సోలార్ వ్యాపారం ఇక ఈజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సోలార్ ఎనర్జీ రంగంలోకి ప్రవేశించాలని ఉన్నవారికి ఎలాంటి అనుభవం లేకున్నా వ్యాపారం చేసేందుకు వీలుగా ‘సన్‌ప్రో’ మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. సౌర విద్యుత్ రంగంలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఫ్రేయర్ ఎనర్జీ భారత్‌లో తొలిసారిగా ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం 150 కంపెనీలు 40 రకాల పరికరాల వివరాలను యాప్‌లో జోడించాయి.
ఔత్సాహిక వ్యాపారులు కస్టమర్ల అవసరానికి తగ్గట్టుగా సౌర విద్యుత్ పరిష్కారాలను అందించేందుకు వీలుగా యాప్‌ను డిజైన్ చేసినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు సౌరభ్ మర్దా తెలిపారు. సహ వ్యవస్థాపకురాలు రాధిక చౌదరితో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. 80 మంది వ్యాపారులు ఇప్పటి వరకు చేతులు కలిపారని, కంపెనీకి రూ.60 కోట్ల ఆర్డర్ బుక్ ఉందని చెప్పారు. ఫ్రేయర్ ఎనర్జీ 2016–17లో రూ.12 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.80 కోట్లు ఆశిస్తోంది.