న్యూఢిల్లీ: నిర్మాణ రంగ సంస్థ శ్రీరామ్ ప్రాపర్టీస్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించి షేరు ధర శ్రేణిని రూ. 113–118గా నిర్ణయించింది. ఐపీవో డిసెంబర్ 8న ప్రారంభమై 10న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లు డిసెంబర్ 7న బిడ్లు వేయాల్సి ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా శ్రీరామ్ ప్రాపర్టీస్ రూ. 600 కోట్లు సమీకరిస్తోంది. ఇన్వెస్టర్లు కనీసం 125 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద విక్రయించే షేర్ల పరిమాణాన్ని శ్రీరామ్ ప్రాపర్టీస్ రూ. 550 కోట్ల నుంచి రూ. 350 కోట్లకు కంపెనీ తగ్గించింది.
దీంతో ఐపీవో పరిమాణం కూడా రూ. 800 కోట్ల నుంచి రూ. 600 కోట్లకు తగ్గింది. ఇష్యూలో భాగంగా కొత్తగా రూ. 250 కోట్ల షేర్లను జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. సంస్థలో ఇన్వెస్ట్ చేసిన ఒమెగా టీసీ సేబర్ హోల్డింగ్స్ రూ. 91 కోట్లు, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సుమారు రూ. 8 కోట్లు, టీపీజీ ఏషియా ఎస్‌ఎఫ్ రూ. 92 కోట్లు, డబ్ల్యూఎస్‌ఐ/డబ్ల్యూఎస్‌క్యూఐ 5 మారిషస్ ఇన్వెస్టర్స్ రూ. 133 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నాయి.
పబ్లిక్ ఇష్యూలో రూ. 3 కోట్ల విలువ చేసే షేర్లను సంస్థ ఉద్యోగుల కోసం కేటాయించారు. సిబ్బందికి తుది ధరతో పోలిస్తే 11 శాతం డిస్కౌంటుకు షేర్లు లభిస్తాయి. కొత్తగా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం శ్రీరామ్ ప్రాపర్టీస్ వినియోగించుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment