మంటల్లో కాలిపోయిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో వీడియోలు.. | Delhi High Court Justice Yashwant Varma Cash Row Video Viral On Social Media, Details Inside | Sakshi
Sakshi News home page

మంటల్లో కాలిపోయిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో వీడియోలు..

Published Sun, Mar 23 2025 7:10 AM | Last Updated on Sun, Mar 23 2025 12:59 PM

Delhi High Court Justice Yashwant Varma Cash Row Video Viral

ఢిల్లీ: దేశంలో భారీ అవినీతి ఆరోపణ నడుమ జస్టిస్ యశ్వంత్ వర్మ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న యశ్వంత​ వర్మ ఇంట్లో ఇటీవల అగ్ని ప్రమాదం జరగ్గా, అక్కడ పెద్ద ఎత్తున నోట్ల  కట్టలు బయటపడ్డాయి. నోట్ల కట్టలన్నీ మంటల్లో కాలిపోయాయి దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు.

ఇక, అగ్ని ప్రమాదం సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.కె.ఉపాధ్యాయ.. శనివారం 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు సమర్పించారు. అందులో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ వివరణతోపాటు ఢిల్లీ పోలీసు కమిషనర్‌ అందించిన వివరాలు, ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. అగ్నిమాపక శాఖ ఆపరేషన్‌ వివరాలూ ఫొటోలు, వీడియోల్లో ఉన్నాయి. సీజేఐ రాసిన లేఖ కూడా ఉంది.

ఢిల్లీ హైకోర్టు సీజే సమర్పించిన నివేదికను పరిశీలిస్తే.. సగం కాలిన నోట్ల కట్టలను గురించి అధికారిక ప్రస్తావన కనిపించింది. దీనిపై అధికారిక సమాచారం ఉందన్న విషయం అందులో ఉంది. మరోవైపు స్టోర్‌ రూంలో తానుగానీ, తన కుటుంబ సభ్యులుగానీ ఎటువంటి నగదును ఉంచలేదని సీజే జస్టిస్‌ ఉపాధ్యాయకు ఇచ్చిన వివరణలో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ పేర్కొన్నారు. తమకు చెందిన నగదు దొరికిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

మరోవైపు.. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా శనివారం త్రిసభ్య కమిటీ నియమించారు. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ షీల్‌ నాగ్, హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జి.ఎస్‌.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అనూ శివరామన్‌ను సభ్యులుగా నియమించారు. ఇదిలా ఉండగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు ఎలాంటి న్యాయ సంబంధిత విధులు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.కె.ఉపాధ్యాయను సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement