‘ఈ-కామర్స్’ ఫిర్యాదులపై కమిటీ
15 రోజుల్లో నివేదిక
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నది. ఈ కామర్స్ జోరుగా పెరుగుతోందని, అలాగే వినియోగదారుల ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయని, దీని నివారణ కోసం త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారు. ఆర్డర్ చేసిన వస్తువులు రాకపోవడం, సకాలంలో వస్తువులు డెలివరీ కాకపోవడం, నాణ్యత లేని వస్తువులు డెలివరీ కావడం తదితర సమస్యలు ఆన్‌లైన్ కొనుగోళ్లలో జరుగుతున్నాయని వివరించారు.
ఇక్కడ జరిగిన సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్(సీసీపీసీ) 30వ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించామని, ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. ఈ కమిటీ సూచనలను ప్రతిపాదిత వినియోగదారుల రక్షణ బిల్లులో పొందుపరుస్తామని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ బిల్లుపై పార్లమెంటరీ స్థాయి సంఘం కసరత్తు చేస్తోందని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తన నివేదికను సమర్పిస్తుందని వివరించారు.