
రెస్టారెంట్లు బలవంతంగా వసూలు చేయరాదు
ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ చార్జీల పేరుతో అదనంగా వసూలు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తప్పుబట్టింది. వినియోగదారులు సర్వీస్ చార్జీలను స్వచ్ఛందంగా ఇవ్వాల్సిందే తప్ప వారి నుంచి బలవంతంగా వసూలు చేయజాలవని స్పష్టం చేసింది. బిల్లుపై అదనంగా సర్వీస్ చార్జీలంటూ వసూలు చేయరాదన్న సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) నిబంధనలను సవాల్ చేస్తూ రెస్తారెంట్ల సంఘాలు వేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం.సింగ్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. ‘‘కస్టమర్లకు ఇష్టమైతే టిప్ ఇవ్వొచ్చు. అంతేతప్ప సర్వీస్ చార్జీలంటూ వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం.
అసలు బిల్లులో కలపని ఈ మొత్తాన్ని జీఎస్‌టీ లేదా సర్వీస్ ట్యాక్స్ అని కస్టమర్లు భావించే అవకాశముంది. ఇది మోసమే అవుతుంది’’ అని జడ్జి పేర్కొన్నారు. పిటిషన్‌దారులైన ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ), నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆండియా(ఎన్‌ఆర్‌ఏఐ)లకు చెరో రూ.లక్ష చొప్పున జరిమానా సైతం విధించారు. వినియోగదారుల సంక్షేమానికి ఉపయోగపడేలా ఈ మొత్తాన్ని సీపీపీఏ ఖాతాలో జమ చేయాలన్నారు. రెస్టారెంట్ల హక్కుల కంటే వినియోగదారుల హక్కులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తేల్చి చెప్పారు.