Central Consumer Protection Council
-
పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో పాల్గొంటున్నందుకు..
లక్నో: పొగాకు కంపెనీల తరఫున ప్రకటనల్లో కన్పిస్తున్న బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్ దేవ్‌గణ్‌లకు కేంద్రం నోటీసులు పంపింది. ప్రజల ఆరోగ్యానికి చేటు తెస్తున్న పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో సెలబ్రిటీలు, ముఖ్యంగా పద్మ అవార్డు గ్రహీతలు నటిస్తుండటంపై మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. కేంద్రం స్పందించడం లేదని, ఇది ధిక్కరణేనని పిటిషనర్ మరోసారి కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. షారూక్, అక్షయ్, అజయ్‌లకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అక్టోబర్ 20వ తేదీనే నోటీసులిచ్చిందని కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే కోర్టుకు తెలిపారు. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. విచారణ 2024 మే 9కి వాయిదా పడింది. -
అమ్మేది ఎవరో తెలియాల్సిందే.. సీసీపీఏ ఆదేశాలు
న్యూఢిల్లీ:ప్యాకింగ్‌పై విక్రేతల పేరు, చిరునామా, ఫిర్యాదుల పరిష్కార అధికారి నంబర్‌ను స్పష్టంగా, అందుబాటులో ఉండే పద్ధతిలో ఈ–కామర్స్ సంస్థలు ప్రదర్శించాల్సిందేనని సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) స్పష్టం చేసింది. ఈ మేరకు సీసీపీఏ అన్ని రాష్ట్రాలు, పారిశ్రామిక సంఘాలకు సమాచారమిచ్చింది. వినియోగదార్ల రక్షణ (ఈ–కామర్స్) నిబంధనలు–2020 ప్రకారం విక్రేతల వివరాలు పొందుపర్చడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీసీపీఏ స్పందించింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టం కింద చర్య తీసుకుంటామని సీసీపీఏ కమిషనర్ అనుపమ్ మిశ్రా తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్–జూలైలో దేశవ్యాప్తంగా నేషనల్ కంజ్యూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ–కామర్స్ కంపెనీల మీద 69,208 ఫిర్యాదులు అందాయి. బ్యాంకింగ్, టెలికం రంగాలతో పోలిస్తే ఇవే అధికం. -
సెలబ్రిటీలూ.. బాధ్యతగా వ్యవహరించండి
న్యూఢిల్లీ: నాణ్యతలేని, తప్పుదారి పట్టించే బ్రాండ్లకు అంబాసిడర్లుగా వ్యవహరించే విషయంలో సెలబ్రిటీలు బాధ్యతగా నడుచుకోవాలని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్(సీసీపీసీ) మంగళవారం సూచించింది. సీసీపీసీ సమావేశంలో కౌన్సిల్ చైర్మన్, కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘సెలబ్రిటీలకు మార్గదర్శకాలు ఉండాలి. అంబాసిడర్‌గా సంతకం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మా బ్రాండ్ మందు వాడితే ఆర్నెల్లలో ఎత్తు పెరుగుతారు అంటూ ప్రకటన చేస్తుంటారు. అది సమంజసమా.. కాదా.. అన్నది ఆలోచించాలి’ అని సూచించారు. -
‘ఈ-కామర్స్’ ఫిర్యాదులపై కమిటీ
15 రోజుల్లో నివేదిక న్యూఢిల్లీ: ఈ-కామర్స్ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నది. ఈ కామర్స్ జోరుగా పెరుగుతోందని, అలాగే వినియోగదారుల ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయని, దీని నివారణ కోసం త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారు. ఆర్డర్ చేసిన వస్తువులు రాకపోవడం, సకాలంలో వస్తువులు డెలివరీ కాకపోవడం, నాణ్యత లేని వస్తువులు డెలివరీ కావడం తదితర సమస్యలు ఆన్లైన్ కొనుగోళ్లలో జరుగుతున్నాయని వివరించారు. ఇక్కడ జరిగిన సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్(సీసీపీసీ) 30వ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించామని, ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. ఈ కమిటీ సూచనలను ప్రతిపాదిత వినియోగదారుల రక్షణ బిల్లులో పొందుపరుస్తామని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ బిల్లుపై పార్లమెంటరీ స్థాయి సంఘం కసరత్తు చేస్తోందని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తన నివేదికను సమర్పిస్తుందని వివరించారు.