
ఢిల్లీ : హోలీ పండుగ రోజు రాత్రి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో కోట్లు విలువ చేసే కాలిన కరెన్సీ నోట్లు వెలుగులోకి వచ్చాయనే వార్త దేశవ్యాప్తంగా సర్వత్రా సంచలనం సృష్టించింది.
ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు ఉపక్రమించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. నోట్ల కట్టల విషయంపై విచారణ చేపట్టేందుకు ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీఎస్ సందవాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్‌లను సభ్యులుగా చేర్చింది. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ రెండురోజుల కిందట ఘటన జరిగిన జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసానికి వెళ్లింది.
అయితే, సుప్రీం కోర్టు కొలీజియం జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్‌తో పాటు దేశంలో పలు రాష్ట్రాల హైకోర్టు బార్ అసోసియేషన్‌లు సుప్రీం కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. దీంతో ఈ నెల 21న సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆయనను బదిలీ చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది.
ఈ క్రమంలో శుక్రవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడానికి కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయన తన పదవిని చేపట్టి ఉత్తరప్రదేశ్ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. కాగా, జస్టిస్ వర్మ విషయాన్ని సమీక్షిస్తున్నామని,ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన బదిలీపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ఒక రోజు తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.