Shriram Group
-
సర్వం ధారపోసిన ఈ బిజినెస్ టైకూన్ గురించి తెలుసా?
సంపన్న కుటుంబంలో పుట్టి ఆ వారసత్వ సంపదను నిలుపుకోవడంలో, రెట్టింపు చేయడంలో చాలామంది సక్సెస్ అవుతారు. మిలియనీర్లు, బిలియనీర్లుగా ఎదుగుతారు. కానీ కోట్లకు పడగలెత్తినా ఎలాంటి ఆడంబరాలు, విలాసాలకు తావు లేకుండా అతి సాధారణ జీవితాన్ని గడిపేవారు చాలా అరుదు. దాతృత్వంలో సర్వ ధార పోసి తమకు తామే సాటి అని చాటుకుంటారు. అలాంటి వారిలో ఘనుడు 85 ఏళ్ల శ్రీరామ్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆర్ త్యాగరాజన్. తమిళనాడులోని సంపన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టిన త్యాగరాజన్ 37 సంవత్సరాల వయస్సులో బంధువులు, స్నేహితులతో శ్రీరామ్ చిట్స్‌ను స్థాపించడం ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1974లో చెన్నైలో శ్రీరామ్ గ్రూప్‌ను స్థాపించారు. అంతకు ముందు 1961లో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో చేరి, వివిధ ఫైనాన్స్ కంపెనీలలో ఉద్యోగిగా పని చేస్తూ ఇరవై సంవత్సరాల అనుభవాన్ని గడించారు. ఆర్థికంగా అన్ని అడ్డంకులను ఎదుర్కొని వ్యాపార దిగ్గజంగా ఎదగడం మాత్రమే కాదు, సామాజిక బాధ్యత, మానవత్వం పట్ల కూడా అంతే నిబద్ధతతో ఉన్న మహా మనీషి ఆయన.పేరుకు తగ్గట్టే త్యాగంలో రారాజు. నా దృష్టి అంతా వారిమీదే ఈ అనుభవంతోనే సాంప్రదాయ బ్యాంకులు పట్టించుకోని తక్కువ-ఆదాయ రుణగ్రహీతలకు రుణాలు ఇవ్వడంపై దృష్టి సారించారు. ట్రక్కులు, ట్రాక్టర్లు , ఇతర వాహనాల కోసం సమాజంలోని పేదవర్గాలకు రుణాన్ని అందించడంలో కంపెనీ అగ్రగామిగా ఉంది. వెనుకబడిన వారికి సహాయం చేయడంలోని అతని నమ్మకం కంపెనీ వృద్ధికి దారితీసింది. ఫలితంగా కంపెనీ రూ. 6210 కోట్లు కంటే ఎక్కువ విలువైన సంస్థగా అవతరించింది. 23 మిలియన్లకు పైగా వినియోగదారులతో 30 కంపెనీలతో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. శ్రీరామ్ గ్రూపు షేర్లు ఈ సంవత్సరం 35శాతం పెరిగి జూలైలో రికార్డ్ నమోదు చేశాయి. ఇది భారతదేశపు బెంచ్‌మార్క్ స్టాక్ ఇండెక్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ. అంతేకాదు వ్యాపారంలో ఘన విజయం సాధించిన త్యాగరాజన్ దృష్టి కేవలంకంపెనీని విజయంబాటపట్టించడే కాదు.. స్వయంగా కమ్యూనిస్టు భావాలను రంగరించు కున్న ఆయన తన విజయంలో కంపెనీ ఉద్యోగులపాత్రను ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. వారి కష్టాలు,సవాళ్లను స్వయంగా అర్థం చేసుకున్నారు కనుకనే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారి జీవితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం ఐదు వేల డాలర్లు తన వద్ద ఉంచుకుని దాదాపు రూ. 6210 కోట్ల ( 750 మిలియన్ల డాలర్ల) మొత్తం సంపదను తన ఉద్యోగులకు విరాళంగా ఇవ్వాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సామ్రాజ్యం విజయానికి, కోట్ల సంపదకు ఆర్జనకు సహకరించిన వారి పట్ల నిబద్ధతను చాటుకున్నారు. సందపను పంచి ఇవ్వాలనే కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని తు.చ తప్పకుండా పాటించారు. కమ్యూనిస్ట్ భావజాల ప్రభావం,అతి సాధారణ జీవితం బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో,క్రెడిట్ చరిత్ర లేని వారికి డబ్బు ఇవ్వడం ప్రమాదకరం కాదని నిరూపించడానికి కంపెనీని ప్రారంభించినట్లు త్యాగరాజన్ చెప్పారు. అంతేకాదు వ్యాపారవేత్తగా అతి సాధారణ జీవితంలో గడపడంలో ఆయనే తరువాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు.దుబారా అంటే అస్సలు నచ్చదు. ఐఫోన్, ఖరీదైన కారు, లగ్జరీ ఇల్లు, సదుపాయాలకు దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం శ్రీరామ్ గ్రూప్ నుండి విశ్రాంతి తీసుకున్న త్యాగరాజన్ చిన్న ఇల్లు, రూ. 6 లక్షల విలువైన హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్ కారుతో చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇప్పటికీ ప్రతీ 15 రోజులకు ఒకసారి కంపెనీ సీనియర్ మేనేజర్లతో సమావేశమవుతూ, సలహాలు, సూచనలతో శ్రీరామ్ కంపెనీని మరింత అభివృద్దికి బాటలు వేస్తున్నారు. త్యాగరాజన్ ఎక్కడ పుట్టారు? త్యాగరాజన్ 1937 ఆగస్టు 25వ తేదీన తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. చెన్నైలో గ్రాడ్యుయేషన్, మాథ్య్స్లో మాస్టర్స్ చేశారు. తరువాత కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో మూడు సంవత్సరాలు చదివారు. 1961లో దేశీయ అతిపెద్ద బీమా సంస్థల్లో ఒకటైన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలోనూ, దాదాపు రెండు దశాబ్దాల పాటు వైశ్యా బ్యాంక్, రీఇన్స్యూరెన్స్ బ్రోకర్ సంస్థ JB బోడా అండ్ కోలో పనిచేశారు. శ్రీరామ్స్ సంస్థల కారణంగా వడ్డీ రేట్లు దిగి వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ విలువ సుమారు 8.5 బిలియన్ డాలర్లు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో సుమారు 200 మిలియన్ల డాలర్ల లాభాలను ఆర్జించింది. శ్రీరామ్ కంపెనీలలో తన వాటాలన్నింటినీ ఉద్యోగుల గ్రూపునకు కేటాయించి, 2006లో ఏర్పాటు చేసిన శ్రీరామ్ ఓనర్షిప్ ట్రస్ట్‌కు బదిలీ చేసిన గొప్ప వ్యక్తి త్యాగరాజన్. ఈ శాశ్వత ట్రస్ట్‌లో 44 గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. ట్రస్ట్ హోల్డింగ్ మొత్తం విలువ 750 మిలియన్లడాలర్లకు పైమాటే. ఇటీవల శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కో. శ్రీరామ్ క్యాపిటల్ లిమిటెడ్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌లను షేర్-స్వాప్ డీల్‌లో విలీనం చేసుకుంది. -
హోల్డింగ్ కంపెనీగా శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్
చెన్నై: శ్రీరామ్ గ్రూపు హోల్డింగ్ కంపెనీగా ఇప్పటి వరకు ఉన్న శ్రీరామ్ క్యాపిటల్ లిమిటెడ్‌తోపాటు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్.. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్‌లో విలీనం కానున్నట్టు శ్రీరామ్ గ్రూపు ప్రకటించింది. శ్రీరామ్ క్యాపిటల్‌కు హోల్డింగ్ కంపెనీ అయిన శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ (చెన్నై) ప్రైవేటు లిమిటెడ్.. విలీనానంతర కంపెనీకి ప్రమోటర్‌గా మారుతుందని, ఫైనాన్షియల్, బీమా సేవలన్నీ దీని కింద ఉంటాయని ప్రకటించింది. శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్(ఎస్ఎఫ్వీపీఎల్)కు సహ యజమానులుగా శ్రీరామ్ ఓనర్షిప్ ట్రస్ట్, దక్షిణాఫ్రికాకు చెందిన సన్లామ్ గ్రూపు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ఎస్ఎఫ్వీపీఎల్కు వైస్ చైర్మన్, ఎండీగా శ్రీరామ్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డీవీ రవి వ్యవహరిస్తారు. శ్రీరామ్ క్యాపిటల్ సీఎఫ్‌వో శుభశ్రీ శ్రీరామ్, నోవాక్ టెక్నాలజీ డైరెక్టర్, సీఈవో ఎన్ఎస్ నంద కిషోర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ల బాధ్యతలు చేపడతారని శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ ప్రకటించింది. -
శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో కేకేఆర్
న్యూఢిల్లీ: బీమా రంగంలో ఉన్న శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 9.99 శాతం వాటాను ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కేకేఆర్ చేజిక్కించుకుంటోంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్‌ను శ్రీరామ్ గ్రూప్, ఆఫ్రికాకు చెందిన ఫైనాన్షియల్ సేవల కంపెనీ సన్లామ్ ప్రమోట్ చేస్తున్నాయి. ఈ మేరకు మూడు సంస్థల మధ్య సోమవారం ఒక ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయంగా బీమా రంగంలో కేకేఆర్‌కు ఉన్న నైపుణ్యం నుం చి ప్రయోజనం పొందేలా చూస్తున్నామని.. భారతీయ కంపెనీలను తదుపరి స్థాయికి తీసుకెళ్లే అనుభవం ఆ సంస్థకు ఉందని శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో అనిల్‌కుమార్ అగర్వాల్ ఈ సందర్భంగా తెలిపారు. 2009 నుంచి ఇప్పటివరకు భారత్‌లో కేకేఆర్ 20కి పైగా పెట్టుబడులు చేసింది. వీటిలో హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ లైఫ్, ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ ఉన్నాయి. చదవండి: హెచ్డీఎఫ్సీ సంస్థల మెగా విలీనం... ఆర్థికమంత్రితో ‘హెచ్డీఎఫ్సీ’ చీఫ్‌ల భేటీ -
శ్రీరామ్ ప్రాపర్టీస్ ఐపీవో @ రూ. 113–118
న్యూఢిల్లీ: నిర్మాణ రంగ సంస్థ శ్రీరామ్ ప్రాపర్టీస్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించి షేరు ధర శ్రేణిని రూ. 113–118గా నిర్ణయించింది. ఐపీవో డిసెంబర్ 8న ప్రారంభమై 10న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లు డిసెంబర్ 7న బిడ్లు వేయాల్సి ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా శ్రీరామ్ ప్రాపర్టీస్ రూ. 600 కోట్లు సమీకరిస్తోంది. ఇన్వెస్టర్లు కనీసం 125 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద విక్రయించే షేర్ల పరిమాణాన్ని శ్రీరామ్ ప్రాపర్టీస్ రూ. 550 కోట్ల నుంచి రూ. 350 కోట్లకు కంపెనీ తగ్గించింది. దీంతో ఐపీవో పరిమాణం కూడా రూ. 800 కోట్ల నుంచి రూ. 600 కోట్లకు తగ్గింది. ఇష్యూలో భాగంగా కొత్తగా రూ. 250 కోట్ల షేర్లను జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. సంస్థలో ఇన్వెస్ట్ చేసిన ఒమెగా టీసీ సేబర్ హోల్డింగ్స్ రూ. 91 కోట్లు, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సుమారు రూ. 8 కోట్లు, టీపీజీ ఏషియా ఎస్ఎఫ్ రూ. 92 కోట్లు, డబ్ల్యూఎస్ఐ/డబ్ల్యూఎస్‌క్యూఐ 5 మారిషస్ ఇన్వెస్టర్స్ రూ. 133 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నాయి. పబ్లిక్ ఇష్యూలో రూ. 3 కోట్ల విలువ చేసే షేర్లను సంస్థ ఉద్యోగుల కోసం కేటాయించారు. సిబ్బందికి తుది ధరతో పోలిస్తే 11 శాతం డిస్కౌంటుకు షేర్లు లభిస్తాయి. కొత్తగా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం శ్రీరామ్ ప్రాపర్టీస్ వినియోగించుకోనుంది. -
ఐపీఓకి మరో మూడు కంపెనీలు, కళకళలాడుతున్న మార్కెట్లు
న్యూఢిల్లీ: సెకండరీ మార్కెట్ల జోరుతో గత కొంత కాలంగా పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు క్యూ కడుతున్నాయి. దీంతో ఇటీవల ప్రైమరీ మార్కెట్లు సైతం కళకళలాడుతున్నాయి. తాజాగా మరో మూడు కంపెనీలు ఇన్వెస్టర్లను పలుకరించనున్నాయి. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా అనుమతిని పొందాయి. ఈ జాబితాలో క్లీన్‌సైన్స్ అండ్ టెక్నాలజీ, శ్రీరామ్ ప్రాపర్టీస్, జీఆర్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ చేరాయి. వివరాలు ఇలా.. పబ్లిక్ ఇష్యూకి అనుమతించమంటూ ఏప్రిల్‌లోనే మూడు కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. స్పెషాలిటీ కెమికల్స్ తయారీ సంస్థ క్లీన్‌సైన్స్‌కు ఈ నెల 12న, రియల్టీ సంస్థ శ్రీరామ్ ప్రాపర్టీస్‌కు 15న, మౌలిక సదుపాయాల కంపెనీ జీఆర్ ఇన్ఫ్రాకు 16న సెబీ దాదాపు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాగా.. ఐపీవో ద్వారా క్లీన్‌సైన్స్ రూ. 1,400 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. ఆఫర్లో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు, వాటాదారులు ఈక్విటీని విక్రయించనున్నారు. పెర్ఫార్మెన్స్, ఎఫ్ఎంసీజీ కెమికల్స్, ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియెట్స్ తదితరాలను రూపొందిస్తోంది. రూ. 800 కోట్లకు సై పబ్లిక్ ఇష్యూ ద్వారా బెంగళూరు సంస్థ శ్రీరామ్ ప్రాపర్టీస్ రూ. 800 కోట్లను సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు రూ. 550 కోట్ల ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నాయి. దీనికి అదనంగా రూ. 250 కోట్ల విలువైన షేర్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. జాబితాలో టీపీజీ క్యాపిటల్, టాటా క్యాపిటల్, వాల్టన్ స్ట్రీట్ క్యాపిటల్ తదితర సంస్థలున్నాయి. కంపెనీ ఈక్విటీలో 58 శాతం వా టా వరకూ కలిగి ఉన్నాయి. దీంతో ఐపీవో నిధుల లో ప్రధాన భాగం పెట్టుబడి సంస్థలకు చేరనున్నా యి. షేర్ల జారీ నిధులను రుణ చెల్లింపులు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్ర ధానంగా దక్షిణాదిలో పలు ప్రాజెక్టులు చేపట్టింది. రూ. 1,000 కోట్ల అంచనా ఉదయ్‌పూర్ ఈపీసీ కంపెనీ జీఆర్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ ఐపీవో ద్వారా రూ. 800–1,000 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. ఆఫర్లో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు 1.15 కోట్ల షేర్లకుపైగా విక్రయానికి ఉంచనున్నాయి. వాటాలు విక్రయించనున్న సంస్థలలో లోకేష్ బిల్డర్స్, జాసమ్రిత్ ప్రెమిసెస్, ఫ్యాషన్స్, క్రియేషన్స్, ఇండియా బిజినెస్ ఎక్సలెంట్ ఫండ్ తదితరాలున్నాయి. జాతీయ రహదారి ప్రాజెక్టులు చేపట్టే ఈ సంస్థ ఇటీవల రైల్వే రంగ ప్రాజెక్టులలోకీ ప్రవేశించింది. చదవండి: ఇండియన్ బ్యాంక్ షేర్ల అమ్మకం,రూ.4వేల కోట్లు సమీకరణే లక్ష్యం -
శ్రీరామ్ లైఫ్ నుంచి ఏడు కొత్త పథకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ శ్రీరామ్ లైఫ్ కొత్త మార్గదర్శకాలతో కూడిన ఏడు పథకాలను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో మూడు సంప్రదాయ పాలసీలుండగా, నాలుగు యూనిట్ ఆధారిత బీమా పథకాలు (యులిప్స్) ఉన్నాయి. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ సీఈవో మనోజ్ జైన్ ఈ పథకాలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే మరో మూడు నాలుగు పథకాలను విడుదల చేయనున్నామని, వీటికి ఇంకా ఐఆర్డీఏ అనుమతి లభించాల్సి ఉందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు కొత్త ప్రీమియం ఆదాయ వృద్ధి స్థిరంగా ఉన్నప్పటికీ వచ్చే మూడు నెలల్లో 10 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ‘‘గతేడాది రూ.410 కోట్ల కొత్త ప్రీమియం ఆదాయం వచ్చింది. అది ఈ ఆర్థిక సంవత్సరాంతానికి రూ.450 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం పాలసీదారులు యులిప్స్ కంటే సంప్రదాయ పాలసీలకే మొగ్గు చూపిస్తున్నారు. కానీ ఒక్కసారి మార్కెట్ లాభాలను అందించడం మొదలు పెడితే తిరిగి యులిప్స్కి డిమాండ్ పెరుగుతుంది’’ అని వివరించారు. ప్రస్తుతం జీవిత బీమా మార్కెట్లో 73 శాతం సంప్రదాయ పాలసీల నుంచి వస్తుంటే, 27 శాతం యులిప్స్ నుంచి వస్తున్నట్లు మనోజ్ జైన్ తెలియజేశారు. దక్షిణ భారతదేశంలో బాగా విస్తరించి ఉన్న తాము ఇప్పుడు ఉత్తర భారత దేశ విస్తరణపై దృష్టిసారించామని, ఇందులో భాగంగా గత పదినెలల్లో 80 శాఖలను ప్రారంభించామని తెలియజేశారు. దేశవ్యాప్తంగా మరో 50 శాఖలను ప్రారంభించడానికి ఐఆర్డీఏకి దరఖాస్తు చేసినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.