న్యూఢిల్లీ: ప్రత్యేక రసాయనాల తయారీలో ఉన్న డార్ఫ్–కీటాల్ కెమికల్స్ ఇండియా లిమిటెడ్ ఐపీవోకు వస్తోంది. రూ.5,000 కోట్లను సమీకరించేందుకు అనుమతి కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.1,500 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు.
ప్రమోటర్ మీనన్ ఫ్యామిలీ హోల్డింగ్స్ ట్రస్ట్ రూ.3,500 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. డార్ఫ్–కీటాల్ కెమికల్స్ ఇండియా 1992లో ప్రారంభం అయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, పెట్రోనాస్, ఐవోసీ, పీపీజీ ఇండస్ట్రీస్, వేదాంత వంటి దిగ్గజ సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. భారత్‌తోపాటు బ్రెజిల్, యూఎస్, కెనాడాలో మొత్తం 16 తయారీ కేంద్రాలను కలిగి ఉంది.
రసాయనాల తయారీలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అతికొద్ది సంస్థల్లో డార్ఫ్–కీటాల్ కెమికల్స్ ఇండియా ఒకటి. భారత్ వెలుపల సంస్థ ఖాతాలో 542 పేటెంట్స్ ఉన్నాయి. వీటిలో యూఎస్‌లో 99 నమోదయ్యాయి. కంపెనీ 2023–24లో రూ.548 కోట్ల టర్నోవర్‌పై రూ.60 కోట్ల నికరలాభం ఆర్జించింది.
ఐపీఓ అంటే..
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి రెండు రకాల మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఒకటి..కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చినప్పుడు వాటికి దరఖాస్తు చేయడం ద్వారా షేర్లను కొనుగోలు చేయడం. అలాకాకుండా మార్కెట్లో నేరుగా షేర్లను కొనుగోలు చేయడం రెండోది. పబ్లిక్ ఇష్యూనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) అని కూడా వ్యవహరిస్తారు. సాధారణంగా కంపెనీలు తమ ఎదుగుదల క్రమంలో నిధులు అవసరమై ప్రజల నుంచి వాటిని సమీకరించాలనే ఉద్దేశంతో షేర్లను జారీ చేయడం ద్వారా మొట్టమొదటిసారి ఐపీఓకు వస్తాయి.
ఇలా ఐపీఓకి వచ్చే కంపెనీలు ముందుగా లీడ్ మేనేజర్లను నియమించుకుంటాయి. వీరు ఆ కంపెనీ ఐపీఓ వ్యవహారాలు సజావుగా పూర్తయ్యేలా చూస్తారు. కంపెనీలు ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీలు విస్తరణ, మూలధన అవసరాలు, అప్పులు తీర్చడం కోసం వాడుకుంటాయి. ఐపీఓ తర్వాత సంస్థలు వాటాదారులకు జవాబుదారీగా నిలవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment