మొత్తం గత 16 ఏళ్లకు గాను 11 ఏళ్లలో ఎమ్ఎన్సీ షేర్లు నిఫ్టీని మించిన రాబడులనిచ్చాయి. 2006 నుంచి చూస్తే, వరుసగా 13 ఏళ్ల పాటు నిఫ్టీని మించిన పనితీరును ఎమ్ఎన్సీలు చూపించాయి. తాజా ప్రతిపాదన తక్షణం అమలయ్యే అవకాశాల్లేవు. దశలవారీగానే ఈ ప్రతిపాదన అమల్లోకి రావచ్చు. కనీసం 3–4 ఏళ్లు పడుతుందని అంచనా. అయినప్పటికీ, ఇది ఆయా షేర్ల పనితీరుపై తీవ్రంగానే ప్రభావం చూపించవచ్చు. ప్రమోటర్ వాటా 75 శాతానికి పైగా ఉన్న సీమెన్స్, ఏబీబీ, హనీవెల్ వంటి కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్’(ఓఎఫ్ఎస్) విధానంలో తమ వాటాను విక్రయించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. ఇది ఆయా షేర్ల పనితీరుపై సమీప భవిష్యత్తులో తీవ్రంగానే ప్రభావం చూపుతుంది. అయితే సీమెన్స్, ఏబీబీ, హనీవెల్ కంపెనీల ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని, ఈ షేర్లు తగ్గితే అది కొనుగోళ్లకు మంచి అవకాశంగా భావించాలని ఆంటిక్ స్టాక్ బ్రోకింగ్ పేర్కొంది. ఓఎఫ్ఎస్ల వెల్లువ... ఈ ప్రతిపాదన కారణంగా ఆఫర్ ఫర్ సేల్’(ఓఎఫ్ఎస్)లు వెల్లువెత్తుతాయని నిపుణులంటున్నారు. వాటా విక్రయానికి చౌకైన, వేగవంతమైన ప్రక్రియ ఇదేనని, దీంతో స్టాక్ మార్కెట్లో ఓఎఫ్ఎస్లు వెల్లువెత్తుతాయని, దీంతో సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ సమస్య తలెత్తుతుందని వారంటున్నారు. ఈ ప్రతిపాదన కారణంగా కొన్ని ఉత్తమ ఫలితాలూ ఉంటాయని విశ్లేషకులంటున్నారు. సంస్థాగత ఇన్వెస్టర్ల యాజమాన్యం మరింతగా విస్తరిస్తుందని, స్టాక్ మార్కెట్ మరింతగా విస్తరిస్తుందని, షేర్లకు సరైన విలువ లభిస్తుందని, కార్పొరేట్ గవర్నెన్స్ మరింతగా మెరుగుపడగలదని వారంటున్నారు. అంతే కాకుండా నాణ్యత గల షేర్లు సమంజసమైన ధరకు లభించే అవకాశాలూ ఉన్నాయి. -
కోల్ ఇండియా ఓఎఫ్ఎస్ ఓకే!
న్యూఢిల్లీ: కోల్ ఇండియా వాటా విక్రయం విజయవంతంగా ముగిసింది. ఈ కంపెనీలో 3 శాతం వాటా విక్రయం ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావించింది. బుధవారం ప్రారంభమైన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) గురువారం ముగిసింది. ఈ ఓఎఫ్ఎస్లో భాగంగా 3.18 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించి రూ.5,300 కోట్లు సమీకరించింది. బుధవారం సంస్థాగత ఇన్వెస్టర్లకు, గురువారం రిటైల్ ఇన్వెస్టర్లకు బిడ్ చేయడానికి కేటాయించారు. ఈ ఆఫర్ ఫర్ సేల్‌లో భాగంగా 3 శాతం వాటాకు సమానమైన 18.62 కోట్ల షేర్లను ప్రభుత్వం ఆఫర్ చేసింది. ఒక్కో షేర్ ఫ్లోర్ ధరను రూ.266గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ ధరపై 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 1.56 రెట్లు సబ్‌స్క్రైబయిన రిటైల్ వాటా.. రిటైల్ ఇన్వెస్టర్లకు 3.96 కోట్ల షేర్లను రిజర్వ్ చేశారు. 6.19 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. ఈ వాటా విభాగం 1.56 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా కూడా 1 శాతానికి పైగా ఓవర్ సబ్‌స్క్రైబయింది. వారికి 14.89 కోట్ల షేర్లను కేటాయించగా, 15.84 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. ఈ ఇష్యూ ఓవర్ సబ్‌స్క్రైబయితే అదనంగా మరో 6% వాటాను(37.24 కోట్లు) విక్రయించాలని ప్రభుత్వం భావించింది. 3% వాటా విక్రయానికి గాను 3.18% వాటా షేర్ల కోసం బిడ్లు వచ్చాయని, అదనంగా వచ్చిన 0.18% వాటా బిడ్లను కూడా ఆమోదిస్తామని ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు. 2015, జవనరిలో ఓఎఫ్ఎస్ ద్వారానే 10% వాటా విక్రయించి ప్రభుత్వం రూ.23,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతం కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి 78.32% వాటా ఉంది. ఓఎఫ్ఎస్ నేపథ్యంలో బీఎస్ఈలో కోల్ ఇండియా షేర్ 1.9% నష్టపోయి రూ.261 వద్ద ముగిసింది. అతి పెద్ద వాటా విక్రయం..: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టిన అతి పెద్ద వాటా విక్రయం ఇదే. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటివరకూ రూ.10,028 కోట్లు సమీకరించింది. భారత్–22 ఈటీఎఫ్ ఫాలో ఆన్ ఆఫర్‌తో పాటు రీట్స్, ఇర్కన్, మిధాని, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)ల ద్వారా ఈ మొత్తాన్ని ప్రభుత్వం రాబట్టింది. -
ఎన్టీపీసీకి ఓఎఫ్ఎస్ షాక్!
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ విద్యుత్ ఉత్పత్తిదారు ఎన్టీపీసీకి ఓఎఫ్ఎస్ షాక్ తగిలింది. ప్రభుత్వ డిజ్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. షేరుకు రూ .168 చొప్పున ప్రభుత్వం 7 వేల కోట్ల రూపాయల మేరకు 5 శాతం వాటాను విక్రయిస్తోంది. దీంతో ఎన్టీపీఎస్ షేరు 3 శాతానికి పైగా క్షీణించింది. ఓఎఫ్‌ఎస్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర సోమవారం ముగింపు రూ. 173తో పోలిస్తే 3 శాతం తక్కువ! ప్రప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజం ఎన్టీపీసీలో ప్రభుత్వం 5 శాతం వాటాను విక్రయ ఆఫర్ ఫర్ సేల్ మొదలుకానుంది. షేరుకి రూ. 168 ధరలో 5 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 7,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఓవర్-సబ్ స్క్రిప్షన్ ద్వారా మరో 5 శాతం సాధించనున్నట్టు ఆ అధికారి తెలిపారు. కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ ఆఫర్ బుధవారం ఓపెన్ కానుంది. సంస్థాగత ఇన్వెస్టర్లు ఈరోజు బిడ్డింగ్ చేసుకునే అవకాశం. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.8,800 కోట్లను సాధించింది. ముఖ్యంగా ఎల్ అండ్ టిలో వాటాలు విక్రయం, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎస్‌యుటిఐఐ), ఒక వాటాల పునర్ కొనుగోలు సహా ఆరు కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ నిధులను ఆర్జించింది. ప్రభుత్వ రంగాలలో వాటాల విక్రయాల ద్వారా 2017-18లో రూ. 72,500 కోట్ల లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో మైనారిటీ వాటాల విక్రయాల నుండి 46,500 కోట్ల రూపాయలు, పంచవర్ష పెట్టుబడి సంస్థల జాబితా నుండి రూ. 15,000 కోట్లు, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 11,000 కోట్లను సమకూర్చుకోనుంది. -
ఎన్టీపీసీలో 5% డిజిన్వెస్ట్‌మెంట్
♦ రూ. 7000 కోట్ల సమీకరణ ♦ 168 ధరతో నేడు ఆఫర్ ఫర్ సేల్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పాదక దిగ్గజం ఎన్టీపీసీలో కేంద్ర ప్రభుత్వం 5 శాతం వాటాను డిజిన్వెస్ట్ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో జరిగే ఈ వాటా విక్రయం ద్వారా రూ. 7,000 కోట్లు ప్రభుత్వం సమీకరిస్తుంది. రూ. 168 ధరతో జరిగే ఓఎఫ్ఎస్ మంగళ, బుధవారాల్లో అమల్లో వుంటుందని కేంద్ర ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఓఎఫ్ఎస్ నేపథ్యంలో సోమవారం ఎన్టీపీసీ షేరు ధర 2.5 శాతం ఎగిసి రూ. 173.55 వద్ద ముగిసింది. ఓఎఫ్‌ఎస్‌కు తాజా ధరతో పోలిస్తే 3 శాతం డిస్కౌంట్‌తో ఫ్లోర్ ధరను నిర్ణయించారు. ఇష్యూ ఓవర్ సబ్స్క్రయిబ్ అయితే మరో 5 శాతం విక్రయించే ఆప్షన్‌తో ఓఎఫ్ఎస్ జారీచేస్తున్నట్లు ఆ అధికారి వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం రూ. 8,800 కోట్లు సమీకరించగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 72,500 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. -
సోలార్ వ్యాపారం ఇక ఈజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సోలార్ ఎనర్జీ రంగంలోకి ప్రవేశించాలని ఉన్నవారికి ఎలాంటి అనుభవం లేకున్నా వ్యాపారం చేసేందుకు వీలుగా ‘సన్‌ప్రో’ మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. సౌర విద్యుత్ రంగంలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఫ్రేయర్ ఎనర్జీ భారత్‌లో తొలిసారిగా ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం 150 కంపెనీలు 40 రకాల పరికరాల వివరాలను యాప్‌లో జోడించాయి. ఔత్సాహిక వ్యాపారులు కస్టమర్ల అవసరానికి తగ్గట్టుగా సౌర విద్యుత్ పరిష్కారాలను అందించేందుకు వీలుగా యాప్‌ను డిజైన్ చేసినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు సౌరభ్ మర్దా తెలిపారు. సహ వ్యవస్థాపకురాలు రాధిక చౌదరితో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. 80 మంది వ్యాపారులు ఇప్పటి వరకు చేతులు కలిపారని, కంపెనీకి రూ.60 కోట్ల ఆర్డర్ బుక్ ఉందని చెప్పారు. ఫ్రేయర్ ఎనర్జీ 2016–17లో రూ.12 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.80 కోట్లు ఆశిస్తోంది. -
నాల్కో వాటా విక్రయం
ఇష్యూ ధర రూ.67 నేడు నాన్ రిటైలర్లకు.. రేపు రిటైల్ ఇన్వెస్టర్లకు ముంబై: డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ అల్యూమినియం కంపెనీ(నాల్కో)లో 10 శాతం వరకూ వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనుంది. నేడు నాన్–రిటైల్ ఇన్వెస్టర్లకు, రేపు(ఈ నెల 20న) రిటైల్ ఇన్వెస్టర్లకు వాటా విక్రయిస్తామని పేర్కొంది. ఈ వాటా విక్రయానికి ఇష్యూధరగా రూ.67గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది(బీఎస్ఈలో మంగళవారం ఈ షేర్ రూ.73 వద్ద ముగిసింది). ఈ ఓఎఫ్ఎస్ ద్వారా రూ.1,350 కోట్లు వస్తాయని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేపడుతున్న తొలి ప్రభుత్వ వాటా విక్రయం ఇది. నాల్కోలో ప్రభుత్వానికి 74.58 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం వార్త మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడింది. -
ఈ వారం రెండు ఐపీఓలు
మ్యూజిక్ బ్రాడ్కాస్ట్.. రూ.400 కోట్లు అవెన్యూ సూపర్ మార్ట్స్.. రూ.1,870 కోట్లు న్యూఢిల్లీ: ఈ వారంలో రెండు కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)లు రానున్నాయి. రేడియో సిటీ ఎఫ్ఎం రేడియో చానళ్లన్నీ నిర్వహించే జాగరణ్ ప్రకాశన్ గ్రూప్‌కు చెందిన మ్యూజిక్ బ్రాడ్కాస్ట్, డి–మార్ట్ రిటైల్ సూపర్ మార్కెట్ చెయిన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్స్లు ఈ ఐపీఓల ద్వారా రూ.2,300 కోట్ల వరకూ నిధులు సమీకరించనున్నాయి. ఈ నెల 6 నుంచి మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ ఐపీఓ దేశవ్యాప్తంగా 37 నగరాల్లో రేడియో సిటీ బ్రాండ్ కింద ఎఫ్ంఎ రేడియో స్టేషన్లను నిర్వహిస్తున్న మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ ఐపీఓ ఈ నెల 6 న ప్రారంభం కానున్నది. 8వ తేదీన ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.400 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో 26.59 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. ధరల శ్రేణి రూ.324–333గా కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 17న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావచ్చని అంచనా. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను..లిస్టెడ్ నాన్–కన్వర్టబుల్ డిబెంచర్ల ఉపసంహరణకు వినియోగిస్తారు. గత శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఈ కంపెనీ రూ.146 కోట్లు సమీకరించింది. ఈ నెల 8 నుంచి డి–మార్ట్ ఐపీఓ డి–మార్ట్ రిటైల్ చెయిన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ ఐపీఓ ఈ నెల 8న ప్రారంభం అవుతుంది. ఈ నెల 10న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,870 కోట్లు సమీకరించనున్నది. ధరల శ్రేణిని రూ.295–299గా కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 21న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావచ్చని అంచనా. గతేడాది రూ.3,000 కోట్ల పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ. -
ఎన్టీపీసీ ఆఫర్ కు తొలిరోజే భారీ స్పందన
♦ జోరుగా బిడ్చేసిన సంస్థాగత ఇన్వెస్టర్లు ♦ నేడు రిటైల్ ఇన్వెస్టర్లకు ఓఎఫ్ఎస్ న్యూఢిల్లీ: ఎన్టీపీసీ వాటా విక్రయం మంగళవారం శుభారంభం చేసింది. ఈ వాటా విక్రయానికి విదేశీ, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఎన్టీపీసీ 5 శాతం వాటాను రూ.122 ఫ్లోర్ ధరతో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ వాటా విక్రయం తొలిరోజు సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించారు. వాటా విక్రయం ప్రారంభమైన రెండు గంటల్లోనే సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు 32.98 కోట్ల షేర్లు కేటాయించగా, 1.8 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది. 59.62 కోట్ల షేర్లకు (రూ.7,287 కోట్ల విలువైన) బిడ్లు వచ్చాయి. వీటిల్లో రూ.5,325 కోట్ల బిడ్లు బీమా కంపెనీల నుంచి, రూ.925 కోట్ల బిడ్లు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి వచ్చాయి. బ్యాంక్‌లు రూ.498 కోట్లకు, మ్యూచువల్ ఫండ్స్ రూ.436 కోట్లకు, హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్ రూ.102 కోట్లకు బిడ్లు వేశాయి. కాగా ఒక్క ఎల్ఐసీయే రూ.3,000 కోట్లకు బిడ్లు సమర్పించిందని సమాచారం. అధిక బిడ్ రూ.130కు వచ్చింది. నేడు రిటైల్ ఇన్వెస్టర్లకు ఓఎఫ్ఎస్ 8.24 కోట్ల షేర్లు కేటాయించిన రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం ఓఎఫ్ఎస్ నేడు(బుధవారం) జరగనున్నది. రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్‌కు(రూ.116) లభిస్తుంది. ఈ ఎన్టీపీసీ వాటా విక్రయానికి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి ప్రోత్సాహకర స్పందన లభించిందని డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శి నీరజ్ కె. గుప్తా చెప్పారు. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం విక్రయానికి కూడా ఇదే తరహా స్పందన లభించగలదని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీపీసీ వాటా విక్రయం విజయవంతం కావడం భారత ఆర్థిక వ్యవస్థపై స్టాక్ మార్కెట్‌కున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ట్వీట్ చేశారు. వాటా విక్రయం నేపథ్యంలో బీఎస్ఈలో ఎన్టీపీసీ 2.3 శాతం నష్టపోయి రూ.124 వద్ద ముగిసింది. ఖజానాకు రూ.5,030 కోట్లు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) నిబంధనలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సవరించిన తర్వాత వచ్చిన తొలి ఓఎఫ్ఎస్ ఎన్టీపీసీదే. కాగా ఈ ఇష్యూకు ఎస్బీబిక్యాప్ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎడిల్‌వేజ్ సెక్యూరిటీస్, డాషే ఈక్విటీస్ సంస్థలు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఎన్టీపీసీలో ప్రభుత్వ వాటా 74.96 శాతంగా ఉంది. ఈ వాటా విక్రయం తర్వాత ప్రభుత్వ వాటా 69.96 శాతానికి తగ్గుతుంది. ఫ్లోర్ ధర(రూ.122) ఆధారంగా 5 శాతం వాటా విక్రయం కారణంగా ప్రభుత్వానికి రూ.5,030 కోట్లు సమకూరుతాయని అంచనా. -
పీఎఫ్సీ వాటా విక్రయం సక్సెస్
ఖజానాకు రూ.1,600 కోట్లు న్యూఢిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ బాగుం డటంతో ప్రభుత్వ రంగ దిగ్గజం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) తలపెట్టిన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) 2.34 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఈ సంస్థలో ప్రభుత్వానికి ఉన్న వాటాలో 5 శాతాన్ని... అంటే 6.60 కోట్ల షేర్లను ఓఎఫ్ఎస్కి ఉంచగా 15.41 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. ఒకో షేరుకు రూ. 254 ధరను నిర్ణయించటంతో ఖజానాకు రూ. 1,600 కోట్ల పైచిలుకు జమ కానున్నాయి. మొత్తం షేర్లలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 1.32 కోట్ల షేర్లను ప్రతిపాదించగా ఏకంగా 5.92 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. షేరు కనీస విక్రయ ధర రూ.254లో రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంటు లభిస్తుంది. బీఎస్ఈలో సోమవారం పీఎఫ్సీ షేర్లు 2.12 శాతం క్షీణించి రూ. 254.05 వద్ద ముగిశాయి. -
రేపు ఆర్ఈసీలో వాటాల విక్రయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)లో 5 శాతం వాటాల విక్రయాన్ని కేంద్రం ఏప్రిల్ 8న చేపట్టనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో 4.93 కోట్ల షేర్ల విక్రయం ద్వారా రూ. 1,600 కోట్లు సమీకరించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి డిజిన్వెస్ట్‌మెంట్ కానుంది. సోమవారం బీఎస్ఈలో ఆర్ఈసీ షేర్లు 0.52 శాతం క్షీణించి రూ. 335.60 వద్ద ముగిశాయి. ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే ఓఎఫ్ఎస్ షేరు రేటును ప్రభుత్వం మరింత తక్కువగా నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. ఆఫర్లో 20 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు. ఇష్యూ ధరతో పోలిస్తే వారికి 5 శాతం డిస్కౌంటు లభిస్తుంది. -
పీఎస్‌యూల ఈటీఎఫ్ నేడు షురూ
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూ) ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్) మంగళవారం(18న) ప్రారంభంకానుంది. 10 బ్లూచిప్ కంపెనీల వాటాలతో ఏర్పాటు చేసిన ఈ కొత్త ఫండ్‌లో పెట్టుబడులకు తొలి రోజు యాంకర్(సంస్థాగత) ఇన్వెస్టర్లకు మాత్రమే అవకాశముంటుంది. ఫండ్ ద్వారా మొత్తం రూ. 3,000 కోట్లను సమీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేసింది. దీనిలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు రూ. 900 కోట్ల విలువైన యూనిట్లను విక్రయించనుంది. ఆపై బుధవారం(19) నుంచీ సంపన్న వర్గాలు, రిటైల్ ఇన్వెస్టర్లు ఈటీఎఫ్ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విభాగం నుంచి రూ. 2,100 కోట్ల పెట్టుబడులను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫండ్‌లో భాగమైన ప్రభుత్వ బ్లూచిప్ దిగ్గజాల జాబితా ఇలా ఉంది... ఓఎన్జీసీ, గెయిల్, కోల్ ఇండియా, ఆయిల్ ఇండియా, కంటెయినర్ కార్పొరేషన్, ఆర్ఈసీ, పీఎఫ్సీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇం జనీర్స్ ఇండియా, ఐవోసీ చోటు దక్కించుకున్నాయి. కొత్త ఫండ్ ఆఫర్ ఈ నెల 21న ముగియనుంది. రూ. 10 కోట్లకుపైగా... కనీసం రూ. 10 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌చేసే యాంకర్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం తొలుత ఈ కొత్త ఫండ్‌ను ఆఫర్ చేస్తోంది. రిటైలర్లు తదితర ఇన్వెస్టర్లు 19 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ద్వారా టాప్-10 పీఎస్‌యూ కంపెనీలలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లకు అవకాశం లభిస్తుందని డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ కార్యదర్శి టాండన్ పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు 6.66% లాయల్టీ అంటే ప్రతీ 15 యూనిట్లకూ ఒక లాయల్టీ యూనిట్‌ను అందించనున్నట్లు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఇండియాలో ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పుంజుకుంటూ వస్తున్నాయి. 2009 మార్చిలో ఈటీఎఫ్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 1,396 కోట్లుకాగా, 2013 సెప్టెంబర్‌కల్లా రూ. 11,807 కోట్లకు ఎగశాయి. సీపీఎస్ఈ ఇండెక్స్ కూడా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) 18 నుంచీ సీపీఎస్ఈ ఇండెక్స్‌ను ప్రవేశపెడుతోంది. 2009 జనవరి 1 రేట్ల ఆధారంగా ఇండెక్స్‌ను రూపొందించింది. విలువను 1,000గా నిర్ధారించింది. ఇక్కడి నుంచి ఇండెక్స్‌లో ట్రేడింగ్ మొదలుకానుంది. ఈ ఇండెక్స్ ద్వారా సీపీఎస్ఈ ఈటీఎఫ్ యూనిట్ల విక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి ఎన్ఎస్ఈ సహాయపడనుంది. మరోవైపు ఇన్వెస్టర్లకు కూడా తక్కువ వ్యయంలోనే వివిధ పరిశ్రమలకు చెందిన ప్రభుత్వ రంగ బ్లూచిప్ కంపెనీలలో వాటాలను పొందేందుకు అవకాశం లభిస్తుందని ఎన్ఎస్ఈ పేర్కొంది. సీపీఎస్ఈ ఇండెక్స్‌లోని కంపెనీల వెయిటేజీలను ప్రతీ క్వార్టర్లోనూ సమీక్షించి మార్పులను చేపట్టనున్నట్లు తెలిపింది. లక్ష్యానికి చేరువగా: ఆర్థిక మంత్రి చిదంబరం ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని రూ. 40,000 కోట్ల నుంచి రూ. 16,027 కోట్లకు కుదించిన విషయం విదితమే. ఈ లక్ష్యాన్ని చేరుకునే బాటలో ఇప్పటికే ప్రభుత్వం రూ. 13,119 కోట్లను సమీకరించింది. గత శుక్రవారం ఐవోసీలో 10% వాటా విక్రయం ద్వారా రూ. 5,340 కోట్లను సమీకరించింది. ఈ నెల మొదట్లో భెల్‌లో 5.94% వాటాను ఎల్ఐసీకి అమ్మడం ద్వారా రూ.2,685 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే.