న్యూఢిల్లీ: డిపాజిటరీ సేవల దిగ్గజం నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్‌ఎస్‌డీఎల్) పబ్లిక్ ఇష్యూకి లైన్ క్లియర్ అయ్యింది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ, జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ సైతం సెబీ నుంచి లిస్టింగ్‌కు అనుమతులు పొందాయి. వివరాలు చూద్దాం..
ఎన్‌ఎస్‌డీఎల్
ఐపీవో చేపట్టేందుకు వీలుగా ఎన్‌ఎస్‌డీఎల్ 2023 జులైలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. అయితే 14 నెలల తదుపరి అనుమతులు సాధించడం గమనార్హం! ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో 5.72 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ, బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌సహా కంపెనీలో వాటాదారు సంస్థలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి. ప్రధానంగా ఐడీబీఐ బ్యాంక్ 2.22 కోట్ల షేర్లు, ఎన్‌ఎస్‌ఈ 1.8 కోట్ల షేర్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 56.25 లక్షల షేర్లు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా 40 లక్షల షేర్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 40 లక్షల షేర్లు చొప్పున విక్రయానికి ఉంచనున్నాయి. వెరసి ఐపీవో ద్వారా ఎన్‌ఎస్‌డీఎల్‌కు ఎలాంటి నిధులు అందబోవు!
ఇదీ బ్యాక్‌గ్రౌండ్
సెబీ వద్ద రిజిస్టరైన్ ఎన్‌ఎస్‌డీఎల్ మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసులందించే కంపెనీ. దేశీయంగా ఫైనాన్షియల్, సెక్యూరిటీస్ మార్కెట్లో వివిధ సర్వీసులు, ప్రొడక్టులను ఆఫర్ చేస్తోంది. 1996లో ప్రవేశపెట్టిన డిపాజిటరీల చట్టం ప్రకారం అదే ఏడాది నవంబర్‌లో సెక్యూరిటీల డీమ్యాట్ సేవలకు తెరతీసింది. కాగా.. డిపాజిటరీ సేవలందించే మరో కంపెనీ సెంట్రల్ డిపాజిటరీ సరీ్వసెస్(సీడీఎస్‌ఎల్) 2017లో ఎన్‌ఎస్‌ఈలో లిస్టయ్యింది. దీంతో పబ్లిక్‌గా ట్రేడయ్యే రెండో డిపాజిటరీగా ఎన్‌ఎస్‌డీఎల్ నిలవనుంది.
జింకా లాజిస్టిక్స్
వస్తు రవాణా రంగ కంపెనీ జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ఈ ఏడాది(2024) జులైలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 550 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2.16 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అమ్మకాలు, మార్కెటింగ్ వ్యయాలకు, భవిష్యత్ అవసరాలరీత్యా బ్లాక్‌బక్ ఫిన్‌సర్వ్ మూలధన పటిష్టతకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు డౌన్.. కారణం ఏంటో తెలుసా?
స్టాండర్డ్ గ్లాస్
హైదరాబాద్ కంపెనీ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఈ ఏడాది(2024) జులైలో సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 350 కోట్ల విలువైన 1.84 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ ప్రధానంగా ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాలలో వినియోగించే స్పెషలైజ్‌డ్ ఇంజినీరింగ్ పరికరాల తయారు చేస్తోంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment