
హైదరాబాద్: ఇంజినీరింగ్ సంబంధ సేవలందించే హైదరాబాద్ కంపెనీ ఆర్డీ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 80 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లలో ఒకరైన చంద్ర శేఖర్ మోటూరు విక్రయానికి ఉంచనున్నారు.
కంపెనీ సమీకృత డిజైన్, ఇంజినీరింగ్, మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసులు సమకూర్చుతోంది. ప్రధానంగా ప్రీఇంజినీర్డ్ బిల్డింగ్స్(పీఈబీ), మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్(ఎంహెచ్‌ఎస్), ఇంజినీరింగ్ సర్వీసెస్ పేరుతో మూడు విభాగాలలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 280 కోట్లు తెలంగాణలో కొత్తగా రెండు తయారీ యూనిట్ల ఏర్పాటుకు, మరో రూ. 45 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లోని పరవాడలో సమీకృత తయారీ యూనిట్ ఏర్పాటుకు వెచ్చించనుంది.
రుణ చెల్లింపులకు రూ. 65 కోట్లు వినియోగించనుంది. 2008లో ఏర్పాటైన కంపెనీ క్లయింట్లలో ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా(ఏఎంఎన్‌ఎస్), జేకే సిమెంట్, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ, ఉదయ్‌పూర్ సిమెంట్ వర్క్స్ తదితరాలున్నాయి. గతేడాది(2023–24) రూ. 620 కోట్ల ఆదాయం, రూ. 29 కోట్ల నికర లాభం ఆర్జించింది.