ఎన్టీపీసీ ఆఫర్ కు తొలిరోజే భారీ స్పందన
♦ జోరుగా బిడ్‌చేసిన సంస్థాగత ఇన్వెస్టర్లు
♦ నేడు రిటైల్ ఇన్వెస్టర్లకు ఓఎఫ్‌ఎస్
న్యూఢిల్లీ: ఎన్‌టీపీసీ వాటా విక్రయం మంగళవారం శుభారంభం చేసింది. ఈ వాటా విక్రయానికి విదేశీ, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఎన్‌టీపీసీ 5 శాతం వాటాను రూ.122 ఫ్లోర్ ధరతో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ వాటా విక్రయం తొలిరోజు సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించారు. వాటా విక్రయం ప్రారంభమైన రెండు గంటల్లోనే సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు 32.98 కోట్ల షేర్లు కేటాయించగా, 1.8 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది. 59.62 కోట్ల షేర్లకు (రూ.7,287 కోట్ల విలువైన) బిడ్‌లు వచ్చాయి. వీటిల్లో రూ.5,325 కోట్ల బిడ్‌లు బీమా కంపెనీల నుంచి, రూ.925 కోట్ల బిడ్‌లు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి వచ్చాయి. బ్యాంక్‌లు రూ.498 కోట్లకు, మ్యూచువల్ ఫండ్స్ రూ.436 కోట్లకు, హైనెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ రూ.102 కోట్లకు బిడ్‌లు వేశాయి. కాగా ఒక్క ఎల్‌ఐసీయే రూ.3,000 కోట్లకు బిడ్‌లు సమర్పించిందని సమాచారం. అధిక బిడ్ రూ.130కు వచ్చింది.
నేడు రిటైల్ ఇన్వెస్టర్లకు ఓఎఫ్‌ఎస్
8.24 కోట్ల షేర్లు కేటాయించిన రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం ఓఎఫ్‌ఎస్ నేడు(బుధవారం) జరగనున్నది. రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్‌కు(రూ.116) లభిస్తుంది. ఈ ఎన్‌టీపీసీ వాటా విక్రయానికి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి ప్రోత్సాహకర స్పందన లభించిందని డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శి నీరజ్ కె. గుప్తా చెప్పారు. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం విక్రయానికి కూడా ఇదే తరహా స్పందన లభించగలదని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎన్‌టీపీసీ వాటా విక్రయం విజయవంతం కావడం భారత ఆర్థిక వ్యవస్థపై స్టాక్ మార్కెట్‌కున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ట్వీట్ చేశారు. వాటా విక్రయం నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎన్‌టీపీసీ 2.3 శాతం నష్టపోయి రూ.124 వద్ద ముగిసింది.
ఖజానాకు రూ.5,030 కోట్లు
ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) నిబంధనలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సవరించిన తర్వాత వచ్చిన తొలి ఓఎఫ్‌ఎస్ ఎన్‌టీపీసీదే. కాగా ఈ ఇష్యూకు ఎస్‌బీబిక్యాప్ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎడిల్‌వేజ్ సెక్యూరిటీస్, డాషే ఈక్విటీస్ సంస్థలు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఎన్‌టీపీసీలో ప్రభుత్వ వాటా 74.96 శాతంగా ఉంది. ఈ వాటా విక్రయం తర్వాత ప్రభుత్వ వాటా 69.96 శాతానికి తగ్గుతుంది. ఫ్లోర్ ధర(రూ.122) ఆధారంగా 5 శాతం వాటా విక్రయం కారణంగా ప్రభుత్వానికి రూ.5,030 కోట్లు సమకూరుతాయని అంచనా.