- సెప్టెంబర్ క్వార్టర్‌లో 11,564 యూనిట్ల అమ్మకాలు
- దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో 5 శాతం క్షీణత
- ప్రాప్‌టైగర్ ‘రియల్ ఇన్‌సైట్స్’ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల మార్కెట్ కొంత నీరసించింది. హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 19 శాతం క్షీణించగా, దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో సగటున 5 శాతం మేర విక్రయాలు తగ్గాయి. ఎనిమిది పట్టణాల్లో 96,544 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,01,221 యూనిట్లుగా ఉన్నాయి. కొత్త ఇళ్ల ఆవిష్కరణలు (తాజా సరఫరా) సెప్టెంబర్ త్రైమాసికంలో 25 శాతం తక్కువగా 91,863 యూనిట్లుగానే ఉన్నాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ విడుదల చేసింది. నూతన ఇళ్ల సరఫరా తగ్గడానికి తోడు, ధరలు పెరగడం విక్రయాలు క్షీణించడానికి కారణమని ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల ధరలు 20 శాతం పెరగడంతో ధరల అందుబాటుపై ప్రభావం చూపించినట్టు వివరించింది.
పట్టణాల వారీగా..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్‌లో 11,564 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 14,191 యూనిట్లుగా ఉండడం గమనార్హం. అంటే 19 శాతం క్షీణత కనిపిస్తోంది.
బెంగళూరులోనూ 11% తక్కువగా 11,160 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి.
చెన్నైలో 8 శాతం తక్కువగా 3,560 యూనిట్లు అమ్ముడయ్యాయి.
కోల్‌కతాలో అమ్మకాలు 2,796 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలం అమ్మకాలతో పోల్చి చూస్తే 22 శాతం తగ్గాయి.
చదవండి: ఇల్లు పూర్తయినా.. ఈ అనుభవం మీకూ ఎదురైందా?
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో అమ్మకాలు ఒక శాతం తక్కువగా 30,010 యూనిట్లుగా నమోదయ్యాయి.
పుణెలోనూ విక్రయాలు 3 శాతం తగ్గి 18,004 యూనిట్లకు పరిమితమయ్యాయి.
ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో మాత్రం ఇళ్ల అమ్మ కాలు 29% పెరిగాయి. 10,098 యూనిట్ల విక్రయాలు జరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 7,800 యూనిట్లుగా ఉన్నాయి.
అహ్మదాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 9 శాతం క్షీణించి 9,352 యూనిట్లుగా నమోదయ్యాయి.
పండుగల సీజన్‌తో అమ్మకాలకు ఊతం
‘‘వార్షికంగా చూస్తే సెపె్టంబర్ క్వార్టర్‌లో ఇళ్ల అమ్మకాలు, కొత్త ఇళ్ల ఆవిష్కరణలు తగ్గడం ధరల పెరుగుదలకు స్పందనగా కనిపిస్తోంది. మార్కెట్ కార్యకలాపాలు మోస్తరు స్థాయికి చేరడం చూస్తున్నాం. ఇది స్థిరమైన వృద్ధిని తీసుకొస్తుంది. అంతిమంగా వినియోగదారులకు మేలు చేస్తుంది. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో ఇళ్ల ధరలు కొన్ని ప్రాంతాల్లో 3 శాతం నుంచి 50 శాతం వరకూ పెరిగాయి. ఇది తక్షణ ఇళ్ల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపిస్తోంది’’ అని ప్రాప్‌టైగర్ బిజినెస్ హెడ్ వికాస్ వాధ్వాన్ వివరించారు. కొత్త ధరలకు వినియోగదారులు సర్దుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. దేవీ నవరాత్రులతో పండుగల సీజన్ ఊపందుకుందని, అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్, పుణె మార్కెట్లో డెవలపర్లు డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా వ్యూహాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment