పీఎస్‌యూల ఈటీఎఫ్ నేడు షురూ | Govt hopes to keep short-sellers at bay during CPSE ETF | Sakshi
Sakshi News home page

పీఎస్‌యూల ఈటీఎఫ్ నేడు షురూ

Published Tue, Mar 18 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM

పీఎస్‌యూల ఈటీఎఫ్ నేడు షురూ

పీఎస్‌యూల ఈటీఎఫ్ నేడు షురూ

 న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూ) ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్) మంగళవారం(18న) ప్రారంభంకానుంది. 10 బ్లూచిప్ కంపెనీల వాటాలతో ఏర్పాటు చేసిన ఈ కొత్త ఫండ్‌లో పెట్టుబడులకు తొలి రోజు యాంకర్(సంస్థాగత) ఇన్వెస్టర్లకు మాత్రమే అవకాశముంటుంది. ఫండ్ ద్వారా మొత్తం రూ. 3,000 కోట్లను సమీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేసింది. దీనిలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు రూ. 900 కోట్ల విలువైన యూనిట్లను విక్రయించనుంది.

ఆపై బుధవారం(19) నుంచీ సంపన్న వర్గాలు, రిటైల్ ఇన్వెస్టర్లు ఈటీఎఫ్ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విభాగం నుంచి రూ. 2,100 కోట్ల పెట్టుబడులను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫండ్‌లో భాగమైన ప్రభుత్వ బ్లూచిప్ దిగ్గజాల జాబితా ఇలా ఉంది... ఓఎన్‌జీసీ, గెయిల్, కోల్ ఇండియా, ఆయిల్ ఇండియా, కంటెయినర్ కార్పొరేషన్, ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇం జనీర్స్ ఇండియా, ఐవోసీ చోటు దక్కించుకున్నాయి. కొత్త ఫండ్ ఆఫర్ ఈ నెల 21న ముగియనుంది.
 రూ. 10 కోట్లకుపైగా...
 కనీసం రూ. 10 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌చేసే యాంకర్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం తొలుత ఈ కొత్త ఫండ్‌ను ఆఫర్ చేస్తోంది. రిటైలర్లు తదితర ఇన్వెస్టర్లు 19 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ద్వారా టాప్-10 పీఎస్‌యూ కంపెనీలలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లకు అవకాశం లభిస్తుందని డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ కార్యదర్శి టాండన్ పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు 6.66% లాయల్టీ అంటే ప్రతీ 15 యూనిట్లకూ ఒక లాయల్టీ యూనిట్‌ను అందించనున్నట్లు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఇండియాలో ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పుంజుకుంటూ వస్తున్నాయి. 2009 మార్చిలో ఈటీఎఫ్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 1,396 కోట్లుకాగా, 2013 సెప్టెంబర్‌కల్లా రూ. 11,807 కోట్లకు ఎగశాయి.
 సీపీఎస్‌ఈ ఇండెక్స్ కూడా
 నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) 18 నుంచీ సీపీఎస్‌ఈ ఇండెక్స్‌ను ప్రవేశపెడుతోంది. 2009 జనవరి 1 రేట్ల ఆధారంగా ఇండెక్స్‌ను రూపొందించింది. విలువను 1,000గా నిర్ధారించింది. ఇక్కడి నుంచి ఇండెక్స్‌లో ట్రేడింగ్ మొదలుకానుంది. ఈ ఇండెక్స్ ద్వారా సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ యూనిట్ల విక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి ఎన్‌ఎస్‌ఈ సహాయపడనుంది. మరోవైపు ఇన్వెస్టర్లకు కూడా తక్కువ వ్యయంలోనే వివిధ పరిశ్రమలకు చెందిన ప్రభుత్వ రంగ బ్లూచిప్ కంపెనీలలో వాటాలను పొందేందుకు అవకాశం లభిస్తుందని ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. సీపీఎస్‌ఈ ఇండెక్స్‌లోని కంపెనీల వెయిటేజీలను ప్రతీ క్వార్టర్‌లోనూ సమీక్షించి మార్పులను చేపట్టనున్నట్లు తెలిపింది.
 లక్ష్యానికి చేరువగా: ఆర్థిక మంత్రి చిదంబరం ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని రూ. 40,000 కోట్ల నుంచి రూ. 16,027 కోట్లకు కుదించిన విషయం విదితమే. ఈ లక్ష్యాన్ని చేరుకునే బాటలో ఇప్పటికే ప్రభుత్వం రూ. 13,119 కోట్లను సమీకరించింది. గత శుక్రవారం ఐవోసీలో 10% వాటా విక్రయం ద్వారా రూ. 5,340 కోట్లను సమీకరించింది. ఈ నెల మొదట్లో భెల్‌లో 5.94% వాటాను ఎల్‌ఐసీకి అమ్మడం ద్వారా రూ.2,685 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement