
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్‌ఎస్‌డీఎల్)కు వెసులుబాటు లభించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా 2025 జులై 31వరకూ గడువు పెంచింది. ఎన్‌ఎస్‌డీఎల్ అభ్యర్ధనమేరకు గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయ్యేందుకు మరింత గడువును సెబీ అనుమతించింది. దీంతో మార్కెట్ల పరిస్థితులు అనుకూలించేటంతవరకూ కంపెనీ లిస్టింగ్‌కు వెసులుబాటు లభించింది.
నిజానికి 2024 సెప్టెంబర్‌లోనే ఎన్‌ఎస్‌డీఎల్ ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోలో భాగంగా ఎన్‌ఎస్‌డీఎల్ ప్రస్తుత వాటాదారులు ఎన్‌ఎస్‌ఈ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 5.72 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. దేశీయంగా తొలి సెక్యూరిటీల డిపాజిటరీగా కార్యకలాపాలు ప్రారంభించిన ఎన్‌ఎస్‌డీఎల్ 2024 సెప్టెంబర్‌కల్లా 6 ట్రిలియన్ డాలర్ల(సుమారు 500 లక్షల కోట్లు) విలువైన ఆస్తులను నిర్వహిస్తోంది. కాగా.. 2017లోనే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్‌ఎల్) ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌కావడం గమనార్హం!
టాన్బో ఇమేజింగ్ రూ. 175 కోట్ల సమీకరణ
బెంగళూరు: డిఫెన్స్ టెక్నాలజీలను రూపొందించే టాన్బో ఇమేజింగ్ తాజాగా రూ. 175 కోట్లు సమీకరించింది. తమ పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో భాగంగా డీ–సిరీస్ కింద ఫ్లోరిన్‌ట్రీ అడ్వైజర్స్, టెనాసిటీ వెంచర్స్, ఎగ్జిమ్ బ్యాంక్ తదితర సంస్థల నుంచి ఈ మొత్తాన్ని సేకరించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు అరవింద్ లక్ష్మీకుమార్ తెలిపారు.
ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లు, అత్యంత శక్తిమంతమైన మైక్రోవేవ్ టెక్నాలజీస్ మొదలైనవాటిని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే క్వాల్‌కామ్, ఆర్టిమాన్ వంటి ఇన్వెస్టర్ల నుంచి రూ. 300 కోట్లు సమకూర్చుకున్నట్లు వివరించారు. భారత రక్షణ శాఖ, నాటో, అమెరికా నేవీ సీల్స్ సహా 30 దేశాల రక్షణ బలగాలకు సేవలు అందిస్తున్నట్లు అరవింద్ చెప్పారు.