ఇకమొబైల్ కామర్స్ హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాబోయే రోజుల్లో మొబైల్ కామర్స్ (ఎం-కామర్స్) భారీగా పెరుగుతుందని ఆన్‌లైన్ రిటైలింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సహ-వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ తెలిపారు. ల్యాప్‌టాప్‌లు వంటి సాధనాల ద్వారా ఈ-కామర్స్ లావాదేవీలు జరపడం కన్నా మొబైల్ యాప్స్ వంటి వాటి ద్వారా షాపింగ్ చేయడం పెరుగుతుందన్నారు. దీంతో, ప్రస్తుతం సుమారు పది శాతంగా ఉన్న ఎం-కామర్స్ వాటా రాబోయే రెండేళ్లలో యాభై శాతానికి పెరగగలదని పేర్కొన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా తమను తాము మార్చుకోగలిగిన కంపెనీలే మనుగడ సాగించగలవని చెప్పారు. శుక్రవారం ఏఐఈఎస్‌ఈసీ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన యూత్ టు బిజినెస్ ఫోరమ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా సచిన్ బన్సల్ మీడి యాకు ఈ వివరాలు తెలిపారు. దేశీయంగా ఈ-కామర్స్ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే కంపెనీలు కేవలం రిటైలింగ్‌కి మాత్రమే పరిమితం కాకుండా రవాణా తదితర అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక దృష్టితో సర్వీసులను పెద్ద స్థాయిలో విస్తరించేందుకు మౌలిక సదుపాయాలు (గిడ్డంగులు మొదలైనవి), టెక్నాలజీపైన భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నామని ఆయన చెప్పారు. మారు మూల ప్రాంతాలకు కూడా ఈ-కామర్స్ విస్తరించేలా చూడటం ధ్యేయంగా పనిచేస్తున్నామని బన్సల్ వివరించారు.
వృద్ధిపైనే దృష్టి..
ఈ-కామర్స్‌లో మార్జిన్లు చాలా స్వల్పంగా ఉంటాయని, అయితే ప్రస్తుతం లాభదాయకత గురించి ఆలోచించడం కన్నా వేగంగా వృద్ధి సాధించడంపైనే దృష్టి పెట్టినట్లు బన్సల్ వివరించారు. ప్రస్తుతం బిలియన్ డాలర్ల స్థాయికి ఎదిగే దిశగా కంపెనీ అడుగులు వేస్తోందని, త్వరలోనే దీన్ని సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే లావాదేవీల విషయానికొస్తే ట్యాబ్లెట్స్ మొదలైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు అత్యధికంగా అమ్ముడవుతున్నట్లు బన్సల్ చెప్పారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 1,000 పైగా విక్రేతలు ఉన్నారని, ఈ సంఖ్యను మరింత పెంచే విధంగా టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అంతకు ముందు.. యువతలో నాయకత్వ ధోరణి పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఏఐఈఎస్‌ఈసీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బన్సల్‌ల్‌తో పాటు టాటా సన్స్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ ముకుంద్ గోవింద్ రాజన్, కోకకోలా ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ జోలీ, మైక్రోసాఫ్ట్ ఇండియా డెరైక్టర్ రజనీష్ మీనన్ వ్యాపార రంగంలో తమ అనుభవాలను వివరించారు.