రూ.1,891 కోట్ల మధ్యవర్తిత్వ తీర్పును కొట్టివేసిన హైకోర్టు
జిందాల్ ఐటీఎఫ్ లిమిటెడ్‌కు రూ.1,891 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ)ను ఆదేశించిన 2019 మధ్యవర్తిత్వ తీర్పును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ‘పేటెంట్ చట్టవిరుద్ధం’, ప్రభుత్వ విధానాన్ని ఉల్లంఘించడమని కోర్టు గుర్తించింది.
వివాదం నేపథ్యం
ఎన్‌టీపీసీ, జిందాల్ ఐటీఎఫ్ లిమిటెడ్, ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) మధ్య 2011లో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం కారణంగా ఈ వివాదం తలెత్తింది. పశ్చిమ బెంగాల్‌లోని ఎన్‌టీపీసీకి చెందిన ఫరక్కా థర్మల్ పవర్ ప్లాంట్‌కు జాతీయ జలమార్గం ద్వారా బొగ్గు రవాణా చేయడమే ఈ ఒప్పందం లక్ష్యం. బొగ్గు రవాణాకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి జిందాల్ ఐటీఎఫ్ బాధ్యత వహించింది. మౌలిక సదుపాయాల నిర్మాణ సమయంలో జాప్యం జరిగింది. ఫేజ్ 1 పనులు.. 400 రోజులు, ఫేజ్ 2 పనులు.. 674 రోజులు ఆలస్యం అయ్యాయి. 2017లో జిందాల్ ఐటీఎఫ్ మధ్యవర్తిత్వ చర్యలను ప్రారంభించింది. జాప్యం వల్ల జరిగిన ఆదాయ నష్టానికి ఎన్‌టీపీసీ పరిహారం కోరింది. తర్వాత జిందాల్ ఐటీఎఫ్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
ఇదీ చదవండి: మనిషిలా తెలివి మీరుతున్న ఏఐ
ఎన్‌టీపీసీ ఒప్పందాన్ని రద్దు చేసినందుకు 2019 జనవరిలో మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ జిందాల్ ఐటీఎఫ్‌కు మద్దతుగా రూ.1,891 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే కాంట్రాక్ట్ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం, ‘నో డ్యామేజీ’ క్లాజ్ ఉండటం సహా పలు కారణాలను చూపుతూ ఎన్‌టీపీసీ ఢిల్లీ హైకోర్టులో ఈ తీర్పును సవాలు చేసింది. ట్రిబ్యునల్ నష్టపరిహారాలను సరైన రీతిలో లెక్కించలేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ట్రిబ్యునల్ ప్రభుత్వ విధానాన్ని ఉల్లంఘించడమని కోర్టు గుర్తించింది. తగిన శ్రద్ధ, నైపుణ్యంతో ప్రొసీడింగ్స్ నిర్వహించడం మధ్యవర్తి బాధ్యతని కోర్టు నొక్కి చెప్పింది. ఈ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేయాలని జిందాల్ ఐటీఎఫ్ యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment