
2,800 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేసేందుకు ఎన్టీపీసీ యోచన
రెండువేల ఎకరాల భూమిని కేటాయించాలంటూ ప్రభుత్వానికి లేఖ
దేశవ్యాప్తంగా 23 ప్రాంతాల్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లఏర్పాటుకు నిర్ణయం
తెలుగు రాష్ట్రాల్లో చెరొకటి ఏర్పాటు చేసే అవకాశం
భయాందోళనలో జిల్లా ప్రజలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లి జిల్లాలో అణు విద్యుత్ ప్లాంటు (న్యూక్లియర్ పవర్ ప్లాంటు) ఏర్పాటుచేయాలని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలో దాదాపు రెండువేల ఎకరాల మేరకు భూమి కేటాయించాలంటూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. మొత్తం 2,800 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేసే ఈ అణు విద్యుత్ ప్లాంటు కోసం రెండువేల ఎకరాల మేర భూమి అవసరమవుతుందని ఎన్టీపీసీ భావిస్తోంది.
ఇందుకోసం అనకాపల్లి జిల్లా అనువైనదిగా గుర్తించిన ఎన్టీపీసీ.. ఈ ప్లాంటు ఏర్పాటుకు రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది. మరోవైపు.. ఈ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకోసం రోజుకు మూడు బిలియన్ గ్యాలన్ల నీరు అవసరమవుతుంది. కానీ, ఈ అణు విద్యుత్ ప్లాంటు ఏర్పాటుపై ఇప్పటికే అనేక అనుమానాలున్నాయి.
ఎందుకంటే.. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఏర్పాటుచేస్తున్న అణు విద్యుత్ ప్లాంటుపై ఇప్పటికే అనేక పోరాటాలు జరుగుతున్నాయి. ఈ ప్లాంటు ఏర్పాటువల్ల తమకు ఆరోగ్య సమస్యలు వస్తాయంటూ ప్లాంటు ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ తలపెట్టిన అణు విద్యుత్ ప్లాంటుపై జిల్లా ప్రజల్లోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో చెరొకటి..
వాస్తవానికి.. దేశవ్యాప్తంగా 30 గిగావాట్ల (30 వేల మెగావాట్లు) సామర్థ్యం కలిగిన అణు విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుచేయాలని ఎన్టీపీసీ నిర్ణయించుకుంది. ‘ఎన్టీపీసీ పరమాణు ఉర్జ నిగమ్’ అనే సంస్థను ఇందుకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసింది. దేశవ్యాప్తంగా 23 ప్రాంతాలు అనువైనవిగా గుర్తించింది. రోజురోజుకీ బొగ్గు లభ్యత తగ్గిపోవడంతో పాటు సోలార్, విండ్ నుంచి కచ్చితంగా ఇంత మొత్తం విద్యుత్ వచ్చే అవకాశముందని చెప్పే వీల్లేకపోవడంతో దేశ విద్యుత్ అవసరాలను తీర్చేందుకుగానూ అణు విద్యుత్ వైపు ఎన్టీపీసీ అడుగులు వేస్తోంది.
ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాలో ఒక్కొక్కటి 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు ప్లాంట్లు ఏర్పాటుచేసేందుకు అవకాశముందని ఎన్టీపీసీ తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పక్కనున్న తెలంగాణలో కూడా ఒక అణు విద్యుత్ ప్లాంటు ఏర్పాటుచేయాలని ఎన్టీపీసీ నిర్ణయించినట్లు సమాచారం.
అయితే, ప్లాంటు ఏర్పాటుకు అనువైన ప్రాంతం ఏదీ అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టతరాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అణు విద్యుత్ ప్లాంట్‌కు భారీగా నీటి లభ్యత అవసరం ఉంటుందని.. ఈ అవసరాలను పోలవరం ద్వారా తీర్చుకునే వెసులుబాటు ఉందని కూడా ఎన్టీపీసీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అణు ధార్మికత ముప్పుపై జిల్లా ప్రజల్లో ఆందోళన..
ఇక అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై మొదటి నుంచీ ఆందోళన ఉంది. ఈ ప్లాంటు ఏర్పాటైతే తమ భూములను కోల్పోవడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తి, ప్రాణాలకు ముప్పు తప్పదన్న అభిప్రాయాలున్నాయి. దీన్నుంచి వచ్చే అణు ధార్మికతవల్ల ప్రధానంగా క్యాన్సర్‌తో పాటు ఎక్యూట్ రేడియేషన్ సిండ్రోమ్, ఎనీమియా వంటి జబ్బులతో ప్రాణాల మీదకు వస్తుందన్న భయాందోళనలు ఉన్నాయి.
మరోవైపు.. 1986లో ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌లో జరిగిన సంఘటనతో పాటు 2011 జపాన్‌లో జరిగిన అణు విద్యుత్ ప్లాంటు దుర్ఘటనలవల్ల చోటుచేసుకున్న నష్టాన్ని ప్రజలు గుర్తుతెచ్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment